ఐటీఐ.. ఉపాధికి భరోసా
ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్.. ఐటీఐ. పదో తరగతి పూర్తవుతూనే ప్రాక్టికల్ నైపుణ్యాలు అందించే చదువులకు కేరాఫ్. ఆర్థిక స్థోమత లేకనో, ఆసక్తి లేకనో ఉన్నత చదువులకు వెళ్లలేని విద్యార్థులకు త్వరగా ఉపాధి అవకాశాలు కల్పిస్తున్న వాటిలో ముందున్నది ఐటీఐ. కేవలం టెన్త్ అర్హతతోనే ఇందులో ప్రవేశించి ఒకటి, రెండేళ్ల వ్యవధిలోనే సాంకేతిక విద్యలో నైపుణ్యం సాధించవచ్చు. అతి తక్కువ వ్యయం, చిన్న వయస్సులోనే ఉపాధి పొందే అవకాశం ఎక్కువగా ఉండే ఈ కోర్సుల్లో చేరేందుకు విద్యార్థులు భారీ సంఖ్యలో ఆసక్తి చూపుతున్నారు. కోర్సు పూర్తవగానే స్వయం ఉపాధి, కేంద్ర సంస్థల్లో కొలువులు, వాణిజ్య, ఉత్పత్తి సంస్థల్లో అవకాశాలు పుష్కలంగా ఉంటాయి. తక్కువ సమయంలోనే ఉపాధి పొందాలనుకునే విద్యార్థులకు ఉపయోగపడే ఐటీఐ కోర్సుల వివరాలు నిపుణ పాఠకుల కోసం….
దేశంలో పరిశ్రమల ఉత్పాదకత అవి తయారుచేసే వస్తువులు, అందించే సేవల నాణ్యతను పెంపొందించడంలో ఐటీఐల పాత్ర చెప్పలేనిది. ఐటీఐలు యువతలో నిరుద్యోగాన్ని తగ్గించి.. సాంకేతికత, పారిశ్రామిక దృక్పథాలను పెంపొందేలా శిక్షణ ఇస్తున్నాయి. ఇందుకు ప్రభుత్వాలు పారిశ్రామిక అవసరాలకు తగ్గట్లుగా కోర్సులను రూపొందించడంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాయి. దీంతో బహుముఖ నైపుణ్యాలను పెంచుకునే అవకాశం విద్యార్థులకు లభిస్తుంది. ఐటీఐలను కేంద్రంలోని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్, స్కిల్ ఇండియా ఆధ్వర్యంలో నడుపుతున్నారు. పదో తరగతి అర్హతతో ఏడాది, రెండేండ్ల వ్యవధితో ఇంజినీరింగ్, నాన్ ఇంజినీరింగ్ ట్రేడుల్లో కోర్సులు అందిస్తున్నారు. దేశవ్యాప్తంగా 130కి పైగా, తెలుగు రాష్ర్టాల్లో 50 వరకు స్పెషలైజేషన్లు లభిస్తున్నాయి. మన రాష్ట్రంలో 63 ప్రభుత్వ, 195 ప్రైవేటు ఐటీఐ కాలేజీలు ఉన్నాయి. ఐటీఐలో ప్రవేశానికి ఎలాంటి ఎంట్రన్స్ టెస్ట్ అవసరం లేదు. పదో తరగతిలో సాధించిన గ్రేడ్ పాయింట్లతో సీట్లు కేటాయిస్తారు. ఏడాది, రెండేండ్ల కాల వ్యవధి గల ఈ కోర్సులు (ట్రేడులు) పూర్తిచేస్తే ఉన్నత చదువులతో పాటు ఉద్యోగం, స్వయం ఉపాధి పొందవచ్చు. ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల్లోనూ, పరిశ్రమల్లోనూ అవకాశాలు లభిస్తాయి. ఇంకా చెప్పాలంటే కొన్ని రకాల కోర్సులకు వందశాతం ఉపాధి అవకాశాలుండగా, మరికొన్ని కోర్సులకు సీజనల్ అవకాశాలు ఉంటాయి.
ఐటీఐ కోర్సు పూర్తయ్యాక ఏదైనా పరిశ్రమలో నిర్దిష్ట కాలవ్యవధిలో అప్రెంటిస్ శిక్షణ పొందాలి. శిక్షణ సమయంలో 70 శాతాన్ని ప్రాక్టికల్ ట్రైనింగ్‌కు కేటాయిస్తారు. మిగిలిన 30 శాతం సమయాన్ని ట్రేడ్ థియరీ, వర్క్‌షాప్ క్యాలిక్యులేషన్ అండ్ సైన్స్, ఇంజినీరింగ్ డ్రాయింగ్, ఎంప్లాయ్‌బిలిటీ స్కిల్స్, లైబ్రరీ అండ్ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్‌కు కేటాయిస్తారు. ఉద్యోగ నియామకాల్లో అప్రెంటిస్‌గా ఉన్నవారికి ప్రాధాన్యం ఇస్తారు. భారతీయ రైల్వే వేల సంఖ్యలో అప్రెంటిస్‌లను తీసుకుంటుంది. మహారత్న, నవరత్న, మినీరత్న కంపెనీలు సైతం అప్రెంటిస్ అవకాశాలను పెంచాయి. ఈ విధానంలో ప్రతి నెలా కొంత మొత్తం ైస్టెఫండ్ ఇస్తున్నాయి. దీంతోపాటు నియామకాల్లో కొన్ని పోస్టులను అప్రెంటిస్ పూర్తిచేసుకున్నవారితో భర్తీ చేస్తున్నాయి. భారత ప్రభుత్వం స్కిల్ ఇండియా కార్యక్రమం ద్వారా ఐటీఐ పూర్తిచేసిన వారికి అనేక ఉద్యోగవకాశాలు కల్పిస్తుంది. పలు ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు అప్రెంటిస్‌లకు అవకాశం కల్పిస్తున్నాయి. ఆసక్తి ఉన్నవారు కోర్సు పూర్తయిన తర్వాత https://apprenti ceshipindia.orgలో వివరాలు నమోదు చేసుకోవచ్చు.
ఫిట్టర్: కోర్సు పూర్తిచేసినవారు యాంగిల్ ఐరన్‌ను, ఐ-బీమ్స్, స్టీల్ప్లేట్స్ను వివిధ నిర్మాణాల్లో ఏ విధంగా ఉపయోగించాలో తెలుసుకుంటారు. ఈ ట్రేడ్‌లో ఉత్తీర్ణులైనవారు డిప్లొమా లేదా డిగ్రీ కోర్సుల్లో చేరి ఉన్నత విద్యను అభ్యసించవచ్చు. ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో ఉద్యోగావకాశాలుంటాయి. వివిధ పరిశ్రమల్లో, బ్రిడ్జిలు, భవనాలు నిర్మించే పెద్దపెద్ద కంపెనీల్లో వెల్డర్ ఫిట్టర్, పైప్ ఫ్యాబ్రికేటర్, మెకానికల్ ఫిట్టర్, టెక్నికల్ అసిస్టెంట్/టెక్నీషియన్, ప్లాంట్ మెయింటెనెన్స్ ఫిట్టర్, లేథ్ మిషన్ ఆపరేటర్ వంటి ఉద్యోగాల్లో చేరవచ్చు. భారీ పరిశ్రమల్లో వివిధ ఉత్పత్తుల నిర్మాణానికి అవసరమయ్యే విడి భాగాల తయారీ కోసం చిన్న పరిశ్రమలను ఏర్పాటు చేసుకుని స్వయం ఉపాధి పొందవచ్చు.
డీజిల్ మెకానిక్: ఈ ట్రేడ్ పూర్తిచేసినవారు డీజిల్ ఇంజిన్‌కు సంబంధించి పూర్తి అవగాహన పొందుతారు. డీజిల్ ఇంజిన్‌లో తలెత్తే లోపాలను సరిదిద్దగల నైపుణ్యం కలిగి ఉంటారు. ఈ కోర్సు పూర్తిచేసినవారు అసెంబుల్డ్ షాప్‌లు, టెస్ట్ షాప్‌లు, మెకానిక్ షాప్‌లు, మ్యానుఫ్యాక్చరింగ్ పరిశ్రమల్లో ఆటో డీజిల్ ఇంజిన్ మెకానిక్, డీజిల్ ఇంజిన్ సర్వీస్ టెక్నీషియన్, ఆటో ఫిట్టర్, మెకానిక్, డీలర్స్ సర్వీస్ మెకానిక్, డ్రైవర్ లేదా వెహికిల్ ఆపరేటర్, స్పేర్ పార్ట్స్ సేల్స్ అసిస్టెంట్, ల్యాబొరేటరీ అసిస్టెంట్ వంటి ఉద్యోగాలు పొందవచ్చు. లేదంటే సొంతంగా డీజిల్ ఇంజిన్ మెకానిక్ షాప్ ఏర్పాటు చేసుకుని స్వయం ఉపాధి పొందవచ్చు.
ఎలక్ట్రీషియన్: నివాసాలు, వ్యాపార సముదాయాలు, పరిశ్రమల్లోని భవనాల్లో వివిధ రకాల వైరింగ్ విధానాల గురించి తెలుసుకుంటారు. స్ట్రీట్ లైట్లు, జాతీయ రహదారుల్లో లైటింగ్ వ్యవస్థ, ట్రాఫిక్ సిగ్నళ్లకు సంబంధించి పూర్తి అవగాహన కలిగి ఉంటారు. ఈ కోర్సు పూర్తి చేసినవారికి ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో ఉద్యోగావకాశాలు లభిస్తాయి. రాష్ట్ర ఎలక్ట్రిసిటీ బోర్డులు, ఎంఎన్సీ కంపెనీల్లో ఎలక్ట్రీషియన్, వైర్‌మెన్, మెషినరీ ఎలక్ట్రీషియన్ వంటి ఉద్యోగాలు పొందవచ్చు. సంబంధిత లైసెన్స్ సర్టిఫికెట్ పొంది సొంతంగా వర్క్‌షాప్‌లు ఏర్పాటు చేసుకోవచ్చు. హౌస్ వైరింగ్ కాంట్రాక్టర్లుగా మంచి ఆదాయం ఆర్జించవచ్చు.
మెకానిక్ (రిఫ్రిజిరేషన్ అండ్ ఎయిర్ కండిషనర్): ఈ కోర్సు పూర్తిచేసినవారు రిఫ్రిజిరేటర్, వాటర్ కూలర్, బాటిల్ కూలర్, డీప్ ఫ్రీజర్, వాక్ ఇన్ కూలర్, స్లిట్ ఎయిర్ కండిషనర్, ప్యాకేజ్ ఎయిర్ కండిషనర్, సెంట్రల్ ఎయిర్ కండిషనర్, ఆటోమొబైల్ ఎయిర్ కండిషనర్, ట్రాన్స్‌పోర్టు రిఫ్రిజిరేషన్, ఎయిర్‌క్రాఫ్ట్ ఎయిర్ కండిషనింగ్, రైల్వే ఎయిర్ కండిషనింగ్, షిప్ రిఫ్రిజిరేషన్ అండ్ ఎయిర్ కండిషనింగ్ మొదలైన వాటి సర్వీసింగ్, రిపేరింగ్పై పూర్తి అవగాహన కలిగి ఉంటారు. ఈ ట్రేడ్‌లో ఉత్తీర్ణులైతే ఉపాధి, ఉద్యోగ అవకాశాలు చాలా ఉంటాయి. ఇండ్లు, పాఠశాలలు, ఆస్పత్రులు, కార్యాలయాలు, ఫ్యాక్టరీల్లో రిఫ్రిజిరేటర్లు, ఏసీలు, ఎయిర్ కూలర్లు మొదలైన వాటి సర్వీసింగ్, రిపేరింగ్ చేస్తూ ఉపాధి పొందచ్చు. వివిధ కంపెనీల్లో ఏసీ టెక్నీషియన్, ఏసీ అండ్ రిఫ్రిజిరేషన్ మెకానిక్ వంటి ఉద్యోగాలు చేయవచ్చు. సంబంధిత రంగంలో ఉన్నత విద్యను అభ్యసించవచ్చు.
టర్నర్: లోహ విడిభాగాల తయారీ, పరిశ్రమల్లో ఉండే యంత్రాలు, యంత్రాల విడిభాగాలను వాడటం ఎలా అనేది తెలుసుకుంటారు. కోర్సును పూర్తి చేసిన తర్వాత ఉత్పత్తి, తయారీ, ఆటోమొబైల్ సంబంధిత రంగాల్లో ఉపాధి అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా సేవారంగాలైన రవాణా, రైల్వే, నౌకా నిర్మాణం, మరమ్మతులు, రక్షణ రంగాల్లో మెరుగైన అవకాశాలు ఉంటాయి. అంతేకాకుండా ప్రభుత్వరంగ సంస్థలైన బీహెచ్ఈఎల్, బీఈఎంఎల్, ఎన్టీపీసీ, సైనిక సంబంధిత వర్క్‌షాప్‌లలో ఉద్యోగాలు కూడా లభిస్తాయి. ఈ ట్రేడ్ పూర్తిచేస్తే రేడియల్ డ్రిల్లింగ్ ఆపరేటర్, క్వాలిటీ టెక్నీషియన్, సీఎన్సీ ఆపరేటర్, లేథ్ మిషన్ ఆపరేటర్, హైడ్రాలిక్ హోస్ క్రింపర్ తదితర ఉద్యోగాలు పొందవచ్చు.
వెల్డర్ (జనరల్ అండ్ ఎలక్ట్రికల్): వెల్డర్ అనేది మెకానికల్ ఇంజినీరింగ్‌కు సంబంధించిన ఒకేషనల్ కోర్సు. వెల్డింగ్‌కు సంబంధించిన నైపుణ్యం, మెటల్ వర్కింగ్ మెలకువలను నేర్చుకుంటారు. కోర్సు పూర్తి చేసిన తర్వాత ఇదేరంగంలో డిప్లొమా, డిగ్రీ కోర్సులను చేయవచ్చు. భారీ, చిన్న తరహా పరిశ్రమలకు అవసరమైన పనుల కోసం సొంతంగా వర్క్‌షాప్ ఏర్పాటు చేసుకొని స్వయం ఉపాధి పొందవచ్చు. వైమానిక, రక్షణ, నౌకానిర్మాణం, నిర్మాణ రంగం, ఆటోమోటివ్లోని చిన్న, భారీ తరహా పరిశ్రమల్లో ఉద్యోగ అవకాశాలు ఉంటాయి. గ్యాస్ అండ్ ఎలక్ట్రిక్ వెల్డర్, ట్రాక్ వెల్డర్, వెల్డర్, స్ట్రక్చరల్ స్టీల్, పైప్ ఆర్క్ వెల్డర్, వెల్డర్ అండ్ ఫ్యాబ్రికేటర్ హెల్పర్ సంబంధిత ఉద్యోగాలు ఉంటాయి.
డ్రాఫ్ట్‌మ్యాన్ (సివిల్): రెండేండ్ల కోర్సులో సివిల్ ఇంజినీరింగ్‌కు సంబంధించిన ప్రాథమిక అంశాలపై అవగాహన కలుగుతుంది. కోర్సును పూర్తిచేస్తే ప్రభుత్వ ఆధీనంలోని భవనాలు, చారిత్రక ప్రాంతాల్లో అపారమైన ఉద్యోగావకాశాలు ఉంటాయి. నిర్మాణరంగానికి సంబంధించి డిగ్రీ కోర్సులు చేయడానికి అవకాశం ఉంటుంది. చారిత్రక వస్తువులకు సంబంధించి డ్రాయింగ్లు వేసే ఉద్యోగావకాశాలు కూడా లభిస్తాయి. డ్రాఫ్ట్‌మ్యాన్ పైపింగ్, డ్రాఫ్ట్‌మ్యాన్ స్ట్రక్చరల్, ఆర్కిటెక్చరల్ అసిస్టెంట్, స్ట్రక్చరల్ డ్రాఫ్ట్‌మ్యాన్ సంబంధిత ఉద్యోగాలు ఉంటాయి. డ్రాఫ్ట్‌మ్యాన్ (సివిల్)కు సంబంధించి అడ్వాన్స్ కోర్సులు కూడా అందుబాటులోకి వచ్చాయి. ఆర్కిటెక్చరల్ డ్రాఫ్ట్మ్యాన్లో డిప్లొమా, ఆర్కిటెక్చరల్ డ్రాఫ్ట్‌మ్యాన్‌షిప్‌లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లొమా తదితర కోర్సులు కూడా చేసే అవకాశం ఉంటుంది.
ఎలక్ట్రానిక్ మెకానిక్: ఎలక్ట్రానిక్ మెకానిక్ అనేది ఎలక్ట్రానిక్ వస్తువుల మరమ్మతులకు సంబంధించిన కోర్సు. కోర్సులో ఎలక్ట్రానిక్ వస్తువులకు సంబంధించిన పరిజ్ఞానం, వాటి మరమ్మతులు, నిర్వహణ గురించి సంపూర్ణ అవగాహన కలుగుతుంది. కోర్సు పూర్తిచేసిన తర్వాత ఎలక్ట్రానిక్ ఉపకరణాల తయారీ, ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్స్ సంబంధిత, సోలార్ విద్యుత్తు ఆధారిత ఇన్వెర్టర్ల తయారీ పరిశ్రమల్లో ఉపాధి అవకాశాలు ఉంటాయి. సేవా రంగాలైన బీఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్, రైల్వే, ఇస్రో, నౌకాశ్రయం, ఆర్సీఎఫ్, బీపీసీఎల్ తదితర ప్రభుత్వరంగ సంస్థల్లో కూడా ఉద్యోగావకాశాలు ఉంటాయి. ఎల్జీ, సామ్సంగ్, నోకియా, సోని తదితర ఫోన్ల పరిశ్రమల్లో కూడా ఉపాధి అవకాశాలు ఉంటాయి. అసిస్టెంట్ లైన్‌మ్యాన్, ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రానిక్ మెకానిక్, ఏసీ, రిఫ్రిజిరేటర్ మెకానిక్, మెయింటెనెన్స్ టెక్నీషియన్, చార్జ్‌మెన్ మెకానిక్ సంబంధిత ఉద్యోగాలు ఉంటాయి. పై చదువులు చదవడానికి ఆస్కారం ఉంది. ఎలక్ట్రానిక్స్‌లో అడ్వాన్స్డ్ డిప్లొమా, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్స్లో అడ్వాన్స్డ్ డిప్లొమా కోర్సు కూడా చదవవచ్చు.
నాన్ ఇంజినీరింగ్ ట్రేడులు
కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్: ఇది ఏడాది వ్యవధిగల కోర్సు. ప్రస్తుతం ప్రతి పని కంప్యూటర్ ద్వారానే జరుగుతుంది. కాబట్టి ఈ కోర్సు చేసినవారికి ఉపాధి త్వరగా లభిస్తుంది. ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాల్లో వీరి అవసరం చాలా ఉంటుంది.
సెక్రటేరియల్ ప్రాక్టీస్: ఇది ఏడాది వ్యవధిగల కోర్సు. ఈ కోర్సులో కార్యాలయానికి సంబంధించిన నైపుణ్యాన్ని పెంపొందిస్తారు. ఈ కోర్సు పూర్తిచేస్తే ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాల్లో ఆఫీస్ అసిస్టెంట్‌గా, సెక్రటరీగా ఉపాధి పొందవచ్చు.
డాటా ప్రిపరేషన్ అండ్ కంప్యూటర్ సాఫ్ట్వేర్: ఇది ఏడాది వ్యవధిగల కోర్సు. కోర్సు పూర్తిచేసినవారికి ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాల్లో ఉపాధి లభిస్తుంది.
స్టెనోగ్రఫీ (ఇంగ్లిష్): ఇది ఏడాది వ్యవధిగల కోర్సు. ఈ కోర్సు పూర్తిచేస్తే ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగాలు లభిస్తాయి.
టైలరింగ్; మహిళలు స్వయం ఉపాధి పొందేందుకు టైలరింగ్ ట్రేడ్ ఎంతో ఉపయోగపడుతుంది. ఈ ట్రేడ్ పూర్తిచేసిన వారికి ప్రభుత్వ ఉద్యోగాలతో పాటు, స్వయం ఉపాధి పొందే అవకాశం ఉంది. ఇందులో ఎంబ్రాయిడరీ, దుస్తులపై డిజైన్ల తయారీ, కుట్టడంలో శిక్షణ ఇస్తారు. ఫ్యాషన్ రంగంలో కొత్త ఒరవడులు రావడంతో కుట్టు, అల్లికలకు మంచి డిమాండ్ ఉంది.
స్వయం ఉపాధి
నైపుణ్యం ఉన్న ప్లంబర్, కార్పెంటర్, ఎల్రక్ట్రీషియన్, ఏసీ, రిఫ్రిజిరేటర్, మెకానిక్‌లకు పట్టణాలు, నగరాలతో పాటు పల్లెల్లోనూ డిమాండ్ ఉంది. చేతినిండా పని లభిస్తుంది. స్వయం ఉపాధికి కూడా ఎలాంటి ఢోకా లేదు. సొంతంగా షాప్స్ పెట్టుకొని మరికొంత మందికి ఉపాధి కల్పించవచ్చు.
మనూలో
హైదరాబాద్ గచ్చిబౌలిలోని మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ (మనూ)లో కొనసాగుతున్న ఐటీఐలో డ్రాఫ్ట్స్‌మ్యాన్, సివిల్, రిఫ్రిజిరేషన్, ఎయిర్ కండిషనింగ్, ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రానిక్ మెకానిక్, ప్లంబర్ ట్రేడులు అందుబాటులో ఉన్నాయి.
ఐటీఐ కోర్సు చేయాలనుకునేవారు పదో తరగతి ఫెయిలైనా చింతించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే 8, 9 తరగతులు పాసైనవారికి కూడా ఐటీఐలో తగిన కోర్సులు ఉన్నాయి. అవి పూర్తిచేసి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పొందవచ్చు. అలాగే ఇంటర్ ఫెయిలైనవారు ఏడాది వృథాగాపోకుండా ఉండేందుకు ఐటీఐ కోర్సుల్లో తమకు నచ్చిన ఏదో ఒక ట్రేడు పూర్తిచేస్తే అది ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.
రెండేండ్ల వ్యవధి గల కోర్సులు
డ్రాఫ్ట్స్‌మెన్ (సివిల్)
డ్రాఫ్ట్స్‌మెన్ (మెకానికల్)
ఎలక్ట్రీషియన్
ఎలక్ట్రానిక్స్ మెకానిక్ ఫిట్టర్,
ఇన్ఫర్మేషన్
కమ్యూనికేషన్
టెక్నాలజీ సిస్టమ్-మెయింటెనెన్స్
ఇన్స్ట్రుమెంట్ మెకానిక్
ల్యాబొరేటరీ అసిస్టెంట్ (కెమికల్ ప్లాంట్)
ఇన్స్ట్రుమెంట్ మెకానిక్ (కెమికల్ ప్లాంట్)
మెషినిస్టు
మెషినిస్టు (గ్రైండర్)
మెకానిక్ (రిఫ్రిజిరేషన్ అండ్ ఎయిర్ కండిషనింగ్)
మెకానిక్ కంప్యూటర్ హార్డ్‌వేర్
మెకానిక్ మోటార్ వెహికిల్
వైర్‌మెన్
మెరైన్ ఫిట్టర్
టర్నర్
నావిగేటర్
వైర్‌మెన్
మెకానిక్ డీజిల్
ప్లాస్టిక్ ప్రాసెసింగ్ ఆపరేటర్
షీట్ మెటల్ వర్కర్
వెల్డర్
ఏడాది వ్యవధి కోర్సులు
ప్లంబర్
కార్పెంటర్
కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్
డ్రెస్మేకింగ్
ఫౌండ్రీమెన్
హెల్త్ శానిటరీ ఇన్స్పెక్టర్
ప్లాస్టిక్ ప్రాసెసింగ్ ఆపరేటర్
సెక్రటేరియల్ ప్రాక్టీస్
సీవింగ్ టెక్నాలజీ
స్టెనోగ్రాఫర్ అండ్ సెక్రటేరియల్ అసిస్టెంట్
డెంటల్ ల్యాబొరేటరీ ఎక్విప్మెంట్ టెక్నీషియన్
సత్యం గౌడ్ సూదగాని
- Tags
- nipuna
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు