What does omnipotence mean | సర్వసత్తాక అంటే అర్థం ఏమిటి?
ప్రత్యేకం
భారత రాజ్యాంగం ప్రవేశికతో ప్రారంభమవుతుంది. ఈ పద్ధతిని అమెరికా నుంచి స్వీకరించారు. రాజ్యాంగ పరిషత్తులో లక్ష్యాలు-ఆశయాల తీర్మానాన్ని జవహర్లాల్ నెహ్రూ 1946 డిసెంబర్ 13న ప్రవేశపెట్టారు. దీనిని జనవరి 22, 1947లో ఆమోదించారు. ఈ తీర్మానమే ప్రస్తుత రాజ్యాంగంలో ప్రవేశికగా మారింది. అలాగే ఫ్రెంచి, రష్యా విప్లవాల ప్రభావం కూడా ప్రవేశికపై ఉంది. రాజకీయ, ఆర్థిక, సామాజిక న్యాయం అనే పదాల్లో రష్యా విప్లవ ప్రభావం కనిపిస్తే, స్వేచ్చా, సమానత్వం, సౌభ్రాతృత్వం వంటి పదాలు ఫ్రెంచి విప్లవం నుంచి స్వీకరించినవి.
రాజ్యాధికారానికి మూలం, రాజ్య స్వభావం, లక్ష్యాలు, రాజ్యాంగ ఆమోద తేదీని ప్రవేశిక తెలియచేస్తుంది. ‘భారత ప్రజలమైన మేము’ అనే పదాలతో ప్రవేశిక ప్రారంభమవుతుంది. ‘మాకు మేమే సమర్పించుకుంటున్నాం’ అన్న పదాలతో ముగుస్తుంది. దేశంలో అధికారానికి మూలం ప్రజలే. అలాగే రాజ్య స్వభావాన్ని తెలిపే పదాలు ‘సౌభ్రాతృత్వం, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర’.
భారత రాజ్యాంగం ప్రజలకు ఇచ్చిన ఆశయాలు
– సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయం.
– భావ వ్యక్తీకరణలో స్వేచ్ఛతోపాటు ఆరాధన, విశ్వాసంలోనూ స్వేచ్ఛను ఇచ్చారు.
– అవకాశాల్లో, స్థాయిలో సమానత్వం ఉంటుంది.
-తోటి పౌరుల పట్ల సోదర భావంతో మెలుగుతూ సమైక్యతను చాటుతుంది ప్రవేశిక.
– వ్యక్తి గౌరవాన్ని కాపాడడం కూడా లక్ష్యమే. ఆర్టికల్ 17 ద్వారా అస్పృశ్యతను నిషేధించారు. ఇది వ్యక్తి గౌరవాన్ని కాపాడేందుకు ఉద్దేశించిందే.
-అలాగే రాజ్యాంగం ఆమోదపు తేదీని కూడా ప్రవేశిక తెలుపుతుంది. నవంబర్ 26, 1949న దీనిని రాజ్యాంగ సభ ఆమోదించింది. పౌరసత్వం, తాత్కాలిక పార్లమెంట్, ఎన్నికలు వంటి కొన్ని అంశాలు తక్షణమే అమలుల్లోకి వచ్చినా, పూర్తి స్థాయి రాజ్యాంగం మాత్రం జనవరి 26, 1950 నుంచి అమలు అయింది.
-నిర్ణీత కాలానికి, రాజ్యాధినేత ఎన్నికైతే వాటిని గణతంత్ర రాజ్యాలు అంటారు. 1950, జనవరి 26వ తేదీన భారత్ గణతంత్ర రాజ్యంగ అవతరించింది
ఆబ్జెక్టివ్ ప్రశ్నలు
1. ప్రవేశికలో కింది వాటిలో కనిపించనిది ఏది?
ఎ) సాంఘిక న్యాయం బి) ఆరాధనలో స్వేచ్ఛ సి) హోదాలో సమానత్వం డి) సంక్షేమ రాజ్యం
2. కింది వానిలో సరైన వాక్యాలను గుర్తించండి.
1) భారత రాజ్యాంగ అధికారానికి మూలం ప్రవేశిక
2) భారత రాజ్య స్వభావాన్ని తెలుసుకోవచ్చు 3) సాంఘిక, రాజకీయ లక్ష్యాలను ఇది తెలియజేస్తుంది
ఎ) 1,2 బి) 2,3 సి) 1,3 డి) 1,2,3
3. ఇప్పటివరకు ప్రవేశికను ఎన్నిసార్లు సవరించారు?
ఎ) రెండుసార్లు బి) మూడుసార్లు
సి) ఒక్కసారి డి) సవరించలేదు
4. కింది వానిలో భిన్నమైన దానిని గుర్తించండి?
ఎ) సౌభ్రాతృత్వం బి) లౌకిక రాజ్యం
సి) సామ్యవాదం డి) సమైక్యత
5. కింద పేర్కొన్న ఏ కేసులో, ప్రవేశిక రాజ్యాంగంలో అంతర్భాగం కాదు అని సుప్రీంకోర్ట్టు తీర్పు చెప్పింది?
ఎ) ఎల్ఐసీ ఆఫ్ ఇండియా కేసు
బి) ఎస్ ఆర్ బొమ్మై కేసు
సి) గోలక్ నాథ్ కేసు డి) బేరుబారి కేసు
6. కింద పేర్కొన్న పదాలను, ప్రవేశికలో ఉన్న రీతిలోనే వరుస క్రమంలో అమర్చండి?
1) లౌకిక 2) సౌభ్రాతృత్వం
3) ప్రజాస్వామ్యం 4) సామ్యవాదం 5) గణతంత్రం
ఎ) 1, 2, 3, 4, 5 బి) 2, 4, 1, 5, 3
సి) 2, 4, 1, 3, 5 డి) 2, 1, 4, 3, 5
7. ప్రవేశిక రాజ్యాంగంలో అంతర్భాగమే అని తీర్పు చెప్పిన కేసు కింది వానిలో ఏది?
ఎ) కేశవానంద భారతి కేసు
బి) బెరుబరి కేసు సి) నకారా కేసు
డి) ఎక్సెల్ వేర్ కేసు
8. ప్రవేశికలో పేర్కొన్న ఒకే ఒక తేదీ ఏది?
ఎ) జనవరి 26, 1950
బి) నవంబర్ 24, 1949
సి) 1947 ఆగస్ట్ 15
డి) నవంబర్ 26, 1949
9. ప్రవేశికతో సంబంధం ఉన్న రాజ్యాంగ సవరణ ఏది?
ఎ) 44 బి) 24 సి) 42 డి) 51
10. ప్రవేశిక నుంచి ఏం తెలుసుకోగలం?
1) రాజ్య స్వభావం
2) సాధించాల్సిన లక్ష్యాలు
3) అధికారానికి మూలం
4) రాజ్యాంగ ఆమోదపు తేదీ
ఎ) 1, 2 బి) 2, 3
సి) 1, 2, 3 డి) 1, 2, 3, 4
11. సర్వసత్తాక అంటే అర్థం ఏమిటి?
ఎ) సుప్రీంకోర్టు అత్యున్నతమైంది
బి) అంతర్గత, బహిర్గత విషయాల్లో ఇతరుల జోక్యం ఉండదు
సి) అధికారిక మతం లేకపోవడం
డి) నిర్ణీత కాలానికి ఎన్నికలు జరగడం
12. ప్రతిపాదన : ప్రవేశికను పార్లమెంటు సవరించలేదు
కారణం: ప్రవేశిక రాజ్యాంగంలో అంతర్భాగం కాదు
ఎ) ప్రతిపాదన, కారణం రెండూ సరైనవే,
ప్రతిపాదనను కారణం సరిగ్గా వివరిస్తుంది
బి) ప్రతిపాదన, కారణం రెండు సరైనవే, అయితే
ప్రతిపాదనకు కారణం సరైన వివరణ కాదు
సి) ప్రతిపాదన సరైనదే, కారణం సరైనది కాదు
డి) ప్రతిపాదన, కారణం రెండూ సరికావు
13. ప్రవేశికలో లేని అంశం ఏది?
ఎ) అన్ని మతాలు సమానం
బి) సమాఖ్య
సి) రాజ్యాధినేత నిర్ణీత కాలానికి ఎన్నిక అవుతాడు డి) సామ్యవాదం
14. రాజ్యాంగం అమలులోకి వచ్చినప్పుడు ప్రవేశికలోని పదాలలో కింది వానిలో సరైనవి ఏవి?
ఎ) సర్వసత్తాక, ప్రజాస్వామ్య, గణతంత్ర
బి) సార్వభౌమ, సామ్యవాద, ప్రజాస్వామ్య, గణతంత్రం
సి) సార్వభౌమ, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్రం
డి) సార్వభౌమ, సామ్యవాద, లౌకిక, ప్రజాసామ్య, గణతంత్రం
15. లౌకిక అనే పదాన్ని 42వ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చినా, అంతకు ముందే భారత రాజ్యాంగంలో లౌకిక అంశాలు ఉన్నాయి, అవి కింద పేర్కొన్న వాటిలో ఎక్కడ కనిపిస్తాయి?
ఎ) ఆర్టికల్ 32 బి) ఆర్టికల్ 13
సి) ఆర్టికల్ 25 డి) ప్రకరణ 19
ప్రశ్నలు (ఆబ్జెక్టివ్)
1. ప్రవేశికలోని ప్రతి పదం ముఖ్యమైందే, ఆయా లక్ష్యాలను అడుగుతూ ఏ ఆర్టికల్‌లో కనిపిస్తుంది అని అడిగే అవకాశం ఉంది, ఉదాహరణకు
ప్రశ్న: ప్రవేశికలో పేర్కొన్న రాజకీయ న్యాయం కింది వానిలో ఏ ఆర్టికల్‌లో కనిపిస్తుంది? (సి)
ఎ) 320 బి) 324 సి) 326 డి)340
వివరణ: రాచరికంలో రాజ్యాధినేతను, ఇతర పాలకులను ఎన్నుకునే అవకాశం ఉండదు. కేవలం ప్రజాస్వామ్యంలోనే ఎన్నిక పద్ధతి ఉంటుంది. అలాగే భారత్‌లో 1935 వరకు కూడా పరిమిత సంఖ్యలోని ప్రజలకు ఓటుహక్కు కల్పించారు. కానీ రాజ్యాంగం సార్వత్రిక వయోజన ఓటు పద్ధతిని ఎంచుకుంది. అంటే ప్రజాస్వామ్యానికి మూలమైన ఎన్నికల్లో ప్రతి పౌరుడు పాల్గొనే హక్కును పొందాడు. అలాగే ప్రతి పౌరుడు అన్ని రకాల చట్టసభలకు ఎన్నికయ్యేందుకు అర్హుడు, ఈ విధంగా రాజకీయ న్యాయాన్ని అందించారు
2. వర్తమాన అంశాలను ప్రాతిపదికగా తీసుకొని కూడా ప్రవేశిక నుంచి ప్రశ్నలు అడిగేందుకు అవకాశం ఉంది. కేవలం బట్టీ పట్టడం వల్ల అభ్యర్థులు సమాధానం గుర్తించలేరు. ప్రవేశికలోని అంశాలపై పూర్తి పట్టు సాధిస్తేనే సమాధానం వస్తుంది. ఉదాహరణకు
ప్రశ్న: ఇటీవలి కాలంలో పలు ప్రభుత్వ రంగ సంస్థలను కేంద్రం ప్రైవేటీకరిస్తుంది, ఇది ప్రవేశికలోని ఏ అంశానికి భిన్నమైంది? (డి)
ఎ) సౌభ్రాతృత్వం బి) ప్రజాస్వామ్యం
సి) గణతంత్రం డి) సామ్యవాదం
వివరణ: ఈ ప్రశ్నకు సరైన సమాధానం సామ్యవాదం, దీని అర్థం, అసమానతలు తగ్గించడం. ఆర్థిక నిర్వహణ అంతా రాజ్యం ఆధీనంలో ఉంటే సామ్యవాద స్థాపన సాధ్యం అవుతుంది. అయితే భారతదేశంలో 1991 వరకు ఈ విధానాన్నే ఎక్కువగా అవలంభించారు. బీమా, బ్యాంకింగ్, బొగ్గుగనులు జాతీయం చేయడం తదితర విషయాల్లో సామ్యవాద భావన స్పష్టంగా కనిపిస్తుంది. అయితే 1991 నుంచి సరళకృత ఆర్థిక విధానాల ద్వారా మెల్లగా ఈ భావనకు దూరం అవుతున్నారు. ఇటీవల కాలంలో బీమా రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు కూడా అనుమతి ఇచ్చారు. అలాగే ఎయిర్ ఇండియాను టాటా సంస్థకు ఇచ్చారు. ఇవి విధాన పరమైన నిర్ణయాలు. అయితే ప్రవేశికలోని సామ్యవాద భావనకు సరికాదని చెప్పొచ్చు.
మెయిన్స్
1. ప్రవేశికను ఆధారంగా చేసుకొని ప్రభుత్వ స్వరూపాన్ని తెలియజేయండి?
2. ప్రవేశిక ప్రాధాన్యం ఏమిటి? ప్రవేశికలో పేర్కొన్న విధంగా భారత రాజ్యాంగ తాత్వికతను వివరించండి?
3. భారత లౌకికత్వాన్ని రాజ్యాంగ మూలతత్వం ఏ విధంగా పేర్కొంటుంది?
4. ప్రవేశిక భారత రాజ్యాంగంలో అంతర్భాగమా? వివరించండి.
5. రాజ్యాంగంలోని పీఠిక విశిష్టతను వివరించండి.
జవాబులు
1. (డి) 2. (బి) 3. (సి) 4. (ఎ) 5. (డి) 6. (సి) 7. (ఎ) 8. (డి) 9. (సి) 10.(డి) 11.(బి) 12. (డి) 13.(బి) 14. (ఎ) 15. (సి)
– నెహ్రూ ప్రవేశపెట్టిన లక్ష్యాలు, ఆశయాల తీర్మానంలో సౌభ్రాతృత్వం అన్న పదం లేదు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సూచన మేరకు దీనిని ప్రవేశికలో చేర్చారు.
– ప్రవేశికను ఉపోద్ఘాతం, అవతారిక, ముందుమాట, పీఠిక తదితర పదాలతో పిలుస్తారు.
– ప్రవేశికకు న్యాయ సంరక్షణ లేదు
– ప్రవేశిక అనేది రాజ్యాంగానికి గుర్తింపు పత్రం లాంటిదని ప్రముఖ న్యాయకోవిదుడు నానా ఫాల్కీ వాలా వ్యాఖ్యానించారు.
– భారత్‌లో పరోక్ష ప్రజాస్వామ్యం ఉంది. సాధారణంగా ప్రత్యక్ష ప్రజాస్వామ్యంలో ప్లెబిసైట్, రెఫరెండం, రీకాల్, ఇనిషియేటీవ్ తదితర ప్రక్రియలు కనిపిస్తాయి. ఇవి భారత్‌లో లేవు. గ్రామసభ ఒక్కటే మన దేశంలో ప్రత్యేక్ష ప్రజాస్వామ్య భావనను కలిగి ఉంది.
-ప్రవేశికలో పేర్కొన్న వ్యక్తి గౌరవం అనే లక్ష్యాన్ని ఆర్టికల్ 17, 23లు ప్రతిబింబిస్తాయి.
– సామ్యవాదం అనే భావన నాలుగో భాగంలోని ఆదేశిక సూత్రాల్లో స్పష్టంగా కనిపిస్తుంది.
-హోదా, అవకాశాల్లో సమానత్వం అనే భావన ప్రాథమిక హక్కులలోని 14, 15, 16 ప్రకరణల్లో కనిపిస్తుంది. అలాగే ఆదేశిక సూత్రాల్లో 39 ప్రకరణలో కూడా ఉంది, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని ఈ అధికరణం సూచిస్తోంది.
వివిధ కేసులు, తీర్పులు
– ప్రవేశిక రాజ్యాంగ ప్రకరణల అర్థాన్ని, పరిధిని నియంత్రణ చేస్తుందని 1950 నాటి ఏకే గోపాలన్ కేసులో సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది.
-ప్రవేశిక రాజ్యాంగంలో అంతర్భాగం కాదని 1960 నాటి బెరుబరి కేసులో తీర్పు. భారత భూభాగాన్ని పాకిస్థాన్‌కు అప్పగించడానికి సంబంధించిన అంశం ఇది.
-ప్రవేశిక రాజ్యాంగపు అంతర్భాగమే అని చారిత్రాత్మకమైన కేశవానంద భారతీ కేసులో సుప్రీంకోర్ట్టు పేర్కొంది. అలాగే మౌలిక స్వరూప సిద్ధాంతాన్ని కూడా ఇందులోనే తొలిసారిగా సుప్రీంకోర్టు ప్రస్తావించింది.
– సామ్యవాద స్ఫూర్తికి భిన్నమైన విధానాలు కొనసాగుతున్నా, ఆ పదం ప్రవేశికలో ఉండాల్సిందే అని ఎక్సెల్ వేర్ కేసు, నకారా కేసులో సుప్రీంకోర్ట్టు పేర్కొంది. అలాగే సామాజిక న్యాయం అనేది ప్రాథమిక హక్కు అని 1997 నాటి అశోక్ కుమార్ గుప్తా కేసులో సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది.
– మతాల్లోని నైతిక విలువల బోధన లౌకిక తత్వానికి వ్యతిరేకం కాదని, అలాగే ప్రతి మతంలోని ఆ విలువలను తెలుసుకొనే హక్కు విద్యార్థికి ఉంటుందని అరుణారాయ్ కేసులో సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది.
వి.రాజేంద్ర శర్మ, ఫ్యాకల్టీ
9849212411
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?