స్కాలర్షిప్స్.. చదువుకు చేయూత !
ఇంటర్ అయిపోయింది. ఇంజినీరింగ్, మెడిసిన్ వంటి ప్రొఫెషనల్ కోర్సులు చేయడానికి సన్నద్ధమవుతున్నారు విద్యార్థులు. కానీ వీరిలో చాలామందికి ఆర్థికంగా ఫీజులు చెల్లించలేని పరిస్థితి. వీరి చదువులకు ఎటువంటి అడ్డంకులు లేకుండా ఫీజు చెల్లించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతోపాటు పలు ఇతర సంస్థలు, ఏజెన్సీలు ఉన్నాయి. జాతీయ, రాష్ట్ర స్థాయిలో స్కాలర్షిప్స్ వివరాలు…
ప్రగతి స్కాలర్షిప్ స్కీం ఫర్ గర్ల్స్
దీనికి నిధులను కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ చేకూరుస్తుంది. దీన్ని ఏఐసీటీఈ అమలుపరుస్తుంది. డిప్లొమా/ఇంజినీరింగ్ చదువుకునే బాలికలకు (మహిళలకు) ఆర్థిక చేయూతనివ్వడానికి ఈ స్కాలర్షిప్ను ఏర్పాటుచేశారు. మొత్తం ఐదువేల స్కాలర్‌షిప్స్‌ను ఇస్తారు.
ఎవరు దరఖాస్తు చేసుకోవచ్చు?
ఏఐసీటీఈ గుర్తింపు పొందిన సంస్థల్లో డిగ్రీ/డిప్లొమా మొదటి సంవత్సరంలో ప్రవేశం పొందినవారు. ప్రవేశాలు రాష్ట్ర/జాతీయస్థాయి కౌన్సెలింగ్ ద్వారా అయి ఉండాలి.
ఒక్కో కుటుంబం నుంచి ఇద్దరు బాలికలకు ఇస్తారు. వారి కుటుంబ వార్షికాదాయం ఎనిమిది లక్షలు మించరాదు.
ఈ స్కాలర్షిప్స్ రిజర్వేషన్ల ప్రకారం అంటే ఎస్సీలకు 15 శాతం, ఎస్టీలకు 7.5 శాతం, ఓబీసీలకు 27 శాతం చొప్పున కేటాయిస్తారు.
ఎంత స్కాలర్షిప్ ఇస్తారు?
నాలుగేండ్లు/ లేటరల్ ఎంట్రీ కింద మూడేండ్ల డిగ్రీ చదువుతున్న విద్యార్థినులకు ఈ స్కాలర్షిప్ కింద రూ.50,000 ఇస్తారు. కాలేజీ ఫీజు, కంప్యూటర్ పర్చేజ్, స్టేషనరీ బుక్స్, ఎక్విప్మెంట్, సాఫ్ట్వేర్ తదితరాలన్నింటికి కలిపి పై మొత్తాన్ని నేరుగా విద్యార్థినుల ఖాతాలో జమ చేస్తారు.
ముఖ్యతేదీలు: ఈ ఏడాది దరఖాస్తు చేసుకోవడానికి చివరితేదీ నవంబర్ 30.
కావాల్సిన సర్టిఫికెట్లు: పదోతరగతి/ఇంటర్ తదితర అవసరమైన అకడమిక్ సర్టిఫికెట్లు. కుటుంబ వార్షికాదాయ ధృవీకరణ పత్రం, ప్రవేశం పొందిన పత్రం, ట్యూషన్ ఫీజు రిసిప్ట్, ఆధార్‌తో లింక్ అయిన బ్యాంక్ పాస్‌బుక్ అకౌంట్ నంబర్, ఐఎఫ్ఎస్సీ కోడ్, ఫొటోగ్రాఫ్. కులధ్రువీకరణ పత్రం, ఆధార్‌కార్డు, తల్లిదండ్రులు ధ్రువీకరణ పత్రం.
పూర్తి వివరాల కోసం వెబ్సైట్: https://www.aicte-india.org
ఓఎన్జీసీ స్కాలర్షిప్
దేశంలో ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు ప్రోత్సాహాన్ని అందించాలనే ఉద్దేశంతో ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ (ఓఎన్జీసీ) ఫౌండేషన్ సీఎస్ఆర్ కింద ఈ స్కాలర్షిప్స్ అందిస్తుంది.
ఎవరు అర్హులు ?
ఇంజనీరింగ్, ఎంబీఏ, ఎంబీబీఎస్ లేదా మాస్టర్స్ ఇన్ జియోఫిజిక్స్/జియాలజీ ప్రోగ్రామ్స్‌లలో మొదటి ఏడాది చదివే వారు, అలాగే గత అకడమిక్ పరీక్షల్లో కనీసం 60 శాతం సీజీపీఏ సాధించిన విద్యార్థులు కూడా ఈ స్కాలర్షిప్ దరఖాస్తుకు అర్హులు.
దీనితోపాటు జనరల్/ఓబీసీ కుటుంబ వార్షికదాయం రూ. 2 లక్షలకు మించరాదు. ఎస్సీ/ఎస్టీలు అయితే రూ.4.5 లక్షలకు మించరాదు.
వయసు: జూలై 1 నాటికి 30ఏళ్లకు మించకుండా ఉండాలి.
స్కాలర్షిప్
ఈ ప్రోగ్రామ్ కింద అర్హులైన 500 మంది విద్యార్థులను ఎంపిక చేసి.. ఏడాదికి రూ.48,000 అంటే నెలకు రూ.4,000 చొప్పున స్కాలర్‌షిప్‌గా అందిస్తారు.
నోట్: 50 శాతం స్కాలర్‌షిప్స్‌ను అమ్మాయిలకు కేటాయిస్తారు.
దరఖాస్తు: ఆన్లైన్లో
వెబ్సైట్: www.ongcindia.com
సాక్షం స్కాలర్షిప్ స్కీం ఫర్ స్పెషల్లీ ఏబుల్డ్ స్టూడెంట్
కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ అమలు చేస్తున్న స్కాలర్‌షిప్స్‌లో ‘సాక్షం’ ఒకటి. దీన్ని ఏఐసీటీఈ అమలు చేస్తుంది. దివ్యాంగులు సాంకేతిక (టెక్నికల్) విద్యను అభ్యసించడానికి చేయూతనిచ్చే స్కాలర్షిప్ ఇది.
ఏఐసీటీఈ గుర్తింపు పొందిన ఏదైనా విద్యాసంస్థలో డిగ్రీ/డిప్లొమా మొదటి సంవత్సరంలో ప్రవేశం పొంది ఉండాలి. ఈ ప్రవేశం రాష్ట్ర/జాతీయస్థాయిలో సెంట్రలైజ్డ్ అడ్మిషన్ ప్రాసెస్‌లో జరిగి ఉండాలి. అంటే కౌన్సెలింగ్ విధానంలో సీటు పొందినవారికి మాత్రమే.
దివ్యాంగుడైన విద్యార్థి డిజిబిలిటీ 40 శాతం లేదా అంతకన్నా ఎక్కువగా ఉండాలి. అభ్యర్థి కుటుంబ వార్షికాదాయం ఎనిమిది లక్షలు మించరాదు.
స్కాలర్‌షిప్‌లకు అభ్యర్థులను అర్హత పరీక్షలో సాధించిన మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
స్కాలర్షిప్ కింద రూ.50,000/- ఇస్తారు.
ఈ స్కీం కింద బాల, బాలిక దివ్యాంగ విద్యార్థులకు స్కాలర్షిప్ ఇస్తారు.
పూర్తి వివరాల కోసం వెబ్సైట్:
https://www.aicte-india.org
సెంట్రల్ సెక్టార్ స్కీం ఆఫ్ స్కాలర్షిప్
వెనకబడిన కుటుంబ నేపథ్యం ఉన్న విద్యార్థులకు ఈ స్కీం కింద ఆర్థిక సహాయాన్ని నేరుగా చేస్తారు. దీన్ని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ ఇస్తుంది. ఏటా 82,000 మందికి ఈ పథకం కింద స్కాలర్‌షిప్స్‌ను అందిస్తారు.
ఎవరు అర్హులు?
ఇంటర్ లేదా తత్సమాన కోర్సులో కనీసం 80 శాతం మార్కులు సాధించి ఉండాలి. ఏఐసీటీఈ గుర్తింపు పొందిన ఏదైనా విద్యాసంస్థలో రెగ్యులర్ డిగ్రీలో ప్రవేశం పొంది ఉండాలి.
కుటంబ వార్షికాదాయం ఎనిమిది లక్షలు మించరాదు.
స్కాలర్షిప్ ఎంత ఇస్తారు?
బీఈ/బీటెక్ పూర్తయ్యే వరకు ఏటా రూ. 10,000 ఇస్తారు. ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ అయితే మొదటి మూడేండ్లు పదివేలు, తర్వాతి రెండేండ్లు రూ.20 వేలు ఇస్తారు. పీజీ చేస్తున్నవారికి అయితే ఏటా రూ.20 వేలు ఇస్తారు.
ముఖ్యతేదీలు: ఏటా ఈ స్కాలర్షిప్స్ దరఖాస్తులను జూన్/జూలైలో స్వీకరిస్తారు. పూర్తి వివరాల కోసం వెబ్సైట్: https://scholarships.gov.in చూడవచ్చు
విద్యాధన్ స్కాలర్షిప్
సరోజిని దామోదరన్ ఫౌండేషన్ విద్యాధన్ స్కాలర్షిప్ ప్రోగ్రాం ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలలోని ప్రతిభావంతులైన విద్యార్థులు హయ్యర్ ఎడ్యుకేషన్ చదివేలా ప్రోత్సహించడమే లక్ష్యంగా ఈ స్కాలర్షిప్లను సంస్థ అందిస్తుంది.
ఈ స్కాలర్షిప్ను దేశంలోని పది రాష్ర్టాలలో ఎస్డీ ఫౌండేషన్ అమలు చేస్తుంది.
విద్యాధన్ స్కాలర్షిప్ ప్రోగ్రాం 2021
ఎవరు అర్హులు ?
90 శాతం మార్కులతో పదోతరగతి ఉత్తీర్ణత లేదా తత్సమాన ఉత్తీర్ణత.
వార్షిక ఆదాయం రూ.2 లక్షలకు మించరాదు.
స్కాలర్షిప్ వివరాలు
ఇంటర్ రెండు సంవత్సరాలకు ప్రతి సంవత్సరం రూ.6,000/- చొప్పున అందిస్తారు.
ఎంపిక: దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులను షార్ట్‌లిస్ట్ చేసి ఆన్లైన్ టెస్ట్/ఇంటర్వ్యూ నిర్వహించి ఎంపిక చేస్తారు.
దరఖాస్తు: ఆన్లైన్లో
వెబ్సైట్: https://www.vidyadhan.org
- Tags
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు