బౌద్ధ సాహిత్యం- కొన్ని విషయాలు
బౌద్ధ ధర్మ సాహిత్యం పాళీ, మాగధి, ప్రాకృత భాషల్లో ఉంది.
-పాళీ భాషలో రాసిన దమ్మ గ్రంథాల్లో ముఖ్యమైనవి త్రిపీఠకాలు.
-త్రిపీఠక అంటే మూడు ధర్మపీఠికలు అని అర్థం. అవి..
1. సుత్త 2. వినయ 3. అభిదమ్మ పీఠికలు
-పీఠిక అనగా చిన్న గంప అని అర్థం. బుద్ధుని మరణానంతరం అతని బోధనలు మూడు గంపల్లో సేకరించారు. వీటినే త్రిపీఠకాలు అంటారు.
1. సుత్తపీఠిక
-బుద్ధుని శిష్యుడైన ఆనందుడు సంకలనం చేశాడు.
-బుద్ధుడి బోధనలను వివరిస్తుంది.
-ఈ పీఠికలో ఐదు భాగాలు ఉన్నాయి. ఒక్కొక్క విభాగాన్ని నికాయ అని పిలుస్తారు. ఈ భాగాల్లో బుద్ధుడి ఉపదేశాలు పరస్పర సంవాద రూపంలో ఉపన్యాస రూపంలో ఉన్నాయి.
1. దిఘనికాయ 2. మజ్జిమనికాయ 3. సంయుత్త నికాయ 4. అంగుత్తరనికాయ 5. ఖుద్ధకనికాయ
-అంగుత్తరనికాయలో మొదటిసారిగా 16 మహాజనపదాల గురించి పేర్కొన్నారు.
2. వినయ పీఠిక
-బుద్ధుడి శిష్యుడైన ఉపాలి సంకలనం చేశాడు.
-బుద్ధుడి సంఘ నియమ నిబంధనలను వివరిస్తుంది.
-ఈ పీఠికలో నాలుగు భాగాలు ఉన్నాయి. క్రమశిక్షణ, నియమాలను ఉల్లంఘించడం వల్ల కలిగే పరిణామాలను ఈ పీఠికలో వివరించారు.
3. అభిదమ్మ పీఠిక
-బుద్ధుడి దమ్మ వేదాంతాన్ని వివరిస్తుంది.
-ఈ పీఠికలో ఏడు భాగాలు ఉన్నాయి.
-ప్రాచీనకాలంలో చెప్పిన దమ్మం మిక్కిలి విపులంగా ఈ పీఠికలో పేర్కొన్నారు.
-ఏడు విభాగాలను ప్రథమ బౌద్ధ సంగీతిలో ఒకచోట సంకలనం చేశారు. ఈ విభాగాలు థెరవాద సిద్ధాంతాలను వివరిస్తాయి.
జాతక కథలు
-బుద్ధుడి పూర్వజన్మల గురించి చెప్పే కథలను జాతక కథలు అంటారు.
-జాతక కథలను క్రీ.శ. 300 నుంచి క్రీ.శ. 400 మధ్య కాలంలో రచించినట్లు తెలుస్తుంది.
-బుద్ధుడు 500 జన్మలు ఎత్తుతాడని బౌద్ధ గ్రంథాలు తెలుపుతున్నాయి.
-జాతక కథల్లో చాలా వరకు నీతి కథలే ఉన్నాయి.
-ఆంధ్రప్రదేశ్లోని అమరావతి, గోలి, నాగార్జునకొండలోని శిల్పఖండాల్లో జాతక కథలు చూడవచ్చు.
-అజంతాలో కొన్ని జాతక కథలు చూడవచ్చు.
-1వ గుహలో మహాజనక జాతకం, 17వ గుహలో మహాహంస, మాతృ పోషక జాతకాల్లోని కొన్ని దృశ్యాలు చెక్కి ఉన్నాయి.
-అమరావతిలో మిత్ర విందకుని కథ, నలగిరిగజ దర్శనం, బుద్ధుడు శ్వేత రూపంలో అవతరించిన కథలు చెక్కి ఉన్నాయి.
-అజంతా గుహల్లోని 1వ గుహలో స్నాన, అంతఃపుర దృశ్యాలు, 16, 17వ గుహల్లో బుద్ధుడి ఉపదేశం, 19వ గుహలో బుద్ధుడి ఎదుట మాతాశిశువులు గల దృశ్యం, 26వ గుహలో బుద్ధుడి మహాపరినిర్యాణం చెక్కి ఉన్నాయి.
బుద్ధుడి బోధనలు
-వేదాల్లో పేర్కొన్న యజ్ఞయగాదులు చేసి వాటి ఫలితంగా కోరిన కోరికలు సాధించవచ్చనే అభిప్రాయం ప్రజల్లో ఉంది. కానీ, అవి సామాన్యులకు అందుబాటులో లేకపోయాయి.
-వేదాంతం, జీవాత్మ, పరమాత్మ, బ్రహ్మ, సత్యం, అహింస తదితర విషయాల గురించి ఉపనిషత్తులు తెలుపుతున్నాయి. ప్రపంచం మిథ్య అని, బ్రహ్మసత్యం అని పేర్కొన్నాయి. ప్రపంచాన్ని బ్రహ్మ సృష్టించాడని తెలిపాయి. కానీ, ఈ ఉపనిషత్తులను అర్థం చేసుకోని స్థితిలో సామాన్యులు లేరు.
-భగవంతునితో నిమిత్తం లేకుండా లక్ష్య సిద్ధిని స్వయం కృషితో పొందవచ్చు అని బోధించాడు.
-బుద్ధుడు నాలుగు సత్యాలను ప్రవచించాడు. వీటినే ఆర్యసత్యాలు అంటారు.
1. దుఃఖం: జీవితమే దుఃఖమయమని చెప్పాడు.
2. దుఃఖ కారణాలు: కోరిక (తృష్ణ) వల్ల దుఃఖం కలుగుతుంది. కోరిక పునర్జన్మకు దారి తీస్తుంది.
3. దుఃఖ విరోధం: తృష్ణను అరికట్టవచ్చు. ఈ కోరికల వల్ల కలిగే దుఃఖానికి నివారణ ఉంది.
4. దుఃఖ వినాశమార్గం: బుద్ధుడు దుఃఖాలను తొలిగించడానికి అష్టాంగ మార్గాన్ని సూచించాడు.
ఆర్య అష్టాంగ మార్గం
-బుద్ధుడు నీతిని బోధించటమే ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్నాడు. ఒకవైపు ప్రపంచ సుఖాల్లో నిమగ్నం కావడం, మరోవైపు మితిమీరిన ఉపవాసాలు చేసి శరీరాన్ని శుష్కించడం రెండూ నిష్ప్రయోజనమే. ఈ రెండు విపరీత ప్రవృత్తులకు మధ్య మార్గం అష్టాంగ మార్గం. దుఃఖానికి అజ్ఞానం కారణం. అజ్ఞానాన్ని తొలిగించేందుకు ఈ మార్గాన్ని అనుసరించాలి.
1. సమ్యక్ దృష్టి 2. సమ్యక్ సంకల్పం 3. సమ్యక్ వాక్కు 4. సమ్యక్ కర్మ 5. సమ్యక్ జీవనం 6. సమ్యక్ వ్యాయామం 7. సమ్యక్ స్మృతి 8. సమ్యక్ సమాధి
బౌద్ధ మతతత్వం
-బుద్ధుడు నీతి సూత్రాలను ఉపనిషత్తుల నుంచి, తన అనుభవం ద్వారా పరిశోధించిన సత్యాలను సమన్వయపరచి సమకాలీన సమస్యలకు పరిష్కారంగా ఒక ధర్మాన్ని రూపొందించాడు.
-ఆ ధర్మాన్ని సక్రమ పద్ధతిలో ప్రవేశపెట్టి వ్యాపింపజేయడంలో బుద్ధుని గొప్పతనం ఉంది. బ్రాహ్మణులను కూడా బుద్ధుడు గౌరవించాడు.
-బౌద్ధమతంలో భగవంతునితో నిమిత్తం లేదు. కర్మ సిద్ధాంతం ప్రపంచ స్వరూపాన్ని వివరిస్తుందని, కర్మ సిద్ధాంతాన్ని విశ్వసించి కర్మ సిద్ధాంతాలపైనే ప్రపంచం ఆధారపడిందని అన్మాత సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు.
-బౌద్ధ మతానుసారం మానవ శరీరం పంచఖండాలతో తయారైనది. అవి..
1. రూపం 2. వేదన 3. సంజ్ఞ 4. సంస్కారం
5. విజ్ఞానం
-ఈ పంచఖండ సిద్ధాంతం నుంచే కొన్ని ముఖ్యమైన అంశాలను గ్రహించి వైభాసిక, సౌతాంతిక, యోగాచార, మాధ్యమికశాఖలను స్థాపించారు.
-హిందూమతం మాదిరిగానే బౌద్ధమతం కూడా కర్మ సిద్ధాంతాన్ని విశ్వసించింది.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు