Indus Civilization – Groups Special | ముద్రికలు.. సింధూ నాగరికతకు ఆనవాళ్లు
సింధూ నాగరికతకు ఆనవాళ్లు
సింధూ నాగరికత కాలాన్ని, సింధూ నాగరికతను విశ్లేషించడంలో ప్రధాన ఆధారాలు ముద్రికలు. ఈ ముద్రికలను సింధూ ప్రజలు అత్యంత కళాత్మకంగా తయారు చేశారు. వీటిని ‘స్టియటైట్’ అనే మెత్తని రాయితో తయారు చేశారు. ఇప్పటివరకు 1400 స్థలాల నుంచి దాదాపు 400 వరకు ముద్రికలు కనుగొన్నారు. ఎక్కువగా 1398 ముద్రికలు మొహెంజోదారోలో, 891 ముద్రికలు హరప్పాలో కనుగొన్నారు. ఈ ముద్రికల్లో అత్యంత ప్రధానంగా కనిపించేది మూపురం లేని ఎద్దు బొమ్మ. చేప గుర్తుగల ముద్రికను అత్యంత శుభప్రదమైనదిగా భావించేవారు.
టెర్రాకోట బొమ్మలు
- ఈ బొమ్మలు సింధూ నాగరికత ప్రజల సాంఘిక జీవన విధానాన్ని ప్రతిబింబిస్తాయి. కాల్చిన బంకమట్టితో స్త్రీ, పురుషులు, జంతువులు, ఆట బొమ్మలను తయారు చేశారు. వీరి మృణ్మయ బొమ్మల్లో ఎక్కువగా కోతి బొమ్మలు కనిపిస్తాయి.
ఇతర లోహాల బొమ్మలు - సింధూ ప్రజల పాత్రల తయారీకి మట్టితో పాటు వెండి, రాగి, కంచు వంటి ఇతర లోహాలు వాడారు. వీరు ఎక్కువగా ఉపయోగించిన లోహం కాంస్యం. ప్రపచంలో మొదటగా వెండిని వాడింది వీరే.
- వీరి అద్భుతమైన కళకు నిదర్శనం మొహెంజోదారోలో బయల్పడిన కాంస్యంతో చేసిన నాట్యగత్తె విగ్రహం.
- వీరి కళాభ్యున్నతికి మరో నిదర్శనం. గడ్డం గల పురుషుని విగ్రహం (మొహెంజోదారో)
- దైమాబాద్ (మహారాష్ట్ర)లో జరిపిన తవ్వకాల్లో కాంస్యంతో చేసిన ఏనుగు, ఖడ్గమృగం (రైనో), రథం గల బొమ్మలు బయల్పడ్డాయి.
కుండలు - నల్లని బంకమట్టితో కుండలను తయారు చేసేవారు. కుండలపై రేఖాకృతులను, చిత్రాలను నల్లటి పూతతో చిత్రించేవారు. సింధూ నాగరికత వాసుల కుండలకు గల పేరు బీడబ్ల్యూపీ (Black Ware Pottery).
ఆర్థిక వ్యవస్థ - ఆర్థిక వ్యవస్థ ప్రధానంగా వ్యవసాయం, వ్యవసాయ ఆధార పరిశ్రమలపై ఆధార పడింది. సింధూ నాగరికత ఆర్థిక వ్యవస్థను వ్యవసాయం, పరిశ్రమలు, వ్యాపార-వాణిజ్యం అనే మూడు రకాలుగా విభజించవచ్చు.
వ్యవసాయం - సింధూ ప్రజలు వ్యవసాయాన్ని ప్రధానంగా బావులు, కాల్వలు, చెరువుల ద్వారా చేశారు. వ్యాపార-వాణిజ్యాలు కూడా దాదాపు వ్యవసాయంపై ఆధారపడేవి. వీరి ఆర్థిక వ్యవస్థ వ్యవసాయాధారితం, మిగులు ఆర్థిక వ్యవస్థగా ఉండేది. ప్రజలు సింధూ నది వరద నీటిపై ఆధారపడి వ్యవసాయం చేసేవారు. వీరి వ్యవసాయ పనిముట్లు నాగలి, పారలు కొయ్యతో తయారు చేశారు.
- వీరు పండించిన ప్రధాన పంటలు బార్లీ, గోధుమ కాగా, ఇతర పంటలు పత్తి, నువ్వులు, బఠాణీ, వరి, ఆవాలు. కాలాల వారీగా చూస్తే ఖరీఫ్‌లో పత్తి, వరి, ఆవాలు, నువ్వులను పండించగా, రబీ కాలంలో గోధుమ, బార్లీ పంటలను పండించారు.
- ప్రపంచంలో మొదటగా పత్తిని పండించిన వారు సింధూ ప్రజలు. సుమేరియన్, గ్రీకులు పత్తిని సింధెన్ అని పిలిచేవారు. కారణం పత్తిని క్యూనిఫామ్ లిపి (సుమేరియన్ల లిపి)లో సింధెన్ అని పేర్కొంటారు.
- సింధూ ప్రాంతం నుంచి దిగుమతి చేసుకున్న పత్తి బేళ్లు లభ్యమైన మెసపటోమియా నాగరికత పట్టణం ఉమ్మా.
జంతువులు - ఈ నాగరికత ప్రజలు ఎద్దులు, కుక్కలు, పందులు, పిల్లులు, బర్రెలు, మేకలు, గొర్రెలు వంటి జంతువులను మచ్చిక చేసుకున్నారు. ముద్రికలపై ఎక్కువగా ముద్రించిన జంతువు ఎద్దు.
- సింధూ ప్రజల ప్రధానమైన రవాణా సాధనం ఎడ్లబండి.
పరిశ్రమలు - సింధూ ప్రజల ముఖ్యమైన పరిశ్రమలుగా ఇటుకలు, పూసలు, ఆభరణాలు, నౌకా నిర్మాణ, వస్త్ర పరిశ్రమలను పరిగణిస్తారు. ముడి ధాతువు నుంచి రాగిని వేరు చేయడం ఈ నాగరికత ప్రజల లోహ సాంకేతిక పరిజ్ఞానానికి నిదర్శనం.
- నూలు, ఉన్నితో తయారు చేసిన వస్త్ర పరిశ్రమ ప్రధానమైంది. కాగా రాగి, తగరాన్ని కలిపి కంచు తయారు చేసి కంచు పరిశ్రమను అభివృద్ధి చేశారు. కంచు పరిశ్రమ ఆధారాలు హరప్పా, చన్హుదారోలో బయల్పడ్డాయి.
తూనికలు-కొలతలు - సింధూ నాగరికత ప్రజలు కచ్చితమైన తూకాలు, బరువులను ఉపయోగించేవారు. తూనిక రాళ్లు తయారీ మరో నైపుణ్యం గల వృత్తి. వీరు ఉపయోగించిన తూనిక రాయి ఆల్బస్టార్.
- తూనిక రాళ్లు, కొలబద్ధలు మొహెంజోదారో, హరప్పా, చన్హుదారోల్లో లభ్యమయ్యాయి. ప్రాథమిక తూనిక రాయి 13.63 గ్రాముల బరువుంది. దీన్ని ఒక యూనిట్‌గా పరిగణిస్తారు.
- సింధూ ప్రాంతాల్లో లభ్యమైన తూనిక రాళ్ల బరువులు 1, 2, 4, 20, 40, 100, 200, 400, 800 యూనిట్ల రాళ్లు.
- పొడవులను కొలవడానికి క్రమబద్ధ గుర్తులున్న కొలబద్ధను తయారు చేశారు.
నోట్: తూచే బరువు గల ప్రామాణికంగా 16 సంఖ్యతో పాటు దాని రెట్టింపు సంఖ్యను (ఉదా: 32, 64) వాడారు.
వ్యాపార వాణిజ్యాలు - సింధూ నాగరికత కాలంలో వ్యాపారం దేశీయంగాను, అంతర్జాతీయంగాను జరిగింది. వివిధ రకాలైన వస్తువుల తయారీకి అవసరమైన ముడి పదార్థాలు లభించకపోవడంతో అనేక ప్రాంతాల నుంచి అవసరమైన వస్తువులను దిగుమతి చేసుకునేవారు. దీంతో పాటు మిగులు ఉత్పత్తులు, వస్తువులను ఎగుమతి చేసేవారు. వీరు వ్యాపారంలో వస్తుమార్పిడి/వినిమయ విధానం అవలంబించారు.
- వీరి వ్యాపారానికి ప్రధాన ఆధారం ముద్రికలు. పర్షియన్ గల్ఫ్ ముద్రిక లోథాల్లో లభ్యమయ్యింది. పర్షియన్ గల్ఫ్‌లోని ‘సైలక’లో సింధూ నాగరికత ముద్రికలు లభ్యమయ్యాయి.
- మెసపటోమియా నాగరికతకు చెందిన బూడిద కుండలు హరప్పాలో లభ్యమయ్యాయి.
మత సంస్కారాలు
- సింధూ నాగరికత ప్రజలు వివిధ రకాలైన ఖనన పద్ధతులను పాటించారు. ఈ నాగరితక ప్రజలు వ్యక్తిని పూడ్చిపెట్టే విధానాన్ని అధికంగా పాటించారు. మృతదేహాలను ఉత్తర దక్షిణంగా పెట్టి ఖననం చేసేవారు. మృతదేహం తల ఉత్తరం వైపు ఉండేటట్లు వెల్లకిలా పడుకోబెట్టేవారు. పాక్షిక ఖననం (శరీరంలోని ఏదో ఒక అవయవాన్ని పూడ్చిపెట్టే విధానం) చేసినట్లు ఆధారం లభించిన సింధూ నాగరికత ప్రాంత బనవాలి. ఇది వీరశైవ మత సంప్రదాయాన్ని పోలి ఉంది. కుండల్లో చితాభస్మాన్ని పూడ్చిపెట్టే ఆచారానికి సంబంధించిన ఆధారాలు లభ్యమైన నగరం రంగ్‌పూర్.
సామాజిక వ్యవస్థ
- సింధూ సమాజం ప్రధానంగా మాతృస్వామిక సమాజంగా ఉండేదని పేర్కొన్నవారు- సర్ జాన్ మార్షల్
- హరప్పా శ్మశానవాటిలో ఒకే రకమైన జన్యు లక్షణాలు గల మహిళలను పూడ్చిపెట్టిన విధానం, ఇళ్లలో పెద్ద మొత్తంలో లభించిన మాతృదేవత విగ్రహాలను బట్టి మాతృస్వామ్య పద్ధతి అమల్లో ఉండి ఉంటుందని చరిత్రకారులు అభిప్రాయపడుతున్నారు.
- ఆర్థిక అసమానతలు కనిపిస్తాయి. ధనికుల ఇళ్లు పెద్ద ప్రాంతంలో, చుట్టూ ప్రహరీతో, కాల్చిన ఇటుకలతో, సొంత బావితో, విశాలమైన గదులతో నిర్మితమై ఉన్నాయి. పేదలు కేవలం రెండు గదుల నిర్మాణంలో జీవించేవారు. హరప్పా, మొహెంజోదారో నగరంలోని ధనికుల ఇళ్లు, కూలీల ఇళ్లతో పోలిస్తే ఈ అంతరాలు మరింత స్పష్టంగా తెలుస్తాయి.
దుస్తులు-అలంకరణ
- పత్తి, ఉన్నిని వస్ర్తాల ఉత్పత్తికి ఉపయోగించడమైంది. స్త్రీపురుషులిద్దరూ ఉత్తరీయం, అంతరీయం ధరించారు. స్త్రీలు అలంకరణ ప్రియులు, అలంకరణలో భాగంగా వీరికి దువ్వెన, లిప్‌స్టిక్, అద్దం తెలుసు. స్త్రీపురుషులు కంఠాభరణాలు, కంకణాలు, ఉంగరాలు, ఉష్ణౌశాలు (తలపాగాలు) ధరించారు.
మత పరిస్థితులు
- సింధూ నాగరికత ప్రజల మతం గురించి కచ్చితమైన సమాచారం లేదు. మత విశ్వాసాలను ప్రతిబింబించే దేవాలయాలు కాని, ఆరాధించే ప్రదేశాలు కాని లభించలేదు. దీన్ని బట్టి మతం వ్యక్తిగత విశ్వాసమని అర్థమవుతుంది. ముద్రికలు, కంచు బొమ్మలు, హోమగుండాలు, సమాధుల్లో లభించిన వస్తువులు, తాయత్తులపై ఆధారపడి వీరి మతాన్ని విశ్లేషిస్తున్నారు.
1) అమ్మతల్లి లేదా మాతృదేవత: సింధూ ప్రజలు పూజించిన ప్రధాన దైవం అమ్మతల్లి. ఈమెనే ప్రకృతి దేవత, పునరుత్పత్తి దేవత, వ్యవసాయ దేవతగా పూజించారు. అమ్మతల్లి ఆరాధన స్త్రీ దేవతలను పూజించడాన్ని సూచిస్తుంది. ఆనాటి సమకాలీన నాగరికతల్లో అమ్మతల్లిని పోలిన దేవత.. సుమేరియా- ఇనన్న (ఇష్టార్), ఈజిప్ట్ ఇసీస్.
2) జననాంగాల పూజ: సింధూ ప్రజలు స్త్రీ, పురుషుల మర్మాంగాలను కూడా పూజించారు. ‘లింగాన్ని’ పూజించే ఆధారం మొహెంజోదారోలో లభ్యం కాగా, రాతి ‘యోని’ని పూజించే ఆధారం హరప్పాలో లభ్యమయ్యింది.
3) ప్రకృతి జీవులను పూజించడం: వృక్షారాధన చేసిన ప్రాచీన ప్రజలు సింధూ ప్రజలు. ఈ నాగరికత ప్రజలు పూజించిన ప్రధాన వృక్షం రావిచెట్టు (అశ్వత్థ వృక్షం), మర్రిచెట్టు. సింధూ ప్రజలు పావురం, మొసలి, మూపురం గల ఎద్దులను కూడా పూజించారు. పామును పూజించారనే ఆధారం గుమ్లా (సింధూ) ప్రాంతంలో లభించింది.
4) పశుపతి మహాదేవుడు: ఈ నాగరికత ప్రజలు పూజించిన ఏకైక పురుష దేవుడు పశుపతి మహాదేవుడు. పశుపతి మహాదేవుడి బొమ్మ కలిగిన చతురస్రాకార ముద్రిక మొహెంజోదారోలో లభ్యమయ్యింది. ముద్రికలో పశుపతి మహాదేవుడు మూడు తలలు, రెండు కొమ్ములు కలిగిన ఒకే వేదికపై ధ్యాన నిష్టలో కూర్చొని ఉన్నాడు. అతడి చుట్టూ 4 జంతువులు ఉన్నాయి. - కుడి పక్క- ఏనుగు, పులి. ఎడమ పక్క- బర్రె, ఖడ్గమృగం. వేదిక కింద- రెండు జింకలు ఉన్నాయి.
5) స్వస్తిక్ గుర్తు: ఇది సింధూ ప్రజల చిహ్నం. దీన్ని కూడా పూజించారు. సింధూ ప్రజలు భూత, ప్రేత, పిశాచాలను నమ్మారు. వీటి నుంచి తమను తాము కాపాడుకోవడానికి తాయత్తులను కట్టుకునే సంప్రదాయాన్ని కొనసాగించారు. ఇది మూఢనమ్మకాలను తెలియజేస్తుంది.
మాదిరి ప్రశ్నలు
1. లింగాన్ని పూజించే ఆధారం లభించిన సింధూ ప్రాంతం?
1) మొహెంజోదారో 2) హరప్పా
3) లోథాల్ 4) చన్హుదారో
2. హరప్పా నాగరికత ముద్రికలు లభ్యమైన సుమేరియా నాగరికత ప్రాంతాలు?
1) ఉర్ 2) సుసా 3) టెల్ అస్మార్ 4) పైవన్నీ
3. పూసలు, గాజుల పరిశ్రమ ఆధారాలు లభించిన ప్రాంతాలు?
1) బాలాకోట్ 2) లోథాల్
3) చన్హుదారో 4) పైవన్నీ
4. సింధూ ప్రాంతం నుంచి దిగుమతి చేసుకున్న పత్తి బేళ్లు లభ్యమైన మెసపటోమియా పట్టణం?
1) తేష్ 2) ఉమ్మా
3) టెల్ అస్మార్ 4) పైవన్నీ
5. కింది వాటిలో సింధూ నాగరికత ప్రజలకు తెలియనవి?
1) ఇనుము 2) సింహం
3) సిల్క్ 4) పైవన్నీ
6. కాంస్యంతో చేసిన ఏనుగు, ఖడ్గమృగం, రథం గల బొమ్మలు ఎక్కడ బయల్పడ్డాయి?
1) కాలీబంగన్ 2) హరప్పా
3) దైమాబాద్ 4) బనవాలి
7. సింధూ నాగరికత కాలంలో ‘శిలాజట’ అంటే?
1) ఇనుము ముక్కలు 2) బొగ్గు ముక్కలు
3) రాగి ముక్కలు 4) కంచు ముక్కలు
8. కింది వాటిలో సరైనవి?
1) సింధూ ప్రజల భాష ద్రావిడమని పేర్కొన్నది- హెన్రీ హెరాస్, నోరోజోవ్
2) కంప్యూటర్ను ఉపయోగించి సింధూ లిపిని విశ్లేషించడానికి ప్రయత్నించింది- యూరిజ్ నోరోజోవ్
3) 1 4) 1, 2
9. సింధూ నాగరికత పతనం కావడానికి వరదలని పేర్కొన్నది?
1) జార్జ్ ఎఫ్ డేల్స్ 2) మార్టిమర్ వీలర్
3) డీపీ అగర్వాల్ 4) ఆర్ఎస్ శర్మ
10. సుమేరియా శాసనాల్లో సింధూ ప్రజలను ఏ విధంగా ప్రస్తావించారు?
1) సింధన్ 2) మెలూహ
3) హిందూ 4) ద్రవిడ
11. కింది వాటిలో సరైనవి?
1) సంస్కృతానికి మొదటి రూపం సింధూ లిపి- ఎస్ఆర్ రావు
2) ద్రావిడ భాషలకు మొదటి రూపం సింధూ లిపి- మహాదేవన్
3) 1 4) 1, 2
సమాధానాలు
1-1, 2-4, 3-4, 4-2, 5-4,
6-3, 7-2, 8-4, 9-1, 10-2,
11-4.
సాసాల మల్లికార్జున్
అసిస్టెంట్ ప్రొఫెసర్
ప్రభుత్వ డిగ్రీ కాలేజీ,
కోరుట్ల
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు