The arrival of the English | ఆంగ్లేయుల ఆగమనం
క్రీ.శ. 1720లో లెనాయిర్ పుదుచ్చేరి గవర్నర్‌గా వచ్చిన తర్వాత ఫ్రెంచ్‌వారి బలం తిరిగి పుంజుకుంది. ఈ కాలంలో ఫ్రెంచివారు 1721లో మారిషస్‌ను ఆక్రమించారు. మలబార్ కోస్తాలో ఉన్న మహేను 1725లో, కరైకల్‌ను 1739లో స్వాధీనపర్చుకున్నారు. వీటితోపాటు యానాం కూడా ఫ్రెంచివారికి దక్కింది. మొత్తం మీద లెనాయిర్ పుదుచ్చేరిని పటిష్టపరిచి, ఫ్రెంచి వలసలను విస్తరించి, పలు ప్రాంతాలను సుందరంగా తీర్చిదిద్దాడు. లెనాయిర్ అనంతరం డ్యూమా గవర్నర్ అయ్యాడు. ఇతడు దూరదృష్టి కలిగినవాడు. కర్ణాటక నవాబుతో స్నేహం చేసి రూపాయి నాణేలు తయారుచేసే అధికారం పొందాడు. తంజావూరు పాలకుడు అయిన సాహూజీకి సహాయం అందించి అతడి వద్ద నుంచి కరైకల్ (1739) పొందాడు. మొఘలాయి చక్రవర్తి డ్యూమాను 4,500 అశ్వికదళ సైనికులకు మన్సబ్దారుగా నియమించాడు. డ్యూమా పదవీ విరమణ చేసే సమయానికి ఫ్రెంచ్‌వారి వ్యాపారం ఉచ్ఛస్థితిలో ఉంది. 1742లో డ్యూమా తర్వాత డూప్లే గవర్నర్ అయ్యాడు. ఇతని కాలంలోనే కర్ణాటక యుద్ధాలు జరిగాయి. ఈ యుద్ధాల్లో ఓడిన ఫ్రెంచివారు క్రమంగా భారతదేశం నుంచి నిష్క్రమించారు. దీంతో భారతదేశంలో ఆంగ్లేయుల ఆగమనం ఆరంభమైంది.
దక్షిణ భారతదేశంలో ఫ్రెంచి-ఇంగ్లిష్ యుద్ధాలు
భారతదేశంలో భూభాగాలు జయించి రాజకీయాధిపత్యం సాధించడానికి ఇంగ్లిష్ తూర్పు ఇండియా కంపెనీ రూపొందించిన పథకాలు 17వ శతాబ్దం చివరలో ఔరంగజేబు దెబ్బకి తుత్తునియలయ్యాయి. మొఘల్ సామ్రాజ్య పతనంతో 1740 ప్రాంతంలో ఆ పథకాలు తిరిగి ప్రాణం పోసుకున్నాయి. నాదిర్షా దండయాత్ర మొఘల్ సామ్రాజ్య పతనస్థితిని బట్టబయలు చేసింది. భారత పశ్చిమ ప్రాంతంలో మరాఠాలు విజృంభించడంతో అక్కడికి విదేశీయులు చొచ్చుకొని పోవడానికి పెద్దగా అవకాశం కనిపించలేదు. బెంగాళ్లో అలీవర్దీఖాన్ ఇంగ్లిష్వాళ్లనీ కఠినమైన కట్టడిలో ఉంచాడు. దక్షిణ భారతదేశంలో పరిస్థితులు క్రమేణా విదేశీయులకు అనుకూలంగా పరిణమించాయి. ఔరంగజేబు మరణంతో కేంద్ర ప్రభుత్వాధికారం దక్షిణాదిన అంతరించిపోయింది. 1748లో నిజాం-ఉల్-ముల్క్ అసఫ్ జా మరణించడంతో నిజాం ఆధిక్యత కూడా నశించిపోయింది. మహారాష్ర్టులు హైదరాబాద్, మిగతా దక్షిణ ప్రాంతాలపై నిత్యం దాడులు చేస్తూ పన్నులు వసూలు చేసేవారు. ఈ దాడుల వల్ల రాజకీయంగా అస్థిర పరిస్థితులు చోటుచేసుకున్నాయి. పరిపాలనా వ్యవస్థ విచ్ఛిన్నమైంది. అధికారం కోసం సాగే అన్నదమ్ములు, దాయాదుల వారసత్వ యుద్ధాల్లో కర్ణాటక అట్టుడికింది. వీదేశియులు తమ రాజకీయ పలుకుబడిని విస్తరింపజేసుకోవడానికి దక్షిణ భారత సంస్థానాల వ్యవహారాల్లో పెత్తనం చేయడానికి ఈ పరిస్థితులు మహదావకాశం కల్పించాయి.
ఈ క్రమంలో 1744 నుంచి 1763 దాకా దాదాపు ఇరవై ఏండ్ల్లు భారత వ్యాపారం, సంపద, భూభాగాల మీద ఆధిపత్యం కోసం ఫ్రెంచి-ఇంగ్లిష్ వాళ్ల మధ్య భీకర యుద్ధాలు సాగాయి. 1742లో యూరప్‌లో ఇంగ్లండ్, ఫ్రాన్స్‌ల మధ్య యుద్ధం సంభవించింది. అమెరికాలో వలసల గురించి తలెత్తిన శత్రుత్వం ఆ యుద్ధానికి ప్రధాన కారణం. మొఘల్ సామ్రాజ్యం విచ్ఛిన్నమైపోతుందన్న స్పృహ ఉభయ శిబిరాల్లో కలగడంతో ఆ స్పర్థ భారతదేశంలో కూడా తీవ్రతరమైంది. యూరప్‌లో తలెత్తిన ఈ ఘర్షణను అవకాశంగా తీసుకొని భారతదేశంలోని ఫ్రెంచి-ఇంగ్లిష్ కంపెనీలు భారతదేశంలో లోగడ కన్నా వ్యాపారంలో భూభాగ ఆక్రమణలో ఇంకా విపరీతంగా కొట్టేయవచ్చని కయ్యానికి కాలుదువ్వాయి. దాదాపు 20 ఏండ్ల పాటు ఫ్రెంచ్-ఆంగ్లేయ యుద్ధాలు జరిగాయి.
ఈ యుద్ధాలే చరిత్రలో కర్ణాటక యుద్ధాలుగా ప్రసిద్ధిగాంచాయి. కర్ణాటక యుద్ధాలు మూడు జరిగాయి. వాటిలో మొదటిది, మూడోది ఇంగ్లడ్-ఫ్రాన్స్ దేశాలు యూరప్‌లో జరిగిన ఆస్ట్రియా వారసత్వ యుద్ధం, సప్తవర్ష సంగ్రామంలో ఇరుపక్షాలుగా పాల్గొన్న కారణంగా సంభవించాయి. రెండో కర్ణాటక యుద్ధం మాత్రం స్థానిక రాజ్యమైన ఆర్కాట్ ఆంతరంగిక విషయాల్లో జోక్యం చేసుకోవడంతో జరిగింది.
మొదటి కర్ణాటక యుద్ధం (1744-48)
1740లో ఫ్రాన్స్, ఇంగ్లండ్‌లు ఐరోపాలో ఆస్ట్రియా వారసత్వ యుద్ధంలో పాల్గొనడంవల్ల వారి కంపెనీలకు చెందిన సైనికులు భారతదేశంలో యుద్ధానికి దిగారు. ఈ సందర్భంగా బ్రిటిష్ నౌకాదళాన్ని భారతదేశానికి పంపారు. ఈ నౌకాదళం భారత ఈశాన్యతీరంలోని ఫ్రెంచ్ నౌకల్ని పట్టుకొని పాండిచ్చేరిని ముట్టడించింది. ఆ సమయంలో యుద్ధానికి సిద్ధంగా లేని ఫ్రెంచ్ గవర్నర్ డూప్లే ఆర్కాట్ నవాబైన అన్వరుద్దీన్ వద్దకు వెళ్లి బ్రిటిష్‌వారిని హెచ్చరించాల్సిందిగా కోరాడు. దీంతో అన్వరుద్దీన్ బ్రిటిష్‌వారిని కొత్త నౌకాదళాన్ని తిప్పి పంపమని ఆదేశించాడు.
కానీ డూప్లే ఆపద తొలగిన తర్వాత బ్రిటిష్‌వారిని దెబ్బ తీయడానికి రహస్యంగా మారిషస్ దీవుల్లో ఫ్రెంచి గవర్నర్ అయిన మహిడాలాబోర్డ్ను ఆహ్వానించాడు. 1746లో మద్రాస్‌ను ముట్టడించారు. దీంతో ఇంగ్లిష్‌వాళ్లు కర్ణాటక నవాబు అయిన అన్వరుద్దీన్‌ను సహాయం అర్థించారు. అయితే ఆనాడు మద్రాస్ కర్ణాటక నవాబు అధికార పరిధిలో ఉండేది. ఆ ప్రాంతాల మీద తనదే పెత్తనం అని విదేశీ వర్తకులకు కనువిప్పు కలిగిద్దామనే ఉద్దేశంతో కర్ణాటక నవాబు ఫ్రెంచ్-ఇంగ్లిష్ సంఘర్షణలో తలదూర్చడానికి అంగీకరించారు. తన భూభాగంలో ఫ్రెంచి-ఇంగ్లిష్ సేనల యుద్ధాన్ని ఆపడానికి నవాబు తన సైన్యాన్ని పంపాడు. నవాబు పదివేల మహాసైన్యం చిన్నదైన ఫ్రెంచి సైన్యం మీద విరుచుకుపడింది. ఫ్రెంచి సైన్యంలో 230 మంది యూరోపియన్ సైనికులు, పాశ్చాత్య యుద్ధ పద్ధతుల్లో శిక్షితులైన 700 మంది భారత సైనికులు మాత్రమే ఉన్నారు.
కానీ నవాబు భారీసైన్యం చిత్తుగా ఓడిపోయింది. భారత సైన్యాల మీద పాశ్చాత్య సైన్యాల ఆధిక్యత ఈ యుద్ధంలో స్పష్టంగా బయటపడింది. నిర్మాణంలో, సాధనాసంపత్తిలో పాశ్చాత్య సేనలు ఎంతో మెరుగ్గా ఉన్నాయి. భారతీయుల ఈటెలు పాశ్చాత్యుల తూటాల ముందు తేలిపోయాయి. భారత అశ్వికాదళం పాశ్చాత్య శతఘ్నిదళం ముందు వెలవెలపోయింది. క్రమశిక్షణ, నిర్వహణ పాటవం లోపించిన భారత సైన్యాలు ఉత్తమ క్రమశిక్షణాయుతమైన స్వల్ప పాశ్చాత్య సైన్యానికి నిలబడలేకపోయాయి. 1748లో ఆస్ట్రియా వారసత్వ యుద్ధం ఎక్స్-లా-షాపేల్ సంధితో ముగిసింది. ఆ సంధి షరతుల ప్రకారం ఫ్రెంచి మద్రాస్‌ను తిరిగి బ్రిటిష్ కంపెనీకి అప్పగించింది.
ఈ యుద్ధంలో సాధించిన విజయం వల్ల భారతదేశంలో చిన్నచిన్న రాజ్యాల మధ్య రగులుకొంటున్న యుద్ధాల్లో ఆధునిక ఫ్రెంచిసైన్యం జోక్యం కల్పించుకోవడానికి అనువైన వ్యూహాన్ని డూప్లే రూపొందించాడు. ఒకరికి వ్యతిరేకంగా ఇంకొకరిని భుజాన వేసుకొని విజేతల దగ్గర డబ్బు, వ్యాపార రాయితీలు, భూభాగం గుంజుకునే ఉపాయం తయారుచేసి పెట్టుకున్నాడు. ఆ ప్రకారం స్థానిక రాజుల, నవాబుల, నాయకుల వనరులను, సైన్యాల్ని ఫ్రెంచి కంపెనీ ప్రయోజనాలకనుగుణంగా ఉపయోగించుకొని, చివరికి ఇంగ్లిష్వాళ్లని ఇంటిదారి పట్టించడానికి ఎత్తుగడలు సిద్ధం చేసుకున్నాడు. అయితే విదేశీ జోక్యాన్ని స్వదేశీ రాజులు నిరాకరిస్తే, డూప్లే వ్యూహానికి పురిట్లోనే దెబ్బపడేది. కానీ స్వదేశీ రాజులకు సంకుచితమైన వ్యక్తిగత దురాశ, స్వలాభాపేక్ష తప్ప దేశభక్తి శూన్యం, తమ ఆంతరంగిక సంఘర్షణల్లో అమీతుమీ తేల్చుకోవడానికి విదేశీయుల సహాయాన్ని స్వీకరించటంలో వాళ్లు కొంచెమైనా తటపటాయించలేదు.
రెండో కర్ణాటక యుద్ధం (1749-54)
డూప్లే కుతంత్రపు తెలివితేటలకు పూర్తి అవకాశం ఇచ్చిన సందర్భం ఒకటి 1748లో కలిసి వచ్చింది. కర్ణాటకలో నవాబు అన్వరుద్దీన్‌కు వ్యతిరేకంగా చందాసాహెబ్ కుట్ర ప్రారంభించాడు. హైదరాబాద్‌లో నిజాం-ఉల్-ముల్క్ మరణంతో ఆయన కుమారుడు నాజర్‌జంగ్‌కు, మనుమడు ముజఫర్ జంగ్కు మధ్య అంతర్యుద్ధం చెలరేగింది. డూప్లే ఈ అవకాశాన్ని వినియోగించుకొని చందాసాహెబ్తోనూ, ముజఫర్జంగ్తోనూ రహస్యంగా సంధి చేసుకున్నాడు. సుశిక్షతులైన తన ఫ్రెంచి, భారతీయ సైనికులను వాళ్లకు అనుకూలంగా మోహరింపజేస్తానని హామీ ఇచ్చాడు.
1749లో ఈ ముగ్గురు కలిసి అంబూరు యుద్ధంలో నవాబు అన్వరుద్దీన్‌ను ఓడించి చంపారు. నవాబు కుమారుడు మహ్మద్ అలీ, తిరుచానపల్లి పారిపోయాడు. డూప్లే చందాసాహెబ్‌ను కర్ణాటక నవాబుగా చేశాడు. చందాసాహెబ్ ఫ్రెంచ్ సహాయానికి కృతజ్ఞతగా పాండిచ్చేరి చుట్టూ ఉన్న 80 గ్రామాలను ఫ్రెంచి తూర్పు ఇండియా కంపెనీకి ఇచ్చాడు. హైదరాబాద్‌లో కూడా ఫ్రెంచివాళ్లకు లాభం జరిగింది. ఇంగ్లిష్‌వారు ఫ్రెంచి అధికార వ్యాప్తిని నిరోధించడానికి హైదరాబాద్‌లో నాసిర్జంగ్కు, ఆర్కాట్లో అన్వరుద్దీన్ కుమారుడు మహ్మద్‌అలీకి సహాయం చేయడానికి వారిని నవాబులుగా చేయడానికి పూనుకున్నారు. కానీ 1750లో నాసిర్జంగ్ యుద్ధంలో మరణించాడు. నిజాం మనుమడు ముజఫర్‌జంగ్ నవాబు అయ్యాడు. 1751లో డూప్లే సూచనతో ముజఫర్‌జంగ్ జనరల్ బుస్సీ నాయకత్వంలో కొంత ఫ్రెంచి సైన్యం తోడుగా పాండిచ్చేరి నుంచి హైదరాబాద్‌కు బయలుదేరాడు.
రెండు నెలల ప్రయాణం తర్వాత కడప సమీపంలోని లక్కిరెడ్డిపల్లె కనుమదాటే సమయంలో ముజఫర్ జంగ్ హత్యకు గురయ్యాడు. తన పక్షంలోని కడప, కర్నూలు, సవనూరు నవాబుల కుట్ర ఫలితంగా ఇతడు మరణించాడు. దీంతో హైదరాబాద్‌లోని నాసిర్జంగ్ తమ్ముడైన సలాబత్‌జంగ్ నిజాం నవాబు అయ్యాడు. అతనికి సహాయంగా బుస్సీ తన సైన్యంతో హైదరాబాద్‌లో ఉన్నాడు. సలాబత్ జంగ్ ప్రతిఫలంగా ఉత్తర సర్కార్లు, గంజాం, విశాఖపట్నం, గోదావరి, కృష్ణా జిల్లాలను ఫ్రెంచి కంపెనీకి ఇచ్చాడు.
ఈ విధంగా ఫ్రెంచివారి పలుకుబడి కర్ణాటకలోను, హైదరాబాద్‌లోను పెరిగింది. అయితే తమ ప్రత్యర్థుల విజయ పరంపరని ఇంగ్లిష్‌వాళ్లు మౌనంగా చూస్తూ మిన్నకుండిపోలేదు. ఫ్రెంచి పలుకుబడిని దెబ్బతీసి తమ ప్రతిష్టను పెంచుకోవటం కోసం ఇంగ్లిష్‌వాళ్లు నాజర్జంగ్తోను, మహ్మద్ అలీతోనూ రహస్య మంతనాలు జరిపారు. 1750లో తమ యావత్శక్తిని, బలాన్ని మహ్మద్‌అలీ వెనుక మోహరించారు. కంపెనీలో గుమస్తాగా పనిచేసే రాబర్ట్ైక్లెవ్ అనే యువకుడు ఆ యుద్ధంలో ఒక అద్భుతమైన సూచన ప్రతిపాదించాడు. తిరుచానపల్లిలో మహ్మద్అలీపైన మోహరించిన ఫ్రెంచి బలాల ఒత్తిడిని మరోవైపు మళ్లించడానికి కర్ణాటక రాజధాని ఆర్కాట్ని ముట్టడించాలని ైక్లెవ్ ప్రతిపాదించాడు. ైక్లెవ్ చేసిన ఈ ప్రతిపాదనను కంపెనీ అధికారులు ఒప్పుకున్నారు. రాబర్ట్ ైక్లెవ్ స్వయంగా సేనల్ని నడిపి ఆర్కాట్ని ముట్టడించి ఆక్రమించాడు. అతని సైన్యం అంతా కలిపి కేవలం 200 మంది ఇంగ్లిష్ సైనికులు, 300 మంది ఇండియన్ సైనికులు అనుకున్నట్లుగానే చందాసాహెబ్ అతని ఫ్రెంచ్ మిత్రులు తిరుచానపల్లి మీద తమ ఒత్తిడి సడలించారు. ఫ్రెంచి సేనలు ఆ యుద్ధంలో చిత్తుగా ఓడిపోయాయి. చందా సాహెబ్ పట్టుబడి వధించబడ్డాడు. ఫ్రెంచి బలం అధమస్థాయికి దిగిపోయింది. ఇంగ్లిష్ సేనాపతుల ముందు, సేనల ముందు ఫ్రెంచి సేనలు, సేనాపతులు పనికిరారని తేలిపోయింది. పడిపోయిన ఫ్రెంచి స్థాయిని పెంచడానికి డూప్లే నానా ప్రయాసపడ్డాడు. కానీ ఫ్రెంచి ప్రభుత్వంగానీ, ఫ్రెంచి కంపెనీ ఉన్నతాధికారులుగానీ డూప్లే ప్రయత్నాలకు రవ్వంత మద్దతు ఇవ్వలేదు. పైపెచ్చు ఫ్రెంచి ఉన్నతాధికారులు సైనిక, నౌకాబలాల అధిపతులు అస్తమానం కీచులాడుకున్నారు. భారతదేశంలో జరిగిన యుద్ధాల్లో అయిన ఖర్చుకి విసిగివేసారిపోయిన ఫ్రెంచి ప్రభుత్వం అమెరికాలోని వలసలు కూడా తుడిచిపెట్టుకుపోతాయనే భీతితో చివరికి శాంతి సంప్రదింపులకు దిగింది. ఇండియా నుంచి డూప్లేని ఇంటికి పంపించాలని ఇంగ్లిష్‌వాళ్లు విధించిన షరతును ఫ్రెంచి ప్రభుత్వం 1754లో ఒప్పుకుంది. ఇది భారతదేశంలో ఫ్రెంచి కంపెనీ భాగ్యదశని పెద్ద దెబ్బతీసింది.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?