Paramedical for quick employment | త్వరిత ఉపాధికి పారామెడికల్
ప్రస్తుతం ప్రవేశ పరీక్షలు పూర్తయి అడ్మిషన్లు జరుగుతున్న సమయం. ఇంటర్ పూర్తయ్యాక ఏ కోర్సులో జాయిన్ అవ్వాలో, ఏ రంగంవైపు అడుగులు వెయ్యాలో అయోమయంగా ఉంటుంది. తల్లిదండ్రులకు ఒకింత ఆందోళన. ఇంజినీరింగ్, మెడిసిన్లే కాకుండా ఎన్నో ఇతర కోర్సులు అందుబాటులో ఉన్నాయి. చాలామందికి ఆయా కోర్సుల పట్ల అవగాహన లేదు. మెడిసిన్‌లో సీటు రాలేదని బాధపడాల్సిన పనిలేదు. వైదర్యంగంలో నిలదొక్కుకొని సేవలు చేయాలనుకునేవారికి ఎన్నో పారామెడికల్ కోర్సులు, ఉద్యోగాలు అందుబాటులో ఉన్నాయి. ప్రభుత్వరంగ సంస్థల్లోనే కాకుండా ప్రైవేట్ రంగంలోను ఉపాధి అవకాశాలు మెండుగా లభిస్తున్నాయి.
సొంతంగా డయాగ్నోస్టిక్ కేంద్రాలను ఏర్పాటు చేసుకొని పదిమందికి ఉపాధి కల్పించే అవకాశం కూడా ఉంది. ముఖ్యంగా వైద్యరంగంలో నర్సింగ్, ఫిజియోథెరపీలే కాకుండా పారామెడికల్ కోర్సులు చాలా ఉన్నాయి. ఈ కోర్సులను వివిధ ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రులు నిర్వహిస్తుంటాయి. శాస్త్ర, సాంకేతికత రంగంలో విప్లవాత్మక మార్పులు రావడంతో రోగ నిర్ధారణలో పారామెడికల్ సాంకేతిక నిపుణుల భాగస్వామ్యం కీలకంగా మారింది. కేవలం రోగ నిర్ధారణ పరీక్షా విభాగాల్లోనే కాకుండా చికిత్స విధానంలో కూడా పారామెడికల్ నిపుణుల సేవలు అత్యంత ప్రాధాన్యం సంతరించుకున్నాయి. వివిధ ప్రభుత్వ, ప్రైవేటు, డీమ్డ్ యూనివర్సిటీలు పీజీ, డిప్లొమా కోర్సులను నిర్వహిస్తున్నాయి. కొన్నిచోట్ల పీజీ కోర్సులు కూడా ఉన్నాయి. తెలుగు రాష్ర్టాల్లో పారామెడికల్ బోర్డులు ఈ కోర్సులను స్వయంగా వివిధ ఆస్పత్రుల సహకారంతో నిర్వహిస్తున్నాయి. ఇతర రాష్ర్టాల్లో తమిళనాడు శ్రీరామచంద్ర మెడికల్ కాలేజీ, మహారాష్ట్ర(ముంబై)లోని టాటా మెమోరియల్ ఆస్పత్రి, ఢిల్లీలోని ఎయిమ్స్, చండీగఢ్‌లోని పీజీఐ ఆస్పత్రి, పుదుచ్చేరిలోని జిప్మర్ సంస్థలు ఈ పారామెడికల్ కోర్సులను అందిస్తున్నాయి. తెలంగాణలో హైదరాబాద్‌లోని ఉస్మానియా జనరల్ ఆస్పత్రి, గాంధీ జనరల్ ఆస్పత్రి, వరంగల్ ఎంజీఎం, రెడ్‌హిల్స్‌లోని ఎంఎన్‌జే క్యాన్సర్ ఆస్పత్రులే కాకుండా వివిధ ప్రైవేట్ ఆస్పత్రుల్లో (అపోలో, యశోద, కామినేని) కూడా ఈ కోర్సు లు అందుబాటులో ఉన్నాయి.
సాధారణంగా ఈ కోర్సులకు జూన్, జూలై నెలల్లో ప్రవేశ ప్రకటనలు వెలువడుతాయి. ముఖ్యంగా మెడికల్, ఇంజినీరింగ్ కౌన్సెలింగ్ ప్రక్రియలు ముగియగానే ఈ కోర్సుల ప్రవేశాలు ప్రారంభిస్తారు. కొన్నిసార్లు ముందుగానే జరుపుతాయి. ఉస్మానియా విశ్వవిద్యాలయం కూడా కొన్ని ప్రైవేట్ ఆస్పత్రుల సహకారంతో పారామెడికల్ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తున్నది. వివిధ పారామెడికల్ కోర్సులు, ఆస్పత్రుల్లో వాటి ఉపయోగాల గురించి నిపుణ పాఠకుల కోసం అందిస్తున్నాం.
మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ
పాథాలజీ, హిస్టో పాథాలజీ, బయోకెమిస్ట్రీ, మైక్రోబయాలజీ, సిరాలజీ మొదలైన రోగ నిర్ధారణ పరీక్షలు చేపడుతారు.
మెడికల్ ఇమేజింగ్ టెక్నాలజీ
ఈ కోర్సు పూర్తి చేసిన సాంకేతిక నిపుణులు ఎక్స్-రే, సీటీస్కాన్, ఎంఆర్ఐ మమ్మోగ్రఫి, డీఎన్ఏ, కంప్యూటర్ రేడియోగ్రఫీ మొదలైన పరీక్షలు నిర్వహిస్తారు.
అనస్థీషియా టెక్నాలజీ
ఈ సాంకేతిక నిపుణులు శస్త్ర చికిత్సల సమయంలో రోగికి మత్తుమందు మోతాదును, కృత్రిమ శ్వాసను నియంత్రిస్తూ అనస్థీషియా డాక్టర్లకు సహకరిస్తారు.
డయాలసిస్ టెక్నాలజీ
ఈ సాంకేతిక సిబ్బంది మూత్రపిండాలు చెడిపోయిన వారికి కృత్రిమ మూత్రపిండాల (డయాలసిస్ మెషీన్) ద్వారా రక్తశుద్ధి ప్రక్రియను చేపడతారు.
ఎలక్ట్రోకార్డియోగ్రామ్ (ఈసీజీ), కార్డియో వాస్కులార్ టెక్నాలజీ
ఈ సాంకేతిక నిపుణులు గుండె పనితనాన్ని పరీక్షించడమే కాకుండా, గుండె శస్త్ర చికిత్స తరువాత పర్యవేక్షణలో కీలకపాత్ర పోషిస్తారు. యాంజియోగ్రామ్లోను వీరి పాత్ర కీలకం.
వాస్కులార్ టెక్నాలజీ
రక్తనాళాల వ్యాధుల నిర్ధారణ, చికిత్సలో ఈ సిబ్బంది కీలకపాత్ర పోషిస్తారు. రక్త సరఫరాను రక్తనాళాల్లో డాప్లర్ పరీక్ష ద్వారా నిర్వహిస్తారు. డీవీటీ లాంటి రోగ నిర్ధారణలో వీరి పాత్ర ఉంటుంది.
రేడియోథెరపీ, న్యూక్లియర్ మెడిసిన్, రేడియేషన్ ఆంకాలజీ టెక్నాలజీ
క్యాన్సర్ నిర్ధారణ, నివారణ, చికిత్స మొదలైన ప్రక్రియల్లో ఈ సిబ్బంది సేవలు చాలా అవసరం. గామా కెమెరా, పెట్‌స్కాన్ పరీక్షలు నిర్వహిస్తారు.
ఫర్ఫ్యూజన్ టెక్నాలజీ
శ్వాస సంబంధ రోగాలతో బాధపడుతున్నవారికి, కృత్రిమ శ్వాసను వెంటిలేటర్ల ద్వారా అందించడంలో, శ్వాస ఇబ్బందులను తొలగించడంలో వీరి పాత్ర కీలకం.
ట్రాన్స్ఫ్యూజన్ టెక్నాలజీ
రక్త సేకరణ, పరీక్షించడం, క్రాస్ మ్యాచింగ్, రక్తం నిల్వ నిర్వహణ లేదా బ్లడ్‌బ్యాంక్ కేంద్రాల నిర్వహణను ఈ సిబ్బంది పర్యవేక్షిస్తారు. రక్తదాతల నుంచి రక్తాన్ని సేకరించి, వివిధ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహిస్తూ రోగికి కావాల్సిన రక్తాన్ని అందించడంలో వీరు ముఖ్యభూమిక పోషిస్తారు.
మెడికల్ రికార్డు టెక్నాలజీ
ఆస్పత్రుల్లో ఔట్‌పేషెంట్, ఇన్‌పేషెంట్ల రిజిస్ట్రేషన్ ప్రక్రియను రోగులకు సంబంధించి రికార్డులను భద్రపర్చడం వీరి విధి. ఆస్పత్రుల రికార్డులు మెడికో లీగల్ కేసుల్లో ఎంతో కీలకం.
-ఇంకా ఎన్నో స్పెషలైజేషన్ కోర్సులు వివిధ ఆస్పత్రులు అందిస్తున్నాయి. రాష్ట్రంలోని ప్రతిష్ఠాత్మక నిజాం వైద్య విజ్ఞాన సంస్థలో పైన పేర్కొన్న స్పెషలైజేషన్లలో పోస్ట్‌గ్రాడ్యుయేషన్ డిప్లొమా కోర్సులను అందిస్తున్నాయి. ఎయిమ్స్, జిప్మర్, పీజీఐ, చంఢీగడ్, నిమ్హాన్స్ బెంగళూరు, మద్రాస్ మెడికల్ కాలేజీ, శ్రీరామచంద్ర, మెడికల్ కాలేజీల్లో డిగ్రీ, పీజీ డిగ్రీ కోర్సులను నిర్వహిస్తున్నారు. ఈ కోర్సుల్లో ప్రవేశానికి ప్రవేశపరీక్ష నిర్వహిస్తారు. కొన్ని సంస్థలు డిగ్రీ ప్రతిభ ఆధారంగా కూడా నిర్వహిస్తాయి. డిప్లొమా, డిగ్రీ కోర్సులకు ఇంటర్మీడియట్ సైన్స్ గ్రూపు వారు అర్హులు. ఇవేకాకుండా నాలుగేండ్ల కాలపరిమితి గల బీఎస్సీ (నర్సింగ్), నాలుగున్నరేండ్ల వ్యవధి గల ఫిజియోథెరపీ, సైన్స్ గ్రాడ్యుయేట్లకు రెండేండ్ల కాలపరిమితి గల హాస్పిటల్ మేనేజ్మెంట్ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. నాలుగున్నరేండ్ల ఫిజియోథెరపీ పూర్తిచేసినవారిని డాక్టర్లుగా పరిగణిస్తారు.
-వివరాలకు www.nims.edu.inను దర్శించవచ్చు.
-నిజాం వైద్య విజ్ఞాన సంస్థ ఆయా కోర్సులకు నోటిఫికేషన్ విడుదల చేసింది.
-పారామెడికల్ కోర్సులకు ఈ నెలలో నోటిఫికేషన్ రానున్నది. ఉస్మానియా, గాంధీ, ఎంఎన్‌జే ఆస్పత్రులకు కూడా ఈ వారంలో నోటిఫికేషన్ వెలువడనుంది. ఈ కోర్సులు పూర్తిచేసిన తర్వాత దేశ, విదేశాల్లో పుష్కలంగా అవకాశాలు ఉన్నాయి. అమెరికా, ఆస్ట్రేలియా, బ్రిటన్, అరబ్ దేశాల్లో ఈ సాంకేతిక సిబ్బందికి ఎంతో డిమాండ్ ఉంది. భారతీయులు ముఖ్యంగా తెలుగువారు ఆయా దేశాల్లో మంచి ఉపాధి పొందుతున్నారు. ఇంకా ఈ కోర్సులను తిరుపతిలో శ్రీ వేంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ కూడా అందిస్తుంది. ప్రైవేట్ సంస్థలు కూడా ఈ కోర్సులను అందిస్తున్నాయి. అయితే ఆయా సంస్థలకు ప్రభుత్వ గుర్తింపు, ఆస్పత్రులకు అనుబంధంగా ఉన్నదీ లేనిది తెలుసుకొని ఆయా కోర్సుల్లో, సంస్థల్లో చేరాలి. ఆర్థిక స్థోమతగలవారు, త్వరగా ఉపాధి పొందాలనుకునేవారు, స్వయం ఉపాధిని ఎన్నుకొనేవారు, వైద్యరంగంలో సేవలను ఇష్టపడేవారు ఈ వృత్తివిద్యా కోర్సులను పూర్తి చేయడం ద్వారా జీవితంలో త్వరగా స్థిరపడవచ్చు.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?