మన దేశంలో ఆర్థిక సంస్కరణల ఫలితం ఎలాంటిది?
ఒక దేశ అభివృద్ధికి ఆర్థిక సంస్కరణలు కీలకం. ఆర్థిక సామ్రాజ్యాన్ని విస్తరింపజేసుకునేందుకు.. పెట్టుబడులను, పరిశ్రమలను, సేవా రంగాన్ని వర్ధమాన దేశాల్లో నెలకొల్పేందుకు ఈ సంస్కరణలు దోహదపడతాయి. అయితే మనదేశంలో ఆర్థిక సంస్కరణలకు బీజాలు ఎప్పుడు పడ్డాయి? వీటిపై నియమించిన కమిటీలు ఏం చెబుతున్నాయి? ప్రపంచీకరణ, సరళీకరణ, ప్రైవేటీకరణ మొదలైన విధానాలను ప్రవేశ పెట్టడంవల్ల లాభమేంటి? వ్యవసాయరంగం సంక్షోభంలో కూరుకుపోవడానికి కారణమేంటి? భారతదేశంలో సరళీకృత ఆర్థిక సంస్కరణలు-వాటి పరిణామాలేంటో తెలుసుకుందాం..
మన దేశంలో సరళీకృత ఆర్థిక సంస్కరణలకు 1980లోనే బీజాలు పడ్డా1991లో పీవీ నర్సింహారావు ప్రధానిగా ఉన్నప్పుడు కేంద్ర ఆర్థికమంత్రి మన్మోహన్ సింగ్ కాలంలో వీటిని విధానపరంగా ప్రవేశ పెట్టారు. 1990కి పూర్వం మన దేశంలో అమలులో వున్న మిశ్రమ ఆర్థిక విధానాలకు స్వస్తిపలికి మార్కెట్ ఆధారిత అభివృద్ధి, ప్రైవేటు రంగానికి ప్రాధాన్యం, ప్రైవేటీకరణ, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు ఆహ్వానాలతో కూడిన అభివృద్ధి నమూనా ప్రారంభమైంది. డంకెల్ ప్రతిపాదనలు, ప్రపంచ వాణిజ్య సంస్థ, ప్రపంచ బ్యాంకు, అంతర్జాతీయ ద్రవ్యనిధి లాంటి సంస్థలు.. ఈ నూతన ఆర్థిక విధానాలు ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో విస్తరించడానికి ప్రత్యక్షంగా, పరోక్షంగా కృషిచేశాయి.
పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన దేశాలు, ఆయా దేశాలకు చెందిన పెద్ద కంపెనీలు తమ ఆర్థిక సామ్రాజ్యాన్ని విస్తరింపజేసుకునేందుకు.. పెట్టుబడులను, పరిశ్రమలను, సేవా రంగాన్ని వర్ధమాన దేశాల్లో నెలకొల్పేందుకు ఈ సంస్కరణలు దోహదపడ్డాయి. అమెరికా, బ్రిటన్ లాంటి అభివృద్ధి చెందిన దేశాలు.. వివిధ దేశాల మధ్యనున్న వైరుధ్యాలను ఆయా దేశాల్లో వచ్చిన సంక్షోభాలను తమకు అనుకూలంగా మలుచుకుని అనేక దేశాల్లో ప్రత్యక్షంగా జోక్యం చేసుకుని వాటిని తమ నియంత్రణలోకి తెచ్చుకున్నాయి.
మన దేశం పెట్రోల్, దాని ఉప ఉత్పత్తులను గల్ఫ్ దేశాల నుంచి దిగుమతి చేసుకుంటుంది. అయితే 1991లో గల్ఫ్‌లో వచ్చిన సంక్షోభంతో పెట్రోల్ దాని ఉప ఉత్పత్తుల ధరలు బాగా పెరిగాయి. దీంతో వాటి దిగుమతి కోసం భారత్ తనవద్ద ఉన్న విదేశీ మారక నిల్వలను భారీగా ఖర్చుచేసింది. ఫలితంగా మన విదేశీ మారక నిల్వలు 1.2 బిలియన్ డాలర్లకు పడిపోయాయి. దీంతో విదేశీ మారక నిల్వలను పెంచుకోవడానికి భారత్ ఐఎంఎఫ్‌ను సంప్రదించింది.
పెట్టుబడిదారి దేశాల ఏజెంట్‌గా పనిచేసే ఐఎంఎఫ్ మన దేశంలో సరళీకృత ఆర్థిక విధానాలను ప్రవేశపెడితే తాను ఆర్థికంగా సాయపడగలనని తేల్చి చెప్పింది. దీంతో గత్యంతరంలేని పరిస్థితిలో 1991లో ఈ ఆర్థిక సంస్కరణలను మన దేశంలో ప్రవేశపెట్టారు. ఉమ్మడి రాష్ర్ట ముఖ్యమంత్రిగా పనిచేస్తున్న కాలంలో చంద్రబాబునాయుడు రాష్ర్ట ఆర్థిక విధానాలను ప్రపంచ బ్యాంకు చెప్పిన పద్ధతిలో అమలుచేసేందుకు సంకల్పించాడు.
రాష్ర్ట నూతన ఆర్థిక విధానాలను తెలిపే విజన్ 2020ని మెకెన్సి అనే అంతర్జాతీయ కంపెనీతో రూపొందింపజేసి దాని అమలుకు 14 టాస్క్ఫోర్సులను ఏర్పాటు చేశాడు. ఇది 1998 జనవరి నుంచి అమల్లోకి వచ్చింది. ప్రపంచీకరణ, సరళీకరణ, ప్రైవేటీకరణ మొదలైన విధానాలను ప్రవేశ పెట్టడంవల్ల ప్రభుత్వ పాలనా వ్యవహారాల్లో మార్పు వచ్చింది. ప్రజా సంక్షేమ కార్యక్రమాలకు కోతలు విధించి ప్రైవేటు రంగాన్ని ప్రొత్సహించాడు. ప్రజలకు సంబంధించిన సబ్సిడీలో కోతలు విధించి ప్రభుత్వ రంగాలను ప్రైవేటీకరించడానికి అనేక కమిటీలను వేశాడు.
కోనేరు రామకృష్ణారావు కమిటీ
రాష్ర్ట ప్రభుత్వం ఉన్నత విద్యారంగంలో చేపట్టాల్సిన సంస్కరణలను సూచించే నిమిత్తం కోనేరు రామకృష్ణారావు కమిటీని నియమించింది. ఉన్నత విద్య నుంచి ప్రభుత్వం క్రమంగా వైదొలిగి ప్రైవేటు రంగానికి కట్టబెట్టాలని ఈ కమిటీ సూచించింది. సామాజిక శాస్త్రాలకు కాలం చెల్లిందని, వాటిని కొనసాగించాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పడంతో విజన్ 2020లో విద్యను పరిశ్రమగా గుర్తించారు. కొనుక్కోగల వారికి కొనుక్కోగలిగినంత విద్య లభిస్తుంది. ఈ విధానాలు అమల్లోకి రావడంతో సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సుల పేరిట ప్రభుత్వమే విద్యావ్యాపారానికి శ్రీకారం చుట్టింది. ఉన్నత విద్యకు బడ్జెట్ కోతలు, బోధన సిబ్బంది ఖాళీలను భర్తీచేయకపోవడంతో ప్రభుత్వ కళాశాల వ్యవస్థపట్ల ప్రజలకు విముఖత ఏర్పడింది. పాఠశాల స్థాయి నుంచి విశ్వవిద్యాలయ స్థాయివరకు కాంట్రాక్టు ఉద్యోగుల నియామకం అమల్లోకి వచ్చింది.
గంగోపాధ్యాయ కమిటీ
వివిధ ప్రభుత్వ శాఖలను, ఉద్యోగాలను, ఉద్యోగుల జీతాల ఫెన్షన్లను పరిశీలించి ప్రభుత్వ వ్యయాన్ని తగ్గించేందుకు పాటించాల్సిన సూచనలను ఈ కమిటీ సూచించింది. ఈ సూచనలను అనుసరించి ప్రభుత్వంతమ అనుమతి లేకుండా కొత్తగా ఉద్యోగాలను భర్తీ చేయడానికి వీలు లేదనే చట్టం చేసింది. ప్రభుత్వ ఉద్యోగుల్లో అవసరానికి మించి ఉన్న వారిని గుర్తించి 1996-97 నుంచి సాలీనా 0.9 శాతం ఉద్యోగులకు ఉద్వాసన చెప్పాలని సూచించింది. ఈ కమిటీ నీటిపారుదల శాఖలో దాదాపు 40 శాతం ఉద్యోగులు అవసరానికి మించి ఉన్నారని తమ నివేదికలో పేర్కొంది. 1996-97కి పూర్వం ప్రతి ఏడాది 3.4 శాతం ప్రభుత్వ ఉద్యోగాలు పెరుగగా, 1996-97 సంస్కరణల కాలంలో కొత్త ఉద్యోగాలు ఒక శాతం కంటే తక్కువయ్యాయి. సంస్కరణల కాలంలో కొత్త ఉద్యోగాలు పోలీసు, ప్రాథమిక పాఠశాలలు, వైద్యరంగాల్లో మాత్రమే కొనసాగాయి. ఉద్యోగాల కోత ఎంతో పకడ్బందీగా చేపట్టి.. 2000-01లో రాష్ర్ట రెవెన్యూలో 68.17 శాతంగా ఉన్న జీతాలు పెన్షన్ల వ్యయాన్ని 2002-03లో 62.18 శాతానికి తగ్గించారు. ఈ కమిటీ సూచనలతో ప్రభుత్వ శాఖల్లో కొత్త ఉద్యోగాలురాకపోగా ఉన్న ఉద్యోగుల సంఖ్య కుదింపు ప్రారంభమైంది.
సుబ్రమణ్యం కమిటీ
ప్రభుత్వ యాజమాన్యంలో నడుస్తున్న పరిశ్రమల పనితీరును పరిశీలించడానికి ఈ కమిటీని నియమించారు. ప్రభుత్వరంగంలో నష్టాలతో నడుస్తున్న పరిశ్రమలను మూసివేసి వాటిని ప్రైవేటు రంగానికి అప్పగించాలని ఈ కమిటీ తమ నివేదికలో సూచించింది. ఈ కమిటీ సూచనలను చంద్రబాబు ఆచరించడంతో తెలంగాణలోని అనేక పరిశ్రమలు మూతపడ్డాయి. పరిశ్రమలు విధిగా పాటించాల్సిన నియమాలు 1. ఆధునీకరణ, 2. ఆర్థిక క్రమశిక్షణ, 3. ఉద్యోగుల సంఖ్యను తగ్గించుకోవడం. సుబ్రమణ్యం కమిటీ నివేదిక ప్రపంచ బ్యాంకు విధానాలకు అద్దం పడుతుంది. నిజాం షుగర్ మిల్లులు, శ్రీ రాజరాజేశ్వరీ స్పిన్నింగ్ మిల్లు, అంతర్గావ్ స్పిన్నింగ్ మిల్లు, ఆదిలాబాద్ సహకార స్పిన్నింగ్ మిల్లు, ఆల్విన్ వాచెస్, ఏపీ హ్యాండి క్రాఫ్ట్, ఏపీ ఆగ్రోస్ మొదలైన తెలంగాణ ప్రాంత పరిశ్రమలు నష్టాల ఉబిలో కూరుకుపోయాయనే సాకుతో మూసివేతకు గురయ్యాయి. తెలంగాణ ప్రాంతంలోని ప్రభుత్వరంగ సంస్థలు నష్టాలతో నడుస్తున్నాయనే సాకుతో వాటిని మూసివేసి వాటి స్థలాలను ఆంధ్రా పెట్టుబడిదారులకు కట్టబెట్టారు. 36 ప్రభుత్వరంగ సంస్థల్లోని 21,392 మంది ఉద్యోగులను స్వచ్ఛంద పదవీ విరమణ ద్వారా తొలగించారు. దశల వారీగా ప్రభుత్వరంగ సంస్థలన్నింటిని సంస్కరించేందుకు ఏయే కంపెనీలను ప్రైవేటురంగానికి అప్పగించాలి, మూసివేయాలి, వేటిలో ప్రభుత్వ వాటాను తగ్గించుకోవాలి, ఎంత మంది ఉద్యోగులను ఎప్పుడు ఏ విధంగా తొలగించాలి? అన్న విషయాలపై ప్రభుత్వం దృష్టి సారించింది. ప్రపంచ బ్యాంకు ఎజెండాను చంద్రబాబు ప్రభుత్వం ముందుకు తెచ్చింది. దీనిలో భాగంగానే ప్రజలకు సబ్సిడీలను పూర్తిగా తగ్గించింది. రూ.2లకే కిలో బియ్యం పథకాన్ని రద్దుచేసి మద్యపాన నిషేదాన్ని ఎత్తివేసింది. సబ్సిడీల తగ్గింపుతో వ్యవసాయరంగం పూర్తిగా సంక్షోభంలో కూరుకుపోయింది.
హితేన్ భయ్యా కమిటీ
విద్యుచ్ఛక్తి రంగంలో సమూల మార్పులు తేవాలని సంకల్పించిన చంద్రబాబు హితేన్భయ్యా కమిటీని ఏర్పాటు చేశాడు. ఈ కమిటీ తమ నివేదికలో పెక్కు సంస్కరణలతో కూడిన సూచనలను చేసింది. ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎలక్ట్రిసిటీ బోర్డును క్రమంగా ప్రైవేటీకరించాలని విద్యుత్ ఉత్పత్తి, ట్రాన్స్మిషన్, పంపిణీ రంగాలుగా దాన్ని విభజించాలని సూచించింది. విద్యుత్చ్చక్తి బోర్డు ఈ మూడు విభాగాలపై కేవలం పర్యవేక్షణ మాత్రమే చేయాలని, విద్యుత్ విక్రయానికి సంబంధించిన నిర్ణయాలను రెగ్యులేటరీ కమిషన్ మాత్రమే చేపడుతుందని సూచించింది. విద్యుత్ రంగంలో చేపట్టే సంస్కరణలకు ప్రపంచ బ్యాంకు 4460 మిలియన్ డాలర్లను అప్పుగా ఇచ్చింది. సంస్కరణల్లో భాగంగా ప్రజలకు ఇస్తున్న సబ్సిడీ తగ్గించి 15 నుంచి 20 శాతం విద్యుత్ రేట్లను పెంచాలనే నిబంధనను విధించింది. హితేన్ భయ్యా కమిటీ సూచనలను, ప్రపంచ బ్యాంకు షరతులను అంగీకరించిన చంద్రబాబు ప్రభుత్వం.. విద్యుత్ రంగాన్ని ప్రైవేటీకరించడానికి సంబంధించిన బిల్లును 1998 ఏప్రిల్ 28న ఉమ్మడి రాష్ర్ట శాసనసభలో ప్రవేశపెట్టింది. విద్యుత్‌రంగ సంస్కరణల్లో భాగంగా 1999 మార్చిలో ఆంధ్రప్రదేశ్ విద్యుత్ రెగ్యులరేటరీ కమిషన్‌ను ఏర్పాటు చేశారు. 2000 ఏప్రిల్‌లో విద్యుత్ పంపిణీని 4 కంపెనీలకు అప్పగించారు.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు