July Current Affairs | అతి చిన్న వయస్సులో పైలట్ లైసెన్స్ పొందిన వారు?
1. ఇటీవల ప్రపంచ బ్యాంక్ భారత్‌కు 255.5 మిలియన్ అమెరికన్ డాలర్ల రుణాన్ని ఎందుకిచ్చింది? (1)
1) సాంకేతిక విద్యా అభివృద్ధికి
2) వరదల నిర్వహణ
3) విపత్తు నిర్వహణ
4) విద్యుత్ సరఫరా మెరుగు
వివరణ: వాషింగ్టన్ కేంద్రంగా పనిచేసే ప్రపంచ బ్యాంక్ భారత్‌కు 255.5 మిలియన్ డాలర్ల రుణాన్ని ఇచ్చింది. సాంకేతిక విద్యా అభివృద్ధికి ఉద్దేశించింది ఇది. నాణ్యతను పెంచడం ద్వారా వేగంగా యువకులు ఉద్యోగాలు పొందేలా చేసేందుకు అవసరమైన మార్పు చేర్పులను చేస్తారు. రానున్న ఐదు సంవత్సరాల్లో ఎంపిక చేసిన 274 ప్రభుత్వ కళాశాలల్లో ఈ మొత్తాన్ని వ్యయం చేసి సాంకేతిక విద్యను బలోపేతం చేస్తారు. ఏటా 3,50,000 మంది విద్యార్థులు దీని ద్వారా ప్రయోజనం పొందుతారు.
2. ‘వనెస్సా కెర్రీ’ ఏ సంస్థతో ముడిపడి ఉన్నారు? (4)
1) వలసల అంతర్జాతీయ సంస్థ
2) ప్రపంచ వాతావరణ సంస్థ
3) యునెస్కో
4) ప్రపంచ ఆరోగ్య సంస్థ
వివరణ: వనెస్సా కెర్రీ అమెరికాకు చెందిన పౌరురాలు. జెనీవా కేంద్రంగా పనిచేసే ప్రపంచ ఆరోగ్య సంస్థతో ముడిపడి ఉన్నారు. ‘పర్యావరణ మార్పు-ఆరోగ్యం’ అనే అంశానికి సంబంధించి ప్రత్యేక రాయబారిగా డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనాం ఆమెను నియమించారు. ఈ బాధ్యతను చేపట్టనున్న తొలి వ్యక్తి ఆమె. పర్యావరణ మార్పు ఆరోగ్యంలో ఎలాంటి మార్పును తీసుకువస్తుంది, ముఖ్యంగా మహిళలు, చిన్నారుల్లో ఎలాంటి ప్రభావం చూపుతుంది, దానికి పరిష్కారం ఏంటి తదితర విషయాలపై అధ్యయనం ఆమె చేయనున్నారు.
3. ఇటీవల భారత్ దేనిలో చేరింది? (3)
1) నాటో+ 2) బ్రిక్స్
3) ఖనిజాల భద్రతా భాగస్వామ్యం
4) నాటో
వివరణ: అమెరికా నేతృత్వంలో 2022లో ఏర్పాటయిన ఖనిజాల భద్రతా భాగస్వామ్యం (మినరల్ సెక్యూరిటీ పార్ట్నర్షిప్)లో భారత్ భాగం అయింది. ఆస్ట్రేలియా, కెనడా, ఫిన్లాండ్, ఫ్రాన్స్, జర్మనీ, జపాన్, రిపబ్లిక్ ఆఫ్ కొరియా, స్వీడన్, యూకే, యూరోపియన్ కమిషన్, ఇటలీ తదితర దేశాలు ఇందులో సభ్యత్వాన్ని కలిగి ఉన్నాయి. దీనికి క్రిటికల్ మినరల్స్ అలయన్స్ అనే పేరు కూడా ఉంది. అత్యవసరమైన ఖనిజాల సరఫరాలో ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండేందుకు ఏర్పాటు చేసుకున్న వ్యవస్థ ఇది. ఇందుకు అవసరమైన భాగస్వామ్యాన్ని బలోపేతం చేస్తుంది.
4. ప్రపంచ పోటీ సూచీలో భారత్ ఎన్నో స్థానంలో ఉంది? (2)
1) 39 2) 40
3) 41 4) 42
వివరణ: ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ మేనేజ్మెంట్ డెవలప్మెంట్ ఇటీవల ప్రపంచ పోటీ సూచీని విడుదల చేసింది. మొత్తం 64 దేశాలకు సంబంధించిన సమాచారాన్ని సేకరించి ర్యాంకులను కేటాయించింది. డెన్మార్క్, ఐర్లాండ్, స్విట్జర్లాండ్ 1, 2, 3 స్థానాల్లో ఉన్నాయి. ఈ సూచీలో భారత్ 40వ స్థానంలో ఉంది.
5. 2024లో ఒలింపిక్ పోటీలు ఎక్కడ జరుగనున్నాయి? (1)
1) పారిస్ 2) లాస్ ఏంజిల్స్
3) బ్రిస్బేన్ 4) రోమ్
వివరణ: 2024లో ఒలింపిక్ క్రీడలు పారిస్‌లో జరుగనున్నాయి. 2028లో అమెరికాలోని లాస్ ఏంజిల్స్‌లో, 2032లో ఆస్ట్రేలియాలోని బ్రిస్బేన్‌లో నిర్వహిస్తారు. 2024 ఒలింపిక్స్‌లో పతకాలు సాధించడమే లక్ష్యంగా ‘పారిస్‌లో భారత్’ అని ఒక కార్యక్రమాన్ని జూన్ 23న ప్రారంభించారు. వచ్చే ఏడాది అంటే 2024లో జూలై 26న పోటీలు ప్రారంభమై ఆగస్ట్ 11న ముగుస్తాయి. 2020 ఒలింపిక్స్‌లో భారత క్రీడాకారులు తమ ప్రతిభ చూపారు. నీరజ్ చోప్రా బంగారు పతకాన్ని కూడా గెలుచుకున్నారు.
6. ఏ రోజున స్టాటిస్టికల్ డే నిర్వహిస్తారు? (3)
1) జూన్ 27 2) జూన్ 28
3) జూన్ 29 4) జూన్ 30
వివరణ: ఏటా జూన్ 29న స్టాటిస్టికల్ డే నిర్వహిస్తారు. భారత సంఖ్యా శాస్త్రం, ఆర్థిక ప్రణాళికలో కీలక పాత్ర పోషించిన పీసీ మహలనోబిస్ జ్ఞాపకార్థం దీన్ని నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది ఈ రోజుకు సంబంధించిన ఇతివృత్తం ‘ది అలైన్మెంట్ ఆఫ్ స్టేట్ ఇండికేటర్ ఫ్రేమ్‌వర్క్ విత్ నేషనల్ ఇండికేటర్ ఫ్రేమ్‌వర్క్ ఫర్ మానిటరింగ్ సస్టెయినబుల్ డెవలప్మెంట్ గోల్స్’. అంటే సుస్థిరాభివృద్ధి లక్ష్యాల పర్యవేక్షణలో రాష్ట్ర సూచీలను, జాతీయ సూచీలతో అనుసంధానం చేయడం’ అని అర్థం చేసుకోవచ్చు. దేశంలో గణాంక కార్యాలయం ఏర్పాటులో మహలనోబిస్ కీలక పాత్ర పోషించారు. ఆయనను భారత గణాంక పితగా కూడా వ్యవహరిస్తారు.
7. చాంపియన్స్ 2.0 పోర్టల్ ఇటీవల ప్రారంభమయ్యింది. ఇది దేనికి సంబంధించింది? (2)
1) క్రీడలు 2) ఎంఎస్ఎంఈ
3) బ్యాంకింగ్ వ్యవస్థ
4) ఎలక్ట్రిక్ వాహనాలు
వివరణ: సూక్ష్మ, మధ్య తరహా, లఘు పరిశ్రమల శాఖ జూన్ 27న చాంపియన్స్ 2.0 పోర్టల్‌ను ప్రారంభించింది. ఏటా జూన్ 27ని అంతర్జాతీయ ఎంఎస్ఎంఈ రోజుగా నిర్వహిస్తారు. సాంకేతిక కేంద్రాలు, అదేవిధంగా వివిధ ప్రాజెక్ట్‌ల సమూహాలను జియో ట్యాగింగ్ పరిధిలోకి తీసుకొచ్చిన పోర్టల్‌నే చాంపియన్స్ 2.0గా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం ఎంఎస్ఎంఈ మంత్రిగా నారాయణ్ రాణే ఉన్నారు.
8. ‘సాగర్ సామాజిక్ సహ్యోగ్’ దేనికి సంబంధించింది? (1)
1) కార్పొరేట్ సామాజిక బాధ్యత
2) తీర రేఖ విస్తరణ
3) కాలుష్య నివారణ
4) ఏదీకాదు
వివరణ: సాగర్ సామాజిక్ సహ్యోగ్ పేరుతో కొత్త కార్పొరేట్ సామాజిక బాధ్యత నిబంధనలను కేంద్ర మంత్రి సర్బానంద సోనోవాల్ ప్రారంభించారు. వివిధ నౌకాశ్రయాల్లోని స్థానిక సమస్యలను పరిష్కరించేందుకు ఉద్దేశించినవే ఈ నిబంధనలు. రూ.100 కోట్ల వార్షిక టర్నోవర్‌ను మించిన పోర్ట్‌లు, తమ వార్షిక లాభంలో 3-5 శాతం కార్పొరేట్ సామాజిక బాధ్యత విధులు నిర్వహించాల్సి ఉంటుంది. రూ.100 నుంచి రూ.500 కోట్ల వరకు లాభం ఉంటే 2-3 శాతం, రూ.500 కోట్ల లాభం దాటితే 0.5 నుంచి 2 శాతం సామాజిక బాధ్యత పనులు నిర్వర్తించాలి.
9. యునైటెడ్ నేషన్స్ ఆఫీస్ ఫర్ ఔటర్ స్పేస్ అఫైర్స్‌కు డైరెక్టర్‌గా నియమితులైనవారు? (3)
1) అరుణా మిల్లర్ 2) అనిరుధ్
3) ఆర్తి హొల్లా 4) రయాన బర్నవి
వివరణ: ఆస్ట్రియాలోని వియన్నా కేంద్రంగా పనిచేస్తున్న యునైటెడ్ నేషనల్ ఆఫీస్ ఫర్ ఔటర్ స్పేస్ అఫైర్స్‌కు డైరెక్టర్‌గా భారత సంతతికి చెందిన ఆర్తి హోల్లా మియాని నియమితులయ్యారు. ఈ సంస్థను 1958 డిసెంబర్ 13న ఏర్పాటు చేశారు. అంతరిక్ష అనువర్తనాలకు సంబంధించి వివిధ అంశాల బాధ్యతను ఇది చేపడుతుంది. అలాగే శిక్షణ కార్యక్రమాలు, వర్క్‌షాప్‌లను కూడా నిర్వహిస్తుంది. ఇంతటి కీలకమైన వ్యవస్థకు డైరెక్టర్‌గా నియమితులైన భారత సంతతికి చెందిన తొలి వ్యక్తి ఆర్తినే. ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ ఈ నియామకాన్ని ప్రకటించారు.
10. కింది ఏ ఆవిష్కరణతో జాన్ గుడెనఫ్ ముడిపడి ఉన్నారు? (4)
1) కంప్యూటర్
2) వైర్లెస్ కమ్యూనికేషన్స్
3) ఇతర గ్రహాల గురుత్వాకర్షణ
4) లిథియం-అయాన్ బ్యాటరీ
వివరణ: జాన్ గుడెనఫ్ జర్మనీ దేశానికి చెందిన శాస్త్రవేత్త. 2019లో నోబెల్ అవార్డ్ పొందారు. ఆయన లిథియం-అయాన్ బ్యాటరీ రూపకల్పన చేశారు. పర్యావరణ ముప్పు నుంచి భూమిని పరిరక్షించే ఆవిష్కరణ ఇది. జూన్ 25న ఆయన మరణించారు. నోబెల్ అవార్డ్ పొందిన అతి పెద్ద వయస్కుడు ఆయనే. రసాయన శాస్త్రంలో ఆయనకు ఈ అవార్డ్ దక్కింది. యూనివర్సిటీ ఆఫ్ చికాగో నుంచి ఆయన భౌతిక శాస్త్రంలో పీహెచ్డీ చేశారు. నోబెల్ బహుమతి మాత్రం ఆయన రసాయన శాస్త్రంలో పొందారు.
11. అమెరికా పర్యటనలో ప్రధాని నరేంద్ర మోదీ ‘సమోస కౌకస్’ అనే పదాన్ని వినియోగించారు. దీని అర్థం ఏంటి? (1)
1) యూఎస్ కాంగ్రెస్‌కు
ఎన్నికయిన భారత సంతతి వ్యక్తులు
2) అమెరికాలో ఆహార వ్యాపారంలో ఉన్న భారత సంతతి వ్యక్తులు
3) అమెరికాకు తరలివెళ్లిన భారత పాకశాస్త్ర నిపుణులు 4) పైవేవీ కాదు
వివరణ: ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల అమెరికా, ఈజిప్ట్ దేశాలను పర్యటించారు. అమెరికా చట్ట సభ అయిన కాంగ్రెస్‌లో ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా సమోస కౌకస్ అనే పదాన్ని వినియోగించారు. అమెరికా చట్ట సభకు ఎన్నికయిన దక్షిణాసియా ముఖ్యంగా భారత ఉపఖండానికి చెందిన వ్యక్తులను సూచించే పదం ఇది. 2018 నుంచి వినియోగంలో ఉంది. రాజ కృష్ణమూర్తి అనే వ్యక్తి దీన్ని ప్రథమంగా వినియోగించారు. ప్రస్తుతం అమెరికా చట్టసభలో రో ఖన్నా, రాజకృష్ణమూర్తి, ప్రమీలా జయపాల్, కమలా హ్యారిస్ (ఆ దేశ ఉపాధ్యక్షురాలు), అమి బెరా, తండెర్ ఉన్నారు.
12. ఏ రాష్ట్రంలో బలిదాన స్తంభాన్ని ప్రతిష్టించారు? (3)
1) పంజాబ్ 2) రాజస్థాన్
3) జమ్మూకశ్మీర్ 4) హర్యానా
వివరణ: శ్రీనగర్ స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్‌లో భాగంగా బలిదాన స్తంభాన్ని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా జూన్ 24న ప్రారంభించారు. శ్రీనగర్‌లోని లాల్ చౌక్‌లో ఇది ఉంది. దేశ రక్షణలో భాగంగా అమరులైన సైనికుల కోసం దీన్ని నిర్మించారు.
13. ఇటీవల మలేరియా రహిత దేశంగా దేన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది? (2)
1) అర్మేనియా 2) బెలిజ్
3) చిలీ 4) అర్జెంటీనా
వివరణ: బెలిజ్ను మలేరియా రహిత దేశంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది. మధ్య అమెరికా ప్రాంతంలో ఈ దేశం ఉంటుంది. అజర్బైజాన్, తజికిస్థాన్ కూడా మలేరియా రహిత దేశాలుగా అవతరించాయి. ఈ రెండు దేశాలు కూడా మలేరియా రహితం అంటూ మార్చిలో ప్రకటనను ప్రపంచ ఆరోగ్య సంస్థ వెలువరించింది. స్విట్జర్లాండ్‌లోని జెనీవా కేంద్రంగా ఈ సంస్థ పనిచేస్తుంది. 1948 ఏప్రిల్ 7న దీన్ని ఏర్పాటు చేశారు. ఈ ఏడాది ఏప్రిల్ 7తో ఇది 75 సంవత్సరాలు పూర్తి చేసుకుంది.
14. ఆర్టెమిస్ అకార్డ్స్ దేనికి సంబంధించింది? (1)
1) చంద్రుడి అన్వేషణ
2) యుద్ధ విరమణ ఒప్పందం
3) కాల్పుల విరమణ ఒప్పందం
4) యుద్ధ క్షేత్రాల్లో ఆహార
సరఫరా ఒప్పందం
వివరణ: నాసా, అమెరికాలో రూపొందించినవే ఆర్టెమిస్ అకార్డ్స్. ఇది సముద్ర అన్వేషణకు సంబంధించింది. ఈ ప్రయోగంలో భారత్ కూడా భాగస్వామ్యం కానుంది. ఇందుకు సంబంధించి ఇటీవల సంతకం కూడా చేసింది. ఇందులో చేరిన 27వ దేశం భారత్. భూమికి ఉపగ్రహం అయిన చందమామతో పాటు దానికి ఆవల ఉండే అంతరిక్ష వ్యవస్థను అధ్యయనం చేస్తారు. ఇది శాంతి అవసరాలకు మాత్రమే పరిమితం.
15. సాక్షి కొచ్చర్ వార్తల్లో నిలిచారు. కారణం ఏంటి? (3)
1) అతి చిన్న వయస్సులో బ్యాంక్‌కు మేనేజింగ్ డైరెక్టర్‌గా నియామకం
2) అంతరిక్షంలోకి వెళ్లనున్న మహిళ
3) అతిచిన్న వయస్సులో పైలట్ లైసెన్స్ పొందారు
4) ఐసీఏవోకు నేతృత్వం వహించనున్నారు
వివరణ: దేశంలో అతిచిన్న వయస్సులో కమర్షియల్ పైలట్ లైసెన్స్‌ను పొందిన మహిళగా సాక్షి కొచ్చర్ రికార్డ్ సృష్టించారు. 18వ ఏట ఆమె ఈ లైసెన్స్ పొందారు. గతంలో ఈ రికార్డ్ మైత్రి పటేల్ పేరిట ఉంది. తన 19వ ఏట ఆమె కమర్షియల్ పైలట్ లైసెన్స్ పొందారు. ఏడీ మానెక్ వద్ద వీరిద్దరు శిక్షణ పొందారు.
వి. రాజేంద్ర శర్మ
ఫ్యాకల్టీ
21st సెంచరీ ఐఏఎస్
9849212411
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు