పదమూడేండ్ల బ్రిక్స్ ప్రస్థానం
ప్రపంచ జనాభాలో సుమారు 42%, ప్రపంచ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో 24%, ప్రపంచ వాణిజ్యంలో 16% వాటా కలిగి ఉన్న ప్రధాన వర్ధమాన ఆర్థిక వ్యవస్థలను కలిపే అంతర్జాతీయ వేదికే బ్రిక్స్. బ్రిక్స్ దేశాలైన భారత్, చైనా, రష్యా, బ్రెజిల్, సౌతాఫ్రికా కొన్ని దశాబ్దాలుగా ప్రపంచ ఆర్థిక వృద్ధికి ప్రధాన ఇంజిన్లుగా నిలుస్తూ వచ్చాయి. బ్రిక్స్ నిర్మాణం, చర్చలు, వ్యవహారాలు రాజకీయ వ్యవహారాలు, భద్రత, ఆర్థిక సుస్థిరత, సహకారం, సంస్కృతి, వ్యక్తుల మధ్య సౌహార్ద్ర సంబంధాలు అనే మూడు స్తంభాలపై ఆధారపడి ఉన్నాయి.
బ్రిక్స్ పుట్టిందిలా..
బ్రిక్స్ ఆవిర్భావానికి బీజాలు 2006లో పడ్డాయి. ఆ ఏడాది రష్యాలోని సెయింట్ పీటర్స్‌బర్గ్‌లో జరిగిన జీ8 అవుట్‌రీచ్ సమ్మిట్ సందర్భంగా భారత్, చైనా, రష్యా, బ్రెజిల్ దేశాల నాయకులు ఒక ఉమ్మడి అంతర్జాతీయ వేదిక నిర్మాణంపై చర్చించారు. అదే ఏడాది సెప్టెంబర్‌లో తొలి బ్రిక్ విదేశాంగ మంత్రుల సమావేశం ద్వారా బ్రిక్‌ను ఏర్పాటు చేశారు. అనేక ఉన్నత స్థాయి సమావేశాల తరువాత మొట్టమొదటి బ్రిక్ శిఖరాగ్ర సమావేశం 16 జూన్, 2009న రష్యాలోని యెకటెరిన్‌బర్గ్‌లో జరిగింది.
2009లో కొపెన్‌హెగెన్ పర్యావరణ సదస్సులో కాలుష్య ఉద్గారాల నియంత్రణ విషయంలో అభివృద్ధి చెందిన దేశాలకు, అభివృద్ది చెందుతున్న దేశాలకు మధ్య విభేదాలు తలెత్తాయి. అమెరికా, యూరోపియన్ యూనియన్ దేశాల వైఖరితో విసుగెత్తిన నాటి భారత ప్రధాని మన్మోహన్సింగ్, చైనా అధ్యక్షుడు వెన్జియబావో బ్రెజిల్, దక్షిణాఫ్రికాతో కలిసి బేసిక్ గ్రూపును ఏర్పాటు చేశారు. అభివృద్ధి చెందిన దేశాల ఆధిపత్యం నుంచి బయటపడి అభివృద్ధి చెందుతున్న దేశాలకు మార్గదర్శిగా నిలిచేందుకు బేసిక్ గ్రూప్ నుంచి 2009లో బ్రిక్ అవతరించింది. 2010లో దక్షిణాఫ్రికా చేరడంతో బ్రిక్స్‌గా మారింది.
2009 బ్రిక్ సమావేశం
మొదటి సమావేశం రష్యాలోని యెకటెరియన్బర్గ్లో జరిగింది. ఈ సమావేశంలో బ్రెజిల్, రష్యా, భారత్, చైనా ప్రపంచ ఆహార భద్రతపై సంయుక్త తీర్మానం చేశాయి. ప్రస్తుతం ప్రపంచం ఎదుర్కొంటున్న ఆర్థిక మాంద్యం ఆహారభద్రతపై ప్రభావం చూపే ప్రమాదం ఉంది. కోట్లాది మంది ఆకలితో అలమటించడంతో పాటు పౌష్టికాహారానికి దూరమవుతారు. ఇది ఐరాస సహస్రాబ్ది లక్ష్యాలకు విరుద్ధం. ఈ పరిస్థితి నుంచి గట్టెక్కాలంటే ప్రపంచ దేశాలన్నీ కలిసి ఆహారభద్రత కోసం కృషి చేయాలి. అభివృద్ధి చెందుతున్న దేశాలకు అభివృద్ధి చెందిన దేశాలు ఆర్థిక సహాయంతో పాటు సాంకేతికను అందించి అధిక దిగుబడులకు సహకరించాలని తీర్మానంలో పేర్కొంది. పర్యావరణ మార్పులు, జీవ ఇంధనాల వాడకం, డబ్ల్యూటీవో ఒప్పందాలు మొదలైన అంశాలను బ్రిక్ మొదటి సమావేశం తీర్మానంలో పేర్కొన్నారు.
2010 సమావేశం
రెండో సమావేశం బ్రెజిల్ రాజధాని బ్రసీలియాలో జరిగింది. ఈ సమావేశ తీర్మానంలో నేటి బహుళధ్రువ ప్రపంచంలో అంతర్జాతీయ న్యాయసూత్రాలకు లోబడి సమానత్వం, గౌరవ దృక్పథంతో పరస్పర సహకారంతో ప్రపంచ అభివృద్ధి కోసం కృషి చేస్తాం. సమష్టి నిర్ణయాల్ని గౌరవిస్తాం. ప్రపంచం ఎదుర్కొంటున్న సమస్యల్ని పరిష్కరించడంలో జీ20 దేశాలు క్రియాశీల పాత్ర పోషించాలి. ఇంతవరకూ జీ20లో చేసిన తీర్మానాలన్నింటిని సభ్యదేశాలన్నీ పాటించాలి. ప్రపంచ వాణిజ్యంలో వివక్షను పరిష్కరించడంలో జీ20 దేశాలు క్రియాశీల పాత్ర పోషించాలి. ప్రపంచ వాణిజ్యంలో వివక్షకు తావులేకుండా, రక్షణాత్మక ధోరణులకు పాల్పడకుండా పారదర్శక వాణిజ్యం కోసం డబ్ల్యూటీవో చొరవతీసుకోవాలని తీర్మానించింది. పేదరిక నిర్మూలనకు చేపట్టాల్సిన చర్యలు, ఇంధన వనరుల వినియోగం, పర్యావరణ మార్పులు, ఉగ్రవాదంపై పోరాటం మొదలైన అంశాలపై తీర్మానం చేసింది.
2011 సమావేశం
చైనాలోని సాన్యాలో జరిగిన మూడో సమావేశంలో దక్షిణాఫ్రికా తొలిసారి పాల్గొంది. బ్రిక్ కాస్త బ్రిక్స్‌గా అవతరించింది. ఈ సమావేశంలో పలు తీర్మానాలను ఆమోదించారు. ఐరాస సాధారణ, భద్రతా మండలిలో సంస్కరణలు చేపట్టాలి.
అంతర్జాతీయంగా ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా తుదముట్టించాలి. అందుకు ఐరాస ఓ కార్యాచరణను రూపొందించాలి.
ఆర్థికమాంద్యం నుంచి ప్రపంచం ఇప్పుడిప్పుడే కోలుకుంటుంది. ప్రధాన ఆర్థిక వ్యవస్థలు స్థూల ఆర్థిక విధానాల్లో తమ సహకారాన్ని కొనసాగించి మాంద్యం నుంచి పూర్తిగా బయటపడేలా కృషిచేయాలి. ఇందుకోసం జీ20 చేపడుతున్న సానుకూల చర్యలను స్వాగతిస్తున్నాం.
ప్రకృతి విపత్తులతో అతలాకుతలమైన జపాన్ తిరిగి కోలుకోవడానికి సహకారం అందిస్తామని తదితర తీర్మానాలు చేశారు. వీటితో పాటు బ్రిక్స్ దేశాల మధ్య పరస్పర సహకారాన్ని మరింత బలోపేతం చేసేందుకు వీలుగా ఓ యాక్షన్ ప్లాన్‌ను రూపొందించారు. ఇందులో భాగంగా వ్యవసాయం, ఆహారం, భద్రత మొదలైన అంశాల్లో పరస్పర సహకారాన్ని మెరుగుపరచుకునేందుకు వివిధ స్థాయిలో సమావేశాలు, చర్చలు జరపాలని నిర్ణయించారు. బ్రిక్స్ మేధోమథన కూటమిని కొనసాగిస్తూ బ్రిక్స్ దేశాల్లో పలు పరిశోధనా కేంద్రాలను ఏర్పాటు చేయడం, అనుసంధానించడం చేయాలని నిర్ణయించారు. సాంస్కృతిక రంగంలో పరస్పర సహకారం, క్రీడలు, గ్రీన్ ఎకానమీని ప్రోత్సహించడం, శాస్త్ర, సాంకేతిక రంగాల్లో నూతన ఆవిష్కరణలకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చలు జరపడం, బ్రిక్స్ యునెస్కో గ్రూపును ఏర్పాటు చేయడం వంటి ప్రతిపాదనలు తెరపైకి వచ్చాయి.
2012 సమావేశం
బ్రిక్స్ నాలుగో సమావేశానికి న్యూఢిల్లీ ఆతిథ్యం ఇచ్చింది. ‘ప్రపంచ స్థిరత్వం, భద్రత, సౌభాగ్యం కోసం బ్రిక్స్ భాగస్వామ్యం’ అనే నినాదంతో ఈ సమావేశం జరిగింది. ప్రపంచబ్యాంకు, ఐఎంఎఫ్ సంస్థలు సభ్యదేశాలన్నింటికి సమాన ప్రాధాన్యతనిచ్చి అంతర్జాతీయ సంస్థగా తన బహుముఖ పాత్రను పోషించాలని తీర్మానించాయి.
ఈ సమావేశంలో వర్ధమాన, అభివృద్ధి చెందుతున్న దేశాల్లో మౌలిక వసతులు, సుస్థిరాభివృద్ధి ప్రాజెక్టులకు ఆర్థిక వనరులను సమకూర్చే విధంగా న్యూ డెవలప్మెంట్ బ్యాంకును ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన తెరపైకి వచ్చింది. ఈ బ్యాంకు ఏర్పాటు, మనుగడ సాధ్యాసాధ్యాలపై అధ్యయనానికి జాయింట్ వర్కింగ్ గ్రూపు ఏర్పాటు చేసి తదుపరి బ్రిక్స్ సమావేశం నాటికి నివేదికను సమర్పించాలని నిర్దేశించాయి. బ్రిక్స్ దేశాల మధ్య యువత, క్రీడలు, విద్య, సంసృ్కతి, పర్యాటక రంగాల్లో సహకారంతో పాటు ప్రజల మధ్య నేరుగా సంబంధాలు బలపడే విధంగా (పీపుల్ టు పీపుల్ కాంటాక్ట్) చర్యలు తీసుకుంటామని తీర్మానించాయి.
2013 సమావేశం
బ్రిక్స్ ఐదో సమావేశాలకు దక్షిణాఫ్రికాలోని డర్బన్ నగరం ఆతిథ్యమిచ్చింది. ఈ సమావేశంలోని న్యూ డెవలప్మెంట్ బ్యాంకు ఏర్పాటుకు సభ్యదేశాలన్నీ అంగీకరించాయి. అలాగే సభ్యదేశాలకు ఆర్థిక భద్రత కల్పించడం, సంక్షోభ సమయాల్లో సహకారం కోసం విదేశీ మారక నిల్వలను పోగుచేసి అత్యవసరనిధిని (కంటెంజెంట్ రిజర్వ్ అరేంజ్మెంట్-సీఆర్ఏ) ఏర్పాటు చేయాలని నిర్ణయించాయి.
2014 సమావేశం
ఈ సమావేశం ‘సమ్మిళిత వృద్ధి: సుస్థిర పరిష్కారాలు’ అనే నినాదంతో బ్రెజిల్‌లోని పోర్డలెజా నగరంలో జరిగింది. ఈ సమావేశాల్లోనే న్యూ డెవలప్మెట్ బ్యాంకు ఏర్పాటు కోసం రూపొందించిన ఒప్పందంపై సభ్యదేశాలన్నీ సంతకం చేశాయి. బ్రిక్స్ అత్యవసరనిధి ఏర్పాటు (కంటెంజెంట్ రిజర్వ్ అరేంజ్మెంట్) కోసం రూపొందించిన ఒప్పందంపైనా సభ్యదేశాలు సంతకం చేశాయి. అలాగే బ్రిక్స్ దేశాల మధ్య ఆర్థిక సహకారాన్ని, వాణిజ్యాన్ని ఉన్నతస్థాయికి తీసుకెళ్తామని తీర్మానించాయి. ఉన్నతవిద్య, కార్మిక, ఉపాధి, సామాజిక భద్రత మొదలైన రంగాల్లోనూ పరస్పర సహకారాన్ని విస్తరించాలని నిర్ణయించాయి.
2015 సమావేశం
రష్యాలోని ఉఫాలో ‘బ్రిక్స్ భాగస్వామ్యం ప్రపంచ అభివృద్ధిలో కీలకపాత్ర’ అనే నినాదంతో జరిగింది. సభ్యదేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం చేసుకోవాలని తీర్మానించారు. అలాగే సభ్యదేశాలతో పాటు అంతర్జాతీయంగా నూతన సవాళ్లను ఎదుర్కోవడం, శాంతి భద్రతల పరిరక్షణ, సుస్థిరాభివృద్ధి, పేదరిక నిర్మూలన, నిరుద్యోగ సమస్యలకు పరిష్కారం దిశగా సమాలోచనలు జరిపారు. న్యూ డెవలప్మెంట్ బ్యాంకు ద్వారా సభ్యదేశాలతో పాటు అభివృద్ధి చెందుతున్న, వర్ధమాన దేశాలకు కూడా బ్రిక్స్ సహకరించగలదనే అభిప్రాయం సభ్యదేశాల మధ్య వ్యక్తమైంది.
2016 సమావేశం
భారత్ రెండోసారి ఆతిథ్యమిచ్చింది. గోవాలో ‘బిల్డింగ్ రెస్పాన్సివ్, ఇంక్లూజివ్, అండ్ కలెక్టివ్ సొల్యూషన్స్’ అనే నినాదంతో జరిగింది. ఈ సమావేశంలో పలు రంగాల్లో సభ్యదేశాల మధ్య సహకారం కోసం వివిధ సంస్థలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. బ్రిక్స్ వ్యవసాయ పరిశోధనా సంస్థ, రైల్వే రీసెర్చ్ నెట్వర్క్, క్రీడా మండలి వంటి సంస్థల ఏర్పాటుపై చర్చించారు.
2017 సమావేశం
చైనాలోని జియామెన్‌లో 9వ బ్రిక్స్ సమావేశం జరిగింది. ‘బ్రిక్స్: మెరుగైన భవిష్యత్ కోసం దృఢమైన భాగస్వామ్యం’అనే నినాదంతో జరిగిన ఈ సమావేశంలో పలు తీర్మానాలు చేశారు. ప్రధానంగా ఉగ్రవాదంపై దృష్టి సారించిన నేతలు అఫ్గానిస్థాన్‌లో హింసకు వెంటనే చరమగీతం పాడాలని అభిప్రాయం వ్యక్తం చేశారు. తాలిబన్లు, ఐఎస్ఐఎస్, దాని అనుబంధ సంస్థలు, అల్‌ఖైదా, హఖానీ నెట్వర్క్, లష్కరే తొయిబా, జైషే మహమ్మద్, తెహ్రీక్ ఇ తాలిబన్ పాకిస్థాన్, తహ్రీర్ల కారణంగా విస్తరిస్తున్న హింసపై బ్రిక్స్ నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. ఉగ్రవాదంపై పోరుకు అన్ని దేశాలు సమగ్ర విధానాన్ని అవలంబించాలని పిలుపునిచ్చారు. తమ భూభాగాల్లో ఉగ్రవాద కార్యకలాపాలకు ఆర్థిక సహాయం అందకుండా నిరోధించే బాధ్యత ప్రతీ దేశంపై ఉందని తీర్మానంలో పేర్కొన్నారు. ఉత్తర కొరియా చేపట్టిన అణుపరీక్షను ఖండించారు.
2018 సమావేశం
ఇది జొహాన్నెస్‌బర్గ్ (దక్షిణాఫ్రికా)లో జూలై 25-27న జరిగింది. నినాదం ‘సమగ్ర వృద్ధి, భాగస్వామ్యం శ్రేయస్సుకోసం సహకారం.
నెల్సన్ మండేలా పుట్టిన శతాబ్ది సందర్భంలో మేం కలుస్తున్నాం, అతని విలువలు, సూత్రాలు, మానవాభివృద్ధి సేవకు అంకితభాగం గుర్తించాం. అంతర్జాతీయంగా ప్రజాస్వామ్యం కోసం పోరాటానికి, ప్రపంచవ్యాప్తంగా శాంతి సంస్కృతిని ప్రోత్సహించడానికి ఆయన చేసిన కృషిని గుర్తించామని తెలిపారు. ఇరానియన్ న్యూక్లియర్ ప్రోగాంపై జాయింట్ కాంప్రహెన్సివ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ (జేసీపీఓఏ)ను గుర్తుచేసుకుంటూ అన్ని పార్టీలు తమ బాధ్యతలను పూర్తిగా పాటించాలని, అంతర్జాతీయ, ప్రాంతీయ శాంతి, భద్రతను ప్రోత్సహించడానికి జేసీపీఓఏ పూర్తి, సమర్థవంతమైన అమలును నిర్ధారించాలని పిలుపునిచ్చారు.
2019 సమావేశం
ఇటామరటే ప్యాలెస్, బ్రసీలియా, బ్రెజిల్లో నవంబర్ 13-14న జరిగింది. నినాదం ‘వినూత్న భవిష్యత్తు కోసం ఆర్థికవృద్ధి’. సైన్స్, టెక్నాలజీ, ఇన్నోవేషన్‌లో సహకారాన్ని బలోపేతం చేయడం, డిజిటల్ ఎకానమీపై సహకారాన్ని పెంపొందించడం, అంతర్జాతీయంగా నేరానికి వ్యతిరేకంగా పోరాటంలో సహకారాన్ని ప్రోత్సహించడం, ప్రత్యేకించి వ్యవస్థీకృత నేరాలు మనీలాండరింగ్, మాదక ద్రవ్యాల అక్రమ రవాణా, ప్రోత్సాహం న్యూ డెవలప్మెంట్ బ్యాంక్, బ్రిక్స్ బిజినెస్ కౌన్సిల్ మధ్య సయోధ్య గూర్చి చర్చించారు.
2020 సమావేశం
సెయింట్ పీటర్స్బర్గ్, రష్యాలో, నవంబర్ 17న కొవిడ్-19 కారణంగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగింది.
నినాదం ‘ప్రపంచ స్థిరత్వం, భాగస్వామ్య భద్రత, వినూత్న వృద్ధి కోసం బ్రిక్స్ భాగస్వామ్యం.
ఈ సంవత్సరం బ్రిక్స్‌కు రష్యా హోస్ట్, చైర్‌గా ఉంది. ఉగ్రవాదం, కరోనా, ప్రపంచ సంస్థల్లో సంస్కరణల ఆవశ్యకత వంటి అంశాలను చర్చించారు.
2021 సమావేశం
ప్రధాని మోదీ అధ్యక్షతన 13వ బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశం సెప్టెంబర్ 9న వర్చువల్‌గా జరిగింది. బ్రిక్స్ గత 15 ఏండ్లుగా సాధించిన అనేక విషయాలను ప్రధాని ప్రస్తావించారు. అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల గొంతుకగా నిలిచిందని తెలిపారు.
నినాదం ‘బ్రిక్స్15: సుస్థిరత, ఏకీకరణ, ఏకాభిప్రాయం కోసం అంతర్గత సహకార సాధన. అధ్యక్ష హోదాలో భారత్ కింది నాలుగు ప్రాధాన్యతాంశాలను చర్చించింది.
1. బహుళపక్షీయ వ్యవస్థ (మల్టిలేటరలిజం)ను సంస్కరిచడం
2. తీవ్రవాదాన్ని నిరోధించడం: బ్రిక్స్ ఉగ్రవాద నిరోధక చర్య ప్రణాళిక
3. సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సాధన కోసం డిజిటల్, సాంకేతిక సాధనాలను ఉపయోగించడం
4. ప్రజల మధ్య సంబంధాలను మెరుగుపరచడం.
వీటితో పాటు కరోనా, రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహాల సహకారంపై ఒప్పందం, వర్చువల్ బ్రిక్స్ టీకా పరిశోధన అభివృద్ధి కేంద్రం, గ్రీన్ టూరిజంపై చర్చించారు.
న్యూఢిల్లీ డిక్లరేషన్ (2021)
వ్యాక్సిన్ల ఉత్పత్తి ద్వారా కరోనాను ఎదుర్కోవడంలో దేశాల కృషిని ప్రశంసించిన బ్రిక్స్, మరోవైపు టీకాలు, డయాగ్నస్టిక్స్, ఔషధాల పంపిణీలో అత్యంత పేద, బలహీన దేశాలు ఎదుర్కొంటున్న వివక్ష పట్ల విచారం వ్యక్తం చేసింది. సురక్షితమైన, సమర్థవంతమైన, సరసమైన వ్యాక్సిన్ల ప్రాముఖ్యతను నొక్కి చెప్పిన బ్రిక్స్ కొవిడ్ టీకా మేథో సంపత్తి హక్కుల మినహాయింపుపై డబ్ల్యూటీఓలో కొనసాగుతున్న చర్చలు, ట్రిప్స్ ఒప్పందంపై ‘దోహా డిక్లరేషన్’ను చర్చించింది. విజ్ఞానాధారిత, నియంత్రిత, సురక్షిత వ్యాక్సిన్ల ఆవశ్యకతను సదస్సు గుర్తించింది. కరోనాపై పోరాటానికి ఫైనాన్సింగ్, విరాళం, స్థానిక ఉత్పత్తిని ప్రోత్సహించడం, చికిత్స రోగ నిర్ధారణ పరికరాల ఎగుమతిని సులభతరం చేయడం ద్వారా తమ నిబద్ధతను బ్రిక్స్ దేశా లు పునరుద్ఘాటించాయి.
మల్లవరపు బాలలత
సివిల్స్ ఫ్యాకల్టీ
హైదరాబాద్
- Tags
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు