పన్ను ఆదా చేసేద్దాం!
మధ్యతరగతికి ‘సొంతిల్లు’ అనేది ఖరీదైన వ్యవహారమే. ఇందుకోసం ‘హౌసింగ్ లోన్’ తీసుకోవాల్సిందే. అయితే, రుణం తీసుకొని ఇల్లు కొంటే.. అనేక పన్ను ప్రయోజనాలు పొందే అవకాశమున్నది. ప్రస్తుతం ‘కరోనా’తో ధరలు దిగివచ్చాయి. సొంతింటివారయ్యేందుకు ఇదే సువర్ణావకాశం. పైగా వడ్డీ రేట్లు కనిష్ట స్థాయికొచ్చాయి. పన్ను ఆదానూ కలిపి చూసుకొంటే ఇంటి కొనుగోలు లాభసాటిగా మారింది.
బ్యాంకు రుణంతో మొదటిసారి ఇల్లు కొంటే.. ఆదాయపన్ను చట్టంలోని మూడు సెక్షన్ల కింద ప్రయోజనాలకు అర్హులవుతారు. ఉదాహరణకు రూ.40 లక్షల ఇంటిని 80 శాతం రుణంతో (రూ.36 లక్షలు) కొనుగోలు చేస్తే.. 20 ఏండ్ల కాలానికి వడ్డీ రేటు 7 శాతం అనుకుంటే, నెలవారీ ఈఎంఐ రూ.31,000 అవుతుంది. మొదటి ఏడాదిలో రూ.3,72,000 చెల్లించాల్సి వస్తుంది. ఇందులో రూ.2.77 లక్షలు రుణంపై వడ్డీ కింద జమ అవుతుంది. రూ.95,000 రుణానికి అసలు కింద జమ అవుతుంది. రుణ గ్రహీత వార్షిక ఆదాయం రూ.15 లక్షలు అనుకొంటే.. రూ.95,000 అసలు చెల్లింపులను సెక్షన్ 80సీ కింద చూపించుకోవచ్చు. ఒక ఆర్థిక సంవత్సరంలో సెక్షన్ 80సీ కింద రూ.1.50 లక్షల మొత్తంపై పన్ను ఆదాకు అవకాశముంది. కాబట్టి, మిగిలిన రూ.55,000ను కొనుగోలు కోసం చెల్లించిన స్టాంప్ డ్యూటీ చార్జీలను మొదటి ఏడాది కింద మినహాయింపుగా చూపించుకోవచ్చు. ఇక వడ్డీ భాగం కింద రూ.2.77 లక్షల చెల్లింపుల్లో రూ.2,00,000ను సెక్షన్ 24 కింద చూపించుకోవడం ద్వారా ఆ మొత్తంపై రూపాయి పన్ను కూడా చెల్లించక్కర్లేదు. మిగిలిన రూ.77,000ను సెక్షన్ 80ఈఈఏ కింద క్లెయిమ్ చేసుకోవచ్చు. అంటే, మొదటి ఏడాది రూ.4.27లక్షల మొత్తంపై పన్ను మినహాయింపును క్లెయిమ్ చేసుకోవచ్చు. అయితే, అసలు, వడ్డీ భాగం ఏటా మారుతుంటుంది. ఈ మినహాయింపులపై ముందే ఓ స్పష్టతకు రావాలి.
రెండో ఇంటికి..
ఇకపోతే, రెండో ఇంటి కొనుగోలుకు రుణం తీసుకున్నట్టయితే.. వడ్డీ చెల్లింపుల భాగాన్ని సెక్షన్ 24(బి) కింద చూపించుకొనే అవకాశం ఉన్నది. కానీ, ఇక్కడొక పరిమితి ఉంది. రెండు ఇండ్లకూ కలిపి సెక్షన్ 24(బి) కింద గరిష్టంగా రూ.2లక్షల వడ్డీ చెల్లింపులకే పన్ను మినహాయింపు పొందగలరు. 2019-20 నుంచి రెండో ఇల్లు, సొంతంగా ఉండే ఇంటిపై నోషనల్ రెంట్ ఎత్తి వేశారు. అంటే 2019-20 ముందు వరకు ఒక్క ఇంటినే సొంతానికి వినియోగిస్తున్నట్టు చూపించుకొనే అవకాశముండగా, ఆ తర్వాత నుంచి రెండు ఇండ్లను కూడా సొంత వినియోగం కింద చూపించుకొనే అవకాశం కల్పించారు. దీంతో నోషనల్ రెంట్ రూపంలో పన్ను చెల్లించాల్సిన ఇబ్బంది తప్పింది. రెండు ఇండ్లనూ స్వీయ వినియోగానికే కేటాయించుకొంటే.. గరిష్టంగా రూ.2,00,000 వడ్డీ చెల్లింపులను సెక్షన్ 24 (బి) కింద.. సెక్షన్ 80సీ కింద రూ.1,50,000 వరకు అసలు చెల్లింపులపై పన్ను లేకుండా చేసుకోవచ్చు. ఇంటిని అద్దెకు ఇచ్చారనుకొంటే.. అప్పుడు అద్దె ఆదాయం నుంచి 30 శాతాన్ని ప్రామాణిక మినహాయింపు కింద చూపించుకోవచ్చు.
అదే సమయంలో ఇంటి అద్దె ఆదాయాన్ని కూడా వార్షిక ఆదాయానికి కలిపి చూపిస్తూ.. అదే ఇంటి రుణానికి చేసే వడ్డీ చెల్లింపుల మొత్తంపైనా (పరిమితి లేకుండా) పన్ను మినహాయింపు పొందవచ్చు. అలాగే, ఇతర ఆదాయ నష్టం రూ.2,00,000 వరకు సర్దుబాటు చేసుకొనే అవకాశం కూడా ఉంటుంది. ఇలా సర్దుబాటు చేసుకొన్న తర్వాత ఏదైనా మిగులు ఉంటే, దాన్ని తదుపరి ఎనిమిదేండ్లకు క్యారీ ఫార్వర్డ్ చేసుకోవచ్చు.
ఉమ్మడిగా కొనుగోలు చేస్తే..
భార్యా, భర్త ఉమ్మడిగా ఇంటిని కొనుగోలు చేస్తే.. వారు విడివిడిగా పన్ను మినహాయింపులను క్లెయిమ్ చేసుకోవచ్చు. అయితే, ఇక్కడ వారిద్దరూ ఆదాయ వనరులు కలిగి ఉండటం తప్పనిసరి. అలా కాకుండా.. భార్యకు ఎటువంటి ఆదాయ వనరూ లేకపోతే, పన్ను ప్రయోజనాలకు భర్త ఒక్కరే అర్హులవుతారు. పన్ను ప్రయోజనాలను భార్యాభర్తలిద్దరూ విడిగా క్లెయిమ్ చేసుకునేట్లు అయితే.. వారు ఎంత మేరకు వాటా కలిగి ఉన్నారన్నదానిపై ఆధారపడి ఉంటుంది. ఇద్దరి ఆదాయాన్ని కలిపితే అర్హత ఎక్కువ లభిస్తుంది. రుణం సాఫీగా మంజూరవుతుంది. మహిళా దరఖాస్తుదారులకు కొన్ని బ్యాంకులు తక్కువ వడ్డీ రేట్లపై గృహ రుణాలను ఆఫర్ చేస్తున్నాయి. దీంతో చెల్లించాల్సిన ఈఎంఐ కూడా తక్కువగా ఉంటుంది. అలాగే, చాలా రాష్ర్టాల్లో మహిళా కొనుగోలు
దారులకు స్టాంప్‌డ్యూటీ రేటు తక్కువ అమలవుతున్నది.
సెక్షన్ 80సీ కింద గృహ రుణం అసలు చెల్లింపులు రూ.1.50లక్షలు.. సెక్షన్ 24 కింద గృహ రుణంపై వడ్డీ రూ.2,00,000 వరకు మినహాయింపులను క్లెయిమ్ చేసుకోవచ్చు. భార్యా భర్తలు ఉమ్మడిగా గృహ రుణం తీసుకొంటే ఎవరికి వారు గరిష్టంగా ఈ మేరకు పన్ను మినహాయింపులను క్లెయిమ్ చేసుకునేందుకు అవకాశం ఉంటుంది.
శ్రీనివాస్ గౌడ్ ముద్దం
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు