ప్రబల శక్తిగా ‘బిక్స్’ నిలిచేనా?
లక్ష్యం మంచిదయితే సవాళ్లు ఎన్నయినా లక్ష్య పెట్టాల్సిన అవసరం లేదు. గమ్యం చేరేందుకు కావాల్సిందల్లా దృఢ సంకల్పం మాత్రమే. అలాంటి కృత నిశ్చయంతోనే బ్రిక్స్ కూటమి పనిచేస్తుంది. అభివృద్ధి చెందుతున్న దేశాలు అభివృద్ధి చెందిన దేశాలుగా నిలిచేందుకు ఐదు దేశాలు కూటమిగా ఏర్పడ్డాయి. అభివృద్ధి చెందిన దేశాల ఆధిపత్యానికి అడ్డుకట్ట వేస్తూ అందరికీ సమాన అవకాశాలతో కూడిన ప్రపంచాన్ని నిర్మించేందుకు బ్రెజిల్, రష్యా, భారత్, చైనా, దక్షిణాఫ్రికా (బ్రిక్స్) కూటమిగా ఏర్పడి సంయుక్తంగా కృషి చేస్తున్నాయి.
బ్రిక్స్ అవతరణ
– 2009 కొపెన్‌హెగెన్ పర్యావరణ సదస్సులో కాలుష్య ఉద్గారాల నియంత్రణ విషయంలో అభివృద్ధి చెందిన దేశాలకు, అభివృద్ధి చెందుతున్న దేశాలకు మధ్య విభేదాలు తలెత్తాయి. అమెరికా, యూరోపియన్ యూనియన్ దేశాల వైఖరితో విసుగెత్తిన నాటి భారత ప్రధాని మన్మోహన్సింగ్, చైనా అధ్యక్షుడు వెన్జియబావో బ్రెజిల్, రష్యాతో కలిసి బేసిక్ గ్రూపును ఏర్పాటుచేశారు. అభివృద్ధి చెందిన దేశాల ఆధిపత్యం నుంచి బయటపడి అభివృద్ధి చెందుతున్న దేశాలకు మార్గదర్శిగా నిలిచేందుకు బేసిక్ గ్రూపు నుంచి 2009లో బ్రిక్ అవతరించింది. యెకటేరిన్బర్గ్లో మొదటి సమావేశం జరిగింది. 2010లో దక్షిణాఫ్రికా సభ్యదేశంగా చేరడంతో బ్రిక్స్‌గా అవతరించింది. సభ్యదేశాల మధ్య పరస్పర సహకారంతో పాటు ప్రపంచ ఆర్థిక పరిస్థితిని మెరుగుపర్చడం, ఆర్థిక సంస్థలను (ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్) సంస్కరించడం మొదలైన లక్ష్యాలతో ప్రయాణం మొదలైంది.
బలమైన ఆర్థికశక్తి
– ప్రపంచ వేదికలపై అభివృద్ధి చెందుతున్న దేశాల వాణిని వినిపించేందుకు అవతరించిన బ్రిక్స్ కూటమి అనేక ప్రత్యేకతలను సంతరించుకుంది. ప్రపంచ జనాభాలో 42 శాతం బ్రిక్స్ దేశాల్లోనే ఉంది. ప్రపంచ ఆర్థికాభివృద్ధిలో సగానికిపైగా వాటా బ్రిక్స్ సభ్య దేశాలదే. ఈ దేశాల మొత్తం స్థూల దేశీయోత్పత్తి 16.6 లక్షల కోట్ల డాలర్లు. బ్రిక్స్ కూటమిలో దక్షిణాఫ్రికా తప్ప మిగతా అన్ని దేశాలు ఆర్థికంగా వృద్ధి బాటలోనే పయనిస్తున్నాయి. ముడి చమురు ధరలు పెరుగుతుండటంతో రష్యా ఆర్థిక వ్యవస్థ గాడిన పడింది. భారత్‌లోనూ ద్రవ్యోల్బణం అదుపులో ఉంది. రకరకాల సంస్కరణలు తీసుకువస్తున్న తరుణంలో ఒడిదొడుకులు ఎదుర్కొంటున్నప్పటికీ ఆర్థిక మూలాలు బలంగా ఉండటంతో వృద్ధి బాటలో ముందుకుసాగుతోంది. గణనీయంగా విదేశీ పెట్టుబడులు వచ్చి చేరుతున్నాయి. గడిచిన 22 ఏండ్లలో అతి తక్కువ స్థాయిలో వృద్ధిరేటును నమోదు చేసిన చైనా సైతం ఇప్పుడు గాడిన పడింది.
సవాళ్లు
– బ్రెజిల్ మాంద్యం నుంచి బయటపడుతున్న మాట నిజమే కానీ తీవ్ర ద్రవ్యలోటుతో సతమతమవుతుంది. సంస్కరణలతో ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దాల్సిన సమయంలో బ్రెజిల్ రాజకీయ స్థిరత్వంపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఈ పరిస్థితుల్లో బ్రెజిల్ మళ్లీ మాంద్యంలోకి జారుకోవచ్చు. మరోవైపు ప్రపంచవ్యాప్తంగా ముడిచమురు ధరలు పెరుగుతున్నా, ఉత్పత్తి పరిమితంగా ఉండటంతో రష్యా పూర్తి ప్రయోజనం పొందలేకపోతుంది. బలహీన బ్యాంకింగ్, ఆర్థిక వ్యవస్థతో చైనా సతమతమవుతుంది.
బ్రిక్స్ ప్లస్
– ప్రస్తుతం ఉన్న బ్రిక్స్ దేశాలకు తోడుగా మరిన్ని దేశాలకు సభ్యత్వం కల్పించి బ్రిక్స్ ప్లస్‌గా మార్చాలని చైనా ప్రతిపాదిస్తుంది. పాకిస్థాన్, శ్రీలంక, మెక్సికోను నూతనంగా చేర్చాలని చైనా భావిస్తుంది. కానీ ఈ తరుణంలో 9వ బ్రిక్స్ సదస్సుకు పాకిస్థాన్ మినహా ఇతర దేశాలను ఆహ్వానించడం గమనార్హం. ఈ విషయంలో భారతదేశం సున్నితత్వాన్ని చైనా అర్థం చేసుకుందని భావించవచ్చు.
బ్రిక్ – 2009
– మొదటి సమావేశం రష్యాలోని యెకటేరిన్బర్గ్లో జరిగింది. ఈ సమావేశంలో బ్రెజిల్, రష్యా, భారత్, చైనా ప్రపంచ ఆహార భద్రతపై సంయుక్త తీర్మానం చేశాయి. ప్రస్తుతం ప్రపంచం ఎదుర్కొంటున్న ఆర్థిక మాంద్యంతో ఆహార భద్రతపై ప్రభావం చూపే ప్రమాదం ఉంది. కోట్లాది మంది ఆకలితో అలమటించడంతో పాటు పౌష్టికాహారానికి దూరమవుతారు. ఇది ఐరాస సహస్రాబ్ది లక్ష్యాలకు విరుద్ధం. ఈ పరిస్థితి నుంచి గట్టెక్కాలంటే ప్రపంచ దేశాలన్ని కలిసి ఆహార భద్రత కోసం కృషి చేయాలి. అభివృద్ధి చెందుతున్న దేశాలకు అభివృద్ధి చెందిన దేశాలు ఆర్థిక సహాయంతో పాటు శాస్త్ర సాంకేతికతను అందించి అధిక దిగుబడులకు సహకరించాలి అని తీర్మానంలో పేర్కొంది. పర్యావరణ మార్పులు, జీవ ఇంధనాల వాడకం, డబ్ల్యూటీవో ఒప్పందాలు మొదలైన అంశాలను బ్రిక్ మొదటి సమావేశం తీర్మానంలో పేర్కొన్నారు.
బ్రిక్ – 2010
– బ్రిక్ రెండో సమావేశం బ్రెజిల్ రాజధాని బ్రసీలియాలో జరిగింది. ఈ సమావేశం తీర్మానంలో.. నేటి బహుళ ధ్రువ ప్రపంచంలో అంతర్జాతీయ న్యాయ సూత్రాలకు లోబడి సమానత్వం, గౌరవ దృక్పథంతో పరస్పర సహకారంతో ప్రపంచ అభివృద్ధి కోసం కృషి చేస్తాం, సమష్టి నిర్ణయాలను గౌరవిస్తాం, ప్రపంచం ఎదుర్కొంటున్న సమస్యల్ని పరిష్కరించడంలో జీ-20 దేశాలు క్రియాశీల పాత్ర పోషించాలి. ఇంతవరకు జీ-20లో చేసిన తీర్మానాలన్నింటినీ సభ్యదేశాలు పాటించాలి. ప్రపంచ వాణిజ్యంలో వివక్షను పరిష్కరించడంలో జీ-20 దేశాలు క్రియాశీల పాత్ర పోషించాలి. ఇంతవరకూ జీ-20లో చేసిన తీర్మానాలన్నింటినీ సభ్య దేశాలు పాటించాలి. ప్రపంచ వాణిజ్యంలో వివక్షకు తావు లేకుండా, రక్షణాత్మక ధోరణలకు పాల్పడకుండా పారదర్శక వాణిజ్యం కోసం డబ్ల్యూటీవో చొరవ తీసుకోవాలని తీర్మానించింది. వీటితో పాటు ఐరాస సహస్రాభివృద్ధి లక్ష్యాల్ని చేరుకోవడం, వ్యవసాయంలో పరస్పర సహకారంతో వృద్ధి సాధించడం, పేదరిక నిర్మూలనకు చేపట్టాల్సిన చర్యలు, ఇంధన వనరుల వినియోగం, పర్యావరణ మార్పులు, ఉగ్రవాదంపై పోరాటం మొదలైన అంశాలపై తీర్మానం చేసింది.
బ్రిక్స్ – 2011
– చైనాలోని సాన్యాలో జరిగిన మూడో సమావేశంలో దక్షిణాఫ్రికా తొలిసారిగా పాల్గొంది. బ్రిక్ కాస్త బ్రిక్స్‌గా అవతరించింది. ఈ సమావేశలో పలు తీర్మానాలను ఆమోదించారు. ఐక్యరాజ్యసమితి సాధారణ, భద్రత మండలిలో సంస్కరణలు చేపట్టాలి. అంతర్జాతీయ ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా తుదముట్టించాలి. అందుకు ఐక్యరాజ్యసమితి ఓ కార్యాచరణను రూపొందించాలి. ఆర్థిక మాంద్యం నుంచి ప్రపంచం ఇప్పుడిప్పుడే కోలుకుంటుంది. ప్రధాన ఆర్థిక వ్యవస్థలు స్థూల ఆర్థిక విధానాల్లో తమ సహకారాన్ని కొనసాగించి మాంద్యం నుంచి పూర్తిగా బయటపడేలా కృషిచేయాలి. ఇందుకోసం జీ-20 చేపడుతున్న సానుకూల చర్యలను స్వాగతిస్తున్నాం. ప్రకృతి విపత్తులతో అతలాకుతలమైన జపాన్ తిరిగి కోలుకోవడానికి బ్రిక్స్ ద్వారా సహకారం అందిస్తాం అని తదితర తీర్మానాలు చేశారు. వీటితో పాటు బ్రిక్స్ దేశాల మధ్య పరస్పర సహకారాన్ని మరింత బలోపేతం చేసేందుకు వీలుగా ఓ యాక్షన్ ప్లాన్‌ను రూపొందించారు. ఇందులో భాగంగా వ్యవసాయం, ఆహారం, భద్రత మొదలైన అంశాల్లో పరస్పర సహకారాన్ని మెరుగుపర్చేందుకు వివిధ స్థాయిలో సమావేశాలు, చర్చలు జరుపాలని నిర్ణయించారు. బ్రిక్స్ మేథోమథన కూటమిని కొనసాగిస్తూ బ్రిక్స్ దేశాల్లో పలు పరిశోధనా కేంద్రాలను ఏర్పాటుచేయడం అనుసంధానించడం చేయాలని యాక్షన్ ప్లాన్‌లో నిర్ణయించారు. అలాగే ఈ సమావేశంలో సభ్యదేశాలు పలు నూతన ప్రతిపాదనలు చేశాయి.
నూతన ప్రతిపాదనలు
– సాంస్కృతిక రంగంలో పరస్పర సహకారం, క్రీడలు, గ్రీన్ ఎకానమీని ప్రోత్సహించడం, శాస్త్ర, సాంకేతికరంగాల్లో నూతన ఆవిష్కరణలకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చలు జరుపడం, బ్రిక్స్-యునెస్కో గ్రూపును ఏర్పాటు చేయడం వంటి ప్రతిపాదనలు సభ్యదేశాలు చేశాయి.
బ్రిక్స్ – 2013
– బ్రిక్స్ ఐదో సమావేశాలకు దక్షిణాఫ్రికాలోని డర్బన్ ఆతిథ్యమిచ్చింది. ఈ సందర్భంగా న్యూ డెవలప్మెంట్ బ్యాంకు ఏర్పాటుకు సభ్యదేశాలన్నీ అంగీకరించాయి.
– కూటమిలోని అన్ని దేశాలకు ఆర్థిక భద్రత కల్పించడం, సంక్షోభ సమయాల్లో సహకారం కోసం విదేశీ మారక నిల్వల్ని పోగుచేసి అత్యవసరనిధి (కంటింజెంట్ రిజర్వ్ అరేంజ్మెంట్-CRA)ని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.
బ్రిక్స్ – 2014
– బ్రిక్స్ ఆరో సమావేశాలు 2014లో బ్రెజిల్‌లోని ఫోర్టాలెజా నగరంలో జరిగాయి.
– ఈ సమాశేలు సమ్మిళిత వృద్ధి, సుస్థిర పరిష్కారాలు నినాదంతో జరిగాయి.
– న్యూడెవలప్‌మెంట్ బ్యాంకు, బ్రిక్స్ అత్సవసర నిధి ఏర్పాటుకోసం రూపొందించిన ఒప్పందాలపై సభ్యదేశాలు సంతకం చేశాయి.
– బ్రిక్స్ దేశాలమధ్య ఆర్థిక సహకారాన్ని, వాణిజ్యాన్ని ఉన్నతస్థాయికి తీసుకెళ్తామని తీర్మానించాయి.
– ఉన్నతవిద్య, కార్మిక, ఉపాధి, సామాజిక భద్రత మొదలైన రంగాల్లో పరస్పర సహకారాన్ని విస్తరించాలని నిర్ణయించాయి.
బ్రిక్స్ – 2015
– బ్రిక్స్ ఏడో సమావేశం రష్యాలోని ఉఫాలో బ్రిక్స్ భాగస్వామ్యం-ప్రపంచ అభివృద్ధిలో కీలక పాత్ర అనే నినాదంతో జరిగింది.
– సభ్యదేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం చేసుకోవాలని తీర్మానించారు. అలాగే కూటమిలోని దేశాలతోపాటు అంతర్జాతీయంగా నూతన సవాళ్లను ఎదుర్కోవడం, శాంతిభద్రత పరిరక్షణ, సుస్థిరాభివృద్ధి, పేదరిక నిర్మూలన, నిరుద్యోగ సమస్యలకు పరిష్కారం దశగా సమాలోచనలు జరిగాయి.
– న్యూ డెవలప్మెంట్ బ్యాంకు ద్వారా సభ్యదేశాలతో పాటు అభివృద్ధిచెందుతున్న, వర్ధమాన దేశాలకు కూడా బ్రిక్స్ సహకరించగలదనే అభిప్రాయం ఈ సమావేశాల్లో వ్యక్తమైంది.
బ్రిక్స్-విమర్శలు
– బ్రిక్స్ సభ్యదేశాల ఆర్థికవ్యవస్థలు అస్థిరంగా ఉన్నాయి. అలాంటి వ్యవస్థలతో ప్రపంచానికి మార్గదర్శిగా నిలిచేస్థాయికి బ్రిక్స్ ఎదుగలేదని పాశ్చాత్య దేశాల విమర్శ.
– ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో సంస్కరణలపై సభ్యదేశాల్లో ఏకాభిప్రాయం లేదు. పెద్ద దేశాలైన భారత్, చైనా మధ్య సరిహద్దు వివాదాలు, సభ్యదేశాల్లో వివిధ రకాలైన రాజకీయ వ్యవస్థలు ఉన్నాయి. కొన్ని దేశాల్లో ప్రజాస్వామ్యం ఉంటే మరికొన్ని దేశాల్లో నిరంకుశత్వ ప్రభుత్వాలు ఉన్నాయి. అంతర్జాతీయ స్థాయిలోనూ వీరి మధ్య ఏకాభ్రిపాయాలు లేవు. ఆర్థిక వ్యవస్థ, జీడీపీలోనూ భారీ వ్యత్యాసం ఉంది.
న్యూ డెవలప్మెంట్ బ్యాంక్
– ఇప్పటివరకు అభివృద్ధి చెందుతున్న దేశాలు ఆర్థిక సమస్యలు ఎదురైనప్పుడు ఐఎంఎఫ్, ప్రపంచ బ్యాంక్లవైపు చూస్తున్నాయి. ఆర్థిక అవసరాలతో ఆయా సంస్థల దగ్గరకు అప్పులకు వెళ్తే రకరకాల నిబంధనలతో నెత్తి బొప్పి కట్టిస్తున్నాయి. ఐఎంఎఫ్, ప్రపంచబ్యాంక్ రెండింటిపైనా అమెరికా ఆధిపత్యం చెలాయిస్తూ అభివృద్ధి చెందుతున్న దేశాల ఆర్థిక వ్యవస్థను మరింత దెబ్బ తీయాలనే ప్రయత్నం చేస్తుందనే విమర్శలు ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో బ్రిక్స్ కూటమి ప్రత్యేక బ్యాంక్ ఏర్పాటుచేయాలని నిర్ణయించింది. 2014లో బ్రెజిల్‌లోని ఫోర్టాలెజాలో జరిగిన 6వ బ్రిక్స్ సమావేశంలో నూతన బ్యాంక్ ఏర్పాటు కోసం తీర్మానించి 2015 నుంచి అమల్లోకి తీసుకువచ్చింది.
– షాంఘై ప్రధాన కేంద్రంగా బ్యాంకును ఏర్పాటుచేసింది. 100 బిలియన్ డాలర్ల నిధిలో 41 బిలియన్ డాలర్లను అందించేందుకు చైనా ముందుకు రాగా, భారత్, బ్రెజిల్, రష్యా 18 బిలియన్ డాలర్ల చొప్పున అందిస్తాయి. దక్షిణాఫ్రికా మాత్రం 5 బిలియన్ డాలర్లు అందించే విధంగా ఒప్పందం జరిగింది. ఈ బ్యాంక్‌ను న్యూ డెవలప్మెంట్ బ్యాంకుగా నామకరణం చేశారు. దక్షిణాఫ్రికాలోని జోహాన్నెస్‌బర్గ్‌లో ప్రాంతీయ కార్యాలయాన్ని ఏర్పాటుచేశారు. ఈ బ్యాంక్‌కు మొదటి చైర్మన్‌గా బాధ్యతలు నిర్వహించే గౌరవం భారతీయునికే దక్కింది. ఐసీఐసీఐ బ్యాంక్ మాజీ సీఈవో కేవీ కామత్ న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ మొదటి చైర్మన్‌గా ఎన్నికయ్యారు.
-ఈ బ్యాంక్ ద్వారా ఏటా 34 బిలియన్ డాలర్ల రుణాలు మంజూరు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. మౌలిక వసతులు రైల్వే, రహదారులు, సుస్థిర అభివృద్ధి ప్రాజెక్టుల కోసం రుణాలు ఇవ్వాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా పర్యావరణ పరిరక్షణ, గ్రీన్ ఫైనాన్సింగ్, పునరుత్పాదక ఇంధన వనరులకు అధిక ప్రాధాన్యం ఇస్తారు. ఈ బ్యాంక్ ద్వారా ఇప్పటివరకు బ్రిక్స్ సభ్య దేశాల్లోని 23 ప్రాజెక్టుల కోసం 6 బిలియన్ డాలర్ల రుణాలు మంజూరు చేశారు. బ్రిక్స్ న్యూ డెవలప్మెంట్ బ్యాంకులో సభ్యత్వానికి ఐక్యరాజ్య సమితిలోని సభ్యదేశాలన్నింటికీ అర్హత ఉంటుంది. కానీ బ్రిక్స్ దేశాల వాటా 55 శాతానికి తగ్గకుండా చూడాలని నిర్ణయించారు. ఈ ఏడాది మే నెలలో బంగ్లాదేశ్‌తో సహా 15 దేశాలకు ఎన్డీబీలో సభ్యత్వానికి సూచనప్రాయంగా అనుమతి లభించింది.
భారత్‌లో బ్రిక్స్ సమావేశాలు
బ్రిక్స్ – 2012
– బ్రిక్స్ నాలుగో సమావేశాలు న్యూఢిల్లీలో జరిగాయి.
– ప్రపంచ స్థిరత్వం, భద్రత, సౌభాగ్యం కోసం బ్రిక్స్ భాగస్వామ్యం (Brics Partnership for Global Stability, Security and Prosperity) అనే నినాదంతో ఈ సమావేశాలు జరిగాయి.
– ఇందులో ముఖ్యంగా ప్రపంచబ్యాంకు, ఐఎంఎఫ్‌లు సభ్యదేశాలన్నింటికి సమాన ప్రాధాన్యతనిచ్చి అంతర్జాతీయ సంస్థగా తన బహుముఖ పాత్రను పోషించాలని తీర్మానించాయి.
– వర్ధమాన, అభివృద్ధి చెందుతున్న దేశాల్లో మౌలికవసతులు, సుస్థిరాభివృద్ధి ప్రాజెక్టులకు ఆర్థిక వనరులను సమకూర్చే విధంగా న్యూ డెవలప్మెంట్ బ్యాంకును ఏర్పాటు చేయాలని ప్రతిపాదించాయి. బ్యాంకు ఏర్పాటు, మనుగడ సాధ్యాసాధ్యాలపై అధ్యయనానికి జాయింట్ వర్కింగ్ గ్రూప్‌ను ఏర్పాటు చేసి వచ్చే సమావేశం నాటికి నివేదిక సమర్పించాలని నిర్ణయించాయి.
– బ్రిక్స్ దేశాల మధ్య యువత, క్రీడలు, విద్య, సంస్కృతి, పర్యాటకరంగాల్లో సహకారంతోపాటు ప్రజల మధ్య నేరుగా సంబంధాలు బలపడేలా చర్యలు తీసుకుంటామని తీర్మానించాయి.
బ్రిక్స్ -2016
– బ్రిక్స్ ఎనిమిదో సమావేశాలకు భారత్ రెండోసారి ఆతిథ్యం ఇచ్చింది. 2016లో గోవాలో బిల్డింగ్ రెస్పాన్సివ్, ఇన్‌క్లూజివ్ అండ్ కలెక్టివ్ సొల్యూషన్స్ అనే నినాదంతో ఈ సమావేశాలు జరిగాయి.
– సభ్యదేశాల మధ్య పలురంగాల్లో సహకారం కోసం వివిధ సంస్థలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. బ్రిక్స్ వ్యవసాయ పరిశోధన సంస్థ, బ్రిక్స్ రైల్వే రిసెర్చ్ నెట్వర్క్, బ్రిక్స్ క్రీడామండలి వంటి సంస్థల ఏర్పాటుపై నేతలు ఏకాభిప్రాయం వ్యక్తం చేశారు.
– తీవ్రవాదంపై ఉమ్మడిపోరు, తీవ్రవాద శిబిరాలను నాశనం చేయడం, ఆర్థిక మూలాలను దెబ్బతీయడం, ఇంటర్నెట్, సామాజిక మాధ్యమాలను ఉగ్రవాద సంస్థల చేతిలో దుర్వినియోగం కాకుండా చూడటం వంటి అంశాలను తీర్మానంలో చేర్చారు.
– ఐక్యరాజ్యసమితిలో సంస్కరణలు, అభివృద్ధిచెందుతున్న దేశాలకు ప్రాతినిథ్యం పెంచడం, భద్రతామండలిలో భారత్‌కు సభ్యత్వం కల్పించేలా సంస్కరణలు చేపట్టాలని గోవా సమావేశం తీర్మానించింది.
బ్రిక్స్ – 2017
– బ్రిక్స్ కూటమి తొమ్మిదో సమావేశాలు చైనాలోని గ్జియామెన్‌లో జరిగాయి.
– మెరుగైన భవిష్యత్ కోసం దృఢమైన భాగస్వామ్యం అనే నినాదంతో ఈ సమావేశాలు జరిగాయి.
– ప్రధానంగా ఉగ్రవాదంపై దృష్టిసారించిన నేతలు ఆఫ్ఘనిస్థాన్‌లో హింసకు వెంటనే చరమగీతం పాడాలని అభిప్రాయం వ్యక్తం చేశారు. తాలిబన్లు, ఐఎస్ఐఎస్, దాని అనుబంధ సంస్థలు, అల్‌ఖైదా, హఖానీ నెట్వర్క్, లష్కరే తొయిబా, జైషే మహమ్మద్, తెహ్రీక్ ఇ తాలిబన్ పాకిస్థాన్, తెహ్రీర్ల కారణంగా విస్తరిస్తున్న హింసపై బ్రిక్స్ సభ్యదేశాల నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. ఉగ్రవాదంపై పోరుకు అన్ని దేశాలు సమగ్ర విధానాన్ని అనుసరించాలని పిలుపునిచ్చారు.
– తమ భూభాగాల్లో ఉగ్రవాద కార్యకలాపాలకు ఆర్థిక సహాయం అందకుండా నిరోధించే బాధ్యత ప్రతి దేశంపైనా ఉందని తీర్మానంలో పేర్కొన్నారు.
– పన్ను ఎగవేతపై పోరాడేందుకు సమాచార మార్పిడి చేసుకోవాలని, అభివృద్ధి చెందుతున్న దేశాలకు సాంకేతిక సహాయం అందించాలని బ్రిక్స్ దేశాలు నిర్ణయించాయి.
– నిజమైన ఆధునిక ప్రపంచ పన్ను వ్యవస్థకు కట్టుబడి ఉంటామని స్పష్టం చేశాయి.
– సంప్రదాయ వైద్య విధానాల మార్పిడి, అంతర్జాతీయ వేదికలపై ఆరోగ్యరంగంలో సహకారం, అంతరిక్షాన్ని శాంతియుత అవసరాలకే వినియోగించడం, ఐఎంఎఫ్ కోటా సంస్కరణలను 2019 చివరినాటికి పూర్తిచేయాలని నిర్ణయించాయి.
– ఈ సమావేశాల్లో నూతన క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ ఏర్పాటు ఆవశ్యకతను ప్రధాని మోదీ ప్రస్తావించారు. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో కార్పొరేట్ సంస్థల ఆర్థిక వనరుల అవసరాలను తీర్చేందుకు ఇది దోహదపడుతుందని చెప్పారు.
– నూతన క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ ఏర్పాటుకు సంబంధించి గోవాలో జరిగిన సమావేశాల్లో భారత్ ప్రస్తావించింది. దీనికి సంబంధించి సాధ్యాసాధ్యాలపై చర్చిండానికి నిపుణుల కమిటీని కూడా ఏర్పాటు చేశారు. ప్రస్తుతం స్టాండర్డ్ అండ్ పూర్, మూడీస్, పిచ్ వంటి సంస్థలే రేటింగ్ ఇస్తున్నాయి. వీటిలో ఉండే లోపాల కారణంగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో కార్పొరేట్ సంస్థలు నష్టపోతున్నాయని భారత్ ఆందోళన వ్యక్తంచేసింది. నూతన క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీకి విధివిధానాలను త్వరగా అందించాలని ప్రధాని మోదీ ఈ సమావేశంలో కోరారు.
– ఈ సమావేశంలో మోదీ సురక్షితమైన ప్రపంచం కోసం 10 ఉన్నతమైన ఆశయాలను (నోబుల్ కమిట్మెంట్స్) ప్రతిపాదించారు.
– హరిత ప్రపంచాన్ని నిర్మించడం
– సమ్మిళిత ప్రపంచం
– డిజిటల్ ప్రపంచం
– నైపుణ్యంతో కూడిన ప్రపంచం
– ఆరోగ్యంతో కూడిన ప్రపంచం
– సమానత్వంతో కూడిన ప్రపంచం
– అనుసంధానయుతమైన ప్రపంచం
– సమానత్వంతో కూడిన ప్రపంచం
– సామరస్యమైన ప్రపంచం
– క్రియేటింగ్ ఎనేబుల్డ్ వరల్డ్ అనే ఆశయసాధనాలను మోదీ సూచించారు.
– తీవ్రవాదాన్ని ఎదుర్కోవడం, సైబర్ భద్రత, విపత్తు నిర్వహణలో కలిసికట్టుగా, నిర్మాణాత్మక విధానాలతో ముందుకు సాగాల్సిన అవసరం ఉందని సూచించారు.
– భారత్ చైనా సరిహద్దుల్లో డోక్లాం వద్ద రెండున్నర నెలలపాటు నెలకొన్న ఉద్రిక్తతలు బ్రిక్స్ సమావేశాలకు ముందే తెరపడటం, బ్రిక్స్ సమావేశాల్లోనూ ఉగ్రవాద సంస్థలకు వ్యతిరేకంగా చేసిన తీర్మానంలో లష్కరే తొయిబా, జైషే మహ్మద్ వంటి పాక్ ఉగ్రవాద సంస్థల పేర్లు చేర్చడం భారత్‌కు సానుకూల అంశాలు.
– పాక్ ఉగ్రవాద సంస్థలకు వ్యతిరేకంగా బ్రిక్స్‌లో తీర్మానం చేసేకుందుకు గతంలో అభ్యంతరాలు తెలిపిన చైనా ఈసారి మాత్రం అంగీకరించింది.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు