Economy | పేదరికానికి కారణం ‘పేదరికమే’
1. పేదరిక విష వలయం గురించి మొదట వివరించిన ఆర్థిక వేత్త ఎవరు? (బి)
ఎ) ఆడమ్ స్మిత్ బి) రాగ్నర్ నర్క్స్
సి) ఆల్ఫ్రెడ్ మార్షల్ డి) జేఎం కీన్స్
వివరణ :
- పేదరికం మరింత పేదరికానికి దారి తీయడాన్ని ‘పేదరిక విషవలయం అంటారు.
- పేదరికం కొన్ని శక్తుల చర్య, ప్రతీకార చర్య వల్ల వలయాకారంలో ఒక దేశాన్ని పేదరికంలో ఉంచడాన్ని పేదరిక విషవలయం అని రాగ్నర్ నర్క్స్ పేర్కొన్నారు. అంటే పేదరికానికి కారణం పేదరికమే అనేది ఒక విష వలయం.
- పేదరికానికి సంబంధించిన దుర్మార్గపు వృత్తం అనే పదబంధం పేదరికానికి దారితీస్తుందనే ఆలోచనను సూచిస్తుంది.
- పేద ప్రజలు తరచుగా పేదలుగా ఉంటారు, వారి పరిస్థితులను తరువాత తరాలకు అందజేస్తారు.
- పేదరిక విషవలయాలు అభివృద్ధి చెందుతున్న, వెనుకబడిన దేశాల ముఖ్య లక్షణం. పేదరిక విషవలయాలను బీదరిక విషవలయాలు అని కూడా అంటారు.
- పేదరిక సిద్ధాంతానికి సంబంధించిన విష వలయంలో రెండు రకాలుగా ఉంటాయి. అవి 1) సప్లయ్ వైపు విషవలయం
2) డిమాండ్ వైపు విషవలయం
సప్లయ్ వైపు విషవలయం - తక్కువ ఆదాయం వల్ల తక్కువ పొదుపు, తక్కువ పొదుపు వల్ల తక్కువ పెట్టుబడి, తక్కువ పెట్టుబడి వల్ల తక్కువ మూలధనం, తక్కువ మూలధనం వల్ల తక్కువ ఉత్పాదకత, తక్కువ ఉత్పాదకత వల్ల మళ్లీ మొదటి పరిస్థితి తక్కువ ఆదాయం సంభవిస్తూ పేదరికానికి కారణం పేదరికమే అనే విషవలయ చక్రాన్ని అనుసరించి సరఫరా/ సప్లయ్ స్థాయి క్షీణిస్తుంది.
డిమాండ్ వైపు విష వలయం - తక్కువ ఆదాయం వల్ల తక్కువ డిమాండ్ ఉంటుంది. డిమాండ్ తక్కువ ఉండటం వల్ల పెట్టుబడి తక్కువగా ఉంటుంది. తక్కువ పెట్టుబడి వల్ల తక్కువ మూలధనం, తక్కువ మూలధనం వల్ల తక్కువ ఉత్పాదకత ఉంటుంది. తక్కువ ఉత్పాదకత వల్ల తక్కువ ఉత్పత్తి, తక్కువ ఉత్పత్తి వల్ల తక్కువ ఆదాయం ఉంటుంది.
- ఇలా తక్కువ ఆదాయం వల్ల వచ్చే ఫలితాలు చర్య, ప్రతీకార చర్యలకు లోనై మళ్లీ మొదటి పరిస్థితికే దారి తీస్తాయి.
- పొదుపు, పెట్టుబడి పెంచినట్లయితే విషవలయం సప్లయ్ వైపు పరిష్కారం దొరుకుతుంది/ ఏర్పడుతుంది.
- ప్రజలు ఎక్కువ పెట్టుబడి పెట్టేలా మార్కెట్ పరిధిని విస్తరించినట్లయితే డిమాండ్ వైపు పరిష్కారం ఏర్పడుతుంది.
2. ఆర్థికాభివృద్ధి వనరుల కేటాయింపులో ఏ రకమైన దృక్పథాలు ప్రతిపాదించారు? (సి)
ఎ) సంతులిత వృద్ధి
బి) అసంతులిత వృద్ధి
సి) ఎ, బి
డి) ప్రదర్శన ప్రభావం
3. సంతులిత వృద్ధి భావనను ప్రతిపాదించినది ఎవరు? (ఎ)
ఎ) రాగ్నర్ నర్క్స్ బి) హర్ష్‌మన్
సి) ఏసీ పిగూ డి) రాబిన్స్
సంతులిత వృద్ధి - సంతులిత వృద్ధి భావనను రాగ్నర్ నర్క్స్ ప్రతిపాదించారు.
- ఆర్థిక వ్యవస్థలోని వివిధ రంగాల్లో ఏక కాలంలో పెట్టుబడి పెట్టి వాటిని అభివృద్ధి చేయడాన్ని సంతులిత వృద్ధి అంటారు.
- సంతులిత వృద్ధిని సమవృద్ధి అని కూడా అంటారు.
- ఆర్థిక వ్యవస్థలో వివిధ రంగాలు, వివిధ పరిశ్రమలు ఒక దాని మీద మరొకటి ఆధారపడి, పరస్పర పూరకాలుగా ఉంటాయి.
- ఉదాహరణకు ఒక వినియోగ వస్తు పరిశ్రమ స్థాపించినపుడు దానికి కావాల్సిన ముడి పదార్థాలు, యంత్రసామగ్రిని ఉత్పత్తి చేసే పరిశ్రమలు కూడా స్థాపించాలి.
- వివిధ రంగాల్లో ఉత్పత్తి మిగిలి పోవడం కొన్ని రంగాలకు ఉత్పత్తుల కొరత కావడం సంభవిస్తుంది.
- వివిధ రంగాలు ఏక కాలంలో సమానంగా అభివృద్ధి చెందినప్పుడే వివిధ రంగాల ఉత్పత్తులకు తగినంత మార్కెట్లు ఏర్పడుతాయి.
- వ్యవసాయం, పరిశ్రమలు, దేశీయ వినియోగం, ఎగుమతులు, వివిధ పరిశ్రమలు వినియోగ వస్తువులు, ఉత్పాదక వస్తువులు ఆర్థిక, సాంఘిక వ్యవస్థాపనా వ్యయం ఈ రంగాలన్నింటిని సమన్వయ పరుస్తూ ఏకకాలంలో అన్ని సమానంగా అభివృద్ధి చెందేటట్లు చూడాలి.
- సమవృద్ధి/సంతులిత వృద్ధి అభివృద్ధి చెందిన దేశాలకు ఆదర్శమైనదిగా చెప్పవచ్చు.
- సంతులిత వృద్ధిని వెనుకబడిన దేశాలు ఎంతవరకు అనుసరిస్తాయనేదే ప్రశ్న
- మూలధనం అల్పంగా ఉన్న దేశాలు తమ అల్ప మూలధనాన్ని వివిధ రంగాల్లో ఏక కాలంలో పెట్టుబడి పెడితే ఏ రంగానికి కావలసినంత పెట్టుబడి లభ్యం కాకపోవచ్చు. అంతేకాక వనరులు వృథాకావడమే కాకుండా అనుచిత మార్గాలకు తరలించవచ్చు.
4. అసంతులిత వృద్ధి భావనను ప్రతిపాదించినది ఎవరు? (బి)
ఎ) రాగ్నర్ నర్క్స్ బి) హర్ష్‌మన్
సి) మార్షల్ డి) కె.సి నియోగి
అసంతులిత వృద్ధి - అసంతులిత వృద్ధి భావనను మొదట ప్రతిపాదించినది ఆచార్య ఆల్బర్ట్ హర్ష్‌మన్
- ఆర్థిక వ్యవస్థలోని కొన్ని రంగాలను ఎంపిక చేసి వాటిలో పెట్టుబడి పెట్టి అభివృద్ధి చేస్తే, వాటికి అనుబంధంగా ఉండే రంగాల్లో పెట్టుబడికి అవకాశం కల్పించి తద్వారా ఆర్థికాభివృద్ధిని సాధించడాన్ని అసంతులిత వృద్ధి అంటారు.
- ఆర్థిక వ్యవస్థలో కొన్ని కీలక రంగాలను ఎంపిక చేసి వాటిపై భారీ పెట్టుబడి పెట్టినపుడు వాటికి అనుబంధంగా ఉన్న పరిపూరక పరిశ్రమలు కూడా అభివృద్ధి చెందుతాయి.
- ఉదాహరణకు ఉక్కు పరిశ్రమను అభివృద్ధి చేసినపుడు దానిలో కలిగిన ఉత్పత్తి మిగుళ్లు ఒక ఒత్తిడిని కలుగజేస్తాయి.
- ఆ ఉత్పత్తిని ఉపయోగించి అనుబంధ పరిశ్రమలు అభివృద్ధి చెందుతాయి.
- ఈ విధంగా బుద్ధి పూర్వకమైన అసమతుల్యాలను కల్పించి ఒక రంగం తరువాత మరొక రంగాన్ని అభివృద్ధి చేయాలి, ఈ అసమతూక పెట్టుబడికి ఎంపిక చేసుకునే పరిశ్రమలు ఎక్కువ అనుబంధ పరిశ్రమలు కలిగి ఉండాలి.
- అల్ప మూలధనం గల వెనుకబడిన/ అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఈ విధానం మంచిదని హర్ష్‌మన్, హెన్స్ సింగర్ ఆర్థిక వేత్తల అభిప్రాయం.
5. గాజుతెర ఆర్థిక వ్యవస్థను గురించి తెలియ జేసిన ఆర్థిక వేత్త ఎవరు? (బి)
ఎ) గుర్నార్ మిర్దాల్ బి) గౌతమ్మాథుర్
సి) డ్యూసెన్ బెర్రి డి) ఇర్వింగ్ ఫిషర్ - గాజుతెర ఆర్థిక వ్యవస్థ /గ్లాస్ కర్టెన్ ఆర్థిక వ్యవస్థను గురించి తెలియజేసిన ఆర్థిక వేత్త గౌతమ్ మాథుర్
- ధనవంతులు అనుభవించే విలాస వస్తువులను పేదవారు చూడగలుగుతారే గానీ అనుభవించలేక పోతున్నారు.
ఇటువంటి ఆర్థిక వ్యవస్థను గాజుతెర ఆర్థిక వ్యవస్థ అంటారు.
ఉదా : వజ్రాలు, ఖరీదైన కార్లు
6. స్వాతంత్య్రానికి పూర్వం భారతదేశంలో జాతీయాదాయాన్ని మొదటిసారిగా అంచనా వేసినది ఎవరు? (సి)
ఎ) పీసీ మహలనోబిస్
బి) వీకేఆర్‌వీ రావు
సి) దాదాభాయ్ నౌరోజీ డి) డీఆర్ గాడ్గిల్
వివరణ
స్వాతంత్య్రానికి పూర్వం భారతదేశంలో జాతీయాదాయాన్ని మొట్టమొదటిసారిగా అంచనా వేసింది దాదాభాయ్ నౌరోజీ (1868), ఆ తర్వాత ఫ్రెన్లీ షిర్రాస్ (1911), డా.వీకేఆర్‌వీ. రావు (1925) ఆర్సీ దేశాయ్ (1931) మొదలైనవారు అంచనా వేశారు.
- జాతీయాదాయాన్ని క్రమ పద్ధతిలో లెక్కించిన వారు డా. వీకేఆర్‌వీ రావు అయితే ఇవి వ్యక్తిగతంగా అంచనా వేసి గణించడం జరిగింది. కాబట్టి ఇవి శాస్త్రీయమైనవి కావు.
- స్వాతంత్య్రం తర్వాత జాతీయదాయ లెక్క ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకొని పీసీ మహలనోబిస్ అధ్యక్షతన 1949 ఆగస్టు 4న జాతీయాదాయ అంచనాల సంఘాన్ని ప్రభుత్వం నియమించింది. ఇందులో డీఆర్ గాడ్గిల్, వీకేఆర్‌వీ రావు సభ్యులుగా ఉన్నారు.
- తరువాత జాతీయాదాయ అంచనాలను 1954లో ఏర్పరిచి కేంద్ర గణాంక సంస్థకు అప్పగించింది. దీని ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో ఉంది. ఈ సీఎస్‌వో గణాంకాలను వైట్ పేపర్ అంటారు. ఈ సీఎస్‌వోను 1973లో ప్రణాళిక మంత్రిత్వశాఖలో విలీనం చేశారు.
- 2000 జనవరి 1న రంగరాజన్ అధ్యక్షతన సీఎస్‌వో, ఎన్ఎస్ఎస్వోలను విలీనం చేయాలని ప్రతిపాదించగా అది అమలు కాలేదు.
- 2019 మే 3న భారత ప్రభుత్వం ఆదేశం మేరకు సీఎస్‌వో+ఎన్ఎస్ఎస్వోలను విలీనం చేసి ఎన్ఎస్వోగా ఏర్పాటు చేశారు.
- 2019 జూలై 19న బీమల్ కుమార్ రాయ్‌ను (ఎన్ఎస్సీ) జాతీయ గణాంక కమిషన్ చైర్మన్‌గా నియమితులయ్యారు.
- ప్రస్తుతం భారతదేశంలో జాతీయదాయాన్ని అంచనావేస్తున్న సంస్థ ఎన్ఎస్వో.
7. ఒక సంవత్సర కాలంలో ఒక దేశంలో ఉత్పత్తి అయిన అంతిమ వస్తు సేవల విలువ మొత్తాన్ని ఏమంటారు? (బి)
ఎ) తలసరి ఆదాయం
బి) జాతీయాదాయం
సి) నిజ తలసరి ఆదాయం
డి) నిజ జాతీయాదాయం
వివరణ - ‘వినియోగదారులు, భౌతిక వనరులు, మానవ వనరుల నుంచి పొందే వస్తుసేవల సముదాయమే జాతీయాదాయం’
-ఇర్వింగ్ ఫిషర్ - ‘ఒక దేశంలోని శ్రమ, మూలధనం, సహజవనరుల సహాయంతో ప్రతి సంవత్సరం ఉత్పత్తి చేసిన భౌతిక, అభౌతిక వస్తుసేవలతో కూడిన నికర వస్తుసేవల మొత్తమే జాతీయాదాయం’ -అల్ఫ్రెడ్ మార్షల్
- విదేశాల నుంచి వచ్చే ఆదాయంతో సహా ద్రవ్యరూపంలో లెక్కించడానికి వీలైన దేశంలోని ఆదాయమొత్తమే జాతీయాదాయం’ -ఆచార్య పీగూ
- దేశంలోని వ్యక్తులు, వ్యాపార సంస్థలు, సామాజిక, ‘రాజకీయ సంస్థలు ఆర్థిక వ్యాపారాలకు ప్రతిఫలంగా పొందే నికర ఆదాయ సముదాయమే జాతీయాదాయం’ – కుజునెట్
- ఒక సంవత్సర కాలంలో ఉత్పత్తి అయిన వస్తుసేవల విలువల మొత్తమే జాతీయాదాయం’ -యూఎన్వో
- ‘ఒక సంవత్సర కాలంలో ఒక దేశంలో ప్రవహించే వస్తుసేవల ద్రవ్య విలువనే జాతీయాదాయం’ -శామ్యూల్ సన్
- ‘ఒక సంవత్సర కాలంలో బాటకం, వేతనాలు, వడ్డీ లాభాల రూపంలో ఒక దేశ జాతీయులు సృష్టించే ఉత్పత్తి కారకాల ఆదాయమే జాతీయాదాయం’ – కేంద్ర గణాంక సంస్థ
8. నిరంతర ప్రణాళికను ప్రపంచంలో మొదట అమలు చేసిన దేశం ఏది? (డి)
ఎ) జపాన్ బి) అమెరికా
సి) భారతదేశం డి) నెదర్లాండ్స్
వివరణ
గత సంవత్సరాన్ని వదిలివేసి ప్రస్తుత, రాబోయే సంవత్సరాన్ని కలుపుతూ నిరంతరం కొనసాగే ప్రణాళికను నిరంతర ప్రణాళిక అంటారు. - నిరంతర ప్రణాళిక అనే భావనను మొదట స్వీడన్ దేశస్థుడైన గుర్నార్ మిర్దాల్ ‘ఎకనామిక్ ప్లానింగ్ ఇన్ బోర్డర్ సెట్టింగ్ గ్రంథంలో పేర్కొన్నాడు.
- నిరంతర ప్రణాళికలను మొదట అమలు చేసిన దేశం నెదర్లాండ్స్ ఫిలిప్స్ కంపెనీలో అమలు చేశారు. తర్వాత అమెరికాలో స్టాండర్డ్ ఆటోమొబైల్ కంపెనీలో అమలు చేశారు.
- నిరంతర ప్రణాళికలు విజయవంతమైన దేశం జపాన్
- నిరంతర ప్రణాళిక భావనను భారతదేశం జపాన్ దేశం నుంచి స్వీకరించింది.
- నిరంతర ప్రణాళికను భారతదేశంలో 1962లో భారత్-చైనా యుద్ధ సమయంలో రక్షణ శాఖలో మొదట అమలు చేశారు. తర్వాత 1978లో జనతా ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. దీంతో 5వ ప్రణాళికను ఒక సంవత్సరం ముందుగానే రద్దు చేసి మొరార్జీ దేశాయ్ అధ్యక్షతన అప్పటి ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడైన ఆచార్య లక్డావాలా సలహా మేరకు 1978 ఏప్రిల్ 1 నుంచి 1980 మార్చి 31 వరకు అమలు చేశారు.
- నిరంతర ప్రణాళికల ముఖ్య లక్ష్యం చిన్న కుటీర పరిశ్రమలకు ప్రాధాన్యం ఇవ్వడం నిరంతర ప్రణాళిక గాంధేయ సిద్ధాంతాలకు అనుగుణంగా రూపొందించారు. నిరంతర ప్రణాళికలను 1980లో ఇంధిరాగాంధీ ప్రభుత్వం రద్దు చేసింది.
9. అత్యవసర పరిస్థితులు/ కరువులు వరదలు మొదలైన వైపరీత్యాలు సంభవించినపుడు ప్రభుత్వం ఇచ్చే రుణాలను ఏమంటారు? (సి)
ఎ) సహజ రుణాలు
బి) మధ్యకాలిక రుణాలు
సి) తక్కావి రుణాలు డి) పైవన్నీ
వివరణ
కరువులు, కాటకాలు, వరదలు, భూకంపాలు, సునామీలు మొదలైన ప్రకృతి వైపరీత్యాలు సంభవించినపుడు /అత్యవసర పరిస్థితుల సమయంలో ప్రభుత్వం ఇచ్చే రుణాలను తక్కావి రుణాలు అంటారు. - పంటసాగులో ఉత్పాదకతను పెంపొందించడానికి, పేద రైతులకు ఆదాయాన్ని పెంచడానికి ఇది ప్రవేశపెట్టారు.
- ప్రకృతి వైపరీత్యాల వల్ల పంట నష్టాన్ని పరిష్కరించడానికి ప్రత్యేకంగా మంజూరు చేశారు. దీన్ని 1950 చివరలో ప్రవేశపెట్టారు.
- తక్కావి రుణాలు సాధారణంగా జిల్లా, మండల, గ్రామ స్థాయిలో ప్రవేశ పెట్టారు.
- గ్రామీణ పరపతి వ్యవస్థలో దీని శాతం చాల తక్కువ.
- తక్కావి రుణాలపై విధించే వడ్డీరేటు 6 శాతంలోపే ఉంటుంది. అవసరమైన సందర్భంలో రద్ధు కూడా చేయబడుతుంది.
ఫలానా కాలం (Gestation Period) - పెట్టుబడికి, ఉత్పత్తి ప్రారంభానికి మధ్య కాల వ్యవధిని ఫలానా కాలం అంటారు.
- ఈ ఫలానా కాలం భారీ పరిశ్రమల్లో ఎక్కువగా చిన్న కుటీర పరిశ్రమల్లో తక్కువగా ఉంటుంది.
పానుగంటి కేశవ రెడ్డి
రచయిత
వైష్ణవి పబ్లికేషన్స్
గోదావరిఖని
9949562008
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు