World Best Technology Institutes | వరల్డ్ బెస్ట్ టెక్నాలజీ ఇన్స్టిట్యూట్స్
1. మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ
దీన్ని 1861లో అమెరికాలోని మసాచుసెట్స్ రాష్ట్రం, కేంబ్రిడ్జి నగరంలో స్థాపించారు. బ్యాచిలర్ డిగ్రీ, మాస్టర్ డిగ్రీ, డాక్టోరేట్ డిగ్రీ కోర్సులను ఈ విద్యాసంస్థ ఆఫర్ చేస్తుంది. డిజిటల్ ఏజ్‌ను ముందుకు తీసుకెళ్లడంలో, ఆధునిక కంప్యూటింగ్, నెట్వర్కింగ్ టెక్నాలజీలను అభివృద్ధి చేయడంలో MIT కీలకపాత్ర పోషించింది. ఇటీవల ఈ ఇన్స్టిట్యూట్ పర్యావరణ మార్పులు, విద్యుదయస్కాంతత్వంపై ముఖ్యమైన పరిశోధన చేస్తుంది. ప్రవేశ పరీక్ష, విద్యార్థుల గత అకడమిక్ రికార్డు, గ్రేడ్ల ఆధారంగా ఇందులో ప్రవేశాలు కల్పిస్తారు. అన్ని దేశాల విద్యార్థులు MITలో ప్రవేశం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. దాదాపు 11 వేల మంది విద్యార్థులు ఈ యూనివర్సిటీలో విద్యనభ్యసిస్తున్నారు. అందులో 60 శాతం మంది గ్రాడ్యుయేట్ లెవల్ విద్యార్థులు.
వెబ్సైట్: web.mit.edu
2. యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా, బెర్క్లీ (UCB)
-ఈ యూనివర్సిటీని 1868లో అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రం, బెర్క్లీ పట్టణంలో స్థాపించారు. దీనికి డావిస్, లాస్ ఏంజలెస్, మెర్సిడ్, రివర్సైడ్, శాన్ డియేగో, శాన్ ఫ్రాన్సిస్కో, శాంటా బార్బరా, శాంటాక్రజ్ నగరాల్లో శాఖలున్నాయి. ఇది బ్యాచిలర్ డిగ్రీ, మాస్టర్ డిగ్రీ, డాక్టోరేట్ డిగ్రీ కోర్సులతో కలిపి దాదాపు 350 డిగ్రీ ప్రోగ్రామ్‌లను ఆఫర్ చేస్తుంది. ఈ యూనివర్సిటీ అధ్యాపకులు, పూర్వ విద్యార్థులు కలిసి అనేక ఆలోచనాత్మక పరిశోధనలు చేశారు. సిలికాన్ వ్యాలీ సృష్టికి మూలమైన మైక్రోఎలక్ట్రానిక్స్ను ప్రవేశపెట్టిన, హూవర్ డ్యామ్, గోల్డెన్ గేట్ బ్రిడ్జి వంటి చారిత్రక కట్టడాల నిర్మాణానికి సాయం చేసిన ఇంజినీర్లకు ఈ యూనివర్సిటీ ఆతిథ్యం ఇచ్చింది. ప్రస్తుతం UCB ఇంజినీర్లు ప్రపంచవ్యాప్తంగా అనేక రంగాల్లో సాంకేతిక ఆవిష్కరణల అభివృద్ధిలో కీలకపాత్ర పోషిస్తున్నారు. ప్రవేశ పరీక్ష, విద్యార్థుల గత అకడమిక్ రికార్డు, గ్రేడ్ల ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు. అన్ని దేశాల విద్యార్థులు ఇందులో ప్రవేశాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. మొత్తం 36 వేల మందికిపైగా విద్యార్థులు ఈ యూనివర్సిటీలో విద్యనభ్యసిస్తున్నారు. వారిలో దాదాపు 15 శాతం మంది ఇతర దేశాల విద్యార్థులున్నారు.
వెబ్సైట్: berkeley.edu
3. నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్ (NUS)
-ఈ యూనివర్సిటీని 1905లో స్థాపించారు. ఇది స్వయంప్రతిపత్తి కలిగిన విశ్వవిద్యాలయం. సింగపూర్‌లో ఇదే అతిపెద్ద యూనివర్సిటీ. అతిపెద్ద ఇంజినీరింగ్ అధ్యాపక బృందం కలిగిన ఈ యూనివర్సిటీ ప్రారంభంతోనే ప్రపంచ ప్రఖ్యాతి గాంచినదిగా గుర్తింపు పొందింది. ఈ యూనివర్సిటీలో 31 వేల మందికిపైగా విద్యార్థులు చదువుకుంటున్నారు. వారిలో దాదాపు 30 శాతం మంది విదేశీ విద్యార్థులున్నారు. అదేవిధంగా ఈ యూనివర్సిటీలో 3 వేల మందికి పైగా పరిశోధక సిబ్బంది, వివిధ ప్రాంతాల్లో 21కి పైగా యూనివర్సిటీ స్థాయి పరిశోధనా సంస్థలు, కేంద్రాలను కలిగి ఉంది. ఈ యూనివర్సిటీ వ్యవస్థాపక విభాగం.. అధ్యాపక సిబ్బంది, పెట్టుబడిదారులతో కలిసి NUS పరిధిని సింగపూర్‌లో మరింతగా విస్తరించేందుకు కృషిచేస్తోంది.
వెబ్సైట్: www.nus.edu.sg
4. జెజియాంగ్ (zhejiang)యూనివర్సిటీ
-దీన్ని 1897లో స్థాపించారు. ఇది చైనాలోని జెజియాంగ్ ప్రావిన్స్ రాజధాని హంగ్ఝౌలో ఉంది. ఈ యూనివర్సిటీలో దాదాపు 47,000 మంది విద్యనభ్యసిస్తున్నారు. దీనికి జెజియాంగ్‌లోని ప్రధాన క్యాంపస్‌తోపాటు యుక్వాన్, జీజీ, హువాజియాచి, జిజియాంగ్, ఝౌసాన్, హైనింగ్లలో శాఖలు ఉన్నాయి. ఇందులో ఇంజినీరింగ్‌తోపాటు హ్యూమానిటీస్, మెడిసిన్ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. 120కి పైగా అండర్గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్‌లు, 300కు పైగా మాస్టర్ డిగ్రీ ప్రోగ్రామ్లతోపాటు డాక్టోరల్ ప్రోగ్రామ్స్‌ను కూడా ఈ యూనివర్సిటీ ఆఫర్ చేస్తుంది. ఈ యూనివర్సిటీకి చైనావ్యాప్తంగా 12 జాతీయస్థాయి పరిశోధనా కేంద్రాలున్నాయి.
వెబ్సైట్: www.zju.edu.cn
5. నాన్యాంగ్ టెక్నలాజికల్ యూనివర్సిటీ
-దీన్ని 1955లో నాన్యాంగ్ యూనివర్సిటీ పేరుతో స్థాపించారు. 1981లో నాన్యాంగ్ టెక్నలాజికల్ ఇన్స్టిట్యూట్గా పేరు మార్చారు. 1991లో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (NIE)తో కలిసి నాన్యాంగ్ టెక్నలాజికల్ యూనివర్సిటీ మారింది. సింగపూర్‌లోని ఈ యూనివర్సిటీ స్వయంప్రతిపత్తి కలిగిన విద్యాసంస్థ. అదేవిధంగా ఆసియాలోని మూడు అత్యుత్తమ యూనివర్సిటీల్లో ఇదొకటి. NTUలోని కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ అతిపెద్ద అధ్యాపక బృందాన్ని కలిగి ఉంది. 10 వేల మంది అండర్ గ్రాడ్యుయేట్లు, 3 వేల 500 మందికిపైగా గ్రాడ్యుయేట్లతో కొనసాగుతున్న ఈ యూనివర్సిటీలోని ఇంజినీరింగ్ కాలేజీ.. ప్రపంచంలోని అతిపెద్ద ఇంజినీరింగ్ కాలేజీల్లో ఒకటిగా గుర్తింపు పొందింది. టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్‌పై ఈ కాలేజీ దృష్టిసారించింది. ఇందులో మొత్తం 25 వేల మందికిపైగా విద్యార్థులు చదువుతున్నారు. వారిలో 8 వేల మందికిపైగా విదేశీ విద్యార్థులున్నారు.
వెబ్సైట్: www.ntu.edu.sg
6. హార్వర్డ్ యూనివర్సిటీ
-ఆమెరికాలోని మాసాచుసెట్స్ రాష్ట్రం, కేంబ్రిడ్జి నగరంలో 1636లో దీన్ని స్థాపించారు. ఇది అసోసియేట్ డిగ్రీ, బ్యాచిలర్ డిగ్రీ, మాస్టర్ డిగ్రీ కోర్సులను ఆఫర్ చేస్తుంది. ప్రస్తుతం ఈ యూనివర్సిటీ తన క్యాంపస్‌ను ఆన్స్టాన్కు విస్తరించే పనిలో ఉంది. తన సైన్స్ అండ్ టెక్నాలజీ కార్యక్రమాల పరిధిని, శక్తిని పెంచడంతోపాటు, స్కూల్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ అప్లయిడ్ సైన్సెస్ (SEAS)ను అభివృద్ధి చేసేందుకు హార్వర్డ్ యూనివర్సిటీ ఈ విస్తరణకు పూనుకుంది. SEAS అధ్యాపక బృందంలోని పలువురు గొప్పగొప్ప అవార్డులు పొందారు. మెక్ఆర్థర్ అవార్డు, గుగ్గెన్హెయిమ్ ఫెలోషిప్, నోబెల్ బహుమతితోపాటు అనేక అవార్డులను వారు గెలుచుకున్నారు. 380 ఏండ్ల చరిత్ర కలిగిన ఈ యూనివర్సిటీలో ప్రవేశ పరీక్ష, విద్యార్థుల గత అకడమిక్ రికార్డు, గ్రేడ్ల ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు. అన్ని దేశాల విద్యార్థులు హార్వర్డ్‌లో ప్రవేశం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
వెబ్సైట్: harvard.edu
7. స్టాన్‌ఫర్డ్ యూనివర్సిటీ
-ఈ యూనివర్సిటీని అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రం, స్టాన్‌ఫర్డ్ నగరంలో 1885లో స్థాపించారు. ఈ యూరివర్సిటీకి ప్రపంచవ్యాప్తంగా బీజింగ్, బెర్లిన్, బ్రిస్బేన్, కేప్‌టౌన్, ఫ్లోరెన్స్, క్యోటో, మాడ్రిడ్, మాస్కో, ఆక్స్ఫర్డ్, పారిస్, శాంటియాగో నగరాల్లో శాఖలు ఉన్నాయి. వ్యాపారసంబంధ స్ఫూర్తి కలిగినదిగా, ప్రపంచంలోని అత్యున్నత ఇంజినీరింగ్ యూనివర్సిటీల్లో ఒకటిగా ఈ యూనివర్సిటీ ఖ్యాతి గడించింది. ఇంజినీరింగ్, సాంకేతిక రంగాల్లో క్షేత్రస్థాయిలో వినూత్న పరిశోధనలు కొనసాగిస్తోంది. 1940, 50 దశకాల్లో స్టాన్‌ఫర్డ్ యూనివర్సిటీ ఇంజినీరింగ్ డీన్ ఫ్రెడరిక్ టెర్మన్.. సంస్థకు చెందిన పలువురు గ్రాడ్యుయేట్లు, అధ్యాపక సభ్యులను సొంత కంపెనీలు స్థాపించేలా ప్రోత్సహించారు. అదే ఆయనకు ఫాదర్ ఆఫ్ సిలికాన్ వ్యాలీగా పేరు తెచ్చిపెట్టింది. ప్రవేశ పరీక్ష, విద్యార్థుల గత అకడమిక్ రికార్డు, గ్రేడ్ల ఆధారంగా స్టాన్‌ఫర్డ్‌లో ప్రవేశాలు కల్పిస్తారు. దాదాపు 16 వేల మంది ఈ యూనివర్సిటీలో విధ్యనభ్యసిస్తుండగా, వారిలో సుమారు 4 వేల మంది విదేశీ విద్యార్థులున్నారు.
వెబ్సైట్: www.stanford.edu
8. యూనివర్సిటీ ఆఫ్ కేంబ్రిడ్జి
-ఈ యూనివర్సిటీని ఇంగ్లండ్‌లోని కేంబ్రిడ్జి నగరంలో 1209లో స్థాపించారు. 1231లో కింగ్ హెన్రీ-3 దీనికి రాయల్ చార్టర్ హోదా ఇచ్చారు. ఇది ఇంగ్లిష్ మాట్లాడే దేశాల్లో రెండో అతిపురాతన యూనివర్సిటీ. అదేవిధంగా ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం కొనసాగుతున్న యూనివర్సిటీల్లో నాలుగో అతిపురాతనమైనది. ఈ యూనివర్సిటీకి పరిశోధనలో MITతో భాగస్వామ్యం ఉంది (కేంబ్రిడ్జి-ఎంఐటీ ఇన్స్టిట్యూట్). ఈ భాగస్వామ్యం సైలెంట్ ఎయిర్‌క్రాఫ్ట్ ఇన్సియేటివ్ వంటి ప్రతిష్ఠాత్మకమైన అధ్యయనాలకు దారితీసింది. 1960 నుంచి కేంబ్రిడ్జి యూనివర్సిటీ చుట్టుపక్కల జీవ శాస్త్రం, సేవల పరిశ్రమలకు సంబంధించిన టెక్నాలజీ ఒక ఉత్పాతంలా అభివృద్ధి చెందింది. దీనికి కేంబ్రిడ్జి ఫెనామినన్‌గా అంతర్జాతీయ గుర్తింపు లభించింది.
వెబ్సైట్: cam.ac.uk
9. యూనివర్సిటీ ఆఫ్ ఆక్స్ఫర్డ్
-ఈ యూనివర్సిటీని 1096లో ఇంగ్లండ్‌లోని ఆక్స్ఫర్డ్ పట్టణంలో స్థాపించారు. ఇది ప్రభుత్వ యూనివర్సిటీ. బ్యాచిలర్ డిగ్రీ, మాస్టర్ డిగ్రీ, డాక్టోరేట్ డిగ్రీ కోర్సులను ఈ యూనివర్సిటీ ఆఫర్ చేస్తుంది. ప్రారంభమైంది మొదలు విజయవంతంగా కొనసాగుతున్న ఈ యూనివర్సిటీ ఇంగ్లిష్ మాట్లాడే దేశాల్లో అతిపురాతనమైనది. ఇది పరిశోధనా రంగంలో ప్రపంచ దిగ్గజంగా గుర్తింపు పొందింది. తన కీర్తిని కాపాడుకునే లక్ష్యంతో ఇటీవలి కాలంలో నూతన సౌకర్యాలకు భారీగా ఖర్చు చేస్తుంది. 920 ఏండ్ల చరిత్ర కలిగిన ఈ యూనివర్సిటీ ప్రవేశ పరీక్ష, విద్యార్థుల గత అకడమిక్ రికార్డు, గ్రేడ్ల ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తుంది. అన్ని దేశాల విద్యార్థులు ఇందులో ప్రవేశాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
వెబ్సైట్: ox.ac.uk
10. త్సింఘ్వా(Tsinghua) యూనివర్సిటీ
-దీన్ని చైనా రాజధాని బీజింగ్‌లో 1911లో స్థాపించారు. ఇక్కడ చైనా విద్యార్థులతోపాటు ఏటా 100కు పైగా దేశాల నుంచి అంతర్జాతీయ విద్యార్థులు ప్రవేశాలు పొందుతారు. వారిలో ఎక్కువగా ఆసియా విద్యార్థులుంటారు. ఈ యూనివర్సిటీలో ఇంజినీరింగ్‌తోపాటు, సైన్స్, ఆర్ట్స్, ఫిలాసఫీ, మేనేజ్మెంట్, లా, మెడిసిన్ తదితర కోర్సులు కూడా అందుబాటులో ఉన్నాయి. దీని పరిధిలో 300కు పైగా పరిశోధనా కేంద్రాలు ఉన్నాయి. త్సింఘ్వా నేషనల్ ల్యాబొరేటరీ ఫర్ ఇన్ఫర్మేషన్ సైన్స్ అండ్ టెక్నాలజీ, ల్యాబోరేటరీ ఆఫ్ ప్రెసిషన్ మెజరింగ్ టెక్నాలజీ, ఇన్స్ట్రుమెంట్స్ అండ్ ది నేషనల్ ఇంజినీరింగ్ ల్యాబొరేటరీ ఫర్ డిజిటల్ టెలివిజన్ ఈ యూనివర్సిటీ పరిశోధనా కేంద్రాల్లో ప్రధానమైనవి.
వెబ్సైట్: www.tsinghua.edu.cn
11. ఈటీహెచ్ జ్యూరిచ్ (స్విస్ ఫెడరల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ)
-ఈ యూనివర్సిటీని స్విట్జర్లాండ్‌లోని జ్యూరిచ్ నగరంలో 1855లో స్విస్ ఫెడరల్ గవర్నమెంటు స్థాపించింది. ఇది ప్రభుత్వ యూనివర్సిటీ. స్విస్ ఫెడరల్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ టెక్నాలజీ డొమైన్ (ETH డొమైన్)లో ఇది అంతర్భాగం. స్విట్జర్లాండ్‌లో ఇది అత్యున్నత యూనివర్సిటీ. ఇంజినీర్లను, శాస్త్రవేత్తలను ఎడ్యుకేట్ చేయడం, జాతీయస్థాయిలో సైన్స్ అండ్ టెక్నాలజీకి కేంద్రబిందువుగా సేవలందించడం, శాస్త్రీయ సమాజం-పరిశ్రమలకు మధ్య పరస్పర చర్యల కోసం ఒక కేంద్రాన్ని ఏర్పాటు చేయడం ఈ ఇన్స్టిట్యూట్ లక్ష్యాలు. దాదాపు 20 వేల మంది విద్యార్థులు ఇందులో విద్యనభ్యసిస్తున్నారు.
వెబ్సైట్: www.ethz.ch
12. ఇంపీరియల్ కాలేజీ లండన్
-దీన్ని 1907లో యునైటెడ్ కింగడమ్లోని లండన్ నగరంలో స్థాపించారు. 1887లో ఇంపీరియల్ ఇన్స్టిట్యూట్ పేరుతో క్వీన్ విక్టోరియా దీన్ని ప్రారంభించారు. 1907లో రాయల్ చార్టర్ హోదా పొంది, యూనివర్సిటీ ఆఫ్ లండన్‌తో జతకలిసింది. సాంకేతిక ఆవిష్కరణలు, పరిశోధనల్లో ఇది గొప్ప పేరున్న విద్యాసంస్థ. ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ విభాగంలో లండన్‌లోనే అత్యున్నత ర్యాంకు కలిగిన సంస్థ. ఇంపీరియల్ కాలేజీ లండన్ పరిశోధనా విధానంలో.. వాతావరణ మార్పులు వంటి ప్రజాసంబంధ అంశాలకు ప్రాధాన్యం ఉంటుంది. అండర్ గ్రాడ్యుయేట్, గ్రాడ్యుయేట్ కోర్సుల్లో కలిపి ఈ కాలేజీలో మొత్తం 17 వేల మందికిపైగా విద్యార్థులు చదువుతున్నారు.
వెబ్సైట్: www.imperial.ac.uk
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?