Morality is the foundation of building a peace society | నైతికతే శాంతిసమాజ నిర్మాణ పునాది
ప్రతి సమాజంలో నైతిక నియమాలు (ఎథిక్స్) సమాజ మనుగడను ప్రత్యక్షంగా శాసిస్తాయి. సమాజంలోని ప్రతి వ్యక్తి నైతికతను పాటిస్తే సమాజంలో ఎలాంటి సంఘర్షణ, అలజడి, ఆందోళన కనపడదు. నైతిక ప్రవర్తనలు మంచి నడవడిని, సమాజ నియమాల పట్ల నమ్మకాన్ని కోరుకొంటాయి. అందువల్ల సమాజంలో నైతిక నియమాలు అనేక ప్రధాన సామాజిక నియంత్రణ సాధనాలుగా వ్యవహరిస్తాయని చెప్పవచ్చు.
హిందూ మతంలో నైతిక విలువలు
-హిందూ మతం ఒక ప్రాచీనమైన మతం భారతదేశంలో 79.8 శాతం మంది అనుసరిస్తున్న ఈ మతం వైవిధ్యభరితమైంది. ప్రముఖంగా శైవం (శివుడు ఒక అత్యున్నతదైవం అనే నమ్మకం గల శివారాధన), వైష్ణవం (విష్ణువే అత్యున్నతదైవం), శాక్తికేయం (దేవి జగన్మాత ఆరాధన) వంటి మతపరమైన వైవిధ్యాలు స్పష్టంగా కనపడతాయి. హిందూ మతం ఒక సనాతన ధర్మం. ఒక శాశ్వత (అనంతమైన) న్యాయం లేదా ఒక శాశ్వాతమార్గమని నమ్మడం జరుగుతుంది. నిజాయితీ, స్వయం నియంత్రణ, ఉదారస్వభావం, మంచితనం, దయ, స్వచ్ఛత వంటి గుణాలను కలిగి ఉండటమే సనాతన ధర్మం.
ఇస్లాం మతంలోని నైతిక విలువలు
-ఇస్లాం అంటే ఆత్మ సమర్పణం అంటే అల్లాకు ఆత్మ సమర్పణ చేసుకొని, భగవదాజ్ఞలకు అతని పరిపాలనకు విధేయులుగా ఉండటం. ఈ స్థితి మాత్రమే నిజమైన శాంతిని అనంతమైన నిర్మలత్వాన్ని అనుభవించడానికి దోహదం చేస్తుంది.
-ఒకే దేవున్ని నమ్మడం, దేవునిపై అపార నమ్మకం విశ్వాసాన్ని కలిగి ఉండటం వల్ల నిరాశ, పాపం నుంచి రక్షణ పొందడం
-దేవుడి దూతలందరూ మంచిని ప్రబోధించే ఉన్నతమైన గురువులు, మానవజాతికి దేవుని సందేశాన్ని అందించడానికి దేవునిచే ఎన్నికైనవారు.
-మనం చేసే ప్రతి పని, మనకు కలిగిన ప్రతి ఉద్దేశం మన ప్రతి కదలిక కచ్చితంగా లెక్కించబడి, లిఖించబడి ఉంటుంది.
-దేవుడు తన మేధ, ప్రేమను ఒక ఉద్దేశంతోనూ, అర్థవంతమైన ఉపయోగం కోసం తన కార్యకలాపాలను కొనసాగిస్తాడని నిజమైన మహమ్మదీయుడు నమ్ముతాడు.
-భగవంతుడిపై తన విశ్వాసాన్ని, తన విధేయతను చాటి చెప్పడానికిగాను ప్రతిరోజు ఐదు సార్లు దైవ ప్రార్థన (నమాజ్) చేయాలి.
-ఇస్లాం పవిత్రమాసమైన రంజాన్‌లో కఠిన ఉపవాస దీక్షను పాటించాలి.
-తన సంపాదనలో రెండున్నర శాతం పేద ప్రజలకు, అవసరమైన వారికి ప్రతి ఏడాది దాన ధర్మాలు చేయాలి. దీన్నే జకాత్ అంటారు.
-ప్రతి ముస్లిం తన జీవితకాలంలో కనీసం ఒక్కసారైనా మక్కాయాత్ర (హజ్‌యాత్ర) చేయాలి. ఇది తన కుటుంబ సభ్యుల కనీస అవసరాలు తీరిన తర్వాత ప్రయాణపు ఖర్చు భరించగలిగి ఉన్నప్పుడు మాత్రమే చేయాలి.
-ఇస్లాం మతం మానవ జాతికి కొన్ని ప్రాథమిక హక్కుల ద్వారా సమానత్వం, సౌభ్రాతృత్వాన్ని అందించాలి. వీటిని అందుకోవడానికి న్యాయబద్ధమైన రక్షణలను, నైతిక వ్యవస్థలను ఏర్పాటు చేసింది.
-మానవతావాదం, తోటి మానవుల పట్ల దయ, ప్రేమ, భగవంతునిపట్ల విశ్వాసాన్ని కలిగి ఉండాలని ఇస్లాం ప్రబోధిస్తుంది.
-ఇస్లాం మతంలోని సామాజిక బాధ్యత అనేది దయ, ఇతరులను బాధించకుండా ఉండటంపై ఆధారపడి ఉంటుంది.
-ఇస్లాం మతం కనికరాన్ని, సామాజిక సంబంధాలను, ఆ సంబంధాల మధ్యగల క్రమాన్ని నొక్కిచెబుతుంది. మన బాధ్యతను తెలుపుతుంది. బాధ్యత ప్రథమంగా మన కుటుంబసభ్యులు తల్లిదండ్రులు, భర్త లేదా భార్యాపిల్లలు, తరువాత ఇతర బంధువులు, ఇరుగుపొరుగువారు, స్నేహితులు, పరిచయస్తులు, అనాథలు, వితంతువులు, సమాజంలోని దీనులు, ఇతర మానవులందరితోనూ సత్సంబంధాన్ని కలిగి ఉండటమే ఇస్లాం మత సారాంశం.
-తల్లిదండ్రుల పట్ల అనురాగాన్ని, భక్తి ప్రపత్తులను వారి సంరక్షణ బాధ్యతను ఇస్లాం బోధనలు బలపరుస్తాయి.
-భగవంతుని దృష్టిలో మానవులందరూ సమానులే.
క్రైస్తవ మతంలో నైతిక విలువలు
-క్రైస్తవ మతంలో అనేక నైతిక ధర్మాలు ఉన్నాయి. ఇవి మానవున్ని నీతిమంతుడిగా మార్చడానికి దోహదపడుతాయి.
-వీటిలో భగవంతునిచే ప్రతిపాదించబడిన పది సూత్రాలు మోక్షానందం, స్వర్ణపాలనకు క్రియాశీల సాధనాలుగా ఉంటాయి. అవి…
1. నేనే ప్రభువు, నేనే దైవం
2. ఇతరులకు భయాందోళనలు కలిగించకు
3. ప్రభువు పేరు గర్వాహంకారంతో తలచకూడదు
4. సప్తమ పవిత్ర దినమును గుర్తుంచుకోవాలి
5. తల్లిదండ్రులను గౌరవించాలి
6. ఎవరినీ చంపకూడదు
7. వ్యభిచరించవద్దు
8. దొంగతనం చేయకూడదు
9. ఎవరికి అబద్దపు సాక్ష్యం చెప్పకూడదు
10. ఇతరుల ఇంటికి హాని చేయకూడదు, భార్యను గానీ, జంతువులను గాని చంపకూడదు
-క్రైస్తవ మతంలోని ఆదర్శాలైన అణకువ, కనికరం, ఆధ్యాత్మికత, జాలి వంటివి జీవన విధానాన్ని వర్ణించడమేకాకుండా, మానవ సమాజం శాంతియుత జీవనానికి దోహదపడుతుంది.
సిక్కు మతంలోని నైతిక విలువలు
-సిక్కుమతం ఆధ్యాత్మిక లౌకిక జీవనాలు రెండింటి కలయికతో మానవ జీవనాన్ని నడిపిస్తుంది. నిర్మలమైన జీవనం నిగ్రహం, నిజాయితీ, ధ్యానచింతన వ్యక్తికి తప్పనిసరి.
-సిక్కుమతం ఇతరులను బాధించడాన్ని, అన్యాయాన్ని, ధర్మవిరుద్ధంగా ప్రవర్తించడాన్ని వ్యతిరేకిస్తుంది.
-గురునానక్ సేవా భావాన్ని సమర్థిస్తారు. పంచుకోవడం, సమానత్వ భావనలతో గురునానక్ ఏర్పాటు చేసిన సామాజిక వంటశాల (లంగర్) నేటికీ గురుద్వారాలో ఒక భాగంగా ఉంది.
-సిక్కుమతం మానవునిలోని ఐదు అంతర్గత శత్రువుల పట్ల జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తుంది. అవి.. కామం, క్రోధం, లోభం, మోహం, అహంకారం.
-మానవునిలోని ఐదు సుగుణాలు.. సత్యం, కనికరం, ప్రేమ, సంతృప్తి, విధేయత
బౌద్ధమతంలోని నైతిక విలువలు
-బుద్ధుడు మద్యేమార్గ సిద్ధాంతాన్ని ప్రచారం చేశాడు. ఈ సిద్ధాంతంలోని నైతిక సూత్రాలు..
1. సత్ప్రవర్తన, 2. దానగుణం, 3.శీలత్వం
4. కోరికలను జయించడం, 5.ప్రేమ, దయ
6. ఏ జీవికి కూడా హాని తలపెట్టకపోవడం
-బౌద్ధమతం సామాజిక సమానత్వం కోసం పోరాడింది.
-బౌద్ధులు స్వయం నియంత్రణకు అధిక ప్రాధాన్యతనిస్తారు.
-జీవ హింసను వ్యతిరేకించింది. తనదికాని దానిని ఆశించకూడదు. చెడునడతను విడిచిపెట్టాలి.
-బౌద్ధమతం లక్ష్యాత్మకతను, సంప్రదాయబద్ధమైన జీవనానికి ప్రాధాన్యతనిస్తుంది.
జైన మతంలో..
-జైనమతంలోని అతిముఖ్యమైన నైతిక ప్రవర్తన అహింసను పాటించడం. దీంతోపాటు ప్రతి పనికి చివరకు ఆహారం విషయంలో కూడా అహింసా పద్ధతిని ఆచరించాలి.
-అహింస, సత్యం, ఆస్తేయం (దొంగతనం చేయరాదు), అపరిగ్రహం (ఆస్తిని కలిగి ఉండకుండటం, వస్తు వ్యామోహం లేకపోవడం), బ్రహ్మచర్యం (ఇంద్రియ నిగ్రహం) జైనమత సూత్రాలు.
-ప్రతి మనిషి తన ఆలోచనలను, కోరికలను నియంత్రిచుకోవడానికి ద్యానం సహాయపడుతుందని జైనం ప్రచారం చేస్తుంది.
-భారతీయ సమాజంలో ప్రపంచంలోని అన్ని మతాలు ఉన్నాయి. అవి సర్వమానవ సమానత్వాన్ని ప్రచారం చేస్తున్నాయి. ప్రతి మతం నైతిక జీవనాన్ని ప్రోత్సహిస్తుంది. అందువల్ల సమాజంలోని ప్రతి ఒక్కరు నైతిక జీవనాన్ని ఆచరించగలిగితే సమాజంలో ఎలాంటి సంఘర్షణ, సమస్యలు తలెత్తవు.
హిందూ మతంలోని మౌలిక నమ్మకాలు
-వ్యక్తి తన ఆలోచనలు, మాటలు, చేతల ద్వారా తన విధికి తానే బాధ్యుడు
-ప్రతి ఆత్మకూ దాని కర్మ పరిపక్వమయ్యేవరకూ జన్మ, పునర్జన్మలుంటాయి. జన్మ రాహిత్యాన్ని పొందడమే మోక్షం.
-సన్మార్గ సాధనకు ఒక గురువు తప్పనిసరి
-సాటి మానవుడి పట్ల సానుభూతి దయాగుణాన్ని కలిగి ఉండి అహింసా జీవన విధానాన్ని పాటించాలి.
-హిందూ మతంలోని మూల వేదాంత గ్రంథాలు
1. ఉపనిషత్తులు 2. భగవద్గీత 3. బ్రహ్మసూత్రాలు (ఉపనిషత్తులకు వాఖ్యానాలు)
-హిందూతత్వంలోని వ్యవస్థలు
1. న్యాయ 2. వైశేషిక 3. యోగ 4. సాంఖ్య 5. పూర్వ మీమాంస 6. ఉత్తర మీమాంస
-మొత్తం ఉపనిషత్తులు – 108
-వేదాలు నాలుగు
1. రుగ్వేదం 2. సామవేదం 3. యుజుర్వేదం 4. అధర్వణ వేదం
-ఉపనిషత్తుల లక్ష్యం బ్రహ్మజ్ఞానాన్ని సాధించి తన ద్వారా మోక్షాన్ని సాధించుట
-ఉపనిషత్తులన్నీ నీతి సంగ్రాహ సారాంశాలే
-ఒక వ్యక్తిని వివేకవంతుడిగా, ఆదర్శవంతుడిగా తీర్చిదిద్దడానికి అవసరమైన కార్యాచరణను ఉపనిషత్తులు అందిస్తాయి.
-స్వయం నియంత్రణ (Self Control) పెద్దల పట్ల వినయం, ఉదారగుణం, ఉపకారగుణం, గురువులు, అతిథుల పట్ల భక్తిభావం, ఆహారం పట్ల గౌరవభావం (అన్నం పరబ్రహ్మ స్వరూపం) సత్యసంపద, సత్ప్రవర్తన మొదలగు మంచి గుణాలను ఉపనిషత్తుల నుంచి గ్రహించడమైంది.
-మానవునిలోని అరిషడ్వార్గాలైన కామం (కోరికలు) క్రోధం (కోపం), లోభం (అత్యాశ) మోహం (అతిప్రేమ) మదం (పొగరు) మాత్సర్యం (అసూయ)లను త్యజిస్తేనే మానవుడు ప్రశాంతంగా జీవిస్తాడు.
-స్వార్థరహితంగా కర్తవ్యాన్ని నిర్వహించాలని భగవద్గీత ప్రబోధిస్తుంది. ఇది సమాజానికి అన్ని కాలాల్లోని అనంతమైన ఒక ప్రేరణ.
-ఎటువంటి ప్రతిఫలాన్ని ఆశించకుండా మన కర్తవ్యాన్ని మనం నిర్వర్తించాలని పేర్కొనే భగవద్గీతలోని అంశం నేటి యువతకు ఒక చక్కని సందేశం.
-రామాయణం స్నేహధర్మాన్ని, దయ, ఉపకారగుణం వంటి విలువలను ప్రబోధిస్తుంది.
-ప్రతి సందర్భంలోను మహభారతం మనకు నైతికతను ఉత్తమ ప్రదర్శనను ధర్మబద్ధమైన నైతిక విలువలను అందిస్తుంది.
-మహాభారతం మనకు సాంఘిక ప్రవర్తనను కూడా నిర్దేశిస్తుంది.
-ప్రతి వ్యక్తి ధర్మబద్ధంగా ప్రవర్తిస్తూ తన వృత్తిని సక్రమంగా నిర్వహిస్తూ, ధర్మబద్ధంగా ధనాన్ని సంపాదిస్తూ ప్రాపంచిక కోరికలను తీర్చుకొంటూ ఆదర్శవంతమైన జీవితాన్ని గడపాలని పురుషార్థాలు పేర్కొంటున్నాయి.
-ధర్మబద్ధమైన జీవనం అనేది సమాజానికి వెన్నెముక వంటిది.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?