Independence movement | స్వాతంత్య్ర ఉద్యమకాలంలో సమరశీల ఉగ్రవాద ఆవిర్భావం
– 1907, డిసెంబర్లో భారత జాతీయ కాంగ్రెస్ చీలిపోయింది. దాదాపు అదే సమయంలో సమరశీల ఉగ్రవాదం బెంగాల్లో ఆవిర్భవించింది. అయితే ఈ రెండు సంఘటనలకు సంబంధం లేదని చెప్పలేం. 1907 నాటికి జాతీయవాదుల్లోని మితవాదుల చారిత్రక పాత్ర ముగిసింది. కార్యక్రమాలు ప్రారంభించిన తొలిరోజుల్లో వారు పడిన కష్టాలు, ఆ నాటి అపరిపక్వ రాజకీయ చైతన్యాన్ని పరిగణనలోకి తీసుకుంటే వారు సాధించింది ఎక్కువేనని భావించవచ్చు.
– వారి వైఫల్యాలు కూడా అనేకం. సామాన్యుల పట్ల మితవాదులకు నమ్మకం లేదు. అందువల్ల వారితో కలిసి మితవాదులు పనిచేయలేదు. అలా వారు మూలాలను కనుక్కోలేకపోయారు. ఈ విధంగా మితవాద జాతీయవాదుల ప్రచారం కూడా సామాన్యులకు అందుబాటులోకి రాలేదు. అఖిల భారత స్థాయిలో వారు ఏ ఉద్యమాలు చేపట్టలేదు.
-1905-07 మధ్యకాలంలో స్వదేశీ ఉద్యమం, బహిష్కరణల రూపంలో అఖిల భారత స్థాయిలో ఉద్యమాలు నిర్వహించాల్సి వచ్చినప్పుడు నాయకత్వం వాళ్ల చేతుల్లో లేదు (బెంగాల్లో మాత్రమే మితవాదులు క్రియాశీల పాత్ర నిర్వహించగలిగారు). పాలకులను ఒప్పించి, ఆర్థిక, రాజకీయ సంస్కరణలు ప్రవేశపెట్టించగలమనే విశ్వాసంపై వారి రాజకీయాలు ఆధారపడ్డాయి.
-అలా ఆచరణాత్మకంగా మితవాదులు సాధించింది మాత్రం చాలా స్వల్పం. బ్రిటిష్ ప్రభుత్వం వారి మితవాద ధోరణిని గౌరవించడం పోయి తృణీకార భావంతో చూసింది. వారి రాజకీయాలను అసహ్యించుకుంది. ప్రజా ఉద్యమాలను దమనకాండతో ఎదుర్కొంది. ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే మితవాదుల ప్రధాన వైఫల్యం ఘటనలకు అనుగుణంగా స్పందించకపోవడంలోనే ఉంది. జాతీయ ఉద్యమ కాలంలో నూతన స్థితితో వారు సరితూగలేకపోయారు. ఈ విషయంలో మన కండ్ల ముందే కనిపించే రుజువు వారు యువతను ఆకర్షించలేకపోవడమే.
– 1907 సంవత్సరాంతం అసహనంగా ఉన్న బెంగాల్ యువత వ్యక్తిగత వీరత్వ పథంలో పయనిస్తూ సమరశీల ఉగ్రవాదం వైపునకు మళ్లారు. వారికి దేశభక్తిని చాటుకునేందుకు మరోదారి కనిపించకపోవడంతో వారిలా చేయాల్సి వచ్చింది. బ్రిటిష్ అధికారుల దౌర్జన్యం, అణచివేత కార్యకలాపాల వల్ల, మితవాదుల యాచక ప్రవృత్తి వల్ల కోపోద్రిక్తులైన యువత బాంటు రాజకీయాల వైపునకు ఆకర్షితులయ్యారని చెప్పవచ్చు.
సమరశీల ఉగ్రవాద కార్యక్రమాల ప్రారంభం
– 1904లో వీడీ సావర్కర్ ‘అభినవ భారత్’ అనే రహస్య విప్లవకారుల సంఘాన్ని స్థాపించాడు. 1905 తరువాత చాలా వార్తాపత్రికలు బాహాటంగా సమరశీల ఉగ్రవాదాన్ని సమర్థించాయి. 1908, ఏప్రిల్‌లో ప్రఫుల్ల చాకీ, ఖుదీరామ్ బోస్‌లు ముజఫర్ జడ్జి కింగ్స్‌ఫోర్డ్ ప్రయాణిస్తున్న వాహనంగా భావించి దానిపై బాంబు విసిరితే ఇద్దరు ఇతర ఆంగ్లేయులు మరణించారు. తరువాత ప్రఫుల్ల చాకీ తనను తానే కాల్చుకుని మరణించాడు. ఖుదీరామ్ బోస్‌ను ఉరితీశారు. ఇతడి మరణం వేలాది మందిని కన్నీరు పెట్టించింది.
-ఖుదీరామ్ బోస్, ప్రఫుల్ల చాకీలు జాతీయవాద నాయకుల సరసన చేరి ప్రజాభిమానాన్ని చూరగొన్నారు. దేశమంతా వారిపై రచించిన జానపద గేయాలు గానం చేశారు. ఆనాటి సమరశీల ఉగ్రవాద చర్యలన్నింటిలోకి అత్యద్భుతమైన రెండు ఘటనలు ఏమిటంటే.. ఒకటి ప్రభుత్వ ఊరేగింపులో ఏనుగుపై కూర్చున్న వైస్రాయ్ లార్డ్ హార్డింజ్‌పై రాస్ బిహారీ బోస్, సచిన్ సన్యాల్‌లు చేసిన హత్యాయత్నం. వారు విసిరిన బాంబు వైస్రాయ్‌ని గాయపరిచిందే కానీ చంపలేకపోయింది. రెండోది లండన్‌లో మదన్‌లాల్ ధింగ్రా ఆధ్వర్యంలో కర్జన్ వైలీ హత్య.
-1908-18 మధ్యకాలంలో 186 మంది విప్లకారుల్ని బ్రిటిష్ ప్రభుత్వం చంపడం కాని, శిక్షించడం కాని జరిగింది. సమరశీల ఉగ్రవాదులు విదేశాల్లో కూడా స్థావరాలను ఏర్పాటు చేసుకున్నారు. వారిలో ప్రముఖులు లండన్‌లో శ్యామ్ జీ కృష్ణవర్మ, వీడీ సావర్కర్, హరదయాళ్, ఐరోపాలో మేడం కామా, అజిత్ సింగ్.
– 1904 నుంచి ఉత్తర అమెరికాలోని పశ్చిమ తీరం క్రమంగా పెరుగుతున్న ప్రవాస పంజాబీలకు ఆవాసమైంది. ఆతిథ్య దేశాల్లో వివక్ష విధానాలు త్వరితగతిన దేశంలోని జాతీయవాదుల్లో ఆకస్మిక రాజకీయ చైతన్యాన్ని రగిల్చింది. 1907 నాటికే పశ్చిమ తీరంలోని ‘రామనాథపురి’ అనే రాజకీయ దేశ బహిష్కృతుడు స్వేచ్ఛపై ఒక కరపత్రాన్ని విడుదల చేసి స్వదేశీ ఉద్యమానికి మద్దతు ప్రకటించాడు.
-తారకానాథ్ దాస్ వాంకోవర్‌లో ‘ఫ్రీ హిందుస్థాన్’ అనే పత్రికను ప్రారంభించి సమరశీల జాతీయవాద భావనలతో నడిపాడు. లండన్‌లోని ‘ఇండియా హౌస్’ లాగా వాంకోవర్‌లో ‘స్వదేశ్ సేవక్ హోమ్’ను జీడీ కుమార్ నిర్వహించాడు. స్వదేశ సేవక్ అనే గురుముఖి పత్రికను ప్రారంభించి సాంఘిక సంస్కరణలు ప్రతిపాదించడమే గాక భారత సైనికుల్ని బ్రిటిష్ ప్రభుత్వం పైకి ఎదురుదాడికి దిగమని కోరేవాడు.
l 1910లో తారకానాథ్ దాస్, జీడీ కుమార్ సియాటెల్‌లో ‘యునైటెడ్ ఇండియా హౌస్’ను స్థాపించారు. వీటివల్ల కెనడా, యూఎస్ఏలలో కొనసాగించిన నిరంతర పోరాట ఫలితంగా అక్కడకు వలస వెళ్లిన భారతీయుల్లో జాతీయ స్పృహ, ఐక్యతా భావన నెలకొంది. హాంకాంగ్, మలయాలలో…. గతంలో పనిచేసిన సిక్కుల పూజారి భగవాన్ సింగ్ 1913 ప్రారంభంలో వాంకోవర్‌ను సందర్శించడంతో విప్లవోద్యమం తొలి ఊపందుకుందని చెప్పవచ్చు. హింసాత్మక మార్గాల ద్వారా బ్రిటిష్ ప్రభుత్వాన్ని కూలదోయాల్సి ఉందని ఆయన బాహాటంగానే బోధించి వందేమాతరాన్ని విప్లవ వందనంగా స్వీకరించమన్నాడు. మూడు నెలల వ్యవధిలోనే భగవాన్ సింగ్‌ను కెనడా నుంచి బహిష్కరించారు. వెంటనే విప్లవ కార్యకలాపాల కేంద్రం అమెరికా సంయుక్త రాష్ట్రాలకు తరలివెళ్లింది. అక్కడి రాజకీయ వాతావరణంలో స్వేచ్ఛ కొంత మెరుగు. భారత దేశం నుంచి రాజకీయ పరమైన దేశ బహిష్కృతుడు లాలా హరదయాళ్ కీలక పాత్ర పోషించాల్సి వచ్చింది.
l 1911, ఏప్రిల్‌లో కాలిఫోర్నియా చేరిన హరదయాళ్ కొద్దికాలం స్టాన్‌ఫర్డ్ యూనివర్సిటీలో బోధనా వృత్తిని స్వీకరించి వెంటనే రాజకీయ కార్యకలాపాల్లో మునిగిపోయాడు. ఈలోగా అమెరికాలోని పశ్చిమ తీరంలో ఆవాసం ఏర్పర్చుకున్న భారతీయులు ఓ నాయకుడి కోసం అన్వేషణలో ఉన్నారు. 1907లో పంజాబ్ తిరుగుబాటులో పేరొందిన అజిత్ సింగ్‌ను ఆహ్వానించాలనుకున్నారు. హరదయాళ్ అక్కడే ఉండటం, 1912, డిసెంబర్ తరువాత రాజకీయాల్లో క్రియాశీల పాత్ర నిర్వహించడంతో నాయకుడి కోసం వెతకాల్సిన పనిలేకుండాపోయింది.
l 1913, మే నెలలో ఫోర్ట్లాండ్లో హిందీ సంఘాన్ని స్థాపించారు. కాన్షీరామ్ నివాసంలో నిర్వహించిన ఆ సంఘం ప్రారంభ సమావేశాన్ని మిగతావాళ్లతో పాటు భాయ్ పరమానంద, సోహాన్ సింగ్ భక్నా, హర్నామ్ సింగ్ తుందీలత్ మొదలైన వారు హాజరయ్యారు. ఆ సమావేశంలోనే హరదయాళ్ తన కార్యనిర్వాహక ప్రణాళికను ఈ విధంగా వివరించాడు. పోరాటం అమెరికన్లపై కాదు, అమెరికాలో లభించే స్వేచ్ఛను సద్వినియోగం చేసుకుంటూ బ్రిటిష్ ప్రభుత్వంపై పోరాడాలి. మీరు మీ దేశంలో స్వాతంత్య్రాన్ని సంపాదించనంత కాలం అమెరికా వాసులు మిమ్మల్ని వాళ్లతో సమానంగా చూడరు. భారత దేశంలో బీదరికానికి, ప్రజల ందాతనం తగ్గడానికి మూల కారణం బ్రిటిష్ పాలనే. కాబట్టి దాన్ని అర్జీలతో కాక సమరశీల సాయుధ పోరాటంతో పడగొట్టాలి. ఈ సందేశాన్ని ప్రజలకు, భారతీయ సైన్యంలోని సిపాయిలకు అందించండి. పెద్ద సంఖ్యలో భారతదేశానికి తరలివెళ్లండి. వాళ్లందరి మద్దతును కూడగట్టండి. హరదయాళ్ ఆలోచనలు అప్పటికప్పుడే అందరికి ఆమోదయోగ్యమై ‘ది గదర్’ అనే వారపత్రికను స్థాపించి, శాన్ఫ్రాన్సిస్కోలో ‘యుగాంతర్ ఆశ్రమ్’ పేరుతో కేంద్ర కార్యస్థానాన్ని ఏర్పాటు చేశారు.
l 1913, నవంబర్ 1న ఉర్దూలో గదర్ తొలి సంచిక విడుదలయ్యింది. పత్రిక పేరు చూడగానే దాని లక్ష్యమేంటో ఇట్టే తెలిసిపోతుంది. గదర్ అంటే తిరుగుబాటు. తొలి పేజీపైనే కనిపించే ‘బ్రిటిష్ పాలనకు శత్రువు’ అనే ప్రకటనలు కనిపించేవి. ఆ పత్రిక ప్రతి సంచిక పై పుటలోనే ‘అంగ్రేజీరాజ్ కా కచ్చా చిఠా’ అంటూ బ్రిటిష్ పాలన దుష్ప్రభావాలను ఓ పద్నాలుగింటిని ఏకరువు పెట్టడం జరిగింది. వాటిలో భారత దేశ సంపద కొల్లగొట్టడం, భారతీయుల స్వల్ప తలసరి ఆదాయం, అధిక శిస్తుల భారం, వైద్యంపై అత్యల్పంగా ఖర్చు చేస్తూ సైన్యంపై అత్యధికంగా వెచ్చించడం, భారతీయ కళలు, పరిశ్రమల విధ్వంసం, లక్షలాది మందిని పొట్టన బెట్టుకునే కరువు, ప్లేగు వంటివి మళ్లీ మళ్లీ రావడం, భారత దేశంలో పన్నులు చెల్లించేవాళ్ల డబ్బులు పట్టుకపోయి అఫ్గానిస్థాన్, బర్మా, ఈజిప్ట్, పర్షియా, చైనాలలో యుద్ధాలపై వెచ్చించడం వంటివి ఉండేవి. ఒక్క ముక్కలో చెప్పాలంటే బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా భారత జాతీయ ఉద్యమం రూపొందించిన విమర్శనంతటినీ సంగ్రహంగా వారం వారం గదర్ పత్రిక చదివే వాళ్లకు అందించడం జరిగింది. జాబితాలోని చివరి రెండు విషయాలు పరిష్కారాన్ని సూచించేవిగా ఉన్నాయి. భారతదేశపు స్వతంత్ర రాజ్యాల్లోని భారతీయుల జనాభా 7 కోట్లు, బ్రిటిష్ పాలనలోని భారతీయుల సంఖ్య 24కోట్లు, ఆంగ్లేయులైన అధికారులు గాని, సైనికులు గాని 79,614 మంది. స్వచ్ఛంద సేవకులు 38,948. 1857 తరువాత 56 ఏండ్లు గడిచాయి. ఇప్పుడు వెంటనే ఇంకో తిరుగుబాటు జరగాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
మాదిరి ప్రశ్నలు
1. 1907 డిసెంబర్లో ఎక్కడ జరిగిన భారతీయ జాతీయ కాంగ్రెస్ సమావేశంలో మితవాదులు, అతివాదులు చీలిపోయారు?
1) లక్నో 2) సూరత్
3) కాన్పూర్ 4) ఢిల్లీ
2. ‘సూక్ష్మ దర్శిని’తో చూస్తేగాని కనిపించని మైనారిటీ మేధావి వర్గానికి చెందినదని’ భారత జాతీయ కాంగ్రెస్‌ను గేలి చేసిన వైస్రాయ్?
1) డఫ్రిన్ 2) కర్జన్
3) మింటో 4) హార్డింజ్
3. భారత జాతీయ కాంగ్రెస్ చీలికను ఘోర విపత్తుగా పేర్కొన్నది?
1) గాంధీ 2) నెహ్రూ
3) తిలక్ 4) లాలా లజపతిరాయ్
4. 1904లో ‘అభినవ భారత్’ అనే రహస్య విప్లవకారుల సంఘాన్ని స్థాపించింది?
1) వీడీ సావర్కర్
2) సుభాష్ చంద్రబోస్
3) సచిన్ సన్యాల్
4) అరబిందో ఘోష్
5. లార్డ్ హార్డింజ్ పై హత్యాయత్నం చేసిన విప్లవకారుల జంట?
1) సచిన్ సన్యాల్-లాలా హరదయాళ్
2) సచిన్ సన్యాల్-రాస్బిహారీ బోస్
3) భూపేంద్ర నాథ్-జోగేంద్ర ఛటర్జీ
4) వీడీ సావర్కర్-గణేశ్ సావర్కర్
6. కింది వాటిలో సరైనవి?
1) తారకానాథ్ దాస్ వాంకోవర్‌లో ‘ఫ్రీ హిందుస్థాన్’ అనే పత్రికను ప్రారంభించాడు
2) వాంకోవర్‌లో ‘స్వదేశ్ సేవక్ హోమ్’ను జీడీ కుమార్ నిర్వహించాడు
3) తారకానాథ్ దాస్, జీడీ కుమార్‌లు సియాటెల్‌లో ‘యునైటెడ్ ఇండియా హౌస్’ను స్థాపించారు
4) పైవన్నీ సరైనవే
7. ‘యుగాంతర్ ఆశ్రమ్’ను ఎక్కడ స్థాపించారు?
1) కాలిఫోర్నియా
2) శాన్ఫ్రాన్సిస్కో
3) వాంకోవర్ 4) లండన్
జవాబులు
1-2, 2-1, 3-3, 4-1, 5-2, 6-4, 7-2.
సాసాల మల్లిఖార్జున్
అసిస్టెంట్ ప్రొఫెసర్
ప్రభుత్వ డిగ్రీ కాలేజీ , కోరట్ల
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?