కణ కేంద్రకం అంటే ఏంటి?
సృష్టిలోని ప్రతి జీవి కణాలతో నిర్మితమై ఉంటుంది. ఈ కణాలు జీవుల్లోని నిర్మాణాత్మకమైన, క్రియాత్మకమైన ప్రమాణాలు. కణాల్లో వివిధ రకాల కణాంగాలు ఉంటాయి. వాటిలో అతిముఖ్యమైన కణాంగం కేంద్రకం. కణంలోని మిగతా కణాంగాలతో పోల్చిచూస్తే కేంద్రకం పెద్దగా, స్పష్టంగా కనిపిస్తుంది. కణంలో జరగాల్సిన క్రియలన్నీ కణ కేంద్రకం ఆధీనంలోనే జరుగుతాయి. అందుకే కేంద్రకాన్ని కణ నియంత్రణ గది అంటారు. ఈ క్రమంలో కణ కేంద్రకం అంటే ఏమిటి? దాని నిర్మాణం ఎలా ఉంటుంది? కణంలో అది ఏయే విధులు నిర్వహిస్తుంది? అనే వివరాలను ఈ ఆర్టికల్‌లో తెలుసుకుందాం..
కేంద్రకం అంటే ఏమిటి?
- కణంలో కేంద్రకాన్ని 1831లో రాబర్ట్ బ్రౌన్ అనే స్కాట్లాండ్ శాస్త్రవేత్త కనిపెట్టాడు.
- కణ కేంద్రకం అనేది కణంలో జన్యుకోడ్ డీఎన్ఏను కలిగివున్న అతిముఖ్యమైన భాగం.
- ఇది కణంలో ఒక నియంత్రణ కేంద్రంగా పనిచేస్తుంది. చిన్నగా, గుండ్రంగా ఉండే ఈ కణకేంద్రకాన్ని క్రోమోజోమ్‌లను కలిగివున్న డీఎన్ఏ గూడుగా కూడా చెప్పవచ్చు.
- జీవుల దేహాల్లో బిలియన్ల కణాలు ఉంటాయి. వాటిలో చాలా కణాలు కేంద్రకాన్ని కలిగి ఉంటాయి.
- బ్యాక్టీరియా, నీలిఆకుపచ్చ శైవలాల్లోని జీవకణాల్లో స్పష్టమైన కేంద్రకం ఉండదు. కాబట్టి వాటి కణాలను కేంద్రకపూర్వ కణాలు అంటారు.
- కొన్ని రకాల క్షీరదాల ఎర్రరక్త కణాల్లో, మొక్కల పోషక కణజాలంలోని చాలనీ నాళాల్లో ప్రారంభ దశలో కేంద్రకం ఉంటుంది. ముదిరిన దశలో ఉండదు.
- కణ కేంద్రకం కణం విధులన్నింటిని క్రమబద్ధీకరించి, నియంత్రిస్తుంది.
- జన్యు సమాచారాన్ని కలిగివుండటం ద్వారా జీవుల లక్షణాలను నిర్ధారిస్తుంది.
- తల్లిదండ్రుల నుంచి బిడ్డలకు సంక్రమించే వంశపారంపర్య లక్షణాలను నిర్దేశిస్తుంది.
- కణ విభజనలో కూడా కేంద్రకం ప్రధానపాత్ర పోషిస్తుంది.
- కేంద్రకం జన్యు సమాచారాన్ని నిలువ చేయడం, ప్రసారం చేయడం లాంటి విధులను కూడా నిర్వర్తిస్తుంది.
- కణం పెరుగుదల, పునరుత్పత్తిని నియంత్రిస్తుంది.
కేంద్రకం నిర్మాణం
- కేంద్రకం రెండు త్వచాలతో ఆవరించి ఉండే సూక్ష్మాంగం. ఈ రెండు పొరలను కలిపి కేంద్రక ఆచ్ఛాదనం అంటారు.
- కణం మధ్యలో గోళాకారంగా ఉండే కేంద్రకంలో కేంద్రక రసం ఉంటుంది. కేంద్రక రసంలో క్రోమోజోమ్‌లు, కేంద్రకాంశం తేలుతూ ఉంటాయి.
- కేంద్రకం లోపల ఉన్న పోగుల్లాంటి నిర్మాణాలనే క్రొమాటిన్ పదార్థం అంటారు. ఇది కణవిభజన సమయంలో క్రోమోజోమ్‌లుగా మారుతుంది.
- క్రొమాటిన్ లేదా క్రోమోజోమ్‌లు డీఎన్ఏ ప్రొటీన్లతో నిర్మితమై ఉంటాయి. డీఎన్ఏలో జన్యువులు ఉంటాయి. జీవి ప్రతి కణంలోని కేంద్రకం 23 జతల క్రోమోజోమ్‌లను కలిగి ఉంటుంది.
- వాటిలో 22 జతలు అలైంగిక క్రోమోజోమ్‌లు, ఒక జత లైంగిక క్రోమోజోమ్‌లు ఉంటాయి.
- కేంద్రకపూర్వ కణాల్లో కేంద్రకత్వచం, కేంద్రకాంశం, హిస్టోన్ ప్రొటీన్లు స్పష్టంగా ఉండవు.
- ఇలాంటి కేంద్రకాన్ని ప్రారంభ కేంద్రకం లేదా న్యూక్లియాయిడ్ అంటారు.
- నిజకేంద్రక కణాల్లో కేంద్రకాన్ని ఆవరించి రెండు పొరల కేంద్రక త్వచం ఉంటుంది.
- కేంద్రకంలో కేంద్రకాంశం, హిస్టోన్ ప్రొటీన్లు ఉంటాయి.
- కేంద్రకపూర్వ కణాలున్న జీవులను కేంద్రకపూర్వ జీవులు అని, నిజ కేంద్రక కణాలున్న జీవులను నిజకేంద్రక జీవులని అంటారు.
కణంలోని ఇతర అంగాలు
కణ త్వచం
జీవిలో ప్రతి కణం చుట్టూ ఒక త్వచం ఉంటుంది. దీన్ని ప్లాస్మా పొర అంటారు. ఇది లిపిడ్లు, ప్రొటీన్లతో నిర్మితమై ఉంటుంది. ఇది కణానికి రక్షణ కల్పిస్తుంది. వృక్ష కణాల్లో కణ త్వచాన్ని ఆవరించి కణకవచం ఉంటుంది. జంతు కణాల్లో ఈ కణ కవచం ఉండదు.
అంతర్జీవ ద్రవ్యజాలం
ఇది కణద్రవ్యంలో త్వచం కలిగిన నాళాలతో ఏర్పడిన వల లాంటి నిర్మాణం. ఇది గరుకు అంతర్జీవ ద్రవ్యజాలం, నునుపు అంతర్జీవ ద్రవ్యజాలం అని రెండు రకాలు. గరుకు అంతర్జీవ ద్రవ్యజాలం ప్రొటీన్ల సంశ్లేషణలో, నునుపు అంతర్జీవ ద్రవ్యజాలం లిపిడ్ అణువుల సంశ్లేషణలో తోడ్పడుతాయి.
గాల్జీ సంక్లిష్టం
కామిల్లో గాల్జీ 1898లో ఈ కణాంగాన్ని గుర్తించాడు. ఈ గాల్జీ సంక్లిష్టం తిత్తులతో కూడి, నాళాల మాదిరిగా ఉంటుంది. దీనిలోని మధ్య కుహరం చుట్టూ ఏకత్వచపు పొర కప్పి ఉంటుంది. గాల్జీ సంక్లిష్టం ప్రొటీన్స్, ఇతర పదార్థాలను ప్లాస్మా పొరవైపు లేదా లైసోజోమ్స్ వైపు పంపటంలో తోడ్పడుతుంది.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు