కొన్నాళ్లు వేచి చూద్దాం!

- మహమ్మారితో కొనుగోలుదారులు, బిల్డర్లలో మారిన ధోరణి
- నిర్మాణాలవైపే దృష్టి సారించిన బిల్డర్లు
- వర్చువల్ మార్కెటింగ్వైపు అడుగులు
- మళ్లీ పుంజుకోగలదంటున్న నిపుణులు

గతేడాది కరోనా కష్టాన్ని దాటొచ్చి పుంజుకున్న రియల్ రంగంపై కొవిడ్ మళ్లీ పంజా విసురుతున్నది. మనుషుల జీవితాలను అతలాకుతలం చేస్తున్న సెకండ్ వేవ్ అన్ని రంగాలనూ కుదిపేస్తున్నది. భవన నిర్మాణ రంగంలోనూ కరోనా వీరంగం సృష్టిస్తున్నది. మొదటి దశకన్నా రెండో దశ ప్రభావం రియల్ ఎస్టేట్పై అధికంగా ఉందని నిపుణులు అభిప్రాయ పడుతున్నారు. ఈ తరుణంలో కర్తవ్యం ఏమిటన్నదే అందరి ఆలోచన.
గతేడాది, ఊహించని విపత్తు రియల్ రంగాన్ని కుదిపేసింది. అయితే, కరోనా తగ్గుముఖం పట్టాక హైదరాబాద్ బ్రాండ్ వాల్యూ భవన నిర్మాణ రంగాన్ని మళ్లీ నిలబెట్టింది. నెమ్మదిగా అమ్మకాలూ జోరందుకున్నాయి. ఇంతలోనే సెకండ్ వేవ్ విజృంభిస్తుండటంతో మళ్లీ పరిస్థితులు చేజారిపోతున్నాయి. కొవిడ్ భయంతో పెట్టుబడుల విషయాన్ని ప్రజలు పక్కన పెట్టేశారని రియల్ రంగ నిపుణులు చెబుతున్నారు. సెకండ్ వేవ్ సద్దుమణిగే వరకు నిరీక్షణ తప్పదంటున్నారు. అయితే, హైదరాబాద్ ఇమేజ్ భవన నిర్మాణ రంగానికి శ్రీరామరక్ష అన్న విశ్వాసాన్ని వ్యాపారులు వ్యక్తం చేస్తున్నారు. తాత్కాలికంగా విపత్కర పరిస్థితులు ఏర్పడినా, అంతే వేగంగా వ్యాపారం పుంజుకోగలదని అంటున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజల ఆరోగ్యమే ముఖ్యమని, అందుకోసం తాము సైతం సాయం చేస్తామని చెబుతున్నారు. ఇందులో భాగంగానే మార్కెటింగ్ కార్యకలాపాలు తగ్గించామని వారన్నారు. పరిస్థితులు యథావిధిగా మారిన తర్వాత హైదరాబాద్లో అమ్మకాలు జోరందుకుంటాయనడంలో సందేహం లేదు.
వర్చువల్ విధానంలో
ఇప్పటికే పూర్తయిన ప్రాజెక్టుల విషయంలో అమ్మకాల కోసం వినూత్న పద్ధతులను అవలంబిస్తున్నారు. వర్చువల్ విధానంలో మార్కెటింగ్ నిర్వహిస్తున్నారు. కరోనా నేపథ్యంలో జనాలెవరూ బయటకు రాలేని పరిస్థితి. లాక్డౌన్తో అందరూ ఇండ్లకే పరిమితమవుతున్నారు. దీంతో కొందరు బిల్డర్లు ఆన్లైన్ వేదికగా మార్కెటింగ్ చేస్తున్నారు. తమ ప్రాజెక్టు సమగ్ర వివరాలను కస్టమర్లకు ఆన్లైన్లోనే తెలియజేస్తున్నారు. కొందరైతే వర్చువల్ రియాలిటీ ఆధారంగా ఇండ్లను ప్రత్యక్షంగా చూసిన అనుభూతిని కలిగిస్తున్నారు. ఇంత చేసినా బుకింగ్స్ ఆశించిన స్థాయిలో ఉండటం లేదంటున్నారు సంజీవరెడ్డినగర్కు చెందిన బిల్డర్ కోపల్లి శ్రీనివాస్. చేతిలో ఉన్న ప్రాజెక్టు నిర్మాణం కొనసాగిస్తూనే, ఆయా ప్రాజెక్టుల్లో కొనుగోలు చేయగల సామర్థ్యం ఉన్నవారిని గుర్తించి, ఆన్లైన్ వేదికగా సంప్రదిస్తున్నారు.
ఉభయులకూ భారం
తెలంగాణ ప్రభుత్వం లాక్డౌన్ ప్రకటించినా నిర్మాణ రంగానికి మినహాయింపు ఇవ్వడం ఊరట కలిగించే అంశమని అంటున్నారు బిల్డర్లు. చాలామంది కొవిడ్ నిబంధనలు పాటిస్తూ నిర్మాణాలు కొనసాగిస్తున్నారు. అయితే, ఆస్తుల కొనుగోళ్లపై కొంత ఆసక్తి తగ్గిన ప్రస్తుత తరుణంలో నిర్మాణ వ్యయం వారిని కలవర పెడుతున్నది. నిర్మాణ సమయంలో జరిగే బుకింగ్స్ వల్ల బిల్డర్లకు డబ్బు సమస్య తలెత్తదు. పైగా ముందుగానే బుక్ చేసుకోవడం వల్ల కొనుగోలుదారులకూ ధరలో కొంత తగ్గింపు లభిస్తుంది. బుకింగ్స్ లేకపోవడం వల్ల మొత్తం పెట్టుబడిని బిల్డర్ భరించాల్సిన పరిస్థితి. పైగా నిర్మాణం మొత్తం పూర్తయి ఆలస్యంగా విక్రయించడం వల్ల అటు బిల్డర్కు, ఇటు కొనుగోలుదారులకు భారమవుతుంది. మొదటి దశ కరోనానుంచి పూర్తిగా కోలుకోవడంతో ఇటీవల హైదరాబాద్లో కొత్త ప్రాజెక్టులు భారీగానే ప్రారంభమయ్యాయి. కానీ, కొవిడ్ మళ్లీ విజృంభించడంతో పరిస్థితులు మొదటికొచ్చాయి. నగరం నలుమూలలా చాలా ప్రాజెక్టులు నిర్మాణ దశలో ఉన్నాయి. కొనుగోలుదారులు కొంతమేర తగ్గడంతో బిల్డర్లు ఆలోచనలో పడ్డారు. హైదరాబాద్ మూలాలు బలంగా ఉన్నాయి కాబట్టి, ప్రస్తుత పరిస్థితులను పెట్టుబడులకు అనువైనవిగా భావించే ఆశావాదులకూ కొదువ లేదు. అలాంటివారికి ఇదో సువర్ణావకాశమే!
లాక్డౌన్ తర్వాత మళ్లీ జోరు
గతంలోకంటే అమ్మకాలలో కాస్త వేగం మందగించింది. మహమ్మారి విజృంభణతో చాలామంది కొనుగోలు విషయంలో వేచి చూసే ధోరణిలో కనిపిస్తున్నారు. కొందరు ఆన్లైన్లో ప్రాజెక్టుల వివరాలను తెలుసుకుంటున్నారు. ఆఫర్ల ను సద్వినియోగం చేసుకొని కొనుగోలు చేస్తున్నారు. లాక్డౌన్ తర్వాత మళ్లీ అమ్మకాలు గణనీయంగా పెరుగుతాయని అంచనా వేస్తున్నాం.కొనుగోళ్లకు ఇది సరైన సమయం.
-కేవీ రామారావు, సుమధుర గ్రూప్ వైస్ ఛైర్మన్
ప్రభావం ఎక్కువే
సెకండ్ వేవ్ ఉధృతి రియల్ అమ్మకాలను తీవ్రంగానే దెబ్బ తీస్తున్నది. ఈ ప్రభావం మరో నాలుగైదు నెలల వరకు ఉండొచ్చు. అదే సమయంలో నిర్మాణ వ్యయం పెరుగుతున్నది. ఇప్పటికే కొందరు వలస కార్మికులు స్వస్థలాలకు వెళ్లిపోయారు. వాళ్లు వచ్చి పనిచేయాలన్నా, ఇక్కడ ఉన్నవారితో పని చేయించాలన్నా ఖర్చు పెరుగుతుంది. ప్రారంభించిన ప్రాజెక్టును సకాలంలో విక్రయించకపోతే ఆ భారమంతా బిల్డర్మీద, కొనుగోలుదారులపైనే ఉంటుంది. ధరలు అందుబాటులో లేకపోతే కొనుగోలుదారులు వెనుకడుగు వేస్తారు. అలాగని నిర్మాణం పూర్తయ్యాక కూడా అమ్మకుండా ఎక్కువ కాలం ఉండలేని పరిస్థితి. కరోనా రియల్ ఎస్టేట్ రంగంపై తీవ్ర ప్రభావాన్ని చూపింది.
-బాల్రాజ్ రెడ్డి, బిల్డర్, సనత్నగర్
RELATED ARTICLES
-
General Studies – Groups Special | దేశంలోని మొదటి భూతాప విద్యుత్తు ఉత్పత్తి కేంద్రం ఏది?
-
Groups Special – Polity | ఎలక్టోరల్ కాలేజీతో ఎంపిక.. మహాభియోగంతో తొలగింపు
-
Current Affairs | ఏ రాష్ర్టానికి చెందిన ‘మట్టి బనానా’కు జీఐ ట్యాగ్ లభించింది?
-
DSC Special – Social | భారతదేశంలో ఇనుప ఖనిజం లభించే ప్రాంతం?
-
Economy | పశువైద్య సేవా సౌకర్యాలను అందించే టోల్ ఫ్రీ నంబర్
-
Indian Culture And Festivals | భారతదేశంలో పండుగలు – ఉత్సవాలు
Latest Updates
Economy – Groups Special | అవస్థాపన సౌకర్యాల అభివృద్ధికి రుణాలు ఇచ్చే సంస్థలేవి?
DSC Special – Biology | Autogamy..Geitonogamy.. Xenogamy
General Studies – Groups Special | ఆదిత్య-ఎల్ 1 మిషన్
IELTS Exam | Language Tests for Overseas Education
Group 2,3 Special | వెట్టి చాకిరీ నిర్మూలనకు తీర్మానం చేసిన ఆంధ్ర మహాసభ?
Job updates | Job Updates 2023
Scholarships | Scholarships for 2023
Current Affairs | ఏ దేశంలో ‘గాంధీ వాక్’ నిర్వహిస్తారు?
NIMS Admissions 2023 | నిమ్స్లో ఎంపీటీ కోర్సు ప్రవేశాలు
JNTUH Admissions 2023 | జేఎన్టీయూహెచ్లో ఎంటెక్, ఎంఫార్మసీ ప్రవేశాలు