చంద్రలోకమందు సౌధముల్..
చంద్రమా మనసో జాతః అంటుంది పురుష సూక్తం. మనసుకు చంద్రుడు అధిపతి. అందుకే అమావాస్యకు, పౌర్ణమికి మనసు ఆటుపోట్లకు గురవుతుంటుందని అంటుంటారు. మొన్నటికి మొన్న ఈజిప్ట్ భూ భాగంలో సూయెజ్ కెనాల్లో ఇసుకలో ఇరుక్కుపోయిన కొండంత జపాన్ నౌక ఎవర్ గివెన్ బయటపడటానికి మానవ ప్రయత్నానికి తోడు పున్నమి చంద్రుడిని చూసి పులకించి పొంగిన సముద్రం పోటుకు నౌక నీటిపై దానంతట అదే తేలడమే కారణమని ప్రపంచం అంగీకరించింది. దేవదానవులు అమృతం కోసం వాసుకి సర్పాన్ని తాడుగా కట్టి మంథర పర్వతాన్ని చిలుకుతున్నారు. అప్పుడు అమృతం కంటే ముందు లక్ష్మీదేవి, చంద్రుడు వచ్చారు.
లక్ష్మీదేవి మనకు అమ్మ. అమ్మ తోబుట్టువు అయిన చంద్రుడు మనకు ఆ క్షణం నుంచి మేనమామ అయ్యాడు. అలా చందమామ అయ్యాడు. అమ్మ తరుపు చుట్టం కాబట్టి చందమామ మన బాగు కోరుకుంటాడు. మనతో చల్లగా మాట్లాడతాడు. మనల్ని చల్లబరుస్తాడు. పిండి వెన్నెల ఇస్తాడు. వెండి వెన్నెల ఇస్తాడు. వెంకన్నను చంకలో బెట్టుకుని అన్నమయ్య- చందమామ రావో జాబిల్లి రావో కుందనపు పైడికోర
వెన్నపాలు తేవో!
నగుమోము చక్కనయ్యకు నలువపుట్టించిన తండ్రికి నిగమములందుండే అప్పకు మా నీలవర్ణునికి జగమెల్ల ఏలిన స్వామికి చక్కని ఇందిర మగనికి ముగురికి మొదలైన ఘనునికి మాముద్దుల మురారి బాలునికి..అని పాడుతూ గోరుముద్దలు తినిపిస్తే అయిదు వందల యాభై ఏండ్లుగా తల్లులందరూ అదే పాట పాడుతూ, అదే చందమామను చూపుతూ చంకలో బిడ్డలకు గోరుముద్దలు తినిపిస్తున్నారు.
పున్నమి వెన్నెల్లో ఇంటి డాబాల మీద విజయనగర ప్రజలు ఎన్నెన్ని వంటకాలను వెన్నెల్లో అద్దుకుని తిన్నారో రాయలనాటి రసికత వ్యాసంలో రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ వివరించారు. గాలికి మిటుకు మిటుకుమని ఆరిపోయే ముందు వెలిగే దీపాల క్యాండిల్ లైట్ స్టార్ హోటల్ చీకటి తిండ్లు తినే మనకు వెన్నెల భోజనాలు వింతగానే ఉంటాయి.
విరాట్ పురుషుడి ఒక కన్ను సూర్యుడు.. ఒక కన్ను చంద్రుడు అంటుంది విష్ణు సహస్రనామం. అగ్ని సోమాత్మకం జగత్ అని ప్రమాణం. అంటే అగ్ని చంద్రుడే ఈ జగత్తుకు ఆధారం. పగలు సూర్యుడి ద్వారా చెట్లు పత్రహరితం పచ్చదనాన్ని పులుముకుంటాయి. దీన్ని కిరణజన్య సంయోగక్రియ అన్నాం. అలాగే రాత్రిళ్లు చంద్రుడి వెన్నెల ధాన్యానికి ఔషధగుణం అద్దుతుంది. శివ లింగానికి వెన్నెల అభిషేకం చేసి పొంగి పోయింది యజుర్వేదం. నెలవంకను శివుడు నెత్తిన పువ్వుగా పెట్టుకుని చంద్రశేఖరుడయ్యాడు.
చందమామను చూచి వద్దామా సదానందా?
అని తెలుగులో ఒక తాత్త్విక గీతముంది. తెలుగు, కన్నడ రెండు భాషల్లో కీర్తనలు రాసి, పాడిన వాగ్గేయకారుడు కైవార తాతయ్య గీతమిది. మన పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామిలా కన్నడ నేల మీద కైవార తాతయ్య కాలజ్ఞాన తత్త్వాలు బాగా ప్రచారంలో ఉన్నాయి. రెండు వందల సంవత్సరాల క్రితం కైవార తాతయ్య చందమామను ఊహల్లో అయినా చూసి వద్దామా అని ప్రశ్నించాడు. అర్ధ శతాబ్దం కిందట నీల్ ఆమ్ స్ట్రాంగ్ చందమామను తొలిసారి తాకి వచ్చాడు. తర్వాత లెక్కలేనన్ని మూన్ మిషన్లు చందమామను పలకరించి వచ్చాయి. వస్తూనే ఉన్నాయి. ఏదో చుట్టపు చూపుగా చందమామ మీద కాలు పెట్టి రావడం కాకుండా- చందమామ మీదే ఇల్లు కట్టుకుని చల్లగా ఉండాలని మనిషి కోరిక. ఎప్పటికయినా నీ దగ్గరికి వస్తాములే అని మహాకవి శ్రీశ్రీ కూడా ఎప్పుడో చెప్పాడు.
భూమ్మీద భూమ్యాకర్షణ శక్తి ఉంటుంది కాబట్టి ఇల్లు వాకిలి కట్టుకుంటే నిలబడతాయి. చంద్రుడి మీద వాతావరణంలో అన్నీ తేలుతూ ఉంటాయి. శాశ్వత నివాసాలు కట్టి కరెంటు, నీళ్లు, డ్రెయిన్ పైపులు పెట్టాలంటే కృత్రిమంగా ఒత్తిడి పుట్టించి పనిచేయించాలి. పైగా భూమ్మీద అడ్డాలో ఆటో ఆపితే కూలీలు దొరుకుతారు. ఇటుక ఇటుక పేర్చి ఇల్లు కడతారు. చంద్రుడి మీద గోడలు కట్టాలన్నా, కట్టిన ఆ గోడలు, పై కప్పులు నిలబడాలన్నా భారరహిత స్థితిని సవాలు చేయాలి. కాబట్టి మన అడ్డా కూలీలు, తాపీ మేస్త్రీలు పనిచేయలేరు. చంద్రుడి మీద ఇండ్లు కట్టే కూలీలు గొప్ప శాస్త్రవేత్తలే అయి ఉండాలి. రాకెట్లలో పోను రాను ఖర్చులు, ఇండ్ల నిర్మాణం అంతా కలిసి చందమామ మీద నివాసయోగ్యమయిన చిన్న ఇల్లు కట్టడానికి మన కరెన్సీలో అక్షరాలా మూడు వందల కోట్లు అవుతుందని అంచనా. అమెరికా నాసా సాయంతో 2024 నాటికి చందమామ మీద ఇండ్లు కట్టడానికి ప్రయత్నాలు మొదలయ్యాయి.
అవుటర్ రింగ్ రోడ్డు పక్కన ఫామ్‌హౌస్‌లో వీకెండ్ విలాసం బోర్ కొడుతున్నది. హాయిగా శుక్రవారం సాయంత్రం రాకెట్లో వెళ్లి చందమామ మీద వెయ్యి చదరపు అడుగుల మన సొంత వీకెండ్ హోమ్‌లో వెన్నెల్లో గాలి పీల్చి, వెన్నెల తిని, తాగి, పిండి వెన్నెల పూసుకుని, పండు వెన్నెల్లో మునిగి తేలి, వెండి వెన్నెల కొండల బ్యాక్ డ్రాప్లో సెల్ఫీలు, విల్ఫీలు తీసుకుని అక్కడినుండే సోషల్ మీడియాలో పోస్ట్ చేసి, మళ్లీ ఆదివారం అర్ధరాత్రికి వెళ్లిన రాకెట్‌లోనే భూమ్మీదికి రావచ్చు. డెస్టినేషన్ పెళ్లిళ్లు, శుభకార్యాలు నిజమయిన మూన్ లైట్ వెన్నెల వెలుగుల్లోనే చేసుకోవచ్చు. భూమ్మీద మరీ ట్రాఫిక్ జామ్‌లు ఎక్కువగా అనిపిస్తే చందమామ మీదే శాశ్వతంగా ఉండిపోవచ్చు. భూమ్మీద పుట్టినవారిని భూలోకవాసులు, మనుషులు అంటున్నాం.
చందమామ మీద పుట్టినవారిని చంద్రగ్రహవాసులు అనాలి. చంద్రోద్భవులు అన్నా వ్యాకరణం అభ్యంతరం చెప్పకపోవచ్చు. ప్రపంచ మెలికల మహరాజు మైకేల్ జాక్సన్ మూన్ వాక్ డ్యాన్స్ చాలా పాపులర్. చందమామ మీద ఉండబోయే అందరి నడక మూన్ వాక్ డ్యాన్సే అవుతుంది. చంద్రగ్రహణం సమయంలో తప్ప మిగతా వేళల్లో భౌగోళికంగా పెద్ద సమస్యలు ఉండకపోవచ్చు. అసలే కరోనా విలయ తాండవంతో భూగోళం తల్లడిల్లిపోతున్నది. చందమామ మీద త్వరగా విల్లాలు, అపార్ట్మెంట్లు, గేటెడ్ కమ్యూనిటీలు కడితే ఇక రాకెట్లు వేసుకుని పొలోమని బయలుదేరవచ్చు. రియల్ ఎస్టేట్ కంపెనీలు ఇకపై రెండు గ్రహాల్లో ప్లాట్లు, ఫ్లాట్ల వ్యాపారాలు చేసుకోవచ్చు. దేనికయినా గ్రహచారం ఉండాలి అంటుంటారు. చంద్రగ్రహం మీద నివాసం ఉండటానికి కూడా మనిషి గ్రహచారంలో రాసి పెట్టి ఉన్నట్లుంది.
పాపం! చంద్రుడి గ్రహచారం ఎలా ఉందో? ఏమో?
అవుటర్ రింగ్ రోడ్డు పక్కన ఫామ్‌హౌస్‌లో వీకెండ్ విలాసం బోర్ కొడుతున్నది. హాయిగా శుక్రవారం సాయంత్రం రాకెట్లో వెళ్లి చందమామ మీద వెయ్యి చదరపు అడుగుల మన సొంత వీకెండ్ హోమ్‌లో వెన్నెల్లో గాలి పీల్చి, వెన్నెల తిని, తాగి, పిండి వెన్నెల పూసుకుని, పండు వెన్నెల్లో మునిగి తేలి, వెండి వెన్నెల కొండల బ్యాక్ డ్రాప్లో సెల్ఫీలు, విల్ఫీలు తీసుకుని అక్కడినుండే సోషల్ మీడియాలో పోస్ట్ చేసి, మళ్లీ ఆదివారం అర్ధరాత్రికి వెళ్లిన రాకెట్‌లోనే భూమ్మీదికి రావచ్చు.
- Tags
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు