నిధి 2.0 పోర్టల్‌ను ప్రారంభించిన ఓం బిర్లా
జాతీయం
నిధి 2.0
ది నేషనల్ ఇంటిగ్రేటెడ్ డేటాబేస్ ఆఫ్ హాస్పిటాలిటీ ఇండస్ట్రీ (నిధి 2.0) పోర్టల్‌ను లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా ప్రారంభించారు. ప్రపంచ పర్యాటక దినోత్సవం సెప్టెంబర్ 27న ఢిల్లీలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. దేశంలోని పర్యాటక ప్రాంతాలు, హోటళ్లు, వాతావరణ పరిస్థితులు, సౌకర్యాలతో ఈ పోర్టల్‌ను రూపొందించారు.
ఆపద మిత్ర
ఎలాంటి విపత్తులు సంభవించినా తక్షణం స్పందించేలా పౌరులకు శిక్షణ ఇచ్చేందుకు ఉద్దేశించిన ఆపద మిత్ర కార్యక్రమాన్ని కేంద్ర హోం మంత్రి అమిత్ షా సెప్టెంబర్ 28న ప్రారంభించారు. ఈ కార్యక్రమాన్ని 350 జిల్లాల్లో ప్రారంభించాలని కేంద్రం యోచిస్తుందని వెల్లడించారు. దీనికి సంబంధించి 28 రాష్ర్టాలతో కేంద్రం ఒప్పందం చేసుకుంది. విపత్తులకు అవకాశం ఉన్న 25 రాష్ర్టాల్లో 30 జిల్లాల్లో చేపట్టిన ఆపద మిత్ర పైలెట్ ప్రాజెక్టు విజయవంతమైందని మంత్రి తెలిపారు.
గ్లోబల్ ఫిన్‌టెక్ ఫెస్ట్
ఇంటర్నెట్ అండ్ మొబైల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఐఏఎంఏఐ) ఆధ్వర్యంలో ‘గ్లోబల్ ఫిన్‌టెక్ ఫెస్ట్-2021’ను సెప్టెంబర్ 28న నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ‘బాధ్యతాయుత చెల్లింపుల విషయమై ఐక్యరాజ్యసమితి సూత్రాలు’ అనే నివేదికను ఆవిష్కరించారు.
హురున్ రిచ్‌లిస్ట్
హురున్ ఇండియా-ఐఐఎఫ్ఎల్ వెల్త్ సంయుక్తంగా సెప్టెంబర్ 15 నాటికి రూ.వెయ్యి కోట్లకు పైగా సంపద కలిగినవారి జాబితాను రూపొందించామని హురున్ ఇండియా ఎండీ అనాస్ రహ్మాన్ జునైద్ సెప్టెంబర్ 30న తెలిపారు. ఈ జాబితాలో రిలయన్స్ ఇండస్ట్రీస్ ముకేశ్ అంబానీ (రూ.7,18,000 కోట్లు) మొదటి స్థానంలో నిలిచారు. గౌతం అదానీ కుటుంబం (రూ.5,05,900 కోట్లు) 2, హెచ్‌సీఎల్ శివ్‌నాడార్ కుటుంబం (రూ.2,36,600 కోట్లు) 3, ఎస్పీ హిందూజా కుటుంబం (రూ.2,20,000 కోట్లు) 4, ఎల్ఎన్ మిట్టల్ కుటుంబం (రూ.1,74,400 కోట్లు) 5, సైరస్ పూనావాలా కుటుంబం (రూ.1,63,700 కోట్లు) 6, డీమార్ట్ రాధాకిషన్ దమానీ (రూ.1,54,300 కోట్లు) 7, వినోద్ శాంతిలాల్ కుటుంబం (రూ.1,31,600 కోట్లు) 8, కుమార మంగళం బిర్లా (రూ.1,22,200 కోట్లు) 9, జెడ్ స్కేలర్ జయ్‌చౌదరి (రూ.1,21,600 కోట్లు) 10వ స్థానంలో ఉన్నారు.
శాంతిస్వరూప్ భట్నాగర్ అవార్డు
సైన్స్ అండ్ టెక్నాలజీ రంగాల్లో విశేష సేవలు అందించిన పలువురు ప్రముఖులకు 2021కు గాను శాంతిస్వరూప్ భట్నాగర్ అవార్డులను సెప్టెంబర్ 30న అందజేశారు. అజిత్ సింగ్ (మైక్రోబయాలజీ), అరుణ్ కుమార్ శుక్లా (బయాలజికల్ సైన్స్), కనిష్క బిశ్వాస్, టీ గోవింద రాజులు (రసాయన శాస్త్రం), బినోయ్ కుమార్ సైకియా (భూమి, వాతావరణం), దేబ్దీప్ ముఖోపాధ్యాయ (కంప్యూటర్ సైన్స్), అనీష్ ఘోష్ (స్కూల్ ఆఫ్ మ్యాథమెటిక్స్), సాకేత్ సౌరభ్ (మ్యాథమెటిక్స్), జీమన్ పన్నియమ్మకల్, అచ్యుత మీనన్ (వైద్యశాస్త్రం), రోహిత్ శ్రీవాస్తవ (బయోసైన్స్), కనక్ సాహా (ఫిజికల్ సైన్స్) అవార్డును అందుకున్నారు. బహుమతి కింద రూ.5 లక్షల నగదు ఇస్తారు.
అంతర్జాతీయం
లక్ష్మీదేవి బంగారు బిస్కెట్
బ్రిటన్ ప్రభుత్వానికి చెందిన రాజ టంకశాల తొలిసారిగా లక్ష్మీదేవి చిత్రపటంతో కూడిన బంగారు బిస్కెట్‌ను సెప్టెంబర్ 28న అందుబాటులోకి తెచ్చింది. 20 గ్రాముల బంగారంతో దీనిని తయారుచేశారు. కార్డిఫ్‌లో ఉన్న స్వామి నారాయణ్ స్వామి ఆలయం సహకారంతో ఎమ్మా నోబెల్ లక్ష్మీదేవి చిత్రాన్ని డిజైన్ చేశారు. దీని విలువ 1,080 పౌండ్లు (సుమారు రూ.1,08,500).
హ్వసాంగ్-8
ధ్వని కంటే దాదాపు 5 రెట్ల వేగంతో ప్రయాణించే అత్యాధునిక హైపర్సోనిక్ హ్వసాంగ్-8 క్షిపణిని సెప్టెంబర్ 29న ఉత్తర కొరియా పరీక్షించింది. అణ్వాయుధాలను మోసుకెళ్లే క్షిపణి ఇది. ఇలాంటి క్షిపణిని ఉత్తర కొరియా పరీక్షించడం ఇది మూడోసారి.
చైనా వైమానిక ప్రదర్శన
చైనా అధునాతన సాంకేతికతతో భారీ వైమానిక ప్రదర్శనను సెప్టెంబర్ 28న నిర్వహించింది. చైనా కొత్తగా రూపొందించిన డ్రోన్ సీహెచ్-6ను ప్రదర్శించింది. ఇది రెండు టర్బోఫాన్ ఇంజిన్లతో పనిచేస్తుంది. ఎలక్ట్రానిక్ యుద్ధ వ్యవస్థలు కలిగిన జే-16డీ విమానాన్ని తొలిసారిగా ప్రదర్శించింది.
రైట్ లైవ్లీహుడ్ అవార్డు
నోబెల్‌తో సమానమైన ‘రైట్ లైవ్లీహుడ్’ అవార్డును సెప్టెంబర్ 29న సంస్థ ప్రకటించింది. ఈ అవార్డును నలుగురికి కలిపి డిసెంబర్ 1న ప్రదానం చేయనున్నారు. భారత్‌లో పర్యావరణ పరిరక్షణకు కృషి చేస్తున్న ‘లీగల్ ఇనిషియేటివ్ ఫర్ ఫారెస్ట్ అండ్ ఎన్విరాన్మెంట్ (లైఫ్)’ సంస్థ, కెనడాకు చెందిన స్వదేశీ హక్కుల ప్రచారకర్త ఫ్రెడా హ్యూసన్, బాలికలపై లైంగిక హింసకు వ్యతిరేకంగా పోరాడుతున్న కామెరూన్‌కు చెందిన మార్థ్ వాన్డౌ, రష్యన్ పర్యావరణ ప్రచారకర్త వ్లాదిమిర్ స్లివ్జాక్లకు కలిపి ఈ అవార్డు లభించింది.
వార్తల్లో వ్యక్తులు
మాగ్నస్ కార్ల్సన్
ఫైనాన్షియల్ సర్వీస్ కంపెనీ మాస్టర్‌కార్డ్‌కు గ్లోబల్ అంబాసిడర్‌గా మాగ్నస్ కార్ల్సన్ సెప్టెంబర్ 27న నియమితులయ్యారు. అతడు నార్వేజియన్ చెస్ గ్రాండ్ మాస్టర్. మాస్టర్‌కార్డ్ ప్రధాన కార్యాలయం న్యూయార్క్‌లో ఉంది. దీని సీఈఓగా మైకేల్ మేబ్యాచ్ ఉన్నారు.
అవీక్ సర్కార్
ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా (పీటీఐ) చైర్మన్‌గా అవీక్ సర్కార్ (ఏబీపీ- ఆనంద బజార్ గ్రూప్ ఆఫ్ పబ్లికేషన్స్ వైస్ చైర్మన్) సెప్టెంబర్ 28న రెండోసారి ఎన్నికయ్యారు. ఇతను రాయల్ కలకత్తా గోల్ఫ్ క్లబ్‌కు పదేండ్లు కెప్టెన్‌గా పనిచేశారు. పీటీఐ ప్రధాన కార్యాలయం ఢిల్లీలో ఉంది. దీనిని 1947, ఆగస్టు 27న ఏర్పాటు చేశారు.
నజ్లా బౌడెన్ రాంధానే
ట్యునీషియా ప్రధానిగా నజ్లా బౌడెన్ రాంధానేను నియమిస్తూ ఆ దేశాధ్యక్షుడు కైస్ సయీద్ సెప్టెంబర్ 29న ప్రకటించారు. దీంతో ఆ దేశానికి ఆమె తొలి మహిళా ప్రధానిగా రికార్డులకెక్కారు. జూలై 25న పార్లమెంటు రద్దు కావడంతో అధ్యక్షుడు సయీద్ ఇంజినీరింగ్ స్కూల్లో జియోఫిజిక్స్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న ఆమెను ప్రధానిగా ఎంపికచేశారు.
ఫ్యుమియో కిషిడా
జపాన్ నూతన ప్రధానిగా ఫ్యుమియో కిషిడా సెప్టెంబర్ 29న ఎన్నికయ్యారు. అధికార లిబరల్ డెమొక్రటిక్ పార్టీ కొత్త ప్రధానిని ఎన్నుకోవడానికి నిర్వహించిన ఎన్నికల్లో ఆ దేశ మాజీ విదేశాంగ మంత్రి కిషిడా మరో మంత్రి తారో కోనోపై గెలుపొందారు. కరోనా కట్టడి వైఫల్యం కేసులు, ఒలింపిక్స్ నిర్వహణ వంటి విమర్శలతో యోషిహిదే సుగా ప్రధాని బాధ్యతల నుంచి తప్పుకోవడంతో కొత్త ప్రధాని ఎన్నిక నిర్వహించారు.
రణ్వీర్ సింగ్
బాలీవుడ్ నటుడు రణ్వీర్ సింగ్ నేషనల్ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ (ఎన్బీఏ)కు ప్రచారకర్తగా సెప్టెంబర్ 30న నియమితులయ్యాడు. 75వ వార్షికోత్సవ వేడుకల సందర్భంగా రణ్వీర్ను ఎన్బీఏ నియమించింది.
క్రీడలు
జ్యోతి సురేఖ
అమెరికాలోని యాంక్టన్‌లో సెప్టెంబర్ 25న నిర్వహించిన ప్రపంచ ఆర్చరీ చాంపియన్‌షిప్ కాంపౌండ్ విభాగంలో వెన్నం జ్యోతి సురేఖ మూడు రజత పతకాలు గెలుపొందింది. వ్యక్తిగత విభాగంలో ఒకటి, అభిషేక్ వర్మతో కలిసి మిక్స్డ్ డబుల్స్ విభాగంలో ఒకటి, ముస్కాన్ కిరార్, ప్రియా గుర్జర్‌తో కలిసి మహిళల టీం విభాగంలో ఒకటి సాధించింది.
మను భాకర్
పెరూ రాజధాని లిమాలో సెప్టెంబర్ 30న జరిగిన జూనియర్ వరల్డ్ చాంపియన్‌షిప్ షూటింగ్లో మను భాకర్‌కు స్వర్ణ పతకం లభించింది. మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్‌లో ఆమెకు ఈ పతకం దక్కింది. పురుషుల విభాగంలో ఇషాసింగ్‌కు రజతం లభించింది.
లూయిస్ హామిల్టన్
సెప్టెంబర్ 26న నిర్వహించిన రష్యన్ గ్రాండ్ ప్రి ఫార్ములా వన్ రేసును లూయిస్ హామిల్టన్ గెలుపొందాడు. దీంతో వంద రేసులు గెలిచిన తొలి డ్రైవర్‌గా హామిల్టన్ నిలిచాడు. ఈ పోటీలో వెర్స్టాపెన్ రెండో స్థానాన్ని దక్కించుకున్నడు.
హాకీకి వీడ్కోలు
టోక్యో ఒలింపిక్స్-2020లో భారత్ కాంస్య పతకం సాధించడంలో కీలకపాత్ర పోషించిన డ్రాగ్ ఫ్లికర్ రూపిందర్ పాల్ సింగ్ (పంజాబ్), బీరేంద్ర లక్రా (ఒడిశా) హాకీ నుంచి రిటైర్ అవుతున్నట్టు సెప్టెంబర్ 30న ప్రకటించారు. రూపిందర్ 223 మ్యాచ్‌లు 119 గోల్స్ సాధించాడు. 2010లో అరంగేట్రం చేశాడు. బీరేంద్ర లక్రా 2014 ఆసియా క్రీడలో స్వర్ణం, 2018 జకార్తలో ఆసియా క్రీడలో కాంస్యం సాధించడంలో కీలక పాత్ర పోషించాడు.
వేముల సైదులు
జీకే, కరెంట్ అఫైర్స్ నిపుణులు
ఆర్సీ రెడ్డి స్టడీ సర్కిల్ హైదరాబాద్
- Tags
- Current Affairs
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు