The winner of the interview is yourself | ఇంటర్వ్యూలో విజేత మీరే
నేనసలు నమ్మలేకపోతున్నాను సర్! నేను కాలేజీలో టాపర్. అలాంటిది ఇంటర్వ్యూలో నేను విఫలం కావటం జీర్ణించుకోలేకపోతున్నాను. ఇంజినీరింగ్ చివరి ఏడాది విద్యార్థి విక్రమ్ ఇలా చెప్పి వాపోయాడు. వారి కాలేజీలో జాబ్ ప్లేస్మెంట్ నియామక పరీక్షలు జరుగుతున్నాయి. వాటిలో చాలా పెద్దపెద్ద మల్టీ నేషనల్ కంపెనీలు రావటం, అర్హులైన అభ్యర్థులను ఎన్నుకోవటం ప్రతి ఏడాది జరిగే విషయమే.
నా జీవితంలో ఓటమి అన్నది ఎరుగను సర్ అని చెబుతున్నాడు విక్రమ్. ప్రశాంతంగా వింటున్నాడు శశాంక్. శశాంక్ వారి కాలేజీ ప్లేస్మెంట్ ఆఫీసర్, సాఫ్ట్ స్కిల్స్ ట్రైనర్. కమ్యూనికేషన్ స్కిల్స్, సాఫ్ట్ స్కిల్స్, స్పోకెన్ ఇంగ్లిష్, ఇంటర్వ్యూ శిక్షణ, గ్రూప్ డిస్కషన్ వంటి విషయాలన్నీ చూసుకుంటూ ఉంటాడు. విక్రమ్ చాలా తెలివైన విద్యార్థే. అన్ని తరగతుల్లోనూ అతనే నంబర్ వన్. హైస్కూలు, కాలేజీ, ఎంసెట్ ఇలా అన్ని పరీక్షల్లో మంచి పర్సంటేజీతో ఉత్తీర్ణడయి, మంచి ఇంజినీరింగ్ కాలేజీలో చదువుతున్నాడు. శశాంక్‌కు తెలుసు విక్రమ్ ఎక్కడ దెబ్బతింటున్నాడో. చెప్పండి సర్ ఇంటూర్వ్యూలో విజయం సాధించాలంటే ఏం చేయాలి అని విక్రమ్ శశాంక్‌ను అడుగుతున్నాడు. విక్రమ్ నువ్వు కాలేజీలో మనం నిర్వహించిన క్లాసులకు అటెండ్ అయ్యావా? అయ్యాను సర్. రెగ్యులర్ క్లాసులు మాత్రమే కాక క్యాంపస్ ఇంటర్వ్యూలు గెలిచే దానికి సంబంధించి గత ఆరు నెలలుగా ప్రత్యేక సీఆర్ ట్రైనింగ్ నిర్వహించాం కదా! ఆ క్లాసులన్నింటికి అటెండ్ అయ్యావా? అయ్యాను సర్ కాకపోతే జీడీ, హెచ్ఆర్ ఇంటర్వ్యూ క్లాసెస్ నాకు చిరాగ్గా అనిపించి వాటికి అటెండ్ కాలేదు. ఏం? ఇంటర్వ్యూ అంటే ప్రశ్నలకు సమాధానం చెప్పటమే కదా! దానికి ప్రత్యేకంగా శిక్షణ ఎందుకని అనిపించింది. అదేవిధంగా గ్రూప్ డిస్కషన్ కూడా నాకు చిరాకుగా అనిపించేది. ఇది ఒక్క విక్రమ్ సమస్య కాదు. చాలామంది విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్య. తెలివితేటలు బాగా ఉన్నవారే విజేతలుగా నిలుస్తారనుకుంటే పొరబాటే. ఇందులో ఎక్స్రావర్టెడ్, ఇంట్రావర్టెడ్ వ్యక్తులని రెండు రకాలుగా విభజించుకోవచ్చు.
ఇంట్రావర్టెడ్ వ్యక్తులు : వీరిని అంతర్ముఖులు అని అంటారు. అంటే తమలో తామే ముడుచుకుపోయి బయటకు ఏదీ మాటల్లో చెప్పుకోలేక ఇబ్బంది పడుతూ ఉంటారు. విపరీమైన మొహమాటం, సిగ్గు ఉంటుంది. కొత్తవారితో కలివిడిగా ఉండలేరు. బిడియం వల్ల ఎవరితో కూడా దీటుగా బదులు ఇవ్వలేరు. అదీగాక తమ స్థితి పట్ల తామే జాలి పడుతూ ఉంటారు. వీరికి తెలివితేటలు పుష్కలంగా ఉంటాయి. అతర్ముఖులుగా ఉండిపోవటం వల్ల వీరు తెలివి తేటలు గలవారని ఎదుటివారికి తెలిసే అవకాశాలు తగ్గిపోతాయి. ఈ కారణాల వల్ల వీరు ఇంటర్వ్యూల్లో విజేతలుగా రాణించలేకపోతుంటారు.
నువ్వు చాలా మారాలి విక్రమ్. తప్పకుండా సర్ చెప్పండి నేనేవిధంగా మారాలో. చెబుతాను గానీ ముందుగా ఒక కథ చెబుతాను. చెప్పండి సర్. ఈ కథ చివర్లో ఒక చిన్న ఫజిల్ ఉంటుంది. బాగా ఆలోచించి సమాధానం చెప్పాలి. అలాగే సర్.
రాము, శ్యాము, కృష్ణ అనే ముగ్గురు యువకులు మంచి స్నేహితులు. వీరొకసారి హిమాలయాలకు వెళ్లి కఠోర తపస్సు చేశారు. వీళ్ల తపస్సుకు మెచ్చి దేవుడు ప్రత్యక్షమై ఏం కావాలో కోరుకొమ్మని అడిగాడు. మొదట రాము వంతు వచ్చింది. అప్పడు రాము నాకు చాలా ధనం, బంగారం, వజ్రాలు, పొలాలు, భవంతులు ఇలా అనేకానేక ఆస్తులు కావాలి అని కోరడం దేవుడు తథాస్తు అనడం రాము క్షణాల్లో ఐశ్వర్యవంతుడిగా మారటం జరిగింది. తరువాత శ్యాము వంతు వచ్చింది. అప్పుడు శ్యాము నేనేం మాట్లాడినా మరుక్షణమే మీడియా అంతా కోడైకూయాలి. నా పేరు లేని వార్త ఉండరాదు. అంత పాపులర్ అయిపోవాలి. ఇంకా నాకు వీలనన్నీ ఆస్తిపాస్తులు, ధనం, బంగారం, వజ్రాలు కూడా ఇవ్వటం మర్చిపోకు దేవుడా! అని కోరుకున్నాడు. దేవుడు తథాస్తు అనటంతో సెలబ్రిటీగా మారాడు శ్యాము. ఇక కృష్ణ వంతు రాగా.. కృష్ణ కళ్లు పెద్దవి చేసుకొని దేవున్ని ఆపాదమస్తకం పులకితుడై చూసి పాదాభివందనం చేసుకొని చాలా చిన్న కోర్కె మూడే మూడు పదాలతో కోరాడు. యథావిధిగా దేవుడు తథాస్తు అనేసి కృష్ణను ప్రేమగా ఒకసారి గాఢాలింగనం చేసుకొని అదృశ్యమయ్యాడు.
కృష్ణ జీవితంలో తక్షణ మార్పులు ఎకాఎకిన ఏం గోచరించలేదు మిగతా ఇద్దరికీ జరిగినట్టు. చిన్నగా నవ్వుకుని తన ఊరికి బయలుదేరాడు కృష్ణ. కాలచక్రం గిర్రున ఏడాది తిరిగింది. ఈ ఏడాదికాలంలో చాలానే మార్పులు వచ్చాయి. రాముకి వ్యాపార దక్షత , ఆర్థిక పరిజ్ఞానం లేకపోవటం వల్ల యావదాస్తి కోల్పోయి కొత్త అప్పులు తెచ్చుకున్నాడు. శ్యాము పరిస్థితి కూడా ఇంతే పైగా అతను చాలా పాపులర్ అవటం వల్ల అతని దుస్థితి ప్రపంచవ్యాప్తంగా తెలిసిపోయి అభాసుపాలయ్యాడు. ఇక కృష్ణ విషయానికొస్తే అతను చాలా మంచి వ్యాపారవేత్తగా, మేధావిగా, చుతురుడిగా ఖ్యాతి తెచ్చుకున్నాడు. అతను అడుగిడని వ్యాపారం లేదు. అతను అందుకోని అవార్డు లేదు. ప్రధానమంత్రికి బాగా విశ్వసనీయుడిగా ఎదిగాడు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థనే శాసించగలిగే స్థాయిని అందుకున్నాడు.
రాము, శ్యాము దేవుడిని ఏమడిగారో మనకు తెలుసు. పరిణామాలు కూడా చూశాం. ఇప్పుడు చెప్పు కృష్ణ ఏం కోరుకునుంటాడో! బాగా ఆలోచించి చెప్పు. బాగా ఆలోచించి విక్రమ్ ఏదో చెప్పాడు. కానీ శశాంక్ కాదంటాడు. ఎంత ఆలోచించినా చెప్పలేకపోయాడు విక్రమ్. చివరికి శశాంకే చెప్పాడు. ఇప్పుడు నేను చెప్పబోయే సమాధానం నీకు చాలా ఉపయోగపడుతుంది. కృష్ణ దేవున్ని ఏ మూడు వరాలు అయితే కోరాడో అవి ప్రతి ఇంటర్వ్యూ అభ్యర్థికి అవసరమే. అవి ఏంటంటే 1) ఇంగితం (కామన్ సెన్స్) 2) వాక్చాతుర్యం (కమ్యూనికేషన్ స్కిల్స్) 3) సమయస్ఫూర్తి (ప్రెజెన్స్ ఆఫ్ మైండ్). తనవంతు వచ్చినప్పుడు కృష్ణ దేవున్ని కోరుకున్నవి ఈ మూడే. ఇంటర్వ్యూలో ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పేముందు తులనాత్మకంగా ఆలోచించాలి.
ఈ ప్రశ్న ఎందుకు వేస్తున్నారు? ఈ ప్రశ్న వెనుక ఉన్న అసలు ఉద్దేశం ఏమిటి? హెచ్ఆర్ మేనేజర్ నా నుంచి ఏం ఆశిస్తున్నారు? ఇంగితం, సమయస్ఫూర్తి, వాక్చాతుర్యం ఉపయోగించి సమాధానం ఇవ్వాలి.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?