పార్లమెంటరీ పద్ధతులు- పారిభాషిక పదజాలం
పార్లమెంటు సమావేశంలో ఉన్నప్పుడు సభలో వివిధ చర్చలు, తీర్మానాలు, ఓటింగ్ మొదలైన ప్రక్రియలు ఉంటాయి. పార్లమెంటులో ప్రయోగించే పదాలకు ప్రత్యేక అర్థం ఉంటుంది. పార్లమెంటరీ ప్రక్రియలో అధికభాగం బ్రిటిష్ రాజ్యాంగం నుంచి గ్రహించినవే. ఆ పదజాలం పద్ధతుల గురించి చూద్దాం.
సమావేశ కాలం (Session)
పార్లమెంటు కార్యక్రమాలు ప్రారంభమైన మొదటి రోజు నుంచి చివరిరోజు వరకు ఉన్న మధ్యకాలాన్ని సమావేశకాలం అంటారు. ఈ మధ్యలో ప్రతిరోజు సభ సమావేశమవుతుంది. సభావ్యవహారాలు కొనసాగుతూ, సమయం ప్రకారం వాయిదా పడుతూ మళ్లీ కొనసాగుతూ ఉంటాయి.
ప్రతి సంవత్సరం పార్లమెంటు 3 సార్లు సమావేశమవుతుంది.
- బడ్జెట్ సమావేశాలు (సాధారణంగా ఫిబ్రవరి-మార్చి)
- వర్షాకాల సమావేశాలు (జూలై-ఆగస్టు)
- శీతాకాల సమావేశాలు (నవంబర్-డిసెంబర్)
కోరమ్ (నిర్దిష్ట పూర్వక సంఖ్య) (Quorum)
పార్లమెంటు సమావేశాలు జరగడానికి హాజరు కావాల్సిన కనిష్ట సభ్యుల సంఖ్యను కోరమ్ అంటారు. అది ఆ సభలోని మొత్తం సభ్యుల్లో (సభాధ్యక్షులతో కలుపుకొని) 1/10వ వంతుకు సమానంగా ఉంటుంది. కోరమ్ కన్నా తక్కువ సభ్యులు హాజరైతే సభా కార్యక్రమాలను సభాధ్యక్షుడు కొంతసేపు వాయిదా వేయాలి. కోరమ్ ఉన్నదా లేదా అని నిర్ణయించేది సభాధ్యక్షుడు.
ఎజెండా (Agenda)
సభలో చర్చించాల్సిన కార్యక్రమాల పట్టికను ఎజెండా అంటారు. సభాకార్యక్రమాలు ఎజెండా ప్రకారమే నిర్వహిస్తారు. సభా వ్యవహారాల సలహా కమిటీ ఎజెండాను నిర్ణయిస్తుంది. సాధారణంగా ప్రశ్నోత్తరాల సమయం ముగిసిన వెంటనే ఈ కార్యక్రమాల పట్టికను అమల్లోకి తెస్తారు.
వాయిదా (Adjournment)
సమావేశ మధ్యకాలంలో తాత్కాలికంగా సభా కార్యక్రమాలను నిర్ణీత వ్యవధికి నిలిపివేసి, ఆ తర్వాత కొనసాగిస్తారు. దీనినే వాయిదా అంటారు. ఉదా: సభలో గందరగోళ పరిస్థితి ఏర్పడినప్పుడు, భోజన విరామం, సెలవులు మొదలైన కారణాల వల్ల సభా కార్యక్రమాలను సభాధ్యక్షుడు నిలిపివేస్తారు.
నిరవధిక వాయిదా (Adjourn sine-die)
సభా సమావేశాలను సమయం తెలపకుండా నిరవధికంగా వాయిదా వేయడం. సభలను నిరవధికంగా వాయిదా వేసే అధికారం సభాధ్యక్షుడికి ఉంటుంది. అయితే ఒకసారి సభని నిరవధికంగా వాయిదా వేసిన తర్వాత కూడా తిరిగి సమావేశపరిచే అధికారం స్పీకర్‌కే ఉంటుంది. ప్రోరోగ్ చేసినప్పుడు మాత్రం సభలను తిరిగి సమావేశపరిచే అధికారం రాష్ట్రపతి/గవర్నర్‌కు ఉంటుంది.
దీర్ఘకాలిక వాయిదా (Prorouge)
సమావేశ సమయంలోనే అనివార్య పరిస్థితుల మూలంగా సభా కార్యకలాపాలను తాత్కాలికంగా స్తంభింపచేయడం ‘వాయిదా’ అయితే, సభ సమావేశం ముగిసిన తరువాత దీర్ఘకాలం పాటు అంటే మరో సమావేశం ఏర్పాటు చేసేవరకు వాయిదా వేయడాన్ని ‘ప్రోరోగ్’ అంటారు. అసెంబ్లీ/ పార్లమెంటు సమావేశం ముగియడాన్ని రాష్ట్రపతి/ గవర్నర్ లాంఛనప్రాయంగా ప్రకటించడమే ప్రోరోగ్. ప్రోరోగ్ తర్వాత సభా సమావేశాలను తిరిగి ఏర్పాటు చేసే అధికారం కేవలం రాష్ట్రపతి/గవర్నర్‌కే ఉంటుంది.
- Tags
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు