Ordinances of India Cross-rule | ఆర్డినెన్స్‌ల భారతం అడ్డదారి పాలన
పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో ప్రభుత్వానికి పరిపాలనలో ఉపయోగపడే అత్యవసర సదుపాయం ఆర్డినెన్స్. చట్టసభలు సమావేశంలో లేనప్పుడు ప్రభుత్వాలు అత్యవసరాలకోసం జారీచేసే ఈ ఆర్డినెన్స్‌లు పాలనలో జాప్యాన్ని నివారించేందుకు ఒక మార్గం. కానీ భారతదేశంలో ఈ ఆర్డినెన్స్‌ల అర్థం క్రమక్రమంగా మారిపోతున్నది. చట్టసభలను పట్టించుకోకుండా ప్రభుత్వాలు తాము అనుకున్నది చేసేందుకు మళ్లీమళ్లీ ఆర్డినెన్స్‌లు జారీచేస్తున్నాయి. ఇలా ఒకే ఆర్డినెన్స్‌ను మళ్లీమళ్లీ జారీచేయటం రాజ్యాంగ ఉల్లంఘనే అవుతుందని ఇటీవలే దేశ అత్యున్నత న్యాయస్థానం తీర్పుచెప్పింది.
ఈ నేపథ్యంలో ఆర్డినెన్స్‌లపై నిపుణ పాఠకుల కోసం ప్రత్యేక వ్యాసం..
-కుల, మత, జాతి ప్రతిపాదికపై ఓట్లు అడగొద్దని. రెండోది ఆర్డినెన్స్ మళ్లీమళ్లీ జారీ రాజ్యాంగ ఉల్లంఘన కిందికే వస్తుందని సుప్రీంకోర్టు ఇటీవల తీర్పునిచ్చింది.
-ఇక ఆర్డినెన్స్ తిరిగి జారీ చేయడం రాజ్యాంగాన్ని వంచించడమే అని, ప్రభుత్వం ఆర్డినెన్స్‌ను తరచూ చట్టసభల ముందు ఉంచకపోవడం అంటే ప్రజాస్వామ్యయుతంగా జరగాల్సిన చట్టబద్ధ ప్రక్రియను దెబ్బతీయడమే అని ఘాటుగా వ్యాఖ్యానించింది. న్యాయ సమీక్షకు ఆర్డినెన్స్ అతీతం కాదనీ 6-1 మెజారిటీతో రాజ్యాంగ ధర్మాసనం పేర్కొంది.
-ఇంత ఘాటుగా సుప్రీంకోర్టు ఎందుకు స్పందించాల్సి వచ్చింది? ఎందుకు ఆర్డినెన్స్ ప్రక్రియ వివాదాస్పదమవుతుంది? అసలు ఆర్డినెన్స్ అంటే ఏమిటి? అది శాసనప్రక్రియ ద్వారా (పార్లమెంటు) జరిగే చట్టానికి ఎలా అతీతం? దాన్ని ఎలా జారీ చేస్తారు? ఎవరు జారీ చేస్తారు? ఆర్డినెన్స్‌కు సంబంధించి సుప్రీంకోర్టు పాత్ర ఎంత? ఆర్డినెన్స్ పర్యవసానాలేమిటి? ఆర్డినెన్స్ ప్రక్రియ శాసన ప్రక్రియను ఎలా నీరుగారుస్తుంది? రాజ్యాంగంలో ఆర్డినెన్స్‌కు సంబంధించిన విషయాలేవి? ఆర్డినెన్స్‌పై వివిధ సందర్భాల్లో వచ్చిన కీలక తీర్పులేంటి? ఇటీవల కాలంలో జారీ చేసిన ముఖ్యమైన ఆర్డినెన్స్‌లు ఏవి? మొదలైన విషయాలను చర్చిద్దాం..
ఆర్డినెన్స్ అంటే?
-శాసన ప్రక్రియ ద్వారా చేసే చట్టాన్ని, కార్యనిర్వహణ చేయడమే ఆర్డినెన్స్. అంటే పార్లమెంటు చేసే చట్టాన్ని రాష్ట్రపతి లేదా గవర్నర్ చేయడాన్ని ఆర్డినెన్స్ అంటారు. ఈ ఆర్డినెన్స్‌కు కూడా చట్టానికున్న హోదా, గౌరవం ఉంటాయి.
రాజ్యాంగంలో ఆర్డినెన్స్
-రాజ్యాంగంలోని అధికరణ 123 ప్రకారం పార్లమెంటు ఉభయసభలు సమావేశంలో లేనప్పుడు అత్యవసరంగా చట్టం చేయాల్సిన పరిస్థితి ఏర్పడితే, ఆర్డినెన్స్ రూపంలో రాష్ట్రపతి చట్టం చేస్తారు.
-గవర్నర్ అయితే ఆర్టికల్ 213 (1) ప్రకారం ఇదే తరహా ఆర్డినెన్స్ జారీ చేస్తారు.
ప్రత్యేకతలు
1.ప్రధానమంత్రి, మంత్రిమండలి సలహామేరకే ఆర్డినెన్స్ జారీచేస్తారు.
2.ఈ విధంగా జారీచేసిన ఆర్డినెన్స్‌ను పార్లమెంటు తిరిగి సమావేశమైన తరువాత ఆరు వారాల్లోపు ఆమోదించాలి.
3.పార్లమెంటు ఆమోదించిన తరువాత ఆర్డినెన్స్ సాధారణ చట్టం అవుతుంది. లేదంటే రద్దవుతుంది.
4.రాష్ట్రపతి మరొక ఆదేశం ద్వారా ఆర్డినెన్స్‌ను ఎప్పుడైనా రద్దు చేయవచ్చు.
5.రాష్ట్రపతికి ఉన్న ఆర్డినెన్స్ జారీచేసే అధికారం పార్లమెంటు శాసనాధికారంతో సమానంగా ఉంటుం ది. అంటే పార్లమెంటు ఏ జాబితాలో చట్టాలు చేస్తుందో ఆ జాబితాల్లోనూ రాష్ట్రపతి ఆర్డినెన్స్ జారీ చేయవచ్చు. అయితే అది శాసనాధికారానికి ప్రత్యామ్నాయం, సమాంతరం కాదు, సహసంబంధ అధికారం మాత్రమే.
-ఈ నియమాలన్నీ దాదాపుగా ఆర్టికల్ 213 (1) ప్రకారం గవర్నర్‌కు కూడా వర్తిస్తాయి.
ఆర్డినెన్స్ కాలపరిమితి
-సాధారణంగా ఆర్డినెన్స్‌ను పార్లమెంటు తిరిగి సమావేశమైన తరువాత ఆరు వారాల్లోపు ఆమోదించాలి.
-ఈ ఆర్డినెన్స్ పార్లమెంటు ద్వారా ఆమోదం పొందకుండా గరిష్టంగా ఏడు నెలల పదిహేను రోజులు అమల్లో ఉంటుంది.
-అంటే పార్లమెంటు ఒక సమావేశానికి, మరొక సమావేశానికి మధ్య కాలం ఆరు నెలలు, అలాగే పార్లమెంటు సమావేశమైన తరువాత, ఆరు వారాల్లోపు ఆమోదించవచ్చనే నియమం వల్ల, ఒకవేళ పార్లమెంటు సమావేశం ముగిసిన తరువాత ఆర్డినెన్స్ జారీ అయి, తిరిగి సమావేశమైన తరువాత ఆరో వారం చివరి రోజున ఆమోదించినట్లయితే 6 నెలలు+ 6 వారాలు, గరిష్టంగా ఏడున్నర నెలలు అవుతుంది.
-అయితే ఆర్డినెన్స్‌కు కనిష్ట కాలపరిమితి లేదు. దీన్ని రాష్ట్రపతి ఎప్పుడైనా రద్దు చేయవచ్చు.
అసలు ఎందుకు వివాదాస్పదమవుతుంది?
-నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఇప్పటికే దాదాపు 26 ఆర్డినెన్స్‌లు జారీచేసింది. అంటే కేవలం రెండున్నరేండ్లలో ఇన్ని ఆర్డినెన్స్‌లు జారీఅయ్యాయంటే పార్లమెంటరీ వ్యవస్థ పనితీరు ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.
-ఆర్డినెన్స్ పాలనగా ముద్రపడిన ఎన్డీఏ ప్రభుత్వం.. పార్లమెంటు సరిగా నడవకపోవడంతోనే ఆర్డినెన్స్ దారి వెతుక్కోవల్సి వస్తుందని పేర్కొంది. అయితే కేవలం ప్రత్యేక సందర్భాల్లో, అత్యవసర సమయంలో మాత్రమే జారీ చేయాల్సిన ఆర్డినెన్స్ ఇలా శాసన ప్రక్రియ పద్ధతినే సవాలుచేసే స్థితికి ఎందుకు వెళ్లిందో పక్కన ఉన్న పట్టిక ద్వారా తెలుసుకోవచ్చు.
-పట్టికను పరిశీలిస్తే కేవలం అత్యవసర సమయంలో జారీ చేయాల్సిన ఆర్డినెన్స్‌ను తమ ఇష్టమొచ్చినట్లు ఎప్పడు పడితే అప్పుడు జారీచేశారనే విషయం స్పష్టమవుతుంది.
1.పార్లమెంటు ద్వారా జరగాల్సిన చట్టాలు కార్యనిర్వహణ శాఖ ద్వారా అంటే రాష్ట్రపతి ద్వారా జరగడం వల్ల.
2.అత్యవసర సమయంలో మాత్రమే జారీ చేయాల్సిన ఆర్డినెన్స్ ఎప్పుడు పడితే అప్పుడు జారీచేయడం.
3.రాష్ట్రపతి ఆర్డినెన్స్ అధికారం న్యాయ సమీక్షకు అతీతమని వక్రభాష్యాలు చెప్పడం.
4.రాష్ట్రపతి విచక్షణాధికారంపై సరైన నిర్వచనం లేకపోవడం.
5.తమవైన విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి, పార్లమెంటు ద్వారా సాధ్యం కానప్పుడు ఇలా ఆర్డినెన్స్ రూపంలో చట్టం చేయడం.
6.పార్లమెంటు, కార్యనిర్వహణ శాఖ ఎప్పుడూ తమ అధికారాలను విడివిడిగా అమలు చేయాలి. కానీ అలా జరగకుండా రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా జరగడం.
-పై కారణాలవల్ల ఎన్నో రకాల కేసులు, విదాదాలు ఆర్డినెన్స్‌పై సుప్రీంకోర్టు తలుపు తట్టాయి.
ఆర్డినెన్స్‌పై చర్చలు – వివాదాలు – తీర్పులు
1.ఆర్సీ కూపర్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు- 1970
-రాష్ట్రపతికి ఉండే విచక్షణాధికారం ఆయన/ఆమె వ్యక్తిగతం కాదనీ అది మొత్తం రాష్ట్రపతి ఆఫీస్‌కు సంబంధించిందనీ అంటే మంత్రిమండలి సంతృప్తి చెందితేనే ఆర్డినెన్స్ జారీచేయాలని సుప్రీంకోర్టు పేర్కొంది.
2.38వ రాజ్యాంగ సవరణ-1975
-ఆర్టికల్ 123కి క్లాజ్ 4ను కొత్తగా చేరుస్తూ రాష్ట్రపతి సంతృప్తి అనేది అంతిమమనీ దాన్ని ఎలాంటి కోర్టుల్లో ప్రశ్నించవద్దని పేర్కొంది. అంటే న్యాయసమీక్ష అధికారం ఆర్డినెన్స్‌కి వర్తించదని పేర్కొన్నారు.
3.44వ రాజ్యాంగ సవరణ-1978
-38వ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చిన క్లాజ్ 4ను తీసివేసి రాష్ట్రపతి ఆర్డినెన్స్ జారీ చేసే అధికారం న్యాయ సమీక్ష కిందకు వస్తుందని పేర్కొన్నారు.
4.ఏకే రాయ్ Vs యూనియన్ ఆఫ్ ఇండియా-1980
-ఆర్డినెన్స్ న్యాయసమీక్ష అధికారం కిందకు వస్తుందని సుప్రీంకోర్టు పేర్కొంది.
-ప్రాథమిక హక్కులను ఉల్లంఘించవద్దని పేర్కొంది.
-ఆర్డినెన్స్‌ను జారీచేయడానికి పార్లమెంటు సమావేశాలను నిరవధిక వాయిదా వేయవచ్చని కూడా పేర్కొంది.
-ఇది రాజ్యాంగ సవరణకు ఉపయోగించకూడదని పేర్కొంది.
5.డీసీ వాద్వా వర్సెస్ బీహార్- 1987
-ఈ కేసులో ఆర్డినెన్స్ జారీచేసే అధికారంపై సమగ్రమైన, విస్తృతమైన తీర్పును సుప్రీంకోర్టు వెలువరించింది. ఒక ఆర్డినెన్స్‌ను జారీచేసిన తరువాత అందులో మార్పులు, చేర్పులు చేయకుండా యథాతథంగా దాన్ని కొనసాగిస్తూ మరొక ఆర్డినెన్స్ జారీచేయడం రాజ్యాంగ స్ఫూర్తికి, ప్రజాస్వామ్య ప్రక్రియకు విరుద్ధమని, అది రాజ్యాంగంపై దాడిగా పేర్కొంది.
-బీహార్ ప్రభుత్వం 1967-81 మధ్య 259 ఆర్డినెన్స్‌లను జారీచేసింది. అందులో కొన్ని దాదాపు 14 ఏండ్లు అమల్లో ఉన్నాయి. ఆర్డినెన్స్ రాజ్ విధానాన్ని తీవ్రంగా తప్పుపడుతూ సుప్రీంకోర్టు పైతీర్పును వెలువరించింది.
ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ముఖ్యాంశాలు
1.ఆర్డినెన్స్ మళ్లీ మళ్లీ జారీచేయడం రాజ్యాంగాన్ని వంచించడమే.
2.చట్టసభలు ఆమోదించిన చట్టానికి ఉన్న సామర్థ్యమే అత్యవసర ఆదేశానికి ఉంటుంది.
3.రాష్ట్రపతి, గవర్నర్ల సంతృప్తి దుర్బుద్ధితో కూడుకున్నదైతే అది న్యాయసమీక్షకు అతీతం కాదని పేర్కొంది.
4.ప్రజాస్వామ్యంలో శాసనాలు చేసేది అంతిమంగా చట్టసభలే కాబట్టి వీటికాడికి వెళ్లకుండా అత్యవసర అదేశాలు (ఆర్డినెన్స్) జారీ చేయడం రాజ్యాంగం అనుమతించదని పేర్కొంది. అది చట్టసభల సార్వభౌమాధికారాన్నే దెబ్బతీస్తుందని పేర్కొంది.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?