Which project was revised by the Khosla Committee in 1951 | 1951లో ‘ఖోస్లా’ కమిటీ ప్రకారం సవరించిన ప్రాజెక్టు??
గ్రూప్స్ ప్రత్యేకం.. తెలంగాణ హిస్టరీ
తెలంగాణ ప్రాంతీయ సంఘం (టీఆర్సీ)
పెద్ద మనుషుల ఒప్పందంలో భాగంగా ‘తెలంగాణ ప్రాంతీయ సంఘాన్ని’ ఏర్పాటు చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రాంతీయ కమిటీ ఆర్డర్-1958ని జారీచేసింది. 1958లో రాష్ట్రపతి ఉత్తర్వుల ద్వారా ఆంధ్రప్రదేశ్‌లో తెలంగాణ ప్రాంతీయ కమిటీని ఏర్పాటు చేశారు. ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రి నీలం సంజీవరెడ్డి తెలంగాణ ప్రాంతీయ కమిటీకి కార్యవర్గాన్ని ఏర్పాటు చేయలేదు. తెలంగాణ ప్రాంతీయ కమిటీకి 1958లో చట్టబద్ధత లభించినప్పటికీ నీలం సంజీవరెడ్డి దీనిని పట్టించుకోలేదు. దామోదరం సంజీవయ్య సీఎంగా ఉన్నప్పుడు తెలంగాణ ప్రాంతీయ కమిటీకి కార్యవర్గాన్ని నియమించారు.
మిగులు నిధులపై టీఆర్సీ నివేదికలు
1956 నుంచి 1959 వరకు ప్రభుత్వం తెలంగాణలో చేయాల్సిన దానికన్నా తక్కువ వ్యయం చేసిందని టీఆర్సీ తన నివేదికలో పేర్కొంది. 1961లో తెలంగాణ శాసన సభ్యులు రీజినల్ కమిటీ మిగులు నిధుల గురించి ప్రశ్నించగా ప్రభుత్వం తెలంగాణ మిగులు నిధులు రూ.10.7 కోట్లు అని 1961 ఆగస్ట్‌లో పేర్కొంది. 1961 వరకు ఉన్న మిగులు నిధులను ఈ ఐదారు సంవత్సరాల్లో తెలంగాణ ప్రాంతంలో ఖర్చు చేయాలని ప్రాంతీయ సంఘం తీర్మానించింది.
1961-63 సంవత్సరాల మధ్య మిగులు నిధులతో వివిధ పథకాలను రూపొందించి అమలు చేశారు. ఈ పథకాలనే తెలంగాణ ప్రాంతీయ సంఘం పథకాలు అంటారు.
ఉస్మానియా విశ్వవిద్యాలయ పథకం
ఈ పథకం కింద ఉస్మానియా యూనివర్సిటీకి రూ.3 కోట్ల నిధులు మంజూరు చేస్తూ, ఆ నిధులు తెలంగాణ ప్రాంతంలో విద్యుదీకరణ వినియోగ నిమిత్తం విద్యుత్ బోర్డు పరిధిలో 10 సంవత్సరాలు అభివృద్ధి బాండ్ల రూపంలో ఉంచాలని నిర్ణయించారు. ఆ బాండ్లపై వచ్చే వడ్డీతో ఉస్మానియా విశ్వవిద్యాలయం అభివృద్ధి పథకాలను చేపట్టాలని నిర్దేశించింది. ఈ పథకం వల్ల ఉస్మానియా యూనివర్సిటీకి లబ్ధి చేకూరుతుందని
పేర్కొంది.
ఇతర పథకాలు
హైదరాబాద్‌లోని అమీర్‌పేట్ ప్రకృతి చికిత్సాలయానికి గ్రాంటును మంజూరు చేశారు. రాజధానిపై అయ్యే వ్యయాన్ని 2:1 నిష్పత్తిలో పంచాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అభిప్రాయపడింది. ఆంధ్రతో తెలంగాణ విలీనం కావడంవల్లనే హైదరాబాద్ నగరంలో అదనపు మౌలిక వసతులు అవసరమవుతున్నాయి. కాబట్టి ఈ మౌలిక వసతులకు అయ్యే వ్యయంతో తెలంగాణ ప్రాంతానికి సంబంధం లేదని టీఆర్సీ వాదించింది.
-ఇదిలా ఉండగా పెద్ద మనుషుల ఒప్పందంలోని 4, 5, 7 అంశాలు ప్రభుత్వ సర్వీసులకు సంబంధించినవి. కానీ ప్రాంతీయ కమిటీని ఏర్పాటు చేస్తూ రాష్ట్రపతి జారీచేసిన ఉత్తర్వులో ప్రభుత్వ ఉద్యోగుల సర్వీసుల ప్రస్తావన లేదు. ప్రాంతీయ సంఘం సర్వీసు విషయాలను చర్చించేది కాని సర్వీస్ విషయాలు ప్రాంతీయ కమిటీ పరిధిలోకి రావని ప్రభుత్వం వాదించేది.
సాగునీటి రంగంలో జరిగిన అన్యాయాలు
తెలంగాణకు నీళ్లు అందించే విషయమై ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం శ్రద్ధ చూపించలేదు. ఆంధ్రప్రదేశ్‌కు కృష్ణా నదిలో 811 టీఎంసీలు, గోదావరి నదిలో 1480 టీఎంసీల నీళ్లు వాటాగా దక్కాయి. నది పరీవాహక ప్రాంతాన్ని ప్రాతిపదికగా తీసుకున్న సాగు భూమి నిష్పత్తి ప్రకారం చూస్తే తెలంగాణకు 70 శాతం నీళ్లు అంటే సుమారు 1500 టీఎంసీల నీళ్లు రావాలి. వెనుకబాటుతనం ప్రాతిపదికన చూస్తే ముందుగా తెలంగాణ ప్రాజెక్టులకు ప్రాధాన్యం ఇవ్వాలి.
– తెలంగాణలో సాగునీటి సౌకర్యం మూడో పంచవర్ష ప్రణాళిక కాలం నాటికి కూడా చాలా తక్కువే. తెలంగాణలో నికర సాగుభూమిలో 16.6 శాతం భూమికి సాగునీటి సౌకర్యం ఉండగా, కోస్తాంధ్రలో 48.31 నికర సాగుభూమికి సాగునీటి సౌకర్యం ఉండేది. తెలంగాణ సాగునీటి సౌకర్యం గల భూమిలో 80 శాతం భూమి చెరువులు, బావుల ద్వారానే సాగవుతుంది.
-తెలంగాణ వెనుకబడి ఉన్నా రెండో పంచవర్ష ప్రణాళిక (1956-61), మూడో పంచవర్ష ప్రణాళికా (1961-66) కాలంలో ఆంధ్రప్రాంతంలో సాగునీటి సౌకర్యాల కల్పన కోసం రూ.93.67 కోట్లు ఖర్చు చేయగా, తెలంగాణ ప్రాంతంలో రూ.56.76 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. ఫలితంగా రెండు ప్రాంతాల మధ్య వ్యత్యాసం మరింతగా పెరిగింది.
-హైదరాబాద్ రాష్ట్రం ప్రతిపాదించిన ప్రాజెక్టుల విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరితో వ్యవహరించింది. దేవునూరు, ఇచ్చంపల్లి ప్రాజెక్టులు పూర్తిగా రద్దయ్యాయి. బళార్థ సాధక ప్రాజెక్టులైన పోచంపాడు, నాగార్జునసాగర్ ప్రాజెక్టులు ఆంధ్రప్రదేశ్‌లో తెలంగాణకు జరిగిన అన్యాయానికి మచ్చుతునకలు.
పోచంపాడు ప్రాజెక్టు
గోదావరి బళార్థ సాధక ప్రాజెక్టుకు నిజాం పాలకులే రూపకల్పన చేశారు. పోచంపాడు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుగా పేరుగాంచిన ఈ ప్రాజెక్టు నీటి నిల్వ సామర్థ్యం 260 టీఎంసీలు. దాదాపు 20 లక్షల ఎకరాలకు సాగునీటిని కల్పించే ఆలోచనతోనే ఈ ప్రాజెక్టును డిజైన్ చేశారు. ప్రాజెక్టులో భాగంగా కడెంపై ఒక రిజర్వాయర్‌ను, మానేరుపై మరొక డ్యామ్‌ను నిర్మించ తలపెట్టారు.
– అంతేకాదు కిష్టాపురం వద్ద నిర్మించ తలపెట్టిన భారీ ప్రాజెక్టు కింద ఇప్పుడు నిర్మించిన పోచంపాడు ప్రాజెక్టును కూడా నిర్మించాలనుకున్నారు. కానీ ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తరువాత ప్రాజెక్టును కుదించారు. సవరించిన ప్రతిపాదన ప్రకారం 66 టీఎంసీల సామర్థ్యం గల రిజర్వాయర్‌ను నిర్మించి 5.7 లక్షల ఎకరాలకు నీరందించే ఆలోచనతో ప్రాజెక్టును డిజైన్ చేశారు. ఇలా కుదించిన ప్రాజెక్టు నిర్మాణానికి కూడా ఆంధ్ర పాలకులు ఆసక్తి చూపించలేదు. మహారాష్ట్ర, కర్ణాటక ప్రభుత్వాలు అభ్యంతరాలు లేవనెత్తుతున్నాయన్న నెపంతో ప్రాజెక్టును అటకెక్కించారు.
– ప్రాజెక్టును సాధించుకోవడానికి రీజినల్ కమిటీ సభ్యులు అనేక పర్యాయాలు ఢిల్లీకి వెళ్లి ప్రాజెక్టుకు అనుమతులను సాధించారు. ప్రాజెక్టుకు 1963, జూలై 26న ప్రధాని నెహ్రూ పునాది రాయి వేశారు. ప్రాజెక్టు వ్యయం రూ.40.10 కోట్లు. కానీ ప్రాజెక్టు నిర్మాణానికి కావలిసినన్ని నిధులను మంజూరు చేయకపోవడంతో పనులు నత్తనడకన సాగాయి. రెండో పంచవర్ష ప్రణాళికలో ప్రాజెక్టును చేర్చి నిధులను కేటాయిస్తే త్వరగా పూర్తయ్యేది.
నాగార్జున సాగర్ ప్రాజెక్ట్
ఈ ప్రాజెక్టు మొదటి పేరు నందికొండ. కృష్ణానదిపై నందికొండ వద్ద ప్రాజెక్టును నిర్మించి ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాలకు నీరందించే లక్ష్యంతో బ్రిటిష్ పాలనాకాలంలోనే మద్రాస్ రాష్ట్రం, నిజాం సంస్థానం సంయుక్తంగా సర్వే నిర్వహించారు. 1951లో ఖోస్లా కమిటీ ప్రకారం ప్రాజెక్టును సవరించారు. 1955, డిసెంబర్లో సవరించిన ప్రతిపాదన ప్రకారం ప్రాజెక్టు పనులను ప్రారంభించారు. ప్రాజెక్టు అసలు ప్రణాళిక ప్రకారం కుడి కాలువ గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో 18.58 లక్షల ఎకరాలకు నీరందిస్తుంది. ఎడమ కాలువ నల్లగొండ, ఖమ్మం జిల్లాల్లోని 10 లక్షల ఎకరాలకు సాగునీటి సౌకర్యాన్ని కల్పిస్తుంది. ఆంధ్ర ప్రాంతానికి చెందిన కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాల్లోని 2.93 లక్షల ఎకరాలకు ఎడమకాలువ నుంచే నీరందించాలని అనుకున్నారు. అయితే ప్రాజెక్టు నిర్మాణ కాలంలో మార్పులు జరిగి ఎడమ కాలువ కింద సాగు భూమి 5.2 లక్షల ఎకరాలకు కుదించారు. కాలువ డిజైన్‌లో వచ్చిన మార్పుల వల్లనే తెలంగాణలో ఆయకట్టు తగ్గింది. కానీ ఆంధ్ర ప్రాంతంలో అదనంగా మరొక 3.1 లక్షల ఎకరాలకు నీరందించారు.
– ఎడమ కాలువ పనులు కూడా నత్తనడకన సాగాయి. 1968 నాటికి కుడి కాలువపై రూ.37.80 కోట్లు ఖర్చు కాగా, ఎడమ కాలువపై రూ.26.53 కోట్లు మాత్రమే ఖర్చయ్యాయి. 1968 సంవత్సరంకల్లా ఆంధ్ర ప్రాంతంలో 5.6 లక్షల ఎకరాల ఆయకట్టు పెంపొందింది. తెలంగాణలో కేవలం 0.9 లక్షల ఎకరాలకు మాత్రమే నీరందించారు.
సాసాల మల్లికార్జున్
అసిస్టెంట్ ప్రొఫెసర్
ప్రభుత్వ డిగ్రీ కాలేజీ,
కోరుట్ల
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?