Popular plays | జనచేతన నాటకాలు
క్యావేషు నాటకం రమ్యం అన్నారు పెద్దలు. నాటకం వినోదంతోపాటు విజ్ఞానాన్ని అందిస్తుంది. సామాజిక సమస్యలపై పోరాటానికి ప్రజలను చైతన్యవంతం చేస్తుంది. తెలంగాణ పోరాటంపై కూడా నాటక సాహిత్య ప్రభావం ఎంతో ఉంది. మధ్యయుగం నాటి నిజాం పరిపాలనా విధానంపై వ్యతిరేక ఉద్యమాలు వచ్చిన సమాజంలో నాటక ప్రక్రియ పాత్ర అనన్య సామాన్యమైంది.
-చరిత్రలో ప్రతి ఉద్యమం కళల్ని, కళాకారుల్ని తమ ప్రయోజనం కోసం ఉపయోగించుకుంటూనే ఉంది. నిజాం ప్రభుత్వ నిరంకుశ పాలనలో, జమీందార్ల పెత్తనంపై వ్యతిరేక పోరాటం, రైతాంగ సాయుధ పోరాటంపై వెట్టిచాకిరీ, అక్రమ వసూళ్లకు వ్యతిరేకంగా జరిగిన పోరాటాలపై నాటక కళ ప్రజల్లో ఎంతో చైతన్యం తెచ్చింది.
-దేశ జనాభాలో అధిక శాతం మంది నిరక్షరాస్యులుగా ఉన్నారు. కాబట్టి నాటకం ప్రజా జీవితాన్ని ఎక్కువగా ప్రభావితం చేయగలదు. హైదరాబాద్ సంస్థానంలోని మొత్తం వ్యవసాయ భూమిలో 30 శాతం జాగీర్దారీ విధానం కింద ఉంటే, 10 శాతం నిజాం సొంత భూమి , కాగా మిగిలిన 60 శాతం భూమి ప్రభుత్వ భూమి. ఈ 60 శాతం భూమిని సాగుచేసేవారు శిస్తుకట్టాలి.
-రైతులు కేవలం కౌలుదార్లు మాత్రమే. పంటలు పండక అప్పులపాలై పెరిగే చక్రవడ్డీల కారణంగా రైతు భూమిని కోల్పోయేవాడు. దొర పొలంలో వెట్టి చెయ్యాల్సి వచ్చేది. సమాజంలో జాగీర్దార్లు, జమీందార్లు, ఇనాందార్లు అగ్రహారికులు, పటేల్, పట్వారీ, దేశ్‌ముఖ్‌లు, దేశ్‌పాండేలదే పెత్తనం.
-వెట్టిచాకిరీ, అక్రమ వసూళ్లు, సర్కార్ పట్టించుకోని ప్రజలను బానిసలుగా తయారు చేసింది వ్యవస్థ.
-జాతీయోద్యమం జరుగుతున్న రోజుల్లోనే ఆంధ్ర మహాసభల ప్రభావంతో తెలంగాణలో భూస్వామ్య వ్యతిరేక పోరాటాలు ప్రారంభమయ్యాయి.
-ఆంధ్ర మహాసభ శాఖలు గ్రామగ్రామాన సంఘంగా వెలిశాయి. కుటుంబ సభ్యులంతా సంఘంలో సభ్యత్వం తీసకొనేవారు.
-దొడ్ది కొమరయ్య, చాకలి ఐలమ్మ పోరాటాలతో సాయుధ పోరాటం తీవ్రరూపం దాల్చింది. కారం, రోకలిబండ, కర్ర, వడిశెలు ఆయుధాలయ్యాయి. గుత్పలు ఆయుధంగా వాడిన వారిని గుత్పల సంఘం అన్నారు. 1946లో ప్రారంభమైన ఉద్యమం 1951 అక్టోబర్ 21న ముగిసింది.
-ఒకవైపు జాతీయోద్యమం, మరోవైపు ఆంధ్రరాష్ట్రోద్యమం, ఇంకోవైపు తెలంగాణ పోరాటాల నేపథ్యంలో అనేక నాటకాలు వచ్చాయి. నాటకం అనేక రకాలుగా చైతన్యం తీసుకువచ్చి ప్రజలను ఉద్యమంవైపు నడిపించింది.
-సామాజిక ఉద్యమకారులు కళాకారులకు ప్రేరణగా నిలవడమా, కళాకారులు ఉద్యమానికి కొత్త ఊపునూ, వేగాన్ని ఇవ్వటమా ఇవి పరస్పర సంబంధమైనవిగా, గతితార్కిక మైనవిగా ఉంటుంది. మహీధర రామ్మోహనరావు అన్నట్లు పోరాటంప్రభావం సాహిత్యం మీద ఉంటుంది, ప్రజలు తర్వాత ఆలోచించడానికి అది సహాయపడుతుంది. అలాగే తిరునగరి రామాంజనేయులు అన్నట్లు ఉద్యమం స్ఫూర్తితో, అవసరంతో కళలు, సారస్వతం నిజమైన సాహిత్యంగా పుట్టుకొస్తుంది, సృజనాత్మకత ఆ సాహిత్యంలోనే ఉంటుంది.
ప్రజానాట్య మండలి
-1943లో స్థాపించబడింది. మొదట దీనికి భారత ప్రజానాట్య మండలి అని పేరు. 1943లో జూన్ 1న ఏర్పడింది. భారత కమ్యూనిస్టు పార్టీ ప్రథమ మహాసభ 1943, మే 23న ప్రారంభమై జూన్ 1 వరకు బొంబాయిలో జరిగింది. ఇండియన్ పీపుల్స్ థియేటర్స్ అసొసియేషన్‌కు డాక్టర్ గరికపాటి రాజారావు కేంద్ర కార్యవర్గ సభ్యులు.
ప్రజానాట్య మండలి ప్రదర్శించిన నాటకాలు
-మా భూమి : దీన్ని సుంకర సత్యనారాయణ, వాసిరెడ్డి భాస్కర్‌రావు రచించారు. వాసిరెడ్డిది ఖమ్మం జిల్లా వీరులపాడు గ్రామం. 1909లో కృష్ణాజిల్లా ఈడ్పగల్లులో సుంకర జన్మించారు. బ్రిటిష్ గులాంలైన సంస్థానాధీశ్వరుల నిరంకుశ క్రూర పరిపాలనను నిలువెల్లా నిర్మూలన చేయ రచించిన తెలంగాణ ప్రజల వీరోచిత పోరాటగాథ మా భూమి నాటకం. ఈ నాటక రచన 1946లో జరిగింది. 1948, మే నెలలో నిషేధించారు.
-బెజవాడ గోపాల్‌రెడ్డి మద్రాస్ సీఎంగా ఉన్నప్పుడు ఈ నాటక ప్రదర్శనను ప్రత్యేకంగా ఏర్పాటు చేయించుకొని బ్ర హ్మాండంగా ఉందని అభినందించి తర్వాత నిషేధించాడు.
-నిజాం సంస్థానంలో దేశ్‌ముఖ్‌ల దౌర్జన్యాలకు వ్యతిరేకంగా రైతాంగం సాగించిన పోరాటాన్ని 6 రంగాల నాటకంగా మాభూమిని రచయితలు మలిచారు.
-పోతుగడ్డ నాటకాన్ని ప్రజానాట్య మండలి ముఖ్య పట్టణా ల్లో ప్రదర్శిస్తూ ప్రజా దళాలకు ఊతమిచ్చింది.
-ముందడుగు నాటకం కూడా ఈ కోవలోనిదే. మా భూమి నాటక రచయితల్లో ఒకరైన సుంకర సత్యనారాయణ నాట క దర్శకులుగా మొదటి పాఠాలు పొలాల్లో, గొడ్లకాపురాల వద్దనే నేర్చుకున్నారు.
-1942లో వచ్చిన కమ్యూనిస్టు ఉద్యమం వైపు ఆకర్శితులైన కొందరు ప్రజానాట్యమండలిలో కీలక పాత్ర పోషించారు. ఈ విధంగా తెలంగాణ పోరాట నేపథ్యం, ప్రజా నాట్యమండలి కళాకారుల ప్రోత్సాహం పోరాటకాలంలో నాటకానికి గొప్ప చైతన్య స్ఫూర్తిని తెచ్చిపెట్టాయి.
-తెలంగాణ ఆర్థిక, సాంఘిక, రాజకీయ వ్యవస్థను ప్రతిఫలిస్తూ తెలంగాణ పోరాట చరిత్రకు సాహిత్య కళారూపాలుగా వచ్చిన ఈ నాటకాలు ప్రజానాట్య మండలి ద్వారా ప్రజల్లోకి వెళ్లాయి.
-ఆధునిక నాటక రంగం మూడు భాగాలు 1. సంప్రదాయక నాటక రంగం, 2. ఔత్సాహిక నాటక రంగం, 3. ఉద్యమ నాటక రంగం.
-సామాజిక సంస్కరణలు, జాతీయ ఉద్యమాలు, శ్రమ జీవుల పోరాటాలు, విప్లవాలు, తిరుగుబాట్లు, త్యాగాలు మొదలైన వాటి ప్రభావంతో వచ్చినవే నాటకాలు. ఈ ఉద్యమ కళారంగం మూడు భాగాలు 1. సంఘ సంస్కరణోద్యమం 2. బ్రిటిష్ సామ్రాజ్యవాద వ్యతిరేక ఉద్యమం 3. జమీందారి భూస్వామ్య వ్యతిరేక ఉద్యమం.
-తెలంగాణ పోరాట ప్రతినిధి నాటకం మాభూమి తెలంగాణలో దేశీయ వాతావరణం లోపించిన నాటకం పోతుగడ్డ.
-మా భూమి నాటకాన్ని బొంబాయి, పుణె, షోలాపూర్ మొదలైన పెద్ద పట్టణాల్లో కూడా ప్రదర్శించారు. అక్రమ వసూళ్ల చరిత్రను, వెట్టిచాకిరీని చిత్రించిన నాటికలు పగ, సరబరాహి, న్యాయం.
-సాయుధ గెరిల్లా పోరాటం గురించి చెప్పే నాటికలు వీరకుంకుమ, వీరనారి.
-అప్పట్లో కాంగ్రెస్‌పార్టీని విమర్శించే నాటికలు కూడా వచ్చాయి. అవి కాంగ్రెసా-అంగ్రేజా, శాంతి రక్షణ కోసం, రిపబ్లిక్ వెలిసింది.
-పోతుగడ్డ : ఈ నాటకం 1953లో వాసిరెడ్డి భాస్కర్‌రావు రాశారు. పల్లెలు వదిలి పట్నాలకు పారిపోయిన దేశ్‌ముఖ్‌లు పోలీసుల సహకారంతో గ్రామాలకు తిరిగి చేరడం ఇందులో ఇతివృత్తం.
గెరిల్లా : ఇది 1973లో రాయబడింది. సుంకర రాసినదే. మా భూమి నాటకంలోని పాత్రలే. గెరిల్లా దళాలుగా ఏర్పడి తిరిగి గ్రామాలకు వచ్చిన భూస్వాములను ఎదురించటం ఈ నాటకంలోని కనిపిస్తుంది. 5 రంగాలు, 21 పాత్రలు.
వీరకుంకుమ : 1948లో వచ్చిన రచన. ఇది కూడా గెరిల్లా పోరాటానికి చెందిందే. సుంకర రచన. రజాకార్ల, దేశ్‌ముఖ్‌ల బలగాల దోపిడీ నుంచి ఆత్మరక్షణ దళం రూపొందిం చినదే ఈ నాటక రూపం.
తిరునగరి రామాంజనేయులు తెలంగాణ, వీర తెలంగాణ అనే రెండు నాటకాలు రాశారు. సుంకర-వాసిరెడ్డి సాహిత్య అవార్డును ఆంధ్రనాటక కళాసమితి నుంచి అందుకున్నా రు. వీరకుంకుమ, వెట్టిచాకిరీ నాటికలు కూడా రాశారు.
పగ : ఉద్యమ కార్యకర్తలను, నాయకులను వెంటాడి ఎలా హింసించారో పగ నాటిక చెబుతుంది.
సరబరాహి: అక్రమ వసూళ్లను వస్తువుగా మలిచిన నాటిక ఇది (సరఫరా), ఊరికి అధికారి రానిరోజు లేదు, ఊర్లో కానుకలు, నజరానాలు, సరబరాహిలు లేని రోజు లేదు.
న్యాయం : అమీన్‌సాబ్ అక్రమ వసూళ్లలోని న్యాయాన్ని ప్రశ్నించిన ఇతివృత్తం. ప్రజాచైతన్యమే వారిని ప్రశ్నించేలా చేసింది.
వీరనారి : గరికపాటి రాజారావు రాశారు. పోలీసులకు పట్టుబడ్డ గెరిల్లాలు బందీలుగా, ఎటువంటి చిత్రహింసలను అనుభవించారో, ఎలా ప్రాణాలు కోల్పోయారో తెలుస్తుంది.
కాంగ్రెసా-అంగ్రేజా : ఇది సుంకర సత్యనారాయణ రచన. అప్పటి కాంగ్రెస్‌కి, భూస్వామ్య వర్గాలకు మధ్య తేడా లేదని ఈ నాటకం తెలియజేస్తుంది.
శాంతి రక్షణ కోసం : ఇది మహీధర రామ్మోహనరావు రచన. కమ్యూనిస్టులు రోజురోజుకు ఎలా ప్రజల్లోకి చొచ్చుకొని పోతున్నారో తెలియజేస్తూ దాని వల్ల ప్రజలు ఎదురుతిరుగుతున్నారని నిజాం, కాంగ్రెస్ ప్రభుత్వాలు రెండూ భావించడం ఈ నాటకం ఇతివృత్తం.
రిపబ్లిక్ వెలిసింది : ఇది మహీధర వ్యంగ్య రచన.
వీర తెలంగాణ : తెలంగాణ సరిహద్దు గ్రామాల్లో ప్రదర్శింపబడింది.
తెలంగాణ : సంఘం స్థాపన, సర్కారు దౌర్జన్యాన్ని జనం చైతన్యవంతంగా ఎదుర్కోవటం ఇతివృత్తం. దీన్ని ఒకసారి సూర్యాపేటలో ప్రదర్శించారు. నాటికలు, నాటకాలన్నీ ఆనాటి ప్రజాసాహితీ, అభ్యుదయ అనే పత్రికలో అచ్చయ్యాయి.
తెలంగాణ నాటక రచన ఒక సమీక్ష : హైదరాబాద్ సంస్థానంలో తెలుగు, మరాఠీ, కన్నడ, ఉర్దూ భాషాలు మాట్లాడే ప్రజలు ఉండేవారు. తెలుగు మాట్లాడేవారు-50 శాతం, మరాఠీ-25 శాతం, కన్నడం-11 శాతం, ఉర్దూ-12శాతం ఉండేవారు. ఇంకా గొండు, చెంచు వంటి గిరిజన తెగల ప్రజలు కూడా ఉన్నారు. నిజాం పాలనలో తెలంగాణలో ఏ గ్రామాన్ని చూసినా మధ్యయుగ పాలన, రాక్షస నాగరికత, కళ్లకు కట్టినట్లుగా ఉండేది. తెలంగాణ ప్రాంతంలో సమకాలీన సమస్యలను ప్రస్తావించే సాంఘిక నాటకాలు వచ్చాయి.
శేషాద్రి రమణ కవుల విచిత్ర వివాహం, సుశీల, చంద్రలేఖ, డాక్టర్ పీవీ రమణ రాసిన ఆకురాలిన వసంతం, దేవతలెత్తిన పడగ, వెంటాడే నీడలు, చలిచీమలు, మోత్కురు మధుసూదన్‌రావు సార్థకజీవి, పీవీ రంగారావు రాసిన దంపతులు, సురవరం ప్రతాపరెడ్డి సంఘోద్దరణ, కేఎల్ నర్సింహారావు రచించిన ఆదర్శలోకాలు, అభాగ్యులు, స్వార్థం, గెలుపునీదే, అడుగుజాడలు, కొత్తగుడి, అగ్ని పరీక్ష, భారతి, కొడిగట్టిన దీపాలు, కల్పతరువు, ప్రజాదేవత, పుట్టినరోజు పండుగ, మతిలేని మహారాజు, ముచ్చట్లు, అందరికి చదువు మొదలైనవి.
సుమారు 120 బృందాలు ఒక్క నాటకాన్నే నాలుగేండ్లలో 960 సార్లు ప్రదర్శించిన నాటకం – మాభూమి
కొందరు నాటక కర్తలు
కేఎల్ఎన్ రావు : కోదాటి లక్ష్మీనరసింహాచార్యులు ది రేపాల గ్రామం, మునగాల మండలం, నల్లగొం డ జిల్లా. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ర్టాలను తన గెలుపునీదే నాటకం ద్వారా ఉర్రూతలూగించిన నాటకకర్త. ఇతను అభ్యుదయ భావాలున్న రచయిత. వేయి ప్రదర్శనలతో తెలంగాణ ప్రజల్లో చైతన్యాన్ని తీసుకువచ్చిన నాటిక గెలుపునీదే. కేఎల్ 1941లో రేపాల గ్రామంలో గ్రామవెలుగు గ్రంథాలయాన్ని కూడా స్థాపించి, 1958లో కోదాటివారి ప్రజానాట్యమండలిలో కలిపివేశారు.
సాంఘిక నాటకాలు : పాముల పుట్ట, పాపఫలం, చీకటిని తిట్టకు, దీపాన్ని వెలిగించు, కల్పతరువు, భారతి, ప్రజాదేవత, తుపాకీ రాజ్యం మొదలైన నాటికలు సాంఘిక సమస్యలను ఎత్తి చూపాయి.
సమాచార శాఖవారు భారతి, ప్రజాదేవత, తుపాకీరాజ్యం నాటికలను ప్రతి గ్రామంలో ప్రచారం చేయించారు. నాటక రంగమే వీరి జీవిత సర్వస్వం అని చెప్పొచ్చు.
బోయి భీమన్న : ఇతను రాసిన పాలేరు నాటకం ప్రజల్లో చైతన్యం తెచ్చి తెలంగాణ సాయుధ పోరాటాన్ని ఉత్తేజితం చేసింది.
వెల్దుర్తి మాణిక్యరావు : 1940లో (మెదక్ జిల్లా) రాసిన దయ్యాల పన్గడ నాటికి తెలంగాణ మాండలికంలో రాయబడింది.
పెరిక రాజారత్నం : 5-5-1935న నల్లగొండలో జన్మించారు. ఎడారి బతుకులు, ఇష్టం లేని పెళ్లి, నూతన కాంతులు, ఎవరు బాధ్యులు అనే నాటికలు సాంఘిక సామాజిక సమస్యలకు దర్పణాలు
బద్దం భాస్కర్‌రెడ్డి : చెరబండరాజుగా పిలుబడ్డారు. గంజినీళ్లు నాటిక. ఈయన దిగంబర కవి.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?