కుతుబ్‌షాహీలు – సైనిక వ్యవస్థ
బహమనీ రాజ్య శిథిలాలపై దక్కన్లో గోల్కొండ కేంద్రంగా అవతరించిన కుతుబ్‌షాహీలు బహమనీల సైనిక వ్యవస్థనే కొద్దిపాటి మార్పులతో ఆచరించారు. వీరు భారీ సైన్యాలను పోషించారని సమకాలీన చరిత్రకారులు, విదేశీ బాటసారులు పేర్కొన్నారు. బహమనీ సైనిక వ్యవస్థ లాగానే మొత్తం సైన్యం ఎప్పుడూ రాజధానిలో ఉండేదికాదు. రాష్ర్టాలు తమ తమ రాజప్రతినిధుల కింద కొంత సైన్యాన్ని వారి లెక్క ప్రకారం ఉంచుకోవల్సి ఉంటుంది. ఇది మధ్యయుగంలో అన్ని రాజ్యాల్లో ఉండేది. సామంతులు, జమీందార్లు కూడా కొంత సైన్యాన్ని పోషిస్తూ ఉంటారు. అవసరమైనప్పుడు సుల్తాన్‌కు ఈ సైన్యాలను సహాయంగా పంపుతారు. ఆ పైన రాష్ర్టాలకు కూడా బలగాల అవసరం ఉంటుంది. తమ ప్రాంతాల్లో శాంతిభద్రతలు కాపాడటానికి పొరుగు రాజ్యం దండెత్తినప్పుడు కేంద్రప్రభుత్వం బలగాలు పంపేదాక శత్రుసైన్యాన్ని నిలువరించడానికి రాష్ర్టాలు సైన్యాలను పోషిస్తూ ఉంటాయి. నిఘావ్యవస్థ, సమాచార వ్యవస్థలు అభివృద్ధి పొందని కాలంలో అది తప్పనిసరి.
సుల్తాన్ కులీ రాజ్యస్థాపన తొలి రోజుల్లోనే రాజ్యపటిష్టతకు బలోపేతమైన, సువిశాల సైన్యం రూపొందించాడు. ఎందుకంటే సమకాలీన దక్కన్ సుల్తాన్లతో శక్తిమంతమైన విజయనగర రాజులతో పోరాడే శక్తి ఉండాలి. యుద్ధకాలంలో సైన్యాధ్యక్షుడు లేదా సిఫఃసలార్ లేదా సర్ లష్కర్ సేనలను నడిపించేవాడు. కుతుబ్‌షాహీల సేనలో హిందూ, ముస్లిం, ఇరానీలు ఉన్నారు. సైనిక శాఖ అధిపతిని ‘ఐయిన్-ఉల్-ముల్క్’ అనేవారు. కుతుబ్‌షాహీల ఆదాయంలో ఎక్కువ భాగం సైన్యాల పోషణకు, సైనికుల జీతభత్యాలకే సరిపోయేది. అబుల్హసన్ కాలంలో సైనికుల జీతభత్యాలకు ఏడాదికి 8 లక్షల 84 వేల 4 వందల డెభ్బైఏడు హొన్నులు ఖర్చయ్యేది. ఫ్రెంచి బాటసారి థెవ్నాట్ ప్రకారం రెండు గుర్రాలను కొంతమంది శిబిరానుచరులను నిర్వహించాల్సిన మహమ్మదీయ సైనికులకు పది హొన్నులు, హిందూ కాల్బలానికి రెండు హొన్నులు నెలకు చెల్లించేవారు. అశ్విక బలగాలకు, కాల్బలాలకు ఏకరూప దుస్తులను తగిన ఆయుధాలను ఇచ్చేవారు. అశ్వికులు ఎర్ర తలపాగాలు, దుస్తులు, కవచం, శిరస్ర్తాణం ధరించేవారు. తెలుగువారు ధోవతులు, అంగీలు, తలపాగాలు ధరించి ఉండేవారు.
సమాచార వ్యవస్థ
కుతుబ్‌షాహీల కాలంలో సమాచారం పంపడం ఉత్తరాల ద్వారానే జరిగేది. ఆ ఉత్తరాల బట్వాడా రౌతులకు, కాల్బంట్లకు అప్పజెప్పేవారు. రౌతులు గుర్రాల మీద స్వారీ చేస్తూ వెళ్లేవారు. గండికోట తన ముఖ్యపట్టణంగా ఏలిన మీర్ జుమ్లా మహ్మద్ సయ్యద్ ఎలా సమాచార వ్యవస్థను నడిపేవాడో టావెర్నియర్ తన గ్రంథంలో వివరించాడు. ‘నవాబు గుడారంలో తన ఇద్దరు కార్యదర్శులతో కూర్చొని ఉండటం చూశాం, సంప్రదాయం ప్రకారం అతని కాళ్లకు పాదరక్షలు లేవు. చేతివేళ్లలో, కాలివేళ్లలో అతడు ఎన్నో కాగితాలు పెట్టుకొని ఉన్నాడు. ఎవరికి ఏ సమాధానం ఇవ్వాలో అతను ఆదేశాలిచ్చాడు. కార్యదర్శులు ఆ సమాధానం రాశాక దాన్ని బయటకు చదవమని అడిగేవాడతను. ఆ పైన ఆ ఉత్తరం తీసుకొని దాన్ని తనే సీలు వేసి, కాల్బంటుకో, రౌతుకో ఇచ్చేవాడు. నిజానికి రౌతుకంటే కాల్బంటే వేగంగా ఉత్తరాలు చేర్చేవాడు. ప్రతి మూడు మైళ్ల మజిలీకి చేరుకోగానే, అతడు ఉత్తరాలను ఓ గుడిసెలోకి విసిరి వేసేవాడు. వెంటనే వాటిని మరొక కాల్బంటు పట్టుకొని పరిగెత్తుతూ తరువాతి మజిలీకి చేర్చేవాడు’
భూమిశిస్తు-రెవెన్యూ విధానం
మధ్యయుగంలోని అన్ని రాజ్యాల్లో మాదిరిగానే కుతుబ్‌షాహీల గోల్కొండ రాజ్యంలో కూడా వ్యవసాయం ప్రధాన జీవనాధారం. సర్కార్ ఖజనాకు భూమిశిస్తే ముఖ్య ఆధారం. తెలంగాణ కేంద్రంగా తెలుగువారిని సుమారు 2 శతాబ్దాల పాటు పరిపాలించిన కుతుబ్‌షాహీలు అనేక విధాలుగా వ్యవసాయాభివృద్ధికి కృషిచేశారు. కాకతీయుల తర్వాత తెలంగాణ ప్రాంతంలో వీరి ప్రోత్సాహంతో వ్యవసాయదారులు సుఖశాంతులతో జీవించారు. సమకాలీన రచనల్లో, విదేశీ అకౌంట్లలో గోల్కొండ రాజ్య సిరిసంపదల గురించి వివరణలు ఉన్నాయి. ముస్లిం భూమి రికార్డుల్లో భూమి సాగుచేసే వ్యక్తిని ‘రయ్యత్’ అని పేర్కొన్నారు. రయ్యత్ నుంచే రైతు అనే పదం ఏర్పడిందని కొందరి పండితుల అభిప్రాయం. అయితే ఏ ముస్లిం పాలకులు కూడా రైతు సంపూర్ణ హక్కును భూమిపై గుర్తించలేదు. 1685-86 నాటి కుతుబ్‌షాహీ రాజ్య ఆదాయాన్ని (భూమి శిస్తు, ఇతర పన్నులను, సుంకాలను కలిపి) సమకాలీన రచయిత గిర్‌ధారీలాల్ తన గ్రంథమైన ‘అష్కర్స్-తారీఖ్-ఇ-జఫరహా’లో అతని వివరణ ప్రకారం మొత్తం 21 సర్కార్ల నుంచి సుల్తాన్ ఖజానాకు వచ్చిన ఆదాయం 82,95,196 హొన్నులు. ఒక హొన్ను నేటి రూ.3కు సమానం. అంటే చిట్టచివరి గోల్కొండ సుల్తాన్ అబ్దుల్లా కుతుబ్‌షా కాలం నాటి మొత్తం రెవెన్యూ రూ.2,47,85,529. ఈ ఆదాయంలో అధిక భాగం నేటి తెలంగాణ ప్రాంతంలో వ్యాపించి ఉన్న 12 సర్కార్ల నుంచి వచ్చేది. అంతేకాక వీరి ఆధీనంలోని కర్నాటకలోని 16 సర్కార్లు, 162 పరగణాల నుంచి రూ.26,75,498 హొన్నుల ఆదాయం వచ్చేది. వజ్రాల గనులను లీజుకు ఇచ్చినందు వల్ల భారీ మొత్తంలో ఆదాయం గోల్కొండ సుల్తాన్లకు వచ్చేది.
ఆర్థిక పరిస్థితులు
మధ్యయుగ దక్కన్లో వెలసిన ఐదు షియా రాజ్యాల్లో గోల్కొండ సంపన్న రాజ్యం. దీనికి రెండు అంశాలు దోహదం చేశాయి. ఒకటి గోల్కొండ రాజ్యంలోని సహజసంపద. ముఖ్యంగా అత్యంత విలువైన వజ్రాల గనులు. రెండు తీరాంధ్ర ప్రాంతంలోని సారవంతమైన భూములు, నీటి వసతులు మచిలీపట్నం కేంద్రంగా మధ్య ఆసియా, ఐరోపా దేశాలతో భారీ ఎత్తున కొనసాగిన విదేశీ వ్యాపారం ప్రజలు సొంత భూములు, వ్యాపార కోఠీలు కలిగి ఉన్నారు. సుల్తాన్లు, వారి అధికారులు విలాసవంత జీవితం గడిపారు. వ్యవసాయమే అధిక సంఖ్యాక ప్రజల వృత్తి. ప్రభుత్వ కోశాగారానికి ముఖ్య ఆదాయమార్గం భూములు. జమీందారీ భూములు, హవేలీ భూములని రెండు రకాలుగా ఉండేవి. వ్యవసాయ పనులు జూన్ నుంచి అక్టోబర్ వరకు వర్షాలపై ఆధారపడి జరిగేవని ‘మెథోల్డ్’ రాశారు. కోస్తా ప్రాంతంలో నీటి వసతులు పుష్కలంగా ఉన్నందువల్ల రైతాంగం మంచి లాభాలు గడించేవారని పేర్కొన్నారు. ఆహార ధాన్యాలు, పండ్లు, పూలు, వాణిజ్య పంటలు పుష్కలంగా పండించేవారని, హిందువులు వరి ధాన్యాన్ని అధికంగా పండించేవారని ‘థెవ్నాట్’ రాశాడు. ద్రాక్షపండ్లు అన్ని రకాలవి పుష్కలంగా పండించేవారని, వీటిలో కొంత భాగం సారాయి తయారీకి వాడేవారని ‘థెవ్నాట్’ పేర్కొన్నాడు. చిరుధాన్యాలు, పప్పులు, తమలపాకులు, పొగాకు, మిర్చి విరివిగా పండేవి. నీలిమందు పంట ఏలూరులో బాగా పండించేవారు.
వ్యవసాయం-నీటిపారుదల సౌకర్యాలు
కుతుబ్‌షాహీ సుల్తాన్లు, వారి అధికారులు రాజ్యంలోని అన్ని ప్రాంతాల్లో వ్యవసాయాన్ని ప్రోత్సహించారు. ముఖ్యంగా నీటిపారుదల వసతులు తక్కువగా గల తెలంగాణ ప్రాంతంలో అనేక పాత చెరువులకు మరమ్మతులు చేయించారు. కొత్త బావులను, చెరువులను నిర్మించి కాకతీయుల కాలం నాటి చెరువులకు ఊపిరిపోశారు. రైతు క్షేమమే తమ కోశాగారానికి రక్ష అని గుర్తించారు. ఇబ్రహీం-కులీ-కుతుబ్‌షా కాలంలో అనేక కొత్త జలాశయాలు, చెరువులు నిర్మించారు. వీటిలో హుస్సేన్‌సాగర్, బద్వేల్ చెరువు, ఇబ్రహీంపట్నం చెరువు ముఖ్యమైనవి. నేటికీ ఇవి రైతాంగానికి, వ్యవసాయానికి ఉపయోగపడుతున్నాయి. గోల్కొండ కోటలో అవసరాల కోసం నీటి సరఫరా చేయడానికి కోటకు 5 కిలోమీటర్ల దూరంలో ‘దుర్గ్’ వద్ద ఒక జలాశయాన్ని నిర్మించారు. అప్పట్లోనే హైడ్రోలాజికల్ ఇంజినీరింగ్ నైపుణ్యంతో ఎత్తున ఉన్న రాజప్రసాదానికి నీటిని సరఫరా చేశారు. సైఫాబాద్ పరిసరాల్లో రాజమాత ‘మాసాహెబా’ (ఖానం ఆఘా) ఒక చెరువును తాగునీటి కోసం కట్టించింది. దీన్నే ‘ మా-సాహెబ్ ట్యాంక్’ అనేవారు. నేడు ఆనాటి చెరువు ఉన్న చోట భవంతులు, క్రీడామైదానం వెలిశాయి.
కుతుబ్‌షాహీ సుల్తానులు, వారి అధికారులు, ఉద్యోగులు గ్రామస్థాయిలో, సర్కార్ స్థాయిలో, పరగణా స్థాయిలో, తరఫ్ స్థాయిలో చెరువుల పరిరక్షణ కోసం ప్రత్యేక అధికారులు, ఉద్యోగులను నియమించారు. వారికి ప్రత్యేక వసతులు, జీతభత్యాలు చెల్లించారు. 1551 నాటి ఒక శాసనం ప్రకారం ఇబ్రహీం-కులీ- కుతుబ్‌షా పానగల్ చెరువు, ఉదయ సముద్రం చెరువుల మరమ్మతులు చేపట్టాడు. ‘అంతోజి’ అనే ఒక హిందూ హవల్దార్ అతని సహచరులు ఒక చెరువుకు నెల్లూరు జిల్లాలో మరమ్మతులు చేపట్టడం కోసం వడ్డెరలకు ఒక కొర్రు తరి భూమిని దానంగా ఇచ్చారని నెల్లూరు జిల్లా (కందుకూరు) శాసనం తెలియజేస్తుంది. చెరువులు నిర్మించిన వారికి, నిర్మాణంలో పాల్గొన్నవారికి, వాటిని పరిరక్షించేవారికి కుతుబ్‌షాహీలు ప్రత్యేక వసతులు, గౌరవం కల్పించారు.
వర్తక వ్యాపారం
కుతుబ్‌షాహీల కాలంలో కూడా కాకతీయ యుగంలో మాదిరిగానే దేశీ, విదేశీ వ్యాపారం భారీ ఎత్తున కొనసాగింది. కోమట్లు దేశీయ, విదేశీ వ్యాపారంంలో కీలకపాత్ర పోషించారు. సమకాలీన రచనలైన హంసవింశతి, శుకసప్తతి విదేశీ బాటసారుల రచనలైన ట్రావెల్ అకౌంట్లు వర్తక వ్యాపారం గురించి ఎంతో విలువైన సమాచారాన్ని ఇస్తున్నాయి. అరబ్, పోర్చుగీసు వర్తకులు కుతుబ్‌షాహీలకు మేలురకం గుర్రాలను సరఫరా చేసేవారు. ఐరోపా వర్తక సంఘాలు ప్రవేశించిన తరువాత నరసాపురం, మచిలీపట్నం, మద్రాస్, గోల్కొండ, కొండపల్లి గొప్ప వర్తక కేంద్రాలుగా రూపొందాయి. దేశీ వ్యాపారంలో ఎడ్లబండ్లు, గాడిదలు, గుర్రాల బగ్గీలు కీలకపాత్ర నిర్వహించేవి. విదేశీ వ్యాపారం సముద్రంపై ఓడల్లో జరిగేది. దాన్ని ‘ఓడబేరం’ అనేవారు. ‘ఓడకాడు’ అనే పదం ‘శుకసప్తతి’లో ఉంది. మోటుపల్లి, నరసాపురం, మచిలీపట్నం నుంచి ఐరోపా దేశాలకు మేలురకం వస్ర్తాలను ఎగుమతి చేసేవారు. విదేశీ బాటసారుల వర్ణనల్లో ఆనాటి ఓడల సైజు, ఎగుమతి అయ్యే వస్తువులు, వస్ర్తాలు, పరికరాల వివరాలు ఉన్నాయి. పుణ్యక్షేత్రాలైన తిరుపతి, శ్రీశైలం, శ్రీకూర్మం, వరంగల్, శ్రీకాళహస్తి, ఉదయగిరి పెద్ద వర్తక కేంద్రాలుగా ఎదిగాయి.
గ్రామాల్లో వారంతపు సంతలు, అంగళ్లు జరిగేవి. పెరికలు వస్తుసామగ్రి రవాణాలో కీలకపాత్ర నిర్వహించేవారు. తెలంగాణ, ఆంధ్రవర్తకులు కర్ణాటక, తమిళనాడు, గుల్బర్గా, ఔరంగాబాద్, అహ్మద్‌నగర్, బీజాపూర్, మద్రాస్ మొదలైన పట్టణాల వర్తకులతో సంబంధాలు కలిగి ఉండేవారు. చేతివృత్తుల వారు ముఖ్యంగా సాలెలు తమ తమ వస్ర్తాలను స్థానిక మార్కెట్లలో స్వయంగా విక్రయించి లాభాలు గడించేవారు. కార్మికులు, పనివారు, వృత్తినిపుణులు ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి తరుచుగా వలసవెళ్లేవారు. దీనివల్ల సంస్కృతి మరింత సుసంపన్నమైంది. ఓడల నిర్మాణం నర్సాపురం, మచిలీపట్నంలో వర్థిల్లింది. తెలంగాణలోని నిర్మల్, ఇందల్వాయి ఇనుము పోత పరిశ్రమకు విశేష ఖ్యాతి గడించాయి. హైదరాబాద్ నుంచి వర్తకులు నల్లగొండ, కొండపల్లి, విజయవాడ మీదుగా మచిలీపట్న చేరేవారు.
కుతుబ్‌షాహీ సుల్తానులు వర్తక వ్యాపారంపై పన్నులు, సుంకాలను నియమిత పద్ధతిలో వసూలు చేసి వ్యాపారాన్ని ప్రోత్సహించారు. వర్తకులకు అన్ని రకాల వసతులు, రక్షణ కల్పించారు. తూకాలు, కొలతలు సరిగ్గా ఉండేటట్లు అధికారులు పర్యవేక్షించారు. గోల్కొండ రాజ్యంలో ముఖ్య కరెన్సీ హొన్ను అనే బంగారు నాణెం. దీన్నే విదేశీ వర్తకులు ‘పగోడ’ అన్నారు. పణం, తార్, కాసు ఇతర నాణేలు. ఆనాటి ఎగుమతుల్లో వస్ర్తాలు, వజ్రాలు, సూరేకారం, తివాచీలు, నీలిమందు, మేలురకం కత్తులు ముఖ్యమైనవి. దిగుమతుల్లో గుర్రాలు, పింగాణీ పాత్రలు, గవ్వలు మొదలైనవి.
సాసాల మల్లికార్జున్
అసిస్టెంట్ ప్రొఫెసర్
ప్రభుత్వ డిగ్రీ కాలేజీ, కోరుట్ల
- Tags
- Education News
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు