Geography | ఎల్‌నినో పదాన్ని మొదటిసారి ఉపయోగించినవారు?
ఎల్ నినో, లా నినాపై వ్యాసం రాయండి?
- సముద్ర ప్రవాహాల ఫలితంగా దక్షిణ పసిఫిక్‌లోని భూమధ్య రేఖ ప్రతి ప్రవాహ క్రియాశీలత మీద ఆధారపడే ఎల్ నినో, లా నినా అనే ప్రత్యేక పరిస్థితులు ఏర్పడుతున్నాయి. అలాగే పసిఫిక్ మహాసముద్రం ఉపరితల ఉష్ణోగ్రత మార్పుల ప్రభావం కూడా ఎల్‌నినో ఏర్పడటానికి కారణం.
- ఎల్‌నినో అంటే పెరూ తీరంలో ప్రతి 3 నుంచి 5 సంవత్సరాలకోసారి పసిఫిక్ జలరాశి అనూహ్యంగా వేడెక్కే స్థితి. ఎల్‌నినో అనేది ఒక స్పానిష్ (లాటిన్) పదం. లాటిన్ భాషలో ఎల్‌నినో అంటే క్రీస్తు శిశువు జననం. దీని కారణంగా భారత, ఆగ్నేయ ఆసియా దేశాల్లో రుతుపవన వ్యవస్థ దెబ్బతిని వర్షపాత పరిమాణం తగ్గుతుంది.
- మహాసముద్రాలు, వాతావరణానికి మధ్య విడదీయరాని సంబంధముంది. పసిఫిక్ మహాసముద్రం విషయంలో ఇది మరింత స్పష్టంగా కనిపిస్తుంది. ఎల్‌నినో పుట్టేదే ఇక్కడ. భూమధ్య రేఖకు ఉత్తరాన, దక్షిణాన అటూ ఇటూ సుమారు 30 డిగ్రీల మధ్య ప్రాంతాన్ని అశ్విక ‘అక్షాంశాలంటారు’. భూభ్రమణం వల్ల ఇక్కడ గాలి భూమధ్య రేఖ వైపు మొగ్గుతుంది. ఈ గాలి కొరియాలిస్ ఎఫెక్ట్ వల్ల ఉత్తరార్ధగోళంలో నైరుతి దిశ వైపు, దక్షిణార్ధగోళంలో వాయవ్యం వైపు కదులుతుంది. దీనికి అధిక పీడనం తోడై భూమధ్య రేఖకు రెండువైపులా తూర్పు నుంచి పడమరకు గాలులు వీస్తుంటాయి. వీటినే వాణిజ్య గాలులు (Trade Winds) అంటారు.
- ఒకప్పుడు నావికులు పసిఫిక్ మహాసముద్రం గుండా తేలికగా ప్రయాణాలు చేయడానికి వీటిని వాడుకునేవారు. వాణిజ్య గాలుల బలాన్ని బట్టి మహాసముద్ర ఉపరితలం చల్లబడటం, వేడెక్కడం ఒక వలయంలా సాగుతుంది. సాధారణంగా పసిఫిక్ మహాసముద్రంలో వాణిజ్య గాలులు భూమధ్య రేఖ వద్ద తూర్పు నుంచి పడమరకు వీస్తుంటాయి. ఇవి దక్షిణ అమెరికా తీర ప్రాంతం నుంచి వేడి నీటిని ఆసియా దిశకు లాక్కొస్తాయి. ఈ వేడి నీటిని భర్తీ చేయడానికి సముద్రపు లోతుల్లోంచి చల్లని నీరు పైకి వస్తుంది.
- ఈ చల్లటి నీటిలో పోషకాలు దండిగా ఉంటాయి. ఇవి సముద్ర ఉపరితలం మీదుండే ఫైటోప్లాంక్టన్కు ఆహారంగా ఉపయోగపడతాయి. వీటిని చేపలు తిని, వృద్ధి చెందుతాయి. అయితే వాణిజ్య గాలులు బలహీనపడినప్పుడు పరిస్థితి తారుమారవుతుంది. గాలుల వేగం తగ్గడం వల్ల ఉపరితల వేడి జలాలను పడమర వైపునకు బలంగా నెట్టలేని స్థితికి చేరుకుంటాయి. అప్పుడు వేడి నీరు భూమధ్య రేఖ వద్దే పోగుపడుతూ వస్తుంది. దీంతో సముద్ర ఉపరితలం వేడెక్కుతుంది.
- అలాగే తూర్పువైపున చల్లటి నీరు పైకి రావడం తగ్గుతుంది. దీంతో చల్లగా ఉండాల్సిన మహాసముద్ర భాగాలు వేడెక్కుతాయి. ఇదే ఎల్ నినో. సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు పెరిగినప్పుడు వేడి సముద్ర ఉపరితలం, కింద చల్లని నీటి మధ్య ఉండే లోతు తగ్గుతుంది. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు, వర్షపాతం తీరుతెన్నులు గణనీయంగా మారిపోతాయి. వరదలు, కరువులు, క్షామం, సముద్ర జీవుల మూకుమ్మడి మరణాల వంటి వాటికి దారితీస్తుంది.
- ఫలితంగా పెరూ వంటి దేశాల్లో కుంభవృష్టి, వరదలు పెరిగితే భారత్, ఇండోనేషియా వంటి దేశాల్లో కరువు, క్షామం సంభవిస్తాయి. అంటే ప్రపంచంలో ఏ ప్రాంతమైనా వాతావరణ ప్రభావంతోనో, సామాజిక-ఆర్థిక పరంగానో నేరుగా ఎల్ నినో ప్రభావానికి గురికావాల్సిందే.
- బలమైన ఎల్‌నినో తొలి సంకేతాలు ఇప్పటికే మొదలయ్యాయని అమెరికా-యూరప్ ఉపగ్రహం ‘సెంటినెల్-6 మైఖేల్ ఫ్రీలిచ్ ఇటీవల గుర్తించింది. సముద్ర ఉపరితలం మీదే వేలాది మైళ్ల విస్తీర్ణంలో 2-4 అంగుళాల ఎత్తుతో వాణిజ్య అలలు ఎగుస్తున్నాయని పసిగట్టింది. ఇవి 2023లో ఎల్‌నినో రావచ్చని చెబుతున్నాయి. ఓషియానిక్ నినో ఇండెక్స్ (వోఎన్ఐ) ఆధారంగా సముద్ర ఉపరితలం ఉష్ణోగ్రతలు కనీసం ఐదు రుతువుల్లో వరుసగా 0.5 డిగ్రీల సెంటిగ్రేడ్ కంటే ఎక్కువగా నమోదైతే ఎల్ నినోకు సంకేతంగా భావిస్తారు.
- ఎల్‌నినో పరిస్థితి ఎన్నడూ ఒకేలా ఉండదు. ప్రతి ఎల్‌నినో విభిన్నమైందే. ఒక్కోటి ఒక్కోలా ప్రభావం చూపుతుంది. ఎల్‌నినోతో వరదలు, కరువులు సంభవించడమే కాదు వాతావరణం వేడెక్కడం మరో సమస్య. పసిఫిక్ ఉపరితలం అధికంగా వేడెక్కడం వల్ల వాతావరణంలోకి పెద్ద మొత్తంలో శక్తి విడుదలవుతుంది. ఫలితంగా తాత్కాలికంగా ప్రపంచ వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు పెరుగుతాయి. ఎల్‌నినో సమయంలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదు కావడానికి కారణమిదే. భూ తాపం పెరుగుతున్న నేపథ్యంలో ఇది నిజంగా కలవరం కలిగించేదే.
- ఎల్ నినో ఏర్పడినప్పుడు పగడపు దీవులకు తీవ్ర నష్టం వాటిల్లుతుంది. 1998లో ఏర్పడిన ఎల్ నినో కారణంగా ప్రపంచ వ్యాప్తంగా సుమారు 16 శాతం పగడపు దీవులు నశించాయని అంచనా. 2015-16లో వచ్చిన ఎల్‌నినో సమయంలో ప్రపంచ వ్యాప్తంగా 75-99 శాతం పగడాలు నశించాయి. ఎల్‌నినోతో కార్చిచ్చులు చెలరేగడం ఎక్కువవుతాయి.
- మహాసముద్రాలు వేడెక్కడం వల్ల నైరుతి రుతుపవనాల కదలికలు మందగించవచ్చు. ఫలితంగా వర్షాలు పడటం తగ్గుతుంది. గతంలో ఎల్‌నినో సంభించినప్పుడు కొన్నిసార్లు తీవ్ర క్షామం ఏర్పడింది. దీంతో పంటలకు నష్టం కలిగింది. ఆహార ధాన్యాల కొరత ఏర్పడింది. దేశంలో 2001-20 మధ్యకాలంలో ఎల్‌నినో సంవత్సరాలను ఎదుర్కొంది. వీటిలో నాలుగు ఎల్‌నినో సంవత్సరాల్లో కరువు ఏర్పడింది. దీర్ఘకాల సగటు వర్షపాతంలో 90 శాతం తక్కువగా వర్షాలు కురిశాయి. ఈ సంత్సరాల్లో ఖరీఫ్‌లో పంట దిగుబడి 16 శాతం, 8 శాతం, 10 శాతం, 3 శాతం చొప్పున తగ్గాయి. ద్రవ్యోల్బణానికి దారితీశాయి. దేశ వార్షిక ఆహార సరఫరాలో సుమారు సగం వాటా ఖరీఫ్ కాలంలో పండిన పంటలదే.
- పసఫిక్ మహాసముద్రంలో వేడి నీటి తీరుతెన్నులను తొలిసారిగా 17వ శతాబ్దంలో పెరూ, ఈక్వెడార్ తీరప్రాంత జాలరులు గమనించారు. సముద్రపు నీరు వేడెక్కినప్పుడు చేపలు తక్కువగా పడుతున్నట్లు, ఇది క్రిస్మస్ సమయంలో ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు. దీనికి వారు పెట్టుకున్న పేరు ‘ఎల్ నినోడిలా నెవిడాడ్’. అంటే ది క్రిస్మస్ చైల్డ్ అంటే బాల ఏసు అని అర్థం.
- 19వ శతాబ్దం చివర, 20వ శతాబ్దం మొదట్లో శాస్త్రవేత్తలు వివిధ దేశాల్లో సంభవిస్తున్న మార్పులకు కారణం ఏమిటనేది తెలుసుకోవడం మీద దృష్టి సారించారు. చివరికి ఇవి ఆయా ప్రాంతాలతో ముడిపడినవి కావని, ఎల్‌నినో
ప్రభావంతోనే ఏర్పడుతున్నాయని 20వ శతాబ్దంలో గుర్తించారు. దీన్నే ‘సదరన్ అసిలేషన్’ అని అంటారు. ఇది సగటున 5 సంవత్సరాలకు ఒకసారి ఏర్పడుతుందని తెలుసుకున్నారు. ఇది కచ్చితమైన వ్యవధి కాదు. కొన్నిసార్లు రెండేళ్లకు, మరికొన్ని సార్లు 7 సంవత్సరాలకు ఏర్పడవచ్చు. సాధారణంగా ఇది 9-12 నెలల పాటు కొనసాగుతుంది. కానీ కొన్నిసార్లు ఏళ్లకొద్దీ ఉండవచ్చు. - సాధారణంగా క్రిస్మస్ సమయంలో ఎల్‌నినో గరిష్ఠ స్థాయికి చేరుకుంటుంది. కొద్ది నెలల పాటు కొనసాగుతూ వస్తుంది. తర్వాత వెనక్కి మళ్లుతుంది. ఈ క్రమంలో
ఎల్‌నినోకు భిన్నమైన పరిస్థితులు ఏర్పడతాయి. - లా నినా అంటే స్పానిష్‌లో బాలిక అని అర్థం. ఈ సమయంలో వాణిజ్య గాలులు బలం పుంజుకొని, వేడినీటిని పడమర వైపునకు బాగా నెట్టేస్తాయి. దీంతో తూర్పు వైపున చల్లటి నీరు పైకి ఉబికి వస్తుంది. ఇది ఎల్‌నినోకు పూర్తి విభిన్నం. అందుకే దీన్ని ‘యాంటీ ఎల్‌నినో’ అని పిలుస్తారు. ఇది వాతావరణం మీద గణనీయమైన ప్రభావాన్నే చూపుతుంది. సాధారణంగా లా నినా కంటే
ఎల్‌నినో తరచూ ఏర్పడుతుంది. - ఎల్‌నినో అనే పదాన్ని ‘క్రైస్ట్ బేజి’ మొదటిసారి ఉపయోగించారు. దక్షిణ అమెరికాలో పసిఫిక్ మహాసముద్రంలోని పెరూ తీర ప్రాంతంలో సాధారణంగా పెరూ
(హంబోల్ట్) శీతల ప్రవాహం ప్రయాణిస్తుంది. ఈ సమయంలో పెరూ తీర ప్రాంతంలో అనూహ్యంగా సముద్ర నీటి ఉష్ణోగ్రత 800 డిగ్రీల సెంటీగ్రేడ్ కంటే ఎక్కువ పెరిగి అధిక ఉష్ణోగ్రత ఏర్పడుతుంది. ఈ సమయంలో ఈ శీతల ప్రవాహ స్థానాన్ని ఉష్ణ ప్రవాహం ఆక్రమించడంతో అక్కడ అధిక స్థాయిలో అల్పపీడనం ఏర్పడుతుంది. దీన్నే ఎల్‌నినో అని కూడా చెప్పవచ్చు. - ఎల్‌నినో అనేది ఉష్ణ సముద్ర ప్రవాహం. దీన్నే ‘వెచ్చని మడుగు’ అని పిలుస్తారు. ఈ ఎల్‌నినో ప్రభావం వల్ల దేశంపైకి వీచే నైరుతి రుతుపవనాలు పెరూ తీరం వైపు పయనించడం వల్ల దేశంలో వర్షపాతం తగ్గుతుంది. దీని వల్ల దేశంలో కరువు పరిస్థితులు ఏర్పడతాయి.
- లా నినా అనేది ఒక శీతల ప్రవాహం. ఇది ఎల్‌నినోకు పూర్తి విరుద్ధమైన ప్రక్రియగా భావిస్తారు. పపిఫిక్ మహాసముద్రంలోని పెరూ తీరానికి పక్కగా వెళ్లే హంబోల్ట్ శీతల ప్రవాహం వల్ల ఈ ప్రాంతంలో ఉష్ణోగ్రతలు తగ్గి అధిక పీడన పరిస్థితులు ఏర్పడతాయి. ఈ పరిస్థితినే
లా నినా అని అంటారు. - ఈ లా నినా ప్రభావం వల్ల దేశం మీదకి వీచే రుతుపవనాలు అధికంగా వీచి అత్యధిక వర్షపాతాన్ని నమోదు చేస్తున్నాయి. లా నినా ఫలితం వల్ల దేశంలో వరదలు సంభవిస్తున్నాయి. ఈ లా నినా ప్రభావం వల్ల పెరూ తీరంలో వర్షపాతం తగ్గుతుంది.
భారతదేశ నడవాల గురించి పేర్కొంటూ, వాటి ప్రాముఖ్యాన్ని తెలపండి?
- ఆర్థిక వ్యవస్థలో కొన్ని రంగాల మధ్యలో ఆధారం ఉంటుంది. దాన్ని గుర్తిస్తూ పరిశ్రమలకు మౌలిక సదుపాయాలను సమగ్రపరుస్తూ జాతి సామాజిక ఆర్థిక అభివృద్ధి కోసం ఆర్థిక నడవా లు పనిచేస్తాయి. వీటి కోసం ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు కల్పించాలి.
1) అత్యంత వేగవంతమైన రైళ్లు, రోడ్ల నెట్‌వర్క్‌ను కలిగి ఉండాలి.
2) అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో ఉన్న నౌకాశ్రయాలతో అనుసంధానాన్ని కలిగి ఉండాలి.
3) అత్యాధునిక విమానశ్రయాలు అందుబాటులో ఉండగలగాలి.
4) ఈ నడవాలకు ఆనుకొని ప్రత్యేక ఆర్థి కమండళ్లు, పారిశ్రామిక ప్రాంతాలు మొదలైనవి ఉండాలి. ఈ కారిడార్లలోనే సంబంధిత మానవ వనరుల అభివృద్ధి, అవసరమైతే వారి నైపుణ్యాల పెరుగుదలకు శిక్షణా సంస్థలను కలిగి ఉండాలి.
5) వీటిలో భాగంగానే స్థిరాస్తి రంగం (రియల్ ఎస్టేట్), మానవ ఆవాసాల అభివృద్ధి, కాలనీలు, టౌన్‌షిప్స్, స్మార్ట్ సిటీస్ మొదలైన పట్టణ మౌలిక సదుపాయాలు కూడా ఉండాలి. - కేంద్ర ప్రభుత్వం పారిశ్రామిక కారిడార్లకు ఆమోదం తెలుపుతూ, వాటిని నాలుగు దశల్లో 32 ప్రాజెక్టులుగా కార్యాచరణలోకి తెచ్చేందుకు అనుమతి ఇచ్చింది.
1) అమృత్సర్-కోల్‌కతా ఇండస్ట్రియల్ కారిడార్. 1893 కి.మీ. పొడవు
2) ఢిల్లీ-ముంబై ఇండస్ట్రియల్ కారిడార్- పారిశ్రామిక నడవా
3) ముంబై-బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్
4) బెంగళూరు-చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్. (ఏపీలోకి కూడా కొంతవరకు)
5) చెన్నై-విశాఖపట్నం ఇండస్ట్రియల్ కారిడార్
6) ఒడిశా ఎకనామిక్ కారిడార్
7) హైదరాబాద్-బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్
8) హైదరాబాద్-వరంగల్ ఇండస్ట్రియల్ కారిడార్
9) హైదరాబాద్-నాగపూర్ ఇండస్ట్రియల్ కారిడార్
10) ఢిల్లీ-నాగపూర్ ఇండస్ట్రియల్ కారిడార్
11) చెన్నై-బెంగళూరు నుంచి కొచ్చి వరకు పొడిగింపు - మేక్ ఇన్ ఇండియాకు ప్రాధాన్యతనిస్తూ 2021, మార్చి వరకు వీటి అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం రూ.8,715 కోట్లు కేటాయించింది. ఈ ప్రాజెక్టు అమలు కోసం నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్మెంట్ అండ్ ఇంప్లిమెంటేషన్ ట్రస్ట్‌ను ఏర్పాటు చేశారు. వీటి పరిసర ప్రాంతాల్లో చాలావరకు పట్టణ ప్రాంతాలను స్మార్ట్సిటీస్గా ప్రకటిస్తూ వాటికి అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పిస్తూ దేశంలో సుస్థిర పట్టణీకరణకు, సమ్మిళిత వృద్ధికి బాటలు వేస్తూ ప్రపంచ ఆర్థికవృద్ధిలో ప్రపంచ మౌలిక సదుపాయాల కల్పనలో కూడా భారత్‌ను ఒక ప్రధాన పోటీదారుగా చేయడం వీటి లక్ష్యం.
ముగింపు
ఎల్‌నినో, పసిఫిక్ మహాసముద్ర జలాల్లో తలెత్తే ఒక సహజ పరిణామం. ఇది తాత్కాలికమైందే అయిన ప్రపంచ వ్యాప్తంగా కలవరపెడుతుంది. దీనివల్ల సంభవించే కరువులు, వరదలు, వడగాలుల వంటి వాతావరణ మార్పులు ఊహించిన దాని కంటే ఎక్కువ కాలం కొనసాగవచ్చని అమెరికాకు చెందిన ‘డార్ట్మౌత్ కాలేజీ’ తాజా అధ్యయనం హెచ్చరిస్తుండటమే దీనికి కారణం.
ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు సుమారు రూ.281 లక్షల కోట్ల నష్టం సంభవించవచ్చని పేర్కొంటుంది. ఇప్పటికే మానవ చర్యల కారణంగా పెరుగుతున్న భూతాపంతో సతమతమవుతున్న తరుణంలో ఇది అందరికి ఆందోళన కలిగిస్తుంది.
జీ గిరిధర్
సివిల్స్ ఫ్యాకల్టీ
బీసీ స్టడీ సర్కిల్
హైదరాబాద్
9966330068
Next article
Current Affairs | జాతీయం
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు