Telugu in competitive examinations | పోటీ పరీక్షల్లో తెలుగు
ఏ మనిషికైనా సుఖవంతమైన, సంతృప్తికరమైన జీవితానికి ఉపాధి తప్పకుండా అవసరం. నేటి పోటీ ప్రపంచంలో ఉపాధి అవకాశాలను అందుకునేందుకు భాషా నైపుణ్యాలు తప్పకుండా దోహదపడతాయి. ప్రభుత్వ ఉద్యోగాల్లో తెలుగుకు ఉన్న అవకాశాలు తగ్గిపోతున్నాయనే చెప్పాలి. ప్రపంచీకరణ ప్రభావం, ఆంగ్లభాషా వ్యామోహంలో తెలుగు భాషా సాహిత్యాలను కెరీర్‌గా ఎంచుకొని అధ్యయనం చేసేవారి సంఖ్య తగ్గుతుంది. ఈ సందర్భంలో తెలుగు భాషా సాహిత్యాలు కెరీర్‌గా ఎంచుకుంటే ఉండే ఉద్యోగ, ఉపాధి అవకాశాలు, వివిధ పోటీ పరీక్షల్లో తెలుగు ప్రాధాన్యం గురించి పరిశీలించినట్లయితే..
గ్రూప్స్
గ్రూప్స్ (1, 2, 3, 4) పరీక్షల తెలుగు సిలబస్‌ను పరిశీలించినట్లయితే ప్రిలిమినరీ స్థాయిలో తెలంగాణ సమాజం-కళలు-సాహిత్యం-వారసత్వ సంపద పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్దేశించింది. అయితే ఇందులో సాహిత్యానికి సంబంధించి ఇప్పటివరకు జరిగిన పరీక్షల్లో ప్రశ్నపత్రాలను పరిశీలించినట్లయితే తెలుగు సాహిత్యానికి సంబంధించి ఒకటో, రెండో ప్రశ్నలు అడిగింది. ఇలా కాకుండా తెలుగు సాహిత్యానికి సంబంధించి గ్రూప్స్ 1, 2, 3, 4 అన్ని పరీక్షలు పేపర్‌ను విధిగా చేర్చాలి. దీని వల్ల సాహిత్యానికి సంబంధించి అన్ని రంగాలో విద్యార్థిని పరీక్షించినట్లవుతుంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల తెలుగు మీడియం నేపథ్యంలో చదివినవారు కూడా ఉద్యోగావకాశాలను పొందగలుగుతారు.
యూపీఎస్సీ
సివిల్ సర్వీసెస్ పరీక్షలు ఆప్షనల్ సబ్జెక్టుగా ఇతర జాతీయ, అంతర్జాతీయ భాషలతోపాటు తెలుగు భాషా సాహిత్యాలు ఎంపిక చేసుకొనే అవకాశం ఉంది. ఆప్షనల్ సబ్జెక్టులో రెండు పేపర్లు ఉన్నాయి. పేపర్-1కు 250 మార్కులు, పేపర్-2కు 250 మార్కులు మొత్తం 500 మార్కులను కేటాయించడం శుభపరిణామమే. కానీ ఇటీవల జరిగిన సివిల్స్ ప్రశ్నపత్రాలను పరిశీలించినట్లయితే తెలుగు అభ్యాసకుల కోసం పరీక్ష నిర్వహిస్తున్నట్లుగా ప్రశ్నపత్రాన్ని మరీ కఠినంగా ఇస్తున్నారు. తెలుగును ఆప్షనల్‌గా ఎంచుకునేదే ఎక్కువ మార్కులు పొందడం కోసం. భిన్న నేపథ్యం నుంచి వచ్చినవాళ్లు ఆప్షనల్‌గా తెలుగును ఎంచుకుంటున్నారు. అలాంటప్పుడు వీరికి విశ్వవిద్యాలయ స్థాయికి మించిన ప్రశ్నలు ఇవ్వడం వల్ల తెలుగు సాహిత్యాన్ని ఆప్షనల్‌గా తీసుకోవాలంటే విద్యార్థులు దూరంగా ఉండే పరిస్థితి కనిపిస్తుంది. 20 మార్కులకు రాసే జవాబును 60 మార్కుల ప్రశ్నలుగా ఇస్తున్నారు. ఇది మంచి పరిణామం కాదు. మరో విషయం ఏమిటంటే పద్య వ్యాఖ్యానాలకు సంబంధించిన అంశం కూడా సివిల్స్‌లో ఉంది. దీనిని తెలుగులో తప్పనిసరి చేశారు. కానీ తమిళ, కన్నడ భాషలో ఇది తప్పనిసరిగా లేదు. కాబట్టి అన్ని భాషలకు సమానంగా అవకాశమిచ్చేలా ప్రశ్నపత్రం రూపొందించాలి.
అధ్యాపక పరీక్షల్లో
జూనియర్ లెక్చరర్ల పరీక్షకు సన్నద్ధమయ్యే అభ్యర్థులు కనీసం 50 శాతం మార్కులతో ఎంఏ తెలుగు ఉత్తీర్ణులైతే సరిపోతుంది. డిగ్రీ లెక్చరర్ల ఉద్యోగాలకు 55 మార్కులు ఎంఏ తెలుగు ఉత్తీర్ణతతోపాటుగా సెట్, నెట్, లేదా పీహెచ్డీ పూర్తిచేసి ఉండాలి. ఈ రెండు పరీక్షలకు సంబంధించి పేపర్ 1, 2 ఉంటాయి. పేపర్-1 జనరల్ స్టడీస్, పేపర్-2లో సబ్జెక్టుకు సంబంధించి 150 ప్రశ్నలు ఉంటాయి. ఒక్కో ప్రశ్నకు 2 మార్కుల చొప్పున మొత్తం 300 మార్కులు ఉంటాయి. ఇందులో 135 ప్రశ్నలు తెలుగు భాష, సాహిత్యం, వ్యాకరణం విమర్శ వంటి అంశాలపై ఉంటాయి. మిగిలిన 15 ప్రశ్నలు సంస్కృత, ప్రాథమిక వ్యాకరణాంశాలు, హితోపదేశం, కాళిదాసు గ్రంథాలకు సంబంధించి ఉంటాయి. వీటిని సిలబస్‌లో నుంచి తీసేసి భాష, సాహిత్యం, విమర్శ, వ్యాకరణాంశాలు మొదలైన కేవలం తెలుగు సాహిత్యానికి సంబంధించిన సిలబస్‌ను పొందుపరిస్తే మంచిది. మరో సూచన ఏమిటంటే జనరల్ స్టడీస్‌లోని ప్రశ్నలను సాధారణ స్థాయిలో అడిగితే తెలుగు అభ్యర్థులు నష్టపోకుండా ఉంటారు.
యూనివర్సిటీ స్థాయిలో
విశ్వవిద్యాలయ స్థాయి అసిస్టెంట్ ప్రొఫెసర్ నియామకానికి కనీసం 44 శాతం మార్కులతో ఎంఏ తెలుగుతో పాటు నెట్, స్లెట్ కలిగి ఉంటే అర్హులు. దీనికి రాత పరీక్ష లేదు. ఇంటర్వ్యూ మాత్రమే ఉంటుంది. పరీక్ష లేకుండా ఇంటర్వ్యూ ఉండటం అనేది లోపభూయిష్టమైన విధానం. డిగ్రీ కళాశాలల అధ్యాపకులకు ఏవిధంగా అయితే సిలబస్, రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఉంటుందో అదే తరహాలో విశ్వవిద్యాలయ అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకూ నిర్వహిస్తే ప్రతిభావంతులు ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంటుంది.
పోలీస్ పరీక్షల్లో
ఎస్ఐ ఆఫ్ పోలీస్ పరీక్షల్లో తెలుగు భాషా సామర్థ్యం అనే అంశం ఉంది. ఇందులో 100 మార్కులకు ప్రత్యేక పేపర్ ఉంది. ఇందులో లేఖారచన, పేరాగ్రాఫ్ రైటింగ్, కాంప్రహెన్షన్ రైటింగ్, వ్యాసరచన, నివేదిక రచన వంటి అంశాలపై ప్రశ్నలు ఉన్నాయి. ఇందులో అర్హత సాధిస్తేనే మిగతా పేపర్లు మూల్యంకనం చేస్తారు. ఒకవిధంగా చెప్పాలంటే ఇందులో సాహిత్యానికి ప్రమేయం లేదు. భాషా నైపుణ్యానికి, భాషా వినియోగానికి ప్రాధాన్యం ఉంది. ఇదే సరైన విధానం. ఎందుకంటే తెలుగు అంటే సాహిత్యం కాదు. సామాన్యులకు సైతం, రోజువారీ వ్యవహారాల్లో ఉపయోగపడేలా భాషా సామర్థ్యాన్ని పరీక్షించేలా ఉండాలి.
మాతృభాషతోపాటు ఆంగ్ల భాషా పరిజ్ఞానం, భాషా నియమాల అధ్యయనంపై ఉత్సుకత, సూక్ష్మస్థాయి పరిశీలన, పరిశోధనా దృష్టి, మ్యాథమెటిక్స్, కంప్యూటర్ ప్రోగ్రామింగ్లపై ఆసక్తి వంటి నైపుణ్యాలు కలిగి ఉండటం వల్ల లింగ్విస్టిక్స్ భాషాశాస్ర్తాలకూ ఉద్యోగావకాశాలు పుష్కలంగా ఉన్నాయి. తెలుగు భాషా నైపుణ్యాలతోపాటు అదనంగా డీటీపీ, పీజీ డిప్లొమా ఇన్ కంప్యూటర్స్ అప్లికేషన్ వంటి కోర్సులు చేస్తే ప్రభుత్వ, ప్రైవేట్ ముద్రణాలయాల్లో కంపోజ్, ఫ్రూప్ రీడర్లుగా స్థిరపడవచ్చు. కార్పొరేట్ పాఠశాలలో కూడా తెలుగు ఉపాధ్యాయులకు అవకాశాలు ఉన్నాయి. రచనా రంగాల్లో ఆసక్తి ఉన్నవారు పుస్తక రచయిత, సినిమా కథల రచయితలుగా అవకాశాలు పొందవచ్చు.
-ఫ్రెంచి సామాజిక శాస్త్రవేత్త పియరీ బోర్డియా భాషాపరమైన మార్కెట్ సిద్ధాంతాన్ని అభివృద్ధి చేశారు. ఇందులో భాషకు సంబంధించి ఉపాధి గురించి తెలియజేస్తూ ఒక భాష వల్ల ఒనగూరే ప్రయోజనాలను బట్టి ప్రజలు ఆయా భాషలను ఎంచుకుంటారు. కానీ ఎక్కువ శాతం ఉపాధి అకకాశాలను పెంచుకోవడం, ఆర్థికంగా అభివృద్ధి చెందటం కోసమే ప్రత్యేకంగా తమ భాషను కొందరు ఎంచుకుంటున్నారు. ఈ విపణిలో మన మాతృభాష కూడా పోటీపడాలంటే అన్ని పోటీ పరీక్షల్లో తప్పకుండా మాతృభాషకు ప్రాధాన్యం ఇచ్చేలా ప్రభుత్వం విధానాలను రూపొందించాలి. పబ్లిక్ సర్వీస్ కమిషన్‌వారు నిర్వహించే అన్ని పోట పరీక్షల్లో తెలుగు సాహిత్యాన్ని తప్పనిసరి పేపర్‌గా పొందుపర్చాలి.
టీచర్ పోస్టుల్లో
సమాజంలో గౌరవప్రదమైన, ప్రశాంతమైన జీవితంతో కూడిన వృత్తి ఉపాధ్యాయ వృత్తి. ఇటీవల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎస్జీటీ, స్కూల్ అసిస్టెంట్లు, భాషా పండితులకు సంబంధించిన నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. డిగ్రీతో పాటు బీఎడ్ లేదా తెలుగు పండిత్ ట్రైనింగ్ (టీపీటీ) ఉత్తీర్ణులైన అభ్యర్థులు తెలుగు స్కూల్ అసిస్టెంట్, గ్రేడ్-2 తెలుగు పండిట్ ఉద్యోగాలకు అర్హులు. వీరు టెట్ పేపర్-1 ప్రాథమికస్థాయి ఉపాధ్యాయులకు, పేపర్-2 స్కూల్ అసిస్టెంట్లకు 150 మార్కులు, తెలుగు భాషా సాహిత్యాలకు 30 మార్కులను కేటాయించారు. పేపర్-2లో తెలుగు భాషా సాహిత్యాలకు 30 మార్కులను కేటాయించారు. 24 మార్కులు కంటెంట్‌కు, 6 మార్కులు బోధనా పద్ధతులకు కేటాయించారు. అయితే దీనికి సంబంధించి సిలబస్‌ను ఎక్కువగా నిర్ణయించి మార్కులను తక్కువగా కేటాయించడం అర్థరహితం. తెలుగు బోధనా పద్ధతులు అనే విషయం అందరికీ అవసరం లేదు. వ్యాకరణం, పద్యబోధన వంటివి తెలుగు పండితులకు తప్ప మిగిలినవారికి అంతగా ఉపయోగపడవు. తెలుగు సాహిత్యం కంటే భాషా, ప్రయోగాలకు ఎక్కువగా అవకాశం ఇస్తే మంచిది.
-ఎస్జీటీలో తెలుగు కంటెంట్‌కు సంబంధించి 6 మార్కుల చొప్పున 18 ప్రశ్నలను, 9 మార్కులను కేటాయించారు. టీచింగ్ మెథడాలజీకి సంబంధించి 6 ప్రశ్నలకు అరమార్కు చొప్పున మొత్తం 3 మార్కులను మొత్తంగా తెలుగు కంటెంట్, మెథడాలజీకి 12 మార్కులను కేటాయించారు. అయితే అందరూ పోటీపడే ఈ విభాగంలో తెలుగు కంటెంట్‌కు సంబంధించిన గత ప్రశ్నపత్రాలను పరిశీలించినట్లయితే సాహిత్యం లోతుల్లోకి వెళ్లి మరీ కఠినంగా ఉన్నాయి. ఇతర విషయాల అభ్యర్థులకు నష్టం కలుగకుండా తెలుగుకు సంబంధించిన భాషా పరిజ్ఞానాన్ని పరీక్షించే ప్రశ్నలు ఎక్కువగా అడిగితే మంచిది. స్కూల్ అసిస్టెంట్ పరీక్షలో తెలుగు కంటెంట్‌కు 44 మార్కులు మెథడాలజీకి 16 మార్కులు మొత్తం 60 మార్కులను గరిష్ఠంగా కేటాయించారు. అయితే బోధనా పద్ధతులకు సంబంధించి ఇంకా ప్రశ్నలను పెంచితే బాగుంటుంది.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?