పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న రమేశ్ ఈ మధ్య తరచూ తలనొప్పి అంటున్నాడు. పరీక్షలు గుర్తొస్తే అరచేతులు చెమటలు పడుతున్నాయి. పుస్తకం చదవడం మొదలుపెడుతాడు కానీ కొద్దిసేపటికే వేరే ఆలోచనలు మనసును చుట్టు ముడుతున్నాయి. పరీక్షలు దగ్గరపడుతుంటే చాలామంది విద్యార్థులు రమేశ్లాగే సతమతమవుతుంటారు. ఈ వ్యాకులత ఇలాగే కొనసాగితే కష్టపడి చదివింది కూడా పరీక్షలో సరిగా రాయలేకపోయే ప్రమాదం ఉంది.
ఎన్ని రకాలో….
పరీక్షల సీజన్లో విద్యార్థిపై ఉండే ఒత్తిళ్లు రకరకాలు. కుటుంబం, సమాజం, స్నేహితుల నుంచే కాదు, విద్యార్థి స్వయంగా సృష్టించుకునే ఒత్తిడి ఉంటుంది. సబ్జెక్టుల క్లిష్టత, జ్ఞాపకశక్తి క్షీణించడం లాంటి సమస్యలు కూడా ఒత్తిడి పెంచుతాయి.
పరీక్షల ఫలితాల గురించి, దానితో ముడిపడి ఉన్న తల్లిదండ్రుల పరువు ప్రతిష్టల గురించి ఆలోచిస్తూ అవన్నీ తమ చేతిలోనే ఉన్నాయన్న భావన కొందరు విద్యార్థుల్లో ఉంటుంది. సరిగా పరీక్షలు రాయలేమేమోననే సందేహంతో, నిస్సహాయతతో ఆందోళన చెందుతుంటారు.
ఇక్కడ ఉంటే అక్కడి ధ్యాస
హాస్టల్లో రకరకాల విద్యార్థులతో కలిసి ఉండాల్సి వస్తుంది. హేళన చేసేవారూ, ఏడిపించేవారూ వారిలో ఉండొచ్చు. ఈ వాతావరణం పడక చదువుపై ఏకాగ్రత కుదరనివారికి ఇంట్లో ఉంటే ఎంత బాగా చదివే వాణ్ణో కదా అనిపిస్తుంది.
ఇంట్లో ఉన్నవారు ఏమనుకుంటారంటే.. ఇక్కడ ఏదైనా సందేహం వస్తే తీర్చేవారు లేరు. ఇదే హాస్టల్లో ఉండుంటే బావుండేది. అనవసరంగా ఇంట్లో ఉన్నాను అనే ఆలోచనలు చేస్తుంటారు. దీంతో ఈ రెండు రకాలవారూ ఏదో కోల్పోయినట్టు కనబడుతారు. ఆందోళన, విపరీతమైన ఒత్తిడి, ఒకే రకమైన పనివల్ల బాగా నిద్ర వస్తుంది. హాస్టల్లో ఉండేవారికైతే ఇది మరీ ఎక్కువ.
చదవని సిలబస్ భారం
ఇంతకాలం పుస్తకాలను సరిగా పట్టించుకోనివారికి తీరా ఇప్పుడు సిలబస్ భారంగా తోస్తుంది. చదవలేకపోవడం, వేగంగా చదవలేకపోవడం సమస్యలవుతాయి. ముందే చదువు మొదలుపెడితే బాగుండేది అనే ఆలోచన ఇబ్బంది పెడుతుంది.
ఏకాగ్రత కుదరదు
సమయం వృథా చేయకుండా చదువుకుందామని గట్టిగా నిశ్చయించుకుంటారు. ఏదో ఒక విషయం కోసం మిత్రులకు ఫోన్ చేస్తారు. మాటల్లో పడి చదివే మూడ్ పోతుంది. యవ్వన దశ కాబట్టి లైంగికపరమైన ఆలోచనలు వస్తుంటాయి. ఇలా వచ్చిన ఆలోచనల వల్ల తాను తప్పు చేస్తున్నాననే భావంతో సరిగా చదవలేక బాధపడుతుంటారు. ఇవన్నీ సహజం. దాని గురించి దిగులపడటం, ఆలోచించడం చేయకుండా.. వచ్చిన భావనను అనుభవంలోకి తెచ్చుకోవాలనే ఆలోచనను ఇగ్నోర్ (Ignore) చేయడం వల్ల అది మనల్ని ఎక్కువ బాధపెట్టకూడదు. ఒత్తిడిలో ఉన్న విద్యార్థిపై ఇంతకుముందున్న భయాలు, అనుమానాలన్నీ ఒకేసారి దాడిచేస్తాయి. ఆత్మన్యూనతను పెంపొందించి నేను చదవలేను అనే భావనకు గురిచేస్తాయి.
జనరల్ స్టడీస్, కరెంట్ అఫైర్స్ ఇంకా చదవాల్సింది ఎంతో ఉంది. చదివింది నాకు సరిగా వస్తుందో లేదో అనే భయం, అనుమానాలు పెరిగి, ఆత్మన్యూనత పెంపొంది ఇక చదవలేను అనే ఒత్తిడికి గురిచేస్తాయి. సాధించాల్సిన లక్ష్యాన్ని గుర్తుచేసుకుని దృశ్య రూపంలో ఊహించుకుంటే ఏకాగ్రత వస్తుంది. ఇలా రకరకాల కారణాలు విద్యార్థులను వేధిస్తుంటాయి. అయితే కారణాలేవైనా వాటన్నిటినీ పక్కనబెట్టి రాబోయే పరీక్షల కోసం చదవాలి.
ఇన్నాళ్లూ చదవకుండా పోయానన్న భావనతో ఇప్పుడున్న సమయాన్ని వృథా చేయకూడదు. వెంటనే చదవడం మొదలు పెట్టాలి. సాధించాల్సిన లక్ష్యాన్ని గుర్తుకు తెచ్చుకోవడం, దాన్ని దృశ్యరూపంలో ఊహించుకోవడం వల్ల ఏకాగ్రత వస్తుంది.