Simultaneous elections ..| ఏకకాల ఎన్నికలు..!
భారతదేశం ఒక ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యమే కాదు, సమాఖ్య వ్యవస్థ కూడా. ఒక సమాఖ్య రాజ్యాంగానికి ఉండాల్సిన అతిముఖ్యమైన లక్షణం రాజకీయ, అధికార వికేంద్రీకరణ. ఎక్కడైతే సార్వభౌమాధికారం మొత్తం కేంద్రీకృతం కాకుండా పైస్థాయి నుంచి కింది స్థాయి వరకు వికేంద్రీకరించబడుతుందో అక్కడ ప్రజాస్వామ్యం తన స్వచ్ఛమైన రూపాన్ని, బలమైన మనుగడను సాధిస్తుంది. అందుకోసం సమాఖ్య రాజ్యాంగంగా చెప్పబడే మన రాజ్యాంగం ప్రజాప్రతినిధులు.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఏర్పరిచే విధాన్ని అవలంబించింది. కానీ నేటి పరిస్థితుల్లో కేంద్ర, రాష్ట్ర స్థాయి ప్రజాప్రతినిధులు ఎన్నికల ద్వారా అన్ని రాష్ర్టాల్లోనూ ఏకకాలంలో ఎన్నుకోబడటం లేదు. ప్రజాస్వామ్యానికి ప్రాణవాయువుగా పేర్కొనే ఎన్నికలను సమర్ధవంతంగా, స్వల్ప ఖర్చుతో ప్రజానీకానికి అసౌకర్యం కలగకుండా నిర్వహించాలంటే కేంద్ర, రాష్ట్రస్థాయి ఎన్నికలు ఏకకాలంలో జరగాలన్న అభిప్రాయం చాలామంది మేధావులే గాక, 1999లో న్యాయసంఘం తన 170వ నివేదికలో వెలిబుచ్చింది.
దేశంలో ఏకకాల ఎన్నికలు పరిణామాలు
-రాష్ర్టాల, అసెంబ్లీలు, లోక్‌సభకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలన్న ప్రతిపాదన చర్చల్లోకి వచ్చిన సందర్భంలో కేంద్ర ప్రభుత్వం కొంతకాలంగా చెబుతున్న ఈ మాటకు గతంలో మాజీ, ప్రస్తుత రాష్ట్రపతులు మద్దతు తెలపడం విశేషం.
-ఈ నేపథ్యంలో భారత్‌వంటి పెద్దదేశంలో సంక్లిష్టమైన ఏకకాల ఎన్నికల ప్రక్రియను నిర్వహించాల్సిన అవసరం, దానివల్ల కలిగే లాభాలు, నష్టాలవంటివన్నీ చర్చనీయమే. ఎన్నికలు అంటే ఖర్చుతో కూడుకున్న విషయం కాబట్టి మొత్తం ప్రక్రియ పూర్తికావడానికి నెలల తరబడి సమయం పడుతుండటంతో న్యాయ కమిషన్ కూడా ఏకకాలపు ఎన్నికలు అవసరమని చెప్పింది. పార్లమెంటరీ స్థాయి సంఘం కూడా దీనిపై సిఫారసులు చేసింది.
-దేశంలో స్వాతంత్య్రం వచ్చిన తర్వాత తొలిసారి 1951-52లో 1వ లోక్‌సభకు, అన్ని రాష్ర్టాల శాసనసభలకు ఎన్నికలు ఏకకాలంలోనే జరిగాయి. తర్వాత 1957, 1962, 1967 లలోనూ ఎన్నికలు ఏకకాలంలోనే నిర్వహించారు. ఇప్పటివరకు తొలి నాలుగు పర్యాయాలు ఏకకాలంలో ఎన్నికలు జరుగగా.. 1968లో తొలిసారి దీనికి అంతరాయం ఏర్పడింది. ఎందుకంటే 1966లో హర్యానా రాష్ట్రం ఏర్పడిన తర్వాత.. 1967లో అన్ని రాష్ర్టాల శాసనసభలు, లోక్‌సభతోపాటే హర్యానా అసెంబ్లీకి ఎన్నికలు జరిగాయి. అయితే 1968లో హర్యానా అసెంబ్లీ రద్దయింది. అలాగే 1969లో బీహార్, పశ్చిమబెంగాల్ రాష్ర్టాల అసెంబ్లీలను రద్దుచేశారు. ఆ రెండు సంవత్సరాలు అసెంబ్లీలకు మధ్యంతర ఎన్నికలు జరిగాయి. 1970లో ప్రధాని ఇందిరాగాంధీ 4వ లోక్‌సభను రద్దుచేయడంతో 1971లో మళ్లీ లోక్‌సభ ఎన్నికలు నిర్వహించారు. దీంతో 1967లో ఏకకాల ఎన్నికలు పరంపరగా ముగిసినట్లయింది.
-దీని మీద ప్రజా ఫిర్యాదుల చట్టంపై అప్పటి రాజ్యసభ సభ్యుడు సుదర్శన్ నాచియప్పన్ నేతృత్వంలో పనిచేసిన పార్లమెంటరీ స్థాయీసంఘం 2015, డిసెంబర్లో ఉభయసభలకు ఒక నివేదిక సమర్పించింది. దీనిలో భాగంగా ఎన్నికల సాధ్యాసాధ్యాల గురించి కూలంకషంగా చర్చించింది. దీనిపై చర్చ జరుగాలని అభిప్రాయపడుతూ పలు సూచనలు, సిఫారసులు చేసింది.
ఏకకాల ఎన్నికలు – లాభాలు
-ఎన్నికల సంస్కరణలకు సంబంధించి న్యాయ కమిషన్ 1999లో ఇచ్చిన నివేదికలో ఏకకాల ఎన్నికల లాభాలను చర్చించింది.
-లోక్‌సభ, దేశంలోని అన్ని శాసనసభలకు ఏకకాలంలో ఎన్నికలు నిర్వహిస్తే ఖర్చు తగ్గుతుంది. 2014 ఎన్నికల సమయంలో లోక్‌సభ, విధాన సభల ఎన్నికలకు కలిపి సుమారు రూ. 4,000 కోట్లకుపైగా ఖర్చయ్యింది.
-ఎన్నికలు వచ్చిన ప్రతిసారి ఆయా నియోజకవర్గాల్లో ఎన్నికల నియమావళి అమల్లోకి వస్తుంది. ఎన్నికల నియమ-నిబంధనలు అమల్లో ఉంటే అభివృద్ధి కార్యక్రమాలు ఆగిపోతాయి. అదే ఏకకాల ఎన్నికలు జరిగినట్లయితే పలుమార్లు ఈ అసౌకర్యం కలుగకుండా ఉంటుంది.
-తరచుగా ఎన్నికలు వస్తుంటే ప్రజాజీవితానికి ఇబ్బందులు ఏర్పడుతాయి. ఏకకాల ఎన్నికల ద్వారా వీటి ప్రభావం కూడా చాలా తగ్గుతుంది.
ఏకకాల ఎన్నికలు – సవాళ్లు
-ఎన్నికల నిర్వహణలో ఉండే ఇబ్బందులను ఎన్నికల సంఘం ప్రస్తావించింది.
-ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను తగినన్ని సమకూర్చాలి.
-VVPAT (ఓటర్ వెరిఫైడ్ పేపర్ ఆడిట్ ట్రయల్) యంత్రాలు తగినన్ని లేవు.
-2015 అంచనా ప్రకారం ఏకకాల ఎన్నికల కోసం రూ. 9,284 కోట్లు అవసరం అవుతాయి.
-ఓటింగ్ యంత్రాలను పెద్ద సంఖ్యలో 15 ఏండ్లకొకసారి మార్చాల్సి వస్తుంది.
రాజ్యాంగపరమైన అంశాలు
ఏకకాల ఎన్నికలు నిర్వహిస్తే లోక్‌సభ ఎలా ఉండాలి?
-భారత ఎన్నికల సంఘం సూచనల ప్రకారం లోక్‌సభ టర్మ్ ప్రారంభమయ్యే, ముగిసే తేదీలను నిర్ణయించుకోవాలి.
-ముందుగా నిర్ణయించుకున్న తేదీ ప్రకారం లోక్‌సభ ఎప్పుడు మొదలవ్వాలో దానిని బట్టి ఏకకాల ఎన్నికల తేదీలను ఖరారు చేయాలి.
-లోక్‌సభ గడువుకు ముందే రద్దయ్యే అవకాశాలు తగ్గించడానికి ఎన్నికల సంఘం కొన్ని సూచనలు చేసింది.
అవి.
-ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరైనా అవిశ్వాస తీర్మానాన్ని పెట్టాలనుకుంటే వారే తదుపరి ప్రధానిగా ఎవరు ఉంటారో చెబుతూ వారి పేరిట అవిశ్వాస తీర్మానం పెట్టాలి.
-ఈ రెండు తీర్మానాలకు సభలో ఒకేసారి ఓటింగ్ జరగాలి. ఈ రెండు ఆమోదం పొందితేనే సభ రద్దయి ఎన్నికలు అవసరం లేకుండానే కొత్త సభ ఏర్పడుతుంది.
-ఒకవేళ ఏదైనా ఇతర కారణాల వల్ల లోక్‌సభ రద్దయి అనివార్య పరిస్థితి ఏర్పడితే అప్పుడు పాటించాల్సిన రెండు మార్గాలను ఎన్నికల సంఘం సూచించింది.
-లోక్‌సభ రద్దు కారణంగా ఎన్నికలకు కొద్ది సమయే ఉన్నట్లయితే దాని పాలనా పగ్గాలు రాష్ట్రపతి చేపట్టాలి. రాష్ట్రపతి కొందరు మంత్రులను నియమించుకుని వారి సలహా ప్రకారం ప్రభుత్వాన్ని నడపాలి. ఈ నిర్ణీత గడువులో కొత్త ప్రభుత్వం ఏర్పడేవరకు గాని, మళ్లీ ఎన్నికలు వచ్చేవరకు గాని అధ్యక్షపాలన ఉంటుంది.
-ఒకవేళ సభ రద్దయ్యేనాటికి లోక్‌సభ కాలపరిమితి మిగిలి ఉంటే అప్పుడు ఎన్నికలు నిర్వహించుకోవచ్చు. కానీ అప్పుడు ఏర్పడే ప్రభుత్వం అప్పటికి మిగిలి ఉన్న కాలం మాత్రమే అధికారంలో ఉంటుంది. ఇది రాష్ర్టాల శాసనసభలకు వర్తిస్తుంది.
ఏకకాల ఎన్నికలు-రాజ్యాంగ సవరణలు
-లోక్‌సభ, శాసనసభలకు ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించాలంటే రాజ్యాంగంలోని కనీసం 5 అధికరణలను సవరించాల్సి ఉంటుంది.
-ఆర్టికల్-83: లోక్‌సభ గురించి తెలిపే ప్రకరణ
-ఆర్టికల్-85: రాజ్యసభ సమావేశాలను రాష్ట్రపతి ఏర్పాటు, వాయిదా, రద్దు చేయవచ్చు.
-ఆర్టికల్-172: విధానసభ కాలపరిమితి గురించి తెలుపుతుంది.
-ఆర్టికల్- 174: శాసనసభ సమావేశాల ఏర్పాటు, వాయిదా, రద్దుచేసే అధికారం గవర్నర్‌కు ఉంటుంది.
-ఆర్టికల్-356: రాష్ర్టాల్లో విఫలమయ్యే సందర్భాల్లో రాష్ట్రపతి పాలన విధించే నిబంధన.
-దక్షిణాఫ్రికా, స్వీడన్ వంటి దేశాల్లో ఏకకాల ఎన్నికలు నిర్వహిస్తున్నారు. అయితే భారత్‌లో ఉన్నంత జనాభా ఈ దేశాల్లో లేదు. 1967లో చివరిసారిగా ఏకకాల ఎన్నికలు నిర్వహించినప్పటికంటే ప్రస్తుత జనాభా గణనీయంగా పెరిగింది. అయినప్పటికీ ఏకకాల ఎన్నికలకు 2018 సెప్టెంబర్ తర్వాత సిద్ధంగా ఉన్నామని ఎన్నికల సంఘం తెలపడం తమ సామర్థ్యాన్ని తెలుపుతున్నది. ప్రాంతీయంగా ఒక రాజకీయ పార్టీపై స్థానిక జనాభాకు ఉన్న అభిమానం కేంద్ర ఎన్నికలను కూడా ప్రభావితం చేసిన సందర్భాలు మనం చూసినా రాజకీయ సమీకరణాలు, స్థితిగతులు ఎప్పటికీ శాశ్వతమైనవి కావు. కాబట్టి ఏకకాల ఎన్నికలు నిర్వహించడం భారత్‌కు దీర్ఘకాలంలో ప్రయోజనకరం కానుంది.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?