Telangana Sega to Delhi | ఢిల్లీకి తెలంగాణ సెగ
-గ్రూప్-1 ప్రత్యేకం
సంసద్ యాత్ర
-ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు లక్ష్యంగా కేంద్రంపై ఒత్తిడి పెంచడం కోసం రాజకీయ జేఏసీ చేపట్టిన ఆందోళన కార్యక్రమాల్లో సంసద్ యాత్ర ఒకటి. 2013, ఏప్రిల్ 29, 30 (రెండు రోజులు) తేదీల్లో న్యూఢిల్లీలోని జంతర్‌మంతర్ దగ్గర ఈ యాత్రను ఏర్పాటు చేశారు. ఢిల్లీకి ఉద్యమకారులను తరలించడానికి దక్షిణమధ్య రైల్వే అధికారులు ప్రత్యేక రైలును కేటాయించారు. దీనికి తెలంగాణ ఎక్స్‌ప్రెస్ అని పేరు పెట్టారు. సాయంత్రం 6 గంటలకు సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ నుంచి బయలుదేరిన ఈ ప్రత్యేక రైలులో.. తెలంగాణ రాజకీయ జేఏసీలో భాగమైన టీఆర్ఎస్, బీజేపీ, న్యూడెమోక్రసీ పార్టీలకు చెందిన కార్యకర్తలు.. తెలంగాణ నగారా సమితి కార్యకర్తలు.. టీఎన్జీఓ, టీజీఓ, తెలంగాణ ఉద్యోగుల సంఘం జేఏసీలు.. ఆర్టీసీ కార్మికులు, సింగరేణి కార్మికులు, టీచర్లు, లెక్చరర్ల జేఏసీలతోపాటు విద్యార్థులు, న్యాయవాదులు దాదాపు రెండు వేల మంది ఉన్నారు.
చలో అసెంబ్లీ
-తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు బిల్లును వెంటనే పార్లమెంట్లో పెట్టాలనే డిమాండ్‌తో.. 2013, జూన్ 14న రాజకీయ జేఏసీ చలో అసెంబ్లీ కార్యక్రమానికి పిలుపునిచ్చింది. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు వేలాదిగా తరలి వచ్చిన తెలంగాణవాదులను పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. భాష్పవాయు గోళాలు ప్రయోగించారు. దీంతో అసెంబ్లీ ప్రాంగణమంతా రణరంగమైంది. పోలీసులు 47 మంది ఎమ్మెల్యేలను, 14 మంది ఎమ్మెల్సీలను, ఒక ఎంపీని అరెస్టు చేశారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు దాస్యం వినయ్‌భాస్కర్, విద్యాసాగర్‌రావు అసెంబ్లీపైకి ఎక్కి నల్లజెండాలతో నిరసన తెలిపారు.
తెలంగాణలో సాంస్కృతిక పునరుజ్జీవనం
-తెలంగాణ అస్తిత్వ ప్రతీక.. తెలంగాణ తల్లి విగ్రహం
-కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీని స్థాపించినప్పటి నుంచి ఆంధ్ర పాలకులు తెలంగాణ ఉద్యమాన్ని నీరుగార్చేందుకు తెలుగుతల్లి సెంటిమెంట్‌ను తీసుకొచ్చేవారు. అయితే కేసీఆర్ ఆ ప్రస్తావన వచ్చిన ప్రతిసారి తెలుగు తల్లి.. ఎవరికి తల్లి? అంటూ ప్రశ్నించేవారు. మీడియా సమావేశాల్లోనూ, బహిరంగ సభల్లోనూ ఈ అంశాన్ని ప్రశ్నిస్తూ వచ్చారు. వాస్తవానికి తెలుగుతల్లి అనే ప్రస్తావన ఆంధ్ర, హైదరాబాద్ ప్రాంతాలు కలిసిపోయినప్పటి నుంచి ఉన్నదికాదు. 1969లో ఉవ్వెత్తున ఎగిసిన ప్రత్యేక తెలంగాణ ఉద్యమం ఆంధ్రపాలకులను హడలెత్తించడంతో.. ఆ తరహాలో మరోసారి ఉద్యమం జరుగకుండా ఉండటం కోసం 1975, ఏప్రిల్‌లో ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా తెలుగు తల్లి భావనకు విపరీత ప్రచారం కల్పించారు. అప్పటిదాకా ఆంధ్ర మాతగా ప్రసిద్ధి చెందిన తల్లిపేరును తెలుగు తల్లిగా మార్చి సెంటిమెంట్‌ను ప్రచారం చేశారు.
మరోవైపు ఆంధ్రుల ఘనకీర్తిని వివరిస్తూ శంకరం బాడి సుందరాచారి రాసిన మా తెలుగు తల్లికి మల్లెపూదండ అనే పాటను ప్రచారంలోకి తెచ్చి, దాన్ని రాష్ట్ర గీతంగా ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని స్కూళ్లలో ఆ గీతాన్ని పాడాలంటూ విద్యాశాఖ అధికారులతో ఉత్తర్వులు జారీ చేయించారు. ఈ గీతంలో కేవలం ఒక్కచోట రాణి రుద్రమ దేవి ప్రస్తావన మినహా తెలంగాణకు సంబంధించిన మరే అంశమూ ఉండదు.
-కేసీఆర్, ప్రొ గంగాధర్, బీఎస్ రాములు ఆలోచనల ప్రకారం రూపుదిద్దుకున్న తెలంగాణ తల్లి తొలి విగ్రహాన్ని.. తెలంగాణకు చెందిన ప్రముఖ నాయకురాలు నంది నిర్మల ప్రోత్సాహంతో సిద్దిపేటకు చెందిన శిల్పి నర్సింహులు తయారు చేశారు. దీన్ని గోదావరిఖని బస్టాండ్ ముందు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత చేతుల మీదుగా ఆవిష్కరించారు. అయితే ఆ విగ్రహ తయారీకి కొన్ని రోజుల ముందే బీఎస్ రాములు సూచన మేరకు బీయూఆర్ చారి మట్టితో 12 ఇంచుల సైజులో చిన్న విగ్రహాన్ని తయారు చేశారు. ఆ విగ్రహాన్ని వారిద్దరు కలిసి తెలంగాణ భవన్లో కేసీఆర్‌కు బహూకరించారు.
-గోదావరి ఖనిలో విగ్రహావిష్కరణ తర్వాత కేసీఆర్.. తెలంగాణ తల్లి విగ్రహాలన్నీ ఒకే సైజులో, ఒకే రూపంలో, ఒకే రకం రంగులతో, ఒకే విధమైన ఆభరణాలతో ఉండాలని సూచించారు. ఫైన్ ఆర్ట్స్ కళాశాల ప్రొఫెసర్ గంగాధర్‌కు శిష్యుడైన విద్యార్థి పసునూరి దయాకర్ చేతుల మీదుగా విగ్రహాలను తయారు చేయించాలని ఆదేశించారు. ఇలా దయాకర్ చేతుల మీదుగా రూపుదిద్దుకున్న వందలాది విగ్రహాలు తెలంగాణలో ఏ దారిలో వెళ్లినా దర్శనమిస్తాయి.
తెలంగాణ తల్లి రూపం – నేపథ్యం
-తెలంగాణ తల్లి భావన పూర్వం నుంచి ఉన్నదే అయినా, దాన్ని ఉద్యమ ప్రతీకగా ముందుకు తేవాలన్న ఆలోచన మాత్రం ప్రత్యేక రాష్ట్ర ఉద్యమసారథి కేసీఆర్‌దే. తెలంగాణకు చెందిన ప్రముఖ రచయిత, తత్వవేత్త బీఎస్ రాములు మొదటిసారి తెలంగాణ తల్లికి ఒక రూపాన్ని ఇచ్చే ప్రయత్నం చేశారు. బీఎస్ రాములు ఆలోచనలు, సూచనల ప్రకారం.. కంప్యూటర్‌పై తెలంగాణ తల్లి విగ్రహానికి రూపమిచ్చిన వ్యక్తి బీయూఆర్ చారి. సాధారణ స్త్రీ మాదిరిగా (తలపై కీరీటం ఆభరణాలు లేకుండా) కొంగు నడుముకు చుట్టుకొని ఉన్న తెలంగాణ తల్లి రూపాన్ని బీయూఆర్ చారి చిత్రించారు. ఈ రూపం దేవులపల్లి అజయ్ సారథ్యంలో వెలువడుతున్న ప్రజాతంత్ర అనే తెలంగాణ వారపత్రిక కవర్ పేజీపై ప్రచురితమైంది.
-తెలంగాణ తల్లికి తామిచ్చిన రూపాన్ని బీఎస్ రాములు ఉద్యమ సారథి కేసీఆర్ ముందు పెట్టగా.. ఆయన కొన్ని మార్పులు సూచించారు. ఈ విషయమై చర్చించడానికి తెలంగాణ భవన్లో రెండు సమావేశాలు నిర్వహించారు. ఈ సమావేశాల్లో బీఎస్ రాములు, ఫైన్ ఆర్ట్స్ కాలేజీ ప్రొఫెసర్ గంగాధర్, గన్‌పార్క్‌లోని 1969 తెలంగాణ అమరవీరుల స్థూపం సృష్టికర్త ఎక్కా యాదగిరి రావు, తెలంగాణకు చెందిన ప్రముఖ రచయిత, విశ్లేషకులు దుర్గం రవీందర్, ప్రముఖ చిత్రకారుడు కాపు రాజయ్య, ఈ తరం చిత్రకారుడు ఏలె లక్ష్మణ్ పాల్గొన్నారు. ఈ సమావేశాల్లో కేసీఆర్ మాట్లాడుతూ తెలంగాణ తల్లి వెనుకబడ్డ తెలంగాణ ప్రాంతానికి గుర్తుగా పేద స్త్రీ రూపంలో ఎందుకు ఉండాలి? అని ప్రశ్నించారు. తెలంగాణ ఎప్పటికీ ఇలాగే వెనుకబడి ఉండదు కదా. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత గొప్పగా, దేశంలోనే సంపన్న రాష్ట్రంగా, బంగారు తెలంగాణగా మారుతుంది. రాజా రవివర్మ గీసిన దేవతల బొమ్మల స్ఫూర్తితో భారత మాత చిత్రాన్ని రూపొందించారు. ఆ చిత్రాన్ని తలపించేలా తెలంగాణ తల్లికి రూపమివ్వాలి అని కేసీఆర్ సూచించారు. ఆయన సూచనతోపాటు సమావేశాల్లో పాల్గొన్న మరికొందరు ఇచ్చిన సూచనలకు తగినట్లుగా ప్రొఫెసర్ గంగాధర్ ఇప్పటి తెలంగాణ తల్లికి రూపాన్నిచ్చారు.
-తెలంగాణ తల్లి రూపాన్ని తొలిసారి క్యాలెండర్ రంగుల్లో ముంద్రించి కేసీఆర్ చేతుల మీదుగా తెలంగాణ భవన్లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ తెలంగాణ తల్లికి చక్కని రూపాన్నిచ్చిన ప్రొ గంగాధర్, బీఎస్ రాములు పేర్లు తెలంగాణ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడుతాయన్నారు.
తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించిన కేసీఆర్
-పసునూరి దయాకర్ చేతుల మీదుగా తయారైన తెలంగాణ తల్లి తొలి విగ్రహాన్ని 2007, నవంబర్ 15న టీఆర్ఎస్ కార్యాలయమైన తెలంగాణ భవన్లో పలువురు ప్రముఖులు, నాయకుల ఆధ్వర్యంలో కేసీఆర్ ఆవిష్కరించారు. ఇలాంటి విగ్రహాలనే అన్ని నియోజకవర్గాల్లో ఆవిష్కరించాలని పార్టీ నేతలను ఆదేశించారు. తెలంగాణ అస్తిత్వ ప్రతీకగా ఈ తెలంగాణ తల్లి భావన మలిదశ ఉద్యమ వ్యాప్తిలో ఎంతో దోహదపడింది.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?