స్వాతంత్య్రానికి పూర్వం కుల ఉద్యమాలు ఏవి జరిగాయి?
సత్యశోధక్ సమాజ్:
దీన్ని జ్యోతిబాఫూలే 1873లో మహారాష్ట్రలో స్థాపించారు. బ్రాహ్మణుల అణచివేత, వారి అవకాశవాదం నుంచి దిగువ కులాలవారిని రక్షించాల్సిన అవసరం గురించి ఇది నొక్కి చెప్పింది.
జస్టిస్ పార్టీ ఉద్యమం:
1915-16 మద్రాస్‌లో ఈ ఉద్యమం జరిగింది. విద్య, రాజకీయ రంగాల్లో బ్రాహ్మణుల ఆధిపత్యాన్ని సవాలు చేయడంతోపాటు భూస్వామ్య వ్యవస్థలో వీరి పరోక్ష పాత్రను విమర్శించింది. ఎక్కువ ఉద్యోగాలను పొందేందుకు బ్రిటిష్ అనుకూల ధోరణికి ఈ ఉద్యమం వత్తాసు పలికింది.
ప్రజామిత్ర మండలి:
దీనిని 1917లో మైసూర్లో సీఆర్ రెడ్డి స్థాపించారు. మైసూర్లో ప్రారంభమైన మొదటి రాజకీయ సంస్థ బ్రాహ్మణ వ్యతిరేకతకు ఇది వేదికగా నిలిచింది.
వైకోం సత్యాగ్రహం:
1924-15లో జరిగిన ఈ సత్యాగ్రహానికి టీకే మాధవన్, కే కల్లాపాం, కేశవ మీనన్ నాయకత్వం వహించారు. అణగారిన వర్గాలు దేవాలయాల ప్రవేశం కోసం మొదటిసారిగా జరిగిన సంఘటిత ఉద్యమం. ఈ ఉద్యమం గాంధేయమార్గంలో నడిచింది. ట్రావెన్కోర్ దేవాలయ సమీపంలోని దారిపై అణగారినవర్గాలు నడిచేందుకు ఈ ఉద్యమం దోహదం చేసింది.
ఆత్మగౌరవ ఉద్యమం:
ఈవీ రామస్వామి నాయకత్వంలో 1925లో మద్రాస్‌లో జరిగింది. పూజారితో ప్రమేయం లేకుండా వివాహాలు జరిపించడం, దేవాలయాల్లోకి బలవంతంగా ప్రవేశంతోపాటు మనుస్మృతిని దహనం చేశారు. నాస్తిక వాదం వ్యాప్తికి కృషిచేశారు.
మహర్ సత్యాగ్రహం:
ఈ ఉద్యమం 1927లో మహారాష్ట్రలో జరిగింది. మహర్లు చెరువులను వాడుకోనివ్వాలని దేవాలయాల్లోకి ప్రవేశించే హక్కును కల్పించడంతోపాటు, గ్రామ పెద్దలకు అనాదిగా మహర్లు చేస్తున్న వెట్టిచాకిరీని రద్దుచేయాలని అంబేద్కర్ డిమాండ్ చేశారు.
నాయర్ ఉద్యమం:
19వ శతాబ్ది చివరలో ట్రావెన్కోర్లో ఈ ఉద్యమం జరిగింది. నంబూద్రీ బ్రాహ్మణుల సాంఘిక, రాజకీయ ఆధిపత్యంపై ఈ ఉద్యమం దాడిచేసింది.
మహర్ ఉద్యమం:
19వ శతాబ్దం చివరలో మహారాష్ట్రలో జరిగిన ఈ ఉద్యమానికి గోపాల్ బాబా వాలంగేకర్ నాయకత్వం వహించారు. అంటరాతి కులానికి చెందిన మహర్లకు క్షత్రియ హోదాను కల్పించడంతోపాటు సైనిక, సేవారంగాల్లో ఎక్కువ ఉద్యోగాలివ్వాలని పోరాడారు.
నాడార్ ఉద్యమం:
ఈ ఉద్యమం 19వ శతాబ్దం చివర, 20వ శతాబ్దం ఆరంభంలో తమిళనాడులో జరిగింది. దిగువ కులానికి చెందిన కల్లుగీత కార్మికులైన నాడార్లు క్షత్రియ హోదాను కల్పించడంతోపాటు దేవాలయాల్లోకి ప్రవేశించే హక్కు కోసం డిమాండ్ చేశారు. 1910లో నాడార్ మహాజన సంఘ్‌ను స్థాపించారు.
పల్లీ ఉద్యమం:
19వ శతాబ్దం చివరలో తమిళనాడులో జరిగింది. క్షత్రియ హోదాను కల్పించాలని ఉద్యమించారు. వీరు తమను తాము వన్నియకుల క్షత్రియగా ప్రకటించుకున్నారు. వీరు బ్రాహ్మణిక విధానాలను అనుకరించారు. విధవ పునర్వివాహంపై నిషేధం విధించారు.
ఎజోవ ఉద్యమం:
20వ శతాబ్ది ఆరంభంలో కేరళలో జరిగింది. అంటరానివారైన కల్లుగీత కార్మికులు నారాయణ గురు బోధనలతో స్ఫూర్తి పొంది దేవాలయాల ప్రవేశ హక్కుతోపాటు బ్రాహ్మణ ఆధిపత్యంపై దాడిచేశారు. 1902లో శ్రీనారాయణ గురు ధర్మపరిపాలన యోగంను స్థాపించారు.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు