Indian Polity | పునర్ వ్యవస్థీకరణ.. భాష, సాంస్కృతిక ప్రతిపాదన
భారతదేశంలో సమాఖ్య వ్యవస్థ ఉంది. కే్రంద రాష్ర్టాలు రాజ్యాంగపరంగా ఏర్పరిచిన అధికార విభజన సూత్రం ఆధారంగా పనిచేస్తాయి. సమాఖ్య ఏ విధంగా ఏర్పడింది, రాష్ర్టాల ఏర్పాటు పునర్ వ్యవస్థీకరణ మొదలగు అంశాలను ఒక భాగంలో ప్రకరణలు 1 నుంచి 4 వరకు ప్రస్తావించారు.
భారత భూభాగం (Territory of India)
- ప్రకరణ 1 : భారత్ లేదా ఇండియా అనేది రాష్ర్టాల యూనియన్. ఈ ప్రకరణ ప్రకారం భారత భూభాగం అంటే రాష్ర్టాల సరిహద్దులు, కేంద్రపాలిత ప్రాంతాలు, అలాగే కేంద్ర ప్రభుత్వం సమర్థించుకున్న ఇతర భూభాగాలు ఉంటాయి.
- ‘భారత భూభాగం’ అనే భావన విస్తృతమైనది. భారత సార్వభౌమాధికారం ఏ విధంగా విస్తరించి ఉంటుందో తెలుపుతుంది. భారత సార్వభౌమాధికారం భౌగోళిక ప్రాంతాలకే పరిమితం కాదు.
- భారత సముద్ర ప్రాదేశిక అంశాలు (Territorial Water) 12 నాటికల్ మైళ్ల వరకు, విశిష్ట ఆర్థిక మండళ్లు (Exclusive Economic zones) 200 నాటికల్ మైళ్ల వరకు, అలాగే భారత అంతరిక్ష సరిహద్దులకు కూడా సార్వభౌమాధికారం వర్తిస్తుంది.
భారత యూనియన్ (Union of India) - ఇందులో రాష్ర్టాలు మాత్రమే ఉంటాయి. రాష్ర్టాలు సమాఖ్యలో అంతర్భాగంగా ఉంటూ నిర్ణీత అధికారాలను కలిగి ఉంటాయి. ఈ పదం కేంద్ర రాష్ట్ర సంబంధాలను సూచిస్తుంది.
రాష్ర్టాల సమ్మేళనం (Union of States)
- భారత రాజ్యాంగంలో ఒకటో ప్రకరణలో భారతదేశాన్ని ‘రాష్ర్టాల యూనియన్’ (Union of States) గా పేర్కొన్నారు. సమాఖ్య (Federation) అనే పదాన్ని ఎక్కడా పేర్కొనలేదు. కెనడా సమాఖ్యను స్ఫూర్తిగా తీసుకుని ‘యూనియన్’ అనే పదాన్ని రాజ్యాంగంలో చేర్చారు.
- భారత సమాఖ్య అమెరికా వలె రాష్ర్టాల మధ్య ఒప్పందం ద్వారా ఏర్పడలేదు. అలాగే కెనడా వలె ఏకకేంద్ర రాజ్యాంగ సమాఖ్యగా విడగొట్టబడలేదు.
- భారత సమాఖ్య ఒక ప్రత్యేక పద్ధతిలో ఏర్పడింది. కేంద్ర రాష్ర్టాల మధ్య ఒప్పందం లేదు. కాబట్టి రాష్ర్టాల యూనియన్ నుంచి విడిపోలేదు.
- అమెరికా సమాఖ్యలో ప్రారంభంలో రాష్ర్టాలకు కేంద్రం నుంచి విడిపోయే హక్కు ఉండేది. అయితే ఈ హక్కును ఆ తర్వాత రద్దు చేశారు. కాబట్టి భారత సమాఖ్యను
‘విచ్ఛిన్నం కాగల రాష్ర్టాల, ‘అవిచ్ఛిన్న యూనియన్’గా పేర్కొంటారు. అమెరికాను (Indestructible Union of Indestructible State) గా పేర్కొనవచ్చు.
ప్రకరణ 2 - ఈ ప్రకరణ ప్రకారం పార్లమెంటు ఒక చట్టం ద్వారా కొన్ని షరతులతో కొత్త రాష్ర్టాలను చేర్చుకోవచ్చు లేదా ఏర్పాటు చేయవచ్చు. (Admission or establishment of new states) ఈ అధికారం పార్లమెంటుకు సంబంధించినదైనా అంతర్జాతీయ ఒప్పందాలకు లోబడి ఉంటుందని గమనించాలి.
ప్రకరణ 3లో కింది అంశాలు ఉన్నాయి.
ఎ) కొత్త రాష్ర్టాన్ని ఏర్పాటు చేయడం. రెండు లేదా ఎక్కువ రాష్ర్టాలను కలిపి నూతన రాష్ట్రంగా (ఆంధ్ర రాష్ట్రం, హైదరాబాద్ కలయికతో ఆంధ్రప్రదేశ్ 1956లో ఏర్పడటం). అలాగే రాష్ర్టాన్ని విడగొట్టి ఒక కొత్త రాష్ట్రం ఏర్పాటు చేయడం. ఉదాహరణ: 2014 జూన్‌లో ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం.
బి) రాష్ట్ర విస్తీర్ణాన్ని పెంచవచ్చు
సి) రాష్ట్ర విస్తీర్ణాన్ని తగ్గించవచ్చు
డి) రాష్ట్ర సరిహద్దుల్ని సవరించవచ్చు
ఇ) రాష్ర్టాల పేర్లను మార్చవచ్చు
ప్రకరణ 2, ప్రకరణ 3 మధ్య ఉన్న తేడా - ప్రకరణ 2 అనేది భారత యూనియన్‌లో లేని భూభాగాలకు వర్తిస్తుంది. ప్రకరణ 3 భారత భూభాగంలోని ప్రాంతాలకు వర్తిస్తుంది. ప్రకరణ 2 కొత్త రాష్ర్టాలను భారత యూనియన్‌లోకి కలుపుకోవడానికి సంబంధించింది. కొత్త రాష్ర్టాలకు సంబంధించింది. ప్రకరణ 3 అనేది అప్పటికే అమలులో ఉన్న రాష్ర్టాలకు పునర్వ్యవస్థీకరణకు సంబంధించినది.
రాష్ర్టాల ఏర్పాటు – ప్రక్రియ – పద్ధతి - ప్రకరణ 3లో అన్ని అంశాలకు ఒక ప్రక్రియ ఉంటుంది.
- పై అంశాలకు సంబంధించిన బిల్లును పార్లమెంటులోని ఏ సభలోనైనా ప్రవేశపెట్టవచ్చు.
ప్రత్యేక వివరణ - అయితే రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లులో ఆర్థిక వనరుల పంపకాలు ఉంటే అది స్పెషల్ కేటగిరీ బిల్లు అవుతుంది. అలాంటి సందర్భాల్లో బిల్లు లోక్‌సభలోనే ప్రతిపాదించాలి. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయంలో ఈ వివాదాన్ని గమనించగలరు.
- సంబంధిత బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టడానికి ముందే ప్రభావితమవుతున్న రాష్ట్ర శాసనసభల అభిప్రాయాన్ని రాష్ట్రపతి కోరతాడు.
- ఆ సంబంధిత రాష్ట్ర శాసనసభ రాష్ట్రపతి సూచించిన నిర్ణీత సమయంలోనే తమ అభిప్రాయాన్ని తెలియచేయాలి.
- రాష్ట్ర శాసనసభలు వ్యక్తీకరించిన అభిప్రాయాలను పార్లమెంటు పరిగణనలోకి తీసుకోవచ్చు లేదా తీసుకోకపోవచ్చు.
(అమెరికా, ఆస్ట్రేలియా దేశాల్లో రాష్ట్ర శాసనసభల అంగీకారం తప్పనిసరి) - ఈ బిల్లును రాష్ట్రపతి పూర్వ అనుమతితోనే ప్రవేశపెట్టాలి.
గమనిక: పై షరతులను 1955లో ఐదో రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చారు.
వివరణ - 1966లో పంజాబ్ నుంచి హర్యానా రాష్ర్టాన్ని ఏర్పాటు చేసినప్పుడు పంజాబ్‌లో రాష్ట్రపతి పాలన, విధానసభ సుప్త చేతనావస్థలో ఉండటం వల్ల పునర్ వ్యవస్థీకరణ బిల్లును రాష్ట్ర శాసనసభ
అభిప్రాయాన్ని నివేదించలేదు. - ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ బిల్లును శాసనసభ తిరస్కరించింది.
- పార్లమెంటు ఉభయ సభలు సంబంధిత బిల్లును సాధారణ మెజారిటీతో వేర్వేరుగా ఆమోదించాలి. ఉభయసభల మధ్య ప్రతిష్టంభన ఏర్పడితే, సంయుక్త సమావేశానికి ఆస్కారం లేదు. బిల్లు వీగిపోతుంది.
- రాష్ట్రపతి బిల్లును తప్పనిసరిగా ఆమోదించాలి. పునఃపరిశీలన అవకాశం లేదు.
- రాష్ట్రపతి ఆమోదం తెలిపితే బిల్లు చట్టంగా మారుతుంది. దీనితో ప్రక్రియ పూర్తి అవుతుంది.
- కొత్త రాష్ట్రం ఎప్పటి నుంచి అమలులోకి వస్తుందనేది కేంద్ర ప్రభుత్వం ప్రకటిస్తుంది. దీనినే ‘అపాయింటెడ్ డేట్’ అంటారు.
ప్రకరణ 4 - రాష్ర్టాల పునర్ వ్యవస్థీకరణ తరువాత సంభవించే తదుపరి పరిణామాల గురించి వివరిస్తుంది. ఉదాహరణకు ప్రత్యేక హోదా, సదుపాయాలు, మినహాయింపులు మొదలైన వాటిపై పార్లమెంటు చట్టాలు చేయవచ్చు. ప్రకరణ 2, 3 ప్రకారం ఏదైనా సవరణ చేసినప్పుడు 1, 4 షెడ్యూల్లో పేర్కొన్న అంశాలను కూడా తదనుగుణంగా మార్చాల్సి ఉంటుంది.
- ఇందుకోసం పార్లమెంటు కొత్త చట్టం చేయాల్సిన అవసరం లేదు. ప్రకరణ 2, 3 ప్రకారం ఏ సవరణ చేసినా, తదనుగుణంగా 1, 4 షెడ్యూల్లోని అంశాలు కూడా మార్పునకు గురవుతాయి.
ప్రత్యేక వివరణ - ప్రకరణ 2, 3 ప్రకారం ఏ సవరణ చేసినా దాన్ని రాజ్యాంగ సవరణగా పరిగణించరు. కారణం సాధారణ మెజారిటీని పాటించడమే. ఈ అంశాన్ని ప్రకరణ 4 (2)లో స్పష్టంగా పేర్కొన్నారు. అంటే రాష్ర్టాల ఏర్పాటుకు, పునర్ వ్యవస్థీకరణకు ఇతర అంశాలకు, రాజ్యాంగ సవరణ తప్పనిసరి కాదు.
భాషా ప్రయుక్త రాష్ర్టాలు – రాష్ర్టాల పునర్ వ్యవస్థీకరణ
- భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చే సమయానికి రెండు రకాలైన రాజకీయ భాగాలు ఉండేవి.
1. నేరుగా బ్రిటిష్ నియంత్రణలో ఉన్నవి
2. బ్రిటిష్ సార్వభౌమాధికారం కింద పనిచేసే సంస్థానాలు (స్వదేశీ సంస్థానాలు) - ఆనాటికి దేశంలో 552 సంస్థానాలు ఉండేవి. బ్రిటిష్ వారు ప్రకటించిన విలీన ఒప్పందం ప్రకారం 549 స్వదేశీ సంస్థానాలు భారత యూనియన్‌లో విలీనం అయ్యాయి.
- కానీ హైదరాబాద్, జునాగఢ్, కశ్మీర్, విలీనాన్ని వ్యతిరేకించాయి. తరువాత కాలంలో కాశ్మీర్ భారత్‌లో విలీన ఒప్పందం ద్వారా అంతర్భాగం అయ్యింది.
- జునాగఢ్ ప్రజాభిప్రాయం ద్వారా భారత్‌లో విలీనమయింది. ఆ విధంగా ప్రజాభిప్రాయం ద్వారా కలిసిన మొదటి, చివరి సంస్థానం ఇదే. హైదరాబాద్ 1948, సెప్టెంబర్ 17న ‘ఆపరేషన్ పోలో’ అనే పోలీసు చర్య (లేదా సైనిక చర్య) ద్వారా బలవంతంగా విలీనం చేయడం జరిగింది.
- 1950 నాటికి రాజ్యాంగం ప్రకారం నాలుగు రకాలైన రాష్ర్టాలు అమలులో ఉండేవి. వీటిని పార్ట్ -A, పార్ట్ -B, పార్ట్ -C, పార్ట్ -D గా వర్గీకరించారు. పార్ట్ -Aలో బ్రిటిష్ పాలిత గవర్నర్ ప్రావిన్స్‌లు ఉండేవి. వీటి సంఖ్య 9. పార్ట్ -B లో శాసనసభ కలిగిన స్వదేశీ సంస్థానాలు ఉండేవి. వీటి సంఖ్య 9. పార్ట్ -Cలో చీఫ్ కమిషనర్ ప్రాంతాలు ఉండేవి. వీటి సంఖ్య 10. పార్ట్ -D లో అండమాన్ నికోబార్ దీవులు ఉండేవి.
రాష్ర్టాల పునర్ వ్యవస్థీకరణ – ఫజల్అలీ కమిషన్ States Reorgnisation Commission (SRC)
- భాషా ప్రయుక్త ప్రాతిపదికన ఆంధ్రరాష్ట్రం ఏర్పాటు కావడంతో దేశంలోని ఇతర ప్రాంతాల్లో కూడా భాషా ప్రాతిపదికపైన రాష్ర్టాలు ఏర్పాటు చేయాలనే డిమాండ్ గట్టిగా ప్రస్తావించబడింది.
- ఈ డిమాండ్‌కు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం ఫజల్ అలీ (ఆనాటి ఒరిస్సా
గవర్నర్, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి) నాయకత్వంలో ఇద్దరు సభ్యులతో (కె.ఎం.ఫణిక్కర్, హెచ్.ఎం. కుంజ్రూ) రాష్ర్టాల పునర్ వ్యవస్థీకరణ కమిషన్ నియమించింది. ఈ కమిషన్ 1955, అక్టోబర్‌లో నివేదికను సమర్పించింది. భాషా ప్రాతిపదికన రాష్ర్టాల ఏర్పాటును సమర్థించినా ‘ఒక భాష ఒక రాష్ట్రం’ అనే
డిమాండ్‌ను తిరస్కరించింది. కింది ప్రతిపాదనలు చేసింది. - రాష్ర్టాల పునర్ వ్యవస్థీకరణలో దేశ ఐక్యతను, రక్షణను బలోపేతం చేసేలా చర్యలు ఉండాలి.
- భాష, సాంస్కృతికపరమైన సజాతీయత ఉండాలి.
- ఆర్థిక పరిపాలనాపరమైన అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి.
- జాతీయ అభివృద్ధితో పాటు రాష్ర్టాల సంక్షేమాన్ని పరిగణనలోకి తీసుకోవాలి.
- దీనికనుగుణంగా 1956లో పార్లమెంటు రాష్ర్టాల పునర్ వ్యవస్థీకరణ చట్టాన్ని,7వ రాజ్యాంగ సవరణను చేసి, అంతకు ముందు ఉన్న పార్ట్-A, పార్ట్ -B, పార్ట్ -C, అనే వ్యత్యాసాలను రద్దు చేసి రాష్ర్టాలను పునర్ వ్యవస్థీకరించింది.
- తత్ఫలితంగా 14 రాష్ర్టాలు, 6 కేంద్ర పాలిత ప్రాంతాలలో కొత్త వ్యవస్థ అమలులోకి వచ్చింది.
సామాజిక ఆశయాలు
- ప్రవేశికలో కొన్ని ఉదాత్తమైన ఆశయాలను పొందుపరిచారు. ఈ రాజ్యాంగం ద్వారా వాటిని సాకారం చేసుకోవడానికి ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేశారు.
న్యాయం - న్యాయం అంటే ఒక సర్వోన్నతమైన సమతా భావన. అసమానతలు, వివక్ష లేని ఆదర్శ సమాజాన్ని నిర్మించడం. మూడు రకాలైన న్యాయాలను ప్రస్తావించారు.
రాజకీయ న్యాయం - రాజ్య కార్యకలాపాల్లో పౌరులందరు ఎలాంటి వివక్ష లేకుండా పాల్గొనవచ్చు. సార్వజనీన ఓటు హక్కు, పోటీ చేసే హక్కు విజ్ఞాపన హక్కు మొదలైన రాజకీయ న్యాయ సాధనకు ప్రాతిపదికలుగా పేర్కొనవచ్చు.
సామాజిక న్యాయం - సమాజంలో పౌరులందరు సమానులే. జాతి, మత, కుల, లింగ, పుట్టుక అనే తేడాలు లేకుండా అందరికీ సమాన హోదాను, గౌరవాన్ని కల్పించడం.
- అన్ని రకాల సామాజిక వివక్షను రద్దు చేయడం. సామాజికంగా వెనుకబడిన వర్గాలు, షెడ్యూల్డ్ కులాలు, తెగల అభ్యున్నతికి కృషి చేయడం.
ఆర్థిక న్యాయం - ఆర్థిక అంతరాలను తగ్గించడం, సంపద ఉత్పత్తి, పంపిణీ, వృత్తి ఉద్యోగాల్లో అందరికీ సమాన అవకాశాలు, పేదరిక నిర్మూలన, ఆకలి నుంచి విముక్తులను చేయడం.
- జీవితాన్ని జీవించేందుకు అనువుగా మార్చడం. సామాజిక, ఆర్థిక న్యాయ సమన్వయాన్ని వితరణశీల న్యాయం అంటారు.
ఉన్నత ఆదర్శాలు - స్వేచ్ఛ: నిజమైన ప్రజాస్వామ్య రాజ్య స్థాపనకు, ఉదాత్త నాగరిక సామాజిక జీవనానికి స్వేచ్ఛాయుత వాతావరణం అనివార్యం.
- స్వేచ్ఛ అంటే నిర్హేతుకమైన పరిమితులు, నిర్బంధాలు లేకుండా పరిపూర్ణ వ్యక్తి వికాసానికి అవసరమైన పరిస్థితులను
కల్పించడం. - ప్రతి పౌరునికి ఆలోచనలో, భావ ప్రకటనలో, విశ్వాసంలో, ఆరాధనలో స్వేచ్ఛ ఉండి తీరాలి. ఉదా: మత స్వేచ్ఛ అనేది లౌకిక రాజ్య స్థాపనకు పునాది.
సమానత్వం - ప్రజాస్వామ్యంలో అత్యంత ముఖ్యమైన ఆదర్శం సమానత్వం. సమానత్వం అంటే అన్ని రకాల అసమానతలను, వివక్షను రద్దు చేసి ప్రతి వ్యక్తి తాను పూర్తిగా వికాస పరుచుకోవడానికి అవసరమైన అవకాశాలను కల్పించడం.
జీబీకే పబ్లికేషన్స్
హైదరాబాద్, 9959361278
Previous article
Current Affairs | అంతర్జాతీయం
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు