బడ్జెట్లోనే సొంతిల్లు


‘సొంతింటి కల’ను నెరవేర్చుకోవడంలో నగరవాసులు సరికొత్తగా ఆలోచిస్తున్నారు. ‘కొవిడ్’కు ముందు.. ఆఫీస్‌కు దగ్గరగా, నగర నడిబొడ్డునే ఉండాలనుకొనేవారు. కానీ, ప్రస్తుతం
కాలుష్యానికి దూరంగా, ప్రశాంతమైన వాతావరణంలోనే ఇల్లు కొనుగోలు చేయాలనుకొంటున్నారు. అంతేకాకుండా, ‘బడ్జెట్లోనే ఇల్లు’ సొంతమవుతుండటంతో.. అందరూ నగర శివార్లవైపు
చూస్తున్నారు.
శివారువైపు నగరవాసుల చూపు
నగరంలో సొంతిల్లు అంటే ఎవరికైనా ఇష్టమే! తమకంటూ ప్రత్యేకంగా ఓ నీడ ఉండాలని అనుకొంటారు. అయితే, ఈ కల అందరికీ నెరవేరకపోవచ్చు. ఎందుకంటే, నగరంలో ఇల్లు కొనుగోలు చేయడమంటే భారీగా ఖర్చు అవుతుంది. అయితే, బడ్జెట్లోనే సొంతిల్లు కావాలనుకొనే వారి కలను ఇప్పుడు శివార్లు నెరవేరుస్తున్నాయి.
వ్యక్తిగత ఇంటికే మొగ్గు..
నిన్న మొన్నటిదాకా మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి ప్రజల్లో ఎక్కువ మంది అపార్ట్మెంట్లో ఫ్లాట్ కొనుగోలుకే మొగ్గు చూపేవారు. అయితే, కరోనాతో వారి ఆలోచనల్లోనూ మార్పు వచ్చింది. ఫ్లాట్‌తో పోలిస్తే వ్యక్తిగత ఇండ్లే ఎంతో సౌకర్యవంతమని భావిస్తున్నారు. అందుకోసమే ఖర్చు కాస్తంత ఎక్కువైనా, వాటి కొనుగోలుకే ఓటేస్తున్నారు. అపార్ట్మెంట్ ఫ్లాట్ కంటే వ్యక్తిగత గృహాలకు భవిష్యత్తులో మంచి డిమాండ్ ఉంటుందనీ, ఆరోగ్యకర వాతావరణం, నచ్చినట్టుగా ఇంటిని తీర్చిదిద్దుకొనే సౌకర్యం ఇండిపెండెంట్ ఇండ్లతోనే సాధ్యమని అనుకొంటున్నారు. పరిస్థితులకు అనుగుణంగా సొంతింటిపై మరిన్ని అంతస్తులు నిర్మించుకొని, వాటి ద్వారా నెల నెలా అద్దెల రూపంలో ఆదాయం కూడా పొందవచ్చునని భావిస్తున్నారు. అన్నిటికంటే ముఖ్యంగా భవిష్యత్‌లో వ్యక్తిగత గృహానికి పెరిగినట్టుగా ఫ్ల్లాట్కు విలువ పెరిగే అవకాశం లేదని అంటున్నారు.
నగర శివారుల్లోనే..
అయితే, కోర్ సిటీలో ఇండిపెండెంట్ ఇంటిని కొనుగోలు చేయడానికి భారీగా పెట్టుబడి పెట్టాల్సి వస్తుంది. ఈ క్రమంలో ఎక్కువ మంది నగర శివారుల్లో ఇండ్లను కొనుగోలు చేయడానికి మొగ్గు చూపుతున్నారు. ధర తక్కుగా ఉండటంతోపాటు కాలుష్యం నుంచి విముక్తి, ట్రాఫిక్ సమస్య లేకపోవడం, అన్నిటికీ మించి ప్రకృతిని ఆస్వాదిస్తూ ప్రశాంత జీవనం సాగించవచ్చంటూ శివార్లను ఎంచుకుంటున్నారు. నగరంలో భూముల ధరలు అమాంతం పెరగడంతో దూరాభారమైనా వ్యక్తిగత గృహాలను సొంతం చేసుకొంటున్నారు. అందుకే, నగర శివారు ప్రాంతాల్లో వ్యక్తిగత ఇంటి నిర్మాణాల హవా నడుస్తున్నది. కొనుగోలుదారుల డిమాండ్‌కు తగ్గట్టుగా నిర్మాణదారులు కూడా అధిక సంఖ్యలో ఇండిపెండెంట్ ఇండ్ల నిర్మాణాలు చేపడుతున్నారు. ఎటూ చాలా సంస్థలు సిబ్బందికి రవాణా సౌకర్యం కల్పిస్తాయి కాబట్టి ప్రయాణ భారం ఉండదు.
ఫ్లాట్ బడ్జెట్లోనే..
నగర శివారులోని మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీ పరిధిలో ఇండ్ల స్థలాలు పుష్కలంగా ఉన్నాయి. 60 నుంచి 100 గజాలు, 100 గజాల నుంచి 200 గజాల్లో చిన్న సైజు ప్లాట్లు అందుబాటులో ఉన్నాయి. చాలా ప్రాంతాల్లో గజం ధర సుమారు రూ. 20 వేల నుంచి రూ.30వేల వరకు పలుకుతున్నది. సరాసరిగా గజం రూ.25వేలు నడిచినా, 150 గజాల స్థలం రూ.37 లక్షలకు దొరుకుతున్నది. ఇక అపార్ట్మెంట్లో డబుల్ బెడ్ రూమ్‌ను కొనుగోలు చేయాలంటే, స్థలం విలువ, ప్రాంతాన్ని బట్టి చదరపు అడుగుకు రూ.4500 నుంచి రూ.7 వేల వరకూ ఉన్నది. మరికొన్ని ప్రాంతాల్లో చదరపు అడుగు రూ. 8వేల నుంచి రూ.12వేల వరకూ ఉంటుంది. ఈ లెక్కన 1200 చదరపు అడుగుల ఫ్లాట్ కోసం రూ. 60 లక్షల నుంచి రూ.80 లక్షల వరకు పెట్టాల్సి వస్తున్నది. వీటితోపాటు పార్కింగ్, ఇతర సౌకర్యాలకు మరో రూ.5 లక్షల మేర చెల్లించాల్సిందే! నెల నెలా నిర్వహణ ఖర్చులు అదనం. అయితే, ఇదే బడ్జెట్‌తో శివారుకు వెళ్తే వ్యక్తిగత గృహాలు దొరికే అవకాశం ఉన్నది. పైగా అపార్ట్‌మెంట్స్‌లో ఫ్లాట్ రీసేల్ వాల్యూ తక్కువ. ఈ నేపథ్యంలో ఎక్కువ మంది నగర శివార్లలో బడ్జెట్లోనే సొంతింటి కలను సాకారం చేసుకొంటున్నారు.
–వర్ధెల్లి బాపురావు
Latest Updates
జాతీయం-అంతర్జాతీయం
గోబర్ ధన్ ప్లాంటును ఎక్కడ ఏర్పాటు చేశారు? (Groups Special)
తెలంగాణ చిత్రకళాకారులు – ఘనతలు
విద్యా సంస్కరణలతో వికాసం (groups special)
ఖనిజాల కాణాచి అని ఏ ప్రాంతాన్ని పిలుస్తారు? (Groups Special)
తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావం (Groups Special)
పుస్తక సమీక్ష / Book Review
Scholarships for students
డిగ్రీ.. ‘దోస్త్’ రెడీ
బ్యాంకుల్లో 6035 క్లర్క్ పోస్టులు