TET -DSC (TRT) Preparation Plan | టెట్, డీఎస్సీ(టీఆర్టీ) ప్రిపరేషన్ ప్లాన్
TET -DSC (TRT) Preparation Plan | పోటీ ప్రపంచంలో విజేతగా నిలవాలంటే మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా పరీక్షల సన్నద్ధంలో కూడా మార్పులుండాలి. ప్రధానంగా ఉపాధ్యాయ ఉద్యోగం సాధించాలంటే ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)లో క్వాలిఫై కావాలి, అధిక మార్కులు సాధించడం తప్పనిసరి. టెట్‌లో వచ్చిన మార్కులు, డీఎస్సీ (టీఆర్టీ) మార్కులను కలిపి ర్యాంకులు ప్రకటిస్తారు. దీంతో టెట్‌కు ప్రాధాన్యం ఏర్పడింది. ఈ నేపథ్యంలో టెట్ సన్నద్ధతకు అభ్యర్థులు ఎలా చదవాలో తెలుసుకుందాం..
- చాలా మంది అభ్యర్థులు గతంలో ఒకటి కంటే తక్కువ మార్కుల తేడాతో ఉపాధ్యాయ వృత్తికి దూరమైన సంఘటనలు చాలా ఉన్నాయి.
- టెట్, డీఎస్సీ పరీక్షలకు దాదాపు ఒకే విధమైన పుస్తకాలు చదవాల్సి ఉంటుంది.
- కాబట్టి అభ్యర్థులు మూడో తరగతి నుంచి పదో తరగతి వరకు పాఠ్య పుస్తకాలను సేకరించుకొని వాటిని ఎక్కువ సార్లు చదివి ఆయా అంశాలపై సొంతంగా నోట్స్ రాసుకోవడం ఉత్తమమైన పద్ధతి.
మంచి మార్కుల సాధనకు అనుసరించాల్సిన పద్ధతులు
- పాఠ్య పుస్తకాల్లోని అంశాల్లో మార్పులను ఎప్పటికప్పుడు గమనిస్తూ చదవాలి. ప్రధానంగా సామాన్య శాస్త్రం, సాంఘిక శాస్త్రంలోని అంశాలు సమాజంలోని మార్పులకు అనుగుణంగా మారుతూ ఉంటాయి.
ఉదా: పాకిస్థాన్‌తో సరిహద్దును పంచుకుంటున్న రాష్ర్టాల సంఖ్య 4. కానీ జమ్మూకశ్మీర్‌ను కేంద్ర పాలిత ప్రాంతంగా మార్చిన తర్వాత ఆ సంఖ్య 3 కు చేరింది. ప్రస్తుతం పాకిస్థాన్ భారత్‌లోని గుజరాత్, రాజస్థాన్, పంజాబ్ రాష్ర్టాలు ఒక కేంద్ర పాలిత ప్రాంతం (జమ్మూకశ్మీర్) సరిహద్దును పంచుకుంటుంది. - ప్రతి విషయాన్ని క్రమానుగతంగా చదవాలి.
- ఆత్మ విశ్వాసంతో ఇష్టంగా చదవాలి.
- వీలైనంత వరకు చదివిన అంశాలను స్నేహితులతో చర్చించాలి. ఇలా చేయడం వల్ల ఎక్కువ గుర్తుండే అవకాశం ఉంటుంది.
- ప్రతి సబ్జెక్టులో పాఠ్య పుస్తకాలతో పాటు సమకాలీన అంశాలను మేలవిస్తూ సన్నద్ధమైతే విజయం సాధించవచ్చు.
సిలబస్: టెట్, డీఎస్సీ సిలబస్‌ను మూడు భాగాలుగా విభజించవచ్చు.
1. కంటెంట్, బోధనా పద్ధతులు: ఇందులో ఎస్జీటీ వారు సామాన్య శాస్త్రం, సాంఘిక శాస్త్రం, గణితం విషయాలను, బోధనా పద్ధతులను చదవాలి.
2. తెలుగు, ఇంగ్లిష్ (భాషలు)
3. సైకాలజీ - ఎస్ఏ (స్కూల్ అసిస్టెంట్): సైకాలజీ 30 మార్కులు, తెలుగు 30 మార్కులు, ఇంగ్లిష్ 30 మార్కులు, సంబంధిత సబ్జెక్టు నుంచి 48 మార్కులు, బోధనా పద్ధతులు 12 మార్కులు. మొత్తం 150 ప్రశ్నలకు 150 మార్కులు ఉంటాయి.
- పై అంశాలతో పాటు డీఎస్సీకి జనరల్ నాలెడ్జ్, కరెంట్ అఫైర్స్, విద్యా దృక్పథాలు అదనంగా చదవాల్సి ఉంటుంది.
సబ్జెక్టుల వారీగా ప్రాధాన్యం
- టెట్‌లో ఎక్కువ మార్కులు సాధించాలంటే సైకాలజీ, ఇంగ్లిష్, తెలుగుపై ఎక్కువ దృష్టి సారించాలి. ఎందుకంటే ఈ మూడు సబ్జెక్టుల నుంచి 90 ప్రశ్నలు వస్తాయి. కానీ ఎస్జీటీలకు గణితం 30, ఈవీఎస్ నుంచి కూడా 30 ప్రశ్నలు ఉంటాయి.
సైకాలజీ - సామాన్య అభ్యర్థి నుంచి అసాధారణ ప్రతిభ కలిగిన అభ్యర్థి వరకు అందరూ క్లిష్టంగా భావించే అంశం సైకాలజీ.
- సైకాలజీలో మూడు యూనిట్లను అధ్యయనం చేయాల్సి ఉంటుంది. దాంతో పాటు ఏ యూనిట్ నుంచి ఎన్ని ప్రశ్నలను, ఎలాంటి ప్రశ్నలను గతంలో అడిగారో గమనిస్తూ చదవాలి.
సిలబస్
శిశు వికాసం- 10 నుంచి 12 ప్రశ్నలు
అభ్యసనం 8 నుంచి 10 ప్రశ్నలు
పెడగాజీ- 7 నుంచి 10 ప్రశ్నలు - సైకాలజీ విషయంలో కొత్త తెలుగు అకాడమీ పుస్తకాలతో పాటు పాత పుస్తకాలను చదివితే మంచి మార్కులు సాధించవచ్చు.
- సైకాలజీలో సాంకేతిక పదాలు, పుస్తకాలు, రచయితలు వంటి అంశాలను గుర్తించగలగాలి.
- జ్ఞానాత్మక రంగం కంటే అవగాహన, వినియోగాత్మక రంగాలపై ప్రశ్నలు ఎక్కువగా ఉంటాయి.
English: ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమంలో బోధనను తప్పనిసరి చేస్తున్నందున ఉపాధ్యాయులకు ఆంగ్ల భాషలో ప్రావీణ్యం తప్పనిసరి. కాబట్టి ఆంగ్లంలో వ్యాకరణాంశాలన్నింటిపై ప్రశ్నలు విద్యార్థి స్థాయిలో కాకుండా ఉపాధ్యాయుల స్థాయిలో ఆలోచించి సమాధానం గుర్తించే విధంగా ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది. - ఆంగ్లంలో ప్రధానంగా Tenses, Speech, Parts of speech, Vacabulary, Types of Sentences, Voice, Question tags, Spelling test విభాగాల నుంచి ప్రశ్నల స్థాయి కఠినంగా ఉంటుంది. కాబట్టి అభ్యర్థులు ఈ అంశంపై ఎక్కువ దృష్టి సారించాలి.
- ఇంగ్లిష్‌లో ఎక్కువ మార్కులను సాధించడానికి ఎక్కువ మాదిరి ప్రశ్న పత్రాలను ప్రాక్టీస్ చేయాలి.
తెలుగు - TET, TRT పరీక్షల్లో తెలుగు సబ్జెక్ట్‌కు సముచిత స్థానం ఉంది. తెలుగుకు సంబంధించి కవులు వారి రచనలు, వివిధ భాషా రూపాలు, ప్రక్రియలు, సామెతలు, జాతీయాలు, భాషాంశాలైన అలంకారాలు, చందస్సు, కర్తరీ, కర్మరీ వాక్యాలు, ప్రత్యక్ష, పరోక్ష వాక్యాలు, పర్యాయ పదాలు. అపరిచిత పద్యం, అపరిచిత గద్యం మొదలైన అంశాలపై ప్రశ్నలను అడుగుతున్నారు.
- అభ్యర్థులు తెలుగులో అధిక మార్కులు సాధించడానికి పాఠశాల పాఠ్య పుస్తకాల్లో పాఠం తర్వాత ఇచ్చిన మూల్యాంకనంలోని ప్రశ్నలను, వ్యాకరణాంశాలను బాగా చదవాలి.
- ప్రధానంగా ఎనిమిదో తరగతి పాఠ్యపుస్తకంలోని వ్యాకరణాంశాలను ఎక్కువగా చదవాలి. పాఠ్యపుస్తకాల చివరి పేజీలో గల ప్రకృతి-వికృతులు, పర్యాయపదాలు, నానార్థాలు, వ్యుత్పత్యర్థాలు, పద విజ్ఞానంలోని విషయాలను క్షుణ్నంగా పరిశీలిస్తూ చదవాలి.
గణితం - సాధారణంగా ఇంటర్, డిగ్రీల్లో గణితాన్ని ఒక సబ్జెక్టుగా చదివినవారు మినహా మిగిలినవారు ఈ విభాగంలో కొంత న్యూనత, తడబాటుకు లోనవుతారు.
- గణితంలో మొదటగా ప్రాథమిక భావనలైన భిన్నాలు-నిష్పత్తి, అనుపాతాలు, లాభనష్ట శాతాలు, పని-కాలం-దూరం, భాగస్వామ్యం, బారువడ్డీ యూనిట్లపై అభ్యర్థులు పట్టు సాధిస్తే దాదాపు 30 శాతం నుంచి 40 శాతం ప్రశ్నలను చేయగలుగుతారు.
- గత ప్రశ్నపత్రాలను పరిశీలిస్తే సంఖ్యా వ్యవస్థ, అంకగణితం, రేఖా గణితం నుంచి సుమారు 60 శాతం వరకు ప్రశ్నలను అడుగుతున్నారు.
- రేఖాగణితంలో త్రిభుజాలు, చతుర్భుజాలు, వృత్తాలకు సంబంధించి ప్రశ్నలు అడగవచ్చు.
- క్షేత్రగణితంలో వైశాల్యాలు, ఘన పరిమాణాలు, చుట్టుకొలతలపై ప్రశ్నలు
అడగవచ్చు. - గణితానికి సంబంధించి మంచి మార్కుల సాధన కోసం అకాడమీ పుస్తకాల్లోని మాదిరి ప్రశ్నలను ఎక్కువసార్లు ప్రాక్టీస్ చేయాలి.
- గణితంలోని లెక్కను ప్రతిరోజు ప్రాక్టీస్ చేయడం ఉత్తమం.
- గణితానికి సంబంధించిన వివిధ సూత్రాలను ఒక చార్టు రూపంలో తయారు చేసుకొని దాన్ని ప్రతిరోజు గమనించడం వల్ల ఎక్కువ కాలం బాగా గుర్తుంటాయి.
సైన్స్ (సామాన్యశాస్త్రం) - సామాన్యశాస్త్రంలో భౌతిక, రసాయన శాస్ర్తాలతో పాటు జీవశాస్ర్తాన్ని కూడా చదవాలి.
- ఈ విభాగంలో విద్యుత్తు, ఆమ్లాలు-క్షారాలు, కాంతి, వివిధ రకాలైన వాయువులు, గతిశాస్త్రం, వివిధ రకాల సూత్రాలు వాటి ఉపయోగాలు, శాస్త్రీయనామాలు, మానవ శరీర నిర్మాణం, విటమిన్లు, మానవులు, పంటలకు సంబంధించిన వివిధ రకాల వ్యాధులు, పర్యావరణ సమస్యలపై ప్రశ్నలను తరచుగా అడుగుతున్నారు.
- సామాన్యశాస్ర్తానికి సంబంధించిన వివిధ శాస్త్రవేత్తలు, వారు ఏ దేశానికి చెందినవారు, ఏ విభాగంలో కృషి చేశారనే అంశాలపై ఎక్కువ దృష్టి సారించాలి.
- సామాన్య శాస్త్రం పాఠ్యపుస్తకాలను మూడు నుంచి ఎనిమిదో తరగతి వరకు చదవాలి. సామాన్య శాస్త్రంలోని బొమ్మలపై కూడా ప్రశ్నలుంటాయి.
సాంఘిక శాస్త్రం
- సాంఘిక శాస్త్రంలో భూగోళ శాస్త్రం, చరిత్ర, పౌరశాస్త్రం, అర్థశాస్త్ర విభాగాలను చదవాలి.
- వీటిలో చరిత్ర, భూగోళశాస్త్రం నుంచి ఎక్కువ ప్రశ్నలు, తర్వాత స్థానంలో పౌరశాస్త్రం, అర్థశాస్ర్తాల నుంచి వస్తాయి.
- సాంఘిక శాస్త్రంలోని అన్ని పాఠ్యాంశాలను క్షుణ్నంగా చదవడం వల్ల అభ్యర్థులు డీఎస్సీలో జనరల్ నాలెడ్జ్ విభాగంలో కొన్ని ప్రశ్నలకు సులభంగా సమాధానాలను గుర్తించగలుగుతారు.
చరిత్ర : సాధారణంగా విద్యార్థులందరూ ఎక్కువగా భయపడే విషయం చరిత్ర. కానీ క్రమానుగతంగా చదివితే చరిత్రలోని అంశాలను సులభంగా గుర్తించవచ్చు. - చరిత్రకు సంబంధించి గణతంత్ర రాజ్యం ఆవిర్భావం, మగధ సామ్రాజ్యం, చోళుల గ్రామ పరిపాలన కాకతీయులు, విజయనగర రాజ్యం, మొగలు సామ్రాజ్యం, భారతదేశంలో బ్రిటిష్ సామ్రాజ్య స్థాపన, భారత స్వాతంత్రోద్యమం ఈ పాఠ్యాంశాలను చక్కగా చదివితే మార్కులను సాధించవచ్చు.
- రాజులు – కట్టడాలు, వారి రచనలు, బిరుదులు వంటి అంశాలను చార్టు రూపంలో రాస్తూ చదివితే ఎక్కువ కాలం గుర్తుంటాయి.
భూగోళ శాస్త్రం: భూగోళ శాస్త్రం చదివేటప్పుడు సంబంధిత పటాలను పరిశీలిస్తూ చదివితే భాగా ఉపయోగకరంగా ఉంటుంది. - వివిధ రకాల పటాల పైన ప్రశ్నలు అడగవచ్చు.
ఉదా: ఆఫ్రికా ఖండంలో మధ్యధరా సముద్రంతో సరిహద్దును కలిగి ఉన్న దేశాన్ని గుర్తించండి? (బి)
ఎ) సూడాన్ బి) ట్యూనిషియా
సి) నైజీరియా డి) అంగోలా - ఇలాంటి ప్రశ్నలకు సమాధానాలను గుర్తించడం తేలిక కావాలంటే పటాలపై అవగాహన తప్పనిసరి.
- భూగోళశాస్త్రం నుంచి పటాల తయారి అధ్యయనం, శీతోష్ణస్థితి అంశాలు, రుతుపవన వ్యవస్థ నదీ వ్యవస్థ, భారతదేశంలో వ్యవసాయం, ఖనిజాలు, ఆంధ్రప్రదేశ్ మృత్తికలు, అడవులు, సముద్ర తరంగాలు, ఖండాల సమాచారం, సౌరకుటుంబం, భూమి చలనాలు, ధృవప్రాంతాలు, వాతావరణ పొడలు పాఠ్యాంశాలను క్షున్నంగా పరిశీలిస్తూ చదవాలి.
- పాఠశాల సహాయకులు 6 నుంచి 10వ తరగతి వరకు పాఠ్యాంశాలను చదవాలి.
పౌరశాస్త్రం (రాజనీతి శాస్త్రం) : ఈ విభాగంలో ప్రతి అభ్యర్థి ఎక్కువ ప్రశ్నలకు సరైన సమాధానాలను గుర్తించగలరు. దీనికి కారణం జీకే విభాగంలో రాజనీతి శాస్ర్తానికి సంబంధించిన అంశాలు ఎక్కువగా ఉండటమే. - ఈ విభాగంలో కుటుంబం- రకాలు, గ్రామపంచాయతీ, మున్సిపాలిటీ, ఎన్నికల విధానం, భారత రాజ్యాంగ నిర్మాణం, బాలలహక్కులు, విద్యాహక్కు చట్టం, రాష్ట్ర శాసన సభ చట్టం తయారీ, భారత న్యాయవ్యవస్థ, ఐక్యరాజ్యసమితి అంశాల నుంచి గతంలో ఎక్కువ ప్రశ్నలు అడిగారు.
అర్థ శాస్త్రం: ఈ విభాగంలో ద్రవ్యం, బ్యాంకింగ్, జీవనోపాధి- సాంకేతిక విజ్ఞాన ప్రభావం, ప్రజారోగ్యం-ప్రభుత్వం, ఉత్పత్తి కారకాలు, నేటి వ్యవసాయం, వివిధ రకాలైన అభివృద్ధి భావనలు, ఉత్పత్తి – ఉపాధి సౌకర్యాలు, ప్రపంచీకరణ, ఆహార భద్రత సమతుల్య అభివృద్ధి పాఠ్యంశాలను బాగా చదివితే తక్కువ మార్కులను సాధించవచ్చు. - పాఠ్యపుస్తకాలలోని పాఠ్యాంశాలతోపాటు అన్ని పాఠ్యపుస్తకాల అట్టలపై గల బొమ్మలను, అట్టలోపల పేజీలోని విషయాలను కూడా చదవడం మంచిది.
- 6వ తరగతి సాంఘిక శాస్త్రం అట్ట మీద భారత రాజ్యాంగ విధులు, విద్యాహక్కు చట్టం, 7వ తరగతి సాంఘిక శాస్త్రం పాఠ్యపుస్తకం అట్టపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమాచారం, జాతీయ చిహ్నల సమాచారం బాలల హక్కు బిల్లుల నిబంధనలు, 8వ తరగతి సాంఘిక శాస్త్రం అట్టపై బాలల హక్కులు, భూభద్రతా హక్కువంటి విషయాలపై గతంలో జరిగిన టెట్ పరీక్షల్లో ప్రశ్నలు వచ్చాయి.
గతంలో అడిగిన ప్రశ్నలు
1) ఆంధ్రప్రదేశ్‌లోని రెవెన్యూ డివిజన్ల సంఖ్య
2) జాతీయ బాలల విధానం చట్టం చేసిన సంవత్సరం?
3) భారత రాజ్యాంగంలోని విధులు ఏ ఆర్టికల్‌లో ఉన్నాయి?
బోధనా పద్ధతులు
- ఉపాధ్యాయ ఉద్యోగ సాధనలో కీలకమైన అంశం బోధనా పద్ధతులు. ఈ విభాగంలో ఎస్జీటీ అభ్యర్థులు 5 రకాలైన బోధనా పద్ధతుల నుంచి 30 ప్రశ్నలకు సమాధానాలు గుర్తించాల్సి ఉంటుంది.
- కానీ ఎస్.ఎ. అభ్యర్థులు వారికి సంబంధించిన బోధనా పద్ధతులలో టెట్ పరీక్షలో 12 మార్కులకు, ప్రథమ, ద్వితీయ భాషల బోధనా పద్ధతుల నుంచి 12 మార్కులకు ప్రశ్నలుంటాయి. కానీ డీఎస్సీ పరీక్షల్లో ఎస్.ఎ. అభ్యర్థులు భాషాంశాలపై ప్రశ్నలు ఉండవు.
- బోధనా పద్ధతి అంటే ఏదైన ఒక అంశాన్ని ఎలా బోధించాలో తెలిపే పద్ధతి. అంటే ప్రతి విషయబోధనకు ప్రత్యేకమైన బోధనా పద్ధతి ఉంటుంది.
బోధనా పద్ధతులను ఎలా చదవాలి?
1) ప్రాథమిక భావనలను అర్థం చేసుకుంటూ చదవాలి.
2) బోధనా పద్ధతులను చదివేటప్పుడు ఒక క్రమానుగత పద్ధతిని పాటిస్తే మంచి మార్కులు సాధించవచ్చు.
వీరాంజనేయులు
జాగ్రఫీ విషయ నిపుణులు, ఏకేఆర్ పబ్లికేషన్స్
వికారాబాద్, 9441022571
Previous article
Indian History | అశోకుడు పరమత సహనాన్ని గురించి ఏ శాసనంలో వివరించారు?
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు