రాజ్యాంగ ఏర్పాటు క్రమంబెట్టిదనినా..!
కమ్యూన్ అవార్డు (1932)
-మైనారిటీ వర్గాల ప్రాతినిధ్యానికి ఆనాటి బ్రిటన్ ప్రధాని రామ్సే మెక్‌డొనాల్డ్ 1932, ఆగస్టు 4న ఒక ప్రతిపాదన చేశారు. దీన్నే కమ్యూనల్ అవార్డు అంటారు. దీని ప్రకారం ముస్లింలు, సిక్కులు, క్రిస్టియన్లకు ప్రత్యేక నియోజకవర్గాలేకాకుండా ఎస్సీలకు కూడా ప్రత్యేక నియోజకవర్గాలను ప్రతిపాదించారు. దీన్ని వ్యతిరేకిస్తూ మహాత్మాగాంధీ పూనాలోని ఎరవాడ జైలులో 1932, సెప్టెంబర్ 20న ఆమరణ నిరాహార దీక్షకు పూనుకున్నారు.
-రాజాజీ, మదన్మోహన్ మాలవ్య వంటి నాయకుల చొరవతో అంబేద్కర్ మహాత్మాగాంధీతో చర్చించి దీక్షను విరమింపజేశారు. దీంతో 1932 సెప్టెంబర్‌లో అంబేద్కర్, గాంధీల మధ్య పూనాలో ఒక ఒప్పందం కుదిరింది. దీన్నే పూనా ఒడంబడిక అంటారు. తద్వారా కమ్యూనల్ అవార్డు కంటే ఎక్కువగా ఎస్సీలకు అవకాశాలు లభించాయి.
మూడో రౌండ్ టేబుల్ సమావేశం (1932)
-ఈ సమావేశం లండన్‌లో 1932, నవంబర్ 17 నుంచి 1932, డిసెంబర్ 24 వరకు జరిగింది. సమస్యలు సృష్టిస్తారనుకున్నవారిని బ్రిటిష్ ప్రభుత్వం ఆహ్వానించకపోవడంతో కాంగ్రెస్ ప్రతినిధులు హాజరుకాలేదు. ఇంగ్లండ్‌లోని లేబర్ పార్టీ కూడా సహకరించలేదు. ఈ సమావేశంలో చేసిన సిఫారసుల్లో ఎక్కువ భాగం 1935 భారత ప్రభుత్వ చట్టంలో స్థానం పొందాయి. ఈ సమావేశానికి సప్రూ, జిన్నా, అంబేద్కర్లతో పాటు మొత్తం 46 మంది ప్రతినిధులు హాజరయ్యారు.
శ్వేతపత్రం (1933)
-మూడు రౌండ్ టేబుల్ సమావేశాల్లో చర్చించి, నిర్ణయించిన అంశాలతో బ్రిటిష్ ప్రభుత్వం ఒక శ్వేతపత్రాన్ని ప్రచురించింది. దానిలోని ప్రతిపాదనలను లార్డ్ లిన్లిత్గో అధ్యక్షతన బ్రిటిష్ పార్లమెంటుకు చెందిన జాయింట్ సెలక్ట్ కమిటీ పరిశీలించి 1934, నవంబర్ 11న నివేదిక సమర్పించింది. ఆ నివేదికను కాంగ్రెస్ నిర్దంద్వంగా తిరస్కరించింది. ముస్లింలీగ్ మాత్రం ప్రాంతాలకు సంబంధించిన భాగాన్ని ఆమోదించి సమాఖ్య భావనను తిరస్కరించింది.
భారత ప్రభుత్వం చట్టం-1935
-బ్రిటిష్‌వారు రూపొందించిన రాజ్యాంగ సంస్కరణ చట్టాల్లోకెల్లా ఈ చట్టం చాలా విస్తృతమైంది. సెలెక్ట్ కమిటీ ఇచ్చిన నివేదికను పట్టించుకోకుండా ప్రభుత్వం రాజ్యాంగ సంస్కరణలకు సిఫారసు చేసింది. వాటి ఫలితంగా ఆర్భవించిందే భారత ప్రభుత్వం చట్టం-1935.
-ఈ చట్టంలో 321 ప్రకరణలు, 10 షెడ్యూళ్లు ఉన్నాయి. అందువల్లే దేశంలో ఒక నూతన రాజ్యాంగం ప్రవేశపెట్టడం జరిగింది. ఇది 1937, ఏప్రిల్ నుంచి అమల్లోకి వచ్చింది. అవశిష్ట అధికారాలను వైశ్రాయ్‌కి ఇచ్చారు. స్వదేశీ సంస్థానాలు సమాఖ్యలో చేరకపోవడంతో ఇది అమల్లోకి రాలేదు.
-రాష్ట్రంలో ఉన్న ద్వంద్వ పాలనను రద్దుచేసి కేంద్రంలో ద్వంద్వ పాలనను ప్రవేశపెట్టారు. కేంద్రంలో పాలనాంశాలను రిజర్వ్డ్, ట్రాన్స్‌ఫర్డ్ అంశాలుగా విభజించారు. రిజర్వ్డ్ అంశాలను గవర్నర్, ముగ్గురు కౌన్సిలర్ల సహాయంతో పరిపాలిస్తారు.
-రాష్ట్రస్థాయిలో ద్విసభా పద్ధతిని ప్రవేశపెట్టారు. నాటి దేశంలోని 11 ప్రావిన్సులకుగాను బొంబాయి, బెంగాల్, బీహార్, మద్రాస్, అస్సాం, యునైటెడ్ ప్రావిన్సు ఈ ఆరింటిలో ద్విసభా పద్ధతిని ప్రవేశపెట్టారు.
-కమ్యూనల్ ప్రాతినిధ్యాన్ని కొనసాగిస్తూ ఎస్సీలు, మహిళలు, ఇండియన్ క్రిస్టియన్లు, ఆంగ్లో-ఇండియన్లు, యూరోపియన్లు, కార్మికులకు శాసనమండళ్లలో ప్రత్యేక నియోజకవర్గాలను ఏర్పాటు చేశారు.
-కేంద్ర, రాష్ర్టాల మధ్య సమాఖ్య వివాదాలను పరిష్కరించడానికి 1937లో ఫెడరల్ కోర్టును ఏర్పాటు చేశారు. ఇందులో ఒక ప్రధాన న్యాయమూర్తి, ఆరుగురు న్యాయమూర్తలు ఉండేవారు. వీటి తీర్పులను ఇంగ్లండ్‌లోని ప్రైవి కౌన్సిల్‌కు అప్పీల్ చేసుకోవచ్చు.
-ఈ చట్టం ద్వారా ఒక ఫెడరల్ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌ను, రాష్ర్టాల్లో పబ్లిక్ సర్వీస్ కమిషన్లను ఏర్పాటు చేశారు. అంతేకాకుండా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను ఏర్పాటు చేశారు.
-ఈ చట్టం రూపొందించిన అతి ముఖ్యమైన అంశం ప్రాంతీయ స్వపరిపాలన. రాష్ర్టాల్లో మొదటిసారిగా ప్రజాస్వామ్య ప్రభుత్వాలు ఏర్పాటయ్యాయి. ప్రాంతీయ పరిపాలనా అంశాలన్నీ మంత్రుల ఆధీనంలో బదిలీ అయ్యాయి.
ఈ చట్టంపై ప్రముఖుల వ్యాఖ్యలు
-ఒక మంచి వాహనానికి చక్కటి బ్రేకులను అమర్చి ముఖ్యమైన ఇంజిన్‌ను పెట్టడం మర్చిపోయారు- జవహర్లాల్ నెహ్రూ
-కచ్చితంగా పిచ్చిది, సమూలంగా చెడ్డది, మొత్తానికి అనంగీకృతమైంది- జిన్నా
-నిర్మాణాత్మక, రాజనీతి తత్వవిచారంలో ఇది ఒక గొప్ప సాఫల్యం- ప్రొ. కూప్లాండ్
-విచారణలో ఈ కొత్త చట్టాన్ని మాపై బలవంతంగా రుద్దారు. బాహ్యంగా దానికి కొంత ప్రజాస్వామ్యరూపం ఉన్నట్లు తోచినా లోపల మాత్రం అంతా శూన్యమే- మదన్మోహన్ మాలవ్య
-ఇది పొట్టి మనుషులు కట్టిన అవమానకరమైన గొప్ప కట్టడం- విన్స్టన్ చర్చిల్
-భారత్‌లోని అనేక రాష్ర్టాల్లో గోచరించే భూస్వామ్య వ్యవస్థలను దృఢంగా చేయడానికి బ్రిటిష్ పాలకులు ఆడిన నాటకమే- సుభాష్ చంద్రబోస్
లిన్లిత్గో ప్రతిపాదనలు (1940)
-భారత వైశ్రాయ్ లార్డ్ లిన్లిత్గో 1940, ఆగస్టు 8న రాజ్యాంగ సంస్కరణలపై కొన్ని ప్రతిపాదనలను చేశారు. కావున దీనికి ఆగస్టు ప్రతిపాదనలను అని కూడా అంటారు.
-రెండో ప్రపంచ యుద్ధం ముగిసిన తరువాత భారతదేశానికి డొమినియన్ ప్రతిపత్తి కల్పించే విషయాన్ని పరిశీలించి, రాజ్యాంగాన్ని రూపొందించుకునే బాధ్యత ప్రధానంగా భారతీయులకే ఉంటుందని మొదటిసారిగా ప్రకటించారు.
-రాజ్యాంగ పరిషత్తులో అల్పసంఖ్యాకవర్గాల వారికి ప్రాతినిధ్యం కల్పించడం, అన్ని రాజకీయ పార్టీలు, సంస్థానల ప్రతినిధులతో కూడిన యుద్ధ సలహామండలిని ఏర్పాటుచేయడం వంటివి ప్రతిపాదించారు.
-ఈ ప్రతిపాదనలను కాంగ్రెస్ పార్టీ తిరస్కరించింది. కాంగ్రెస్ తిరస్కరించిన ఆ ప్రతిపాదనలోని భాగాన్ని ముస్లింలీగ్ ఆమోదించింది. భావిభారత రాజ్యాంగమనే క్లిష్టమైన సమస్యకు పరిష్కారం భారతదేశ విభజన ఒక్కటే పరిష్కారం అని ముస్లింలీగ్ తెలిపింది.
క్రిప్స్ ప్రతిపాదనలు (1942)
-రెండో ప్రపంచయుద్ధ సమయంలో బ్రిటిష్ సైన్యాల తరఫున భారత సైన్యాలు పాల్గొనడానికి మరోసారి భారతీయులను మభ్యపెట్టడానికి క్రిప్స్ ప్రతిపాదనలు అనే అంశాన్ని ఆశగా చూపారు. బ్రిటిష్ ప్రధాని విన్స్టన్ చర్చిల్ 1942, మార్చి 11న ఒక ప్రకటన ద్వారా భారత రాజ్యాంగా సమస్య విషయంలో అక్కడి నాయకులతో సంప్రదింపుల నిమిత్తం కేబినెట్ మంత్రి అయిన సర్ స్టాఫర్డ్ క్రిప్స్‌ను భారతదేశానికి పంపిస్తున్నట్లుగా పేర్కొన్నాడు.
-క్రిప్స్ 1942, మార్చి 22న భారతదేశానికి వచ్చి ప్రతిపాదనలు తెలిపాడు. భారతదేశానికి అవసరమైన కొత్త రాజ్యాంగాన్ని నిర్మించడానికి ఎన్నుకున్న రాజ్యాంగపరిషత్తు ఏర్పాటవుతుందని, భారత్‌కు వీలైనంత త్వరలో స్వయంప్రతిపత్తి ఇస్తామని పేర్కొన్నాడు.
-రాష్ట్రప్రభుత్వాలు ప్రస్తుతం అమల్లో ఉన్న రాజ్యాంగాన్ని కలిగి ఉండవచ్చు లేదా నూతన రాజ్యాంగాన్ని రూపొందించుకోవచ్చు, గవర్నర్ జనరల్ కార్యనిర్వహణ మండలిలో ఒక భారతీయునికి సభ్యత్వం ఇస్తారని తెలిపాడు.
-ఈ క్రిప్స్ ప్రతిపాదనలను దివాళా తీస్తున్న బ్యాంకు మీద ముందస్తు తేదీని వేసిన ఒక చెక్కు వంటిదని మహాత్మాగాంధీ విమర్శించారు.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు