Monetary-inflation | ద్రవ్యపరపతి-ద్రవ్యోల్బనం
ప్రతి ఆర్థిక వ్యవస్థలో ద్రవ్యపరపతి అనేది అత్యంత కీలకం. ద్రవ్యపరపతికి, ద్రవ్యోల్బనానికి ప్రత్యక్ష సంబంధం ఉంటుంది. ద్రవ్యపరపతి, ద్రవ్యోల్బనాల్లో వచ్చే హెచ్చుతగ్గులతో ఆర్థిక వ్యవస్థలో అనూహ్య మార్పులు వస్తుంటాయి. పోటీ పరీక్షల్లో కూడా ఎకానమీ విభాగంలో ఈ అంశం చాలా కీలకమైనది. ఈ నేపథ్యంలో నిపుణ పాఠకుల కోసం ఈ ప్రత్యేక వ్యాసం..
ఆర్థిక వ్యవస్థ సమతౌల్యం
-మనిషికి రకరకాల ప్రవర్తనలుంటాయి. సాంఘిక, రాజకీయ, మతసంబంధ, సాంస్కృతిక, నైతిక ప్రవర్తనలు. అలాంటిదే ఆర్థిక ప్రవర్తనకూడా.
-ఆర్థిక ప్రవర్తన అంటే డబ్బు సంపాదించడం ఖర్చు చేయడం.
-కోరికలున్నాయి. కాబట్టి కష్టపడాలి, డబ్బు సంపాదించాలి. ఖర్చు చేసి మనకు కావల్సినవి కొనుక్కొని సంతోషపడాలి. కోరికలు + పని + సంతృప్తి.
-ఇది మన ఆర్థిక కార్యకలాపాల స్వరూపం.
-ఒక కోరిక తీరగానే ఇంకోటి పుడుతుంది. చిన్నప్పుడు తక్కువ, పెద్దయ్యాక ఎక్కువ కోరికలు పుడతాయి.
వనరుల అసమతౌల్యం
-ఏ క్షణంలో చూసినా కోరికలు ఎక్కువ, డబ్బులు తక్కువగా ఉంటాయి.
-అవి రెండు ఎప్పుడూ మ్యాచ్ కావు.
-కోరికల్ని అందుకోవడానికి డబ్బు వెంట పరిగెడతాడు మనిషి.
-లంచాలు, నల్లధనం మొదలైనవి.
-కానీ అవి రెండు రైలు పట్టాల వంటివి. ఎప్పుడూ కలుసుకోవు.
-డబ్బును పెంచుకోవడం కన్నా, కోరికలను తగ్గించుకొని సమతౌల్యానికి రావడం చాలా సులభం. అదే శాశ్వతమైనదని మనిషి గ్రహించడు.
-ఇది ద్రవ్యం/డబ్బు సృష్టించే మొదటి అసమతౌల్యం.
విలువల అసమతౌల్యం
-డబ్బు సంపాదించడానికి మనిషి పని చేయాలి. కూర్చోబెట్టి ఎవరూ జీతం ఇవ్వరు.
-పని చేయడమంటే ఉత్పత్తి కార్యకలాపంలో పాల్గొనడం.
-ఉత్పత్తి ఒక్కడు చేసేది కాదు. నాలుగు ఉత్పత్తి కారకాలు భూమి, శ్రమ, మూలధనం, వ్యవస్థాపన కలిసి చేసేది.
-పని చేసినందుకు వాటికి ప్రతిఫలాలు చెల్లించాలి.
-ఈ ప్రతిఫలాలు ఎవరూ తమ జేబులోంచి ఇవ్వరు.
-నాలుగు కలిసి సృష్టించిన ఉత్పత్తి విలువను వాటి మధ్య సమంగా పంపిణీ చేస్తారు.
-నలుగురు కలిసి రూ. 100 విలువైన ఉత్పత్తి సృష్టిస్తే 100/4 = 25. తలా ఒక్కరికి రూ. 25ల జీతం ఉంటుంది.
-అమ్మకముందే జీతం, తరువాతి కాలంలో ఉత్పత్తిదారుడు రూ. 100 వస్తువును రూ. 200కు అమ్ముకుంటాడు. ఇది విలువల అసమతౌల్యం.
ధరల అసమతౌల్యం
-పని చేసే దగ్గర మన చేతులపై తయారైన రూ. 10 వస్తువుకు ఎన్ని టాక్సులు/కమీషన్లు/రవాణా చార్జీలు కలిపినా దాని మార్కెట్ ధర రూ. 15 లేదా రూ. 20ని మించి ఉండరాదు. కానీ రూ. 50లకు పెరిగితే! మార్కెట్ అసమతౌల్యాలు అంటారు. ఇది ధరల అసమతౌల్యం.
ద్రవ్యం – ద్రవ్యత్వాభిరుచి
-సర్వాంగీకారం పొందిన వినిమయ సాధనం ద్రవ్యం. యంత్రాలు సవ్యంగా పనిచేయడానికి ఉపయోగించే నూనె వంటిది- వస్తుసేవలను వినియోగదారులకు చేర్చే సాంకేతిక సాధనం.
-బల్లపరుపుగా ఉండటం వల్ల అది పోగుపడిపోతుంది. అది చెలామణి అవుతుంది.
ద్రవ్యం నిశ్చల విధులు
-వినిమయ సాధనం – విలువల కొలమానం
-విలువల నిధి – వాయిదాల చెల్లింపునకు ప్రమాణం.
ద్రవ్యం చలన విధులు
-ఉపాంత ప్రయోజనాలు
-జాతీయాదాయ పంపిణీ
-పరపతికి పునాది
-సంపదకు సమానరూపత.
-ధరలు, ఉత్పత్తి, ఆదాయ పంపిణీల్లో మార్పులు
ద్రవ్యత్వాభిరుచి
-నీ ముందు రూ. వెయ్యి నోటు, రూ. లక్ష చెక్కు ఉంచితే దేనికి ప్రిఫరెన్స్ ఇస్తావు?
-కచ్చితంగా రూ. 1000 నోటునే అందుకుంటాం!
-డబ్బును డబ్బురూపంలో కలిగి ఉండాలనే కోరిక ద్రవ్యత్వాభిరుచి అంటారు. అంటే ఇతర రూపాల్లో డబ్బును ఇష్టపడరు. ఐదు లక్షలైనా అది పది లక్షల విలువైనది అయినా. దీన్ని లిక్విడిటీ అసమతౌల్యం అంటారు.
-ద్రవ్యత్వాభిరుచి ద్రవ్య సప్లయ్‌కి పునాది.
-ద్రవ్య సప్లయ్ (M1+M2+M3+M4+ పరపతి ద్రవ్యం)
M1= యాక్టివ్ మనీ. రోజువారీ కార్యకలాపాల కోసం మనం పర్సులో పెట్టుకుని తిరిగేది.
M2= ఎమర్జెన్సీ మనీ. అనుకోని ఆపదలను ఎదుర్కొనేందుకు బ్యాంకులో దాచుకున్నది. (M1+సేవింగ్ A/C)
M3= కంటింజెన్సీ మనీ. భవిష్యత్ అవసరాలకోసం దాచుకున్నది. ఫిక్స్డ్ డిపాజిట్లు. (M2+ఫిక్స్డ్ డిపాజిట్లు)
M4= స్పెక్యులేటివ్ మనీ. లాభాలు పెంచుకోవడానికి ఉపయోగించే మిగులు ద్రవ్యం. భూములు/షేర్లపై పెట్టుబడులు/ఎక్కువ వడ్డీ ఇస్తుంది కాబట్టి PO డిపాజిట్. (M3+PO డిపాజిట్)
నోట్: M1 / M2 / M3 + అంటే అవికాక అని అర్థం.
చెలామణి ద్రవ్యం – బ్యాంకు ద్రవ్యం
-మనం వెళ్లి బ్యాంకులో రూ. 1000 డిపాజిట్ చేస్తాం. ఇది చెలామణి ద్రవ్యం.
-ఆ డబ్బును గల్లాపెట్టెలో వేసుకుని పాస్‌బుక్‌లో ఎంట్రీ చేసి మనకు ఇస్తాడు.
-పాస్‌బుక్‌లోని ఎంట్రీ కూడా డబ్బుతో సమానమే. చెక్కులు ఉపయోగించి మనం కొనుగోళ్లు, అమ్మకాలు చేయవచ్చు.
-గల్లాపెట్టెలో డబ్బు అలాగే ఉంది. కానీ ఒకటి పోయి రెండయ్యాయి.
-మనం పదివేలు ఒకటేసారి విత్ డ్రా చేయమని బ్యాంకర్‌కు తెలుసు. అందుకే మన గల్లాపెట్టె డబ్బు వేరేవాడికి లోన్ ఇవ్వజూపుతాడు.
-సాంక్షన్ లెటర్ మీద స్టాంపు కొట్టి వాడికి కూడా ఒక అకౌంట్ సృష్టించి వాడికి కూడా రూ. 10,000 ఎంట్రీ చేసి ఇస్తారు (క్యాష్ క్రెడిట్).
-ఒక్కటికి రెండు, రెండు పోయి మూడు అయినాయి. గల్లాపెట్టెలో అది అలాగే ఉంది. దీన్ని పరపతి సృష్టి లేదా పరపతి ద్రవ్యం అంటారు.
-ద్రవ్య సప్లయ్ పెరగడం అంటే కొత్తనోట్లు ముద్రించడం కాదు పరపతి ద్రవ్యం విచ్చలవిడిగా పెరగడమే!
-మనకు కావల్సిన దానికంటే అధికంగా ఇది సృష్టించటంచేత ఇది ద్రవ్యపరమైన అసమతౌల్యం. ఇది ద్రవ్యోల్బణానికి దారితీస్తుంది.
ద్రవ్యోల్బణం
-వినియోగదారుడు అంటే వస్తువుల్ని కొనేవాడు. పుట్టినప్పటినుంచి చచ్చేదాకా, చంటి పిల్లల నుంచి ప్రెసిడెంటుదాకా అందరూ వినియోగదారులే.
-ఉత్పత్తిదారుడు అంటే ముడి పదార్థాలను అంతిమ వస్తువులుగా మార్చేవాడు.
-ఉత్పత్తి అంటే నూతన వస్తువుల సృష్టి కాదు నూతన ప్రయోజనాల సృష్టి.
-మొదట్లో చెప్పినట్లు కోరికలు తీర్చుకోవడానికి డబ్బు సంపాదించాలి. డబ్బు కోసం వినియోగాదారుడు – ఉత్పత్తిదారుడి వద్దకు పనికి వెళ్తాడు.
-రూ. 10 పనిచేస్తే రూ. 10+ రూ. 1000 పని చూపిస్తే రూ. 1000 పేమెంటు.
-రూ. 100 పనిచేసి రూ. 1000 డిమాండ్ చేయలేవు+రూ. 1000 పనిచేసి రూ. 100 ఇస్తే ఊరుకోవు.
-స్పాట్ పేమెంట్/మంత్లీ పేమెంట్
-పనికెళ్లిన దగ్గర నీ చేతుల మీద తయారైన రూ. 10 వస్తువును మార్కెట్లో నువ్వే రూ. 50లకు కొనాల్సి వస్తే?
-చెప్పడానికి వీలుకాని బాధ/కోపం.
-పని దగ్గర రూ. 40 తక్కువ మార్కెట్లో అదే వస్తువుకు రూ. 40 ఎక్కువ.
-40 + 40 + 80 రూ.ల మొత్తం భారం అదే ద్రవ్యోల్బణం.
-విచిత్రమేమిటంటే రూ. 50లకు అమ్మబోతున్నట్లు వాడికి ముందే తెలుసు. కానీ మోసపోతున్నట్లు మనకు తెలీదు.
-ఈ ఫీలింగ్‌ను ఎలా చెప్పాలో తెలియక ద్రవ్యవోల్బణం అని అన్నారు ఆర్థికవేత్తలు.
-వారి నిర్వచనం ప్రకారం- ద్రవ్యోల్బణం ఒక దేశంలో అన్ని వస్తువుల ధరలు (జీపీఎల్) నిరంతరం పెరుగుతూ ఉండే ప్రక్రియ.
-వస్తుసేవల సప్లయ్+డిమాండ్ కన్నా ద్రవ్యం సప్లయ్+డిమాండ్లు అధికమయ్యే ప్రమాదకర పరిణామం.
ద్రవ్యోల్బణాన్ని గుర్తించడమెలా ?
1) నిరవధికంగా ధరలు పెరగడం
-పెట్రోలు ధరలు పెరిగినట్టు పెరిగి అప్పుడప్పుడు తగ్గడం కాదు.
-పెళ్లిళ్ల సీజన్ రాగానే బట్టలు, బంగారం ధరలు అకస్మాత్తుగా జంప్ అయినట్టు పెరిగినా ద్రవ్యోల్బణం కాదు.
-వెనక్కి రాని విధంగా నిరంతరం పెరగాలి. ఉదా: పదేండ్ల క్రితం సంతూర్ సబ్బు రూ. 5, ప్రస్తుతం రూ. 25. తిరిగి వెనక్కి వచ్చి రూ. 5 అవుతుందా? కాదు అదే ద్రవ్యోల్బణం.
2) ఒక వస్తువో, రెండు వస్తువుల ధరలో పెరగడం కాదు. అన్ని వస్తువుల ధరలు పెరగాలి.
-ఉప్పులు, పప్పులు, కూరగాయలు, బంగారం, బట్టలు అన్ని ధరలు పెరగాలి.
3) ద్రవ్యానికి డిమాండ్, సప్లయ్ పెరుగుతాయి.
-రూ. 10ల పని రూ. 50 ధర. అలాంటప్పుడు ఎక్స్ట్రా రూ. 40ల కోసం తంటాలు పడాలి. డబ్బుకు డిమాండ్ పెరుగుతుంది.
-మరోవైపు రూ. 10 వస్తువు రూ. 50లకు కొంటున్నంతకాలం ఉత్పత్తిదారులు లాభాల కోసం కొత్త కంపెనీలు, కొత్త పెట్టుబడి పెడుతూనే ఉంటా రు. అందుకు వాళ్లు సొంత డబ్బు పెట్టరు. బ్యాంకులోన్లు తీసుకుంటారు.
-రూపాయి రూపాయి మనం బ్యాంకుల్లో దాచుకున్న సొమ్ము వారికి పెట్టుబడి అన్నమాట. లాభాల పంట పండుతుంది.
-వీలుంటే/దయుంటే లోన్లు తిరిగి కడతారు. లేకుంటే అవికూడా ఎగ్గొట్టి లాభం కింద రాసుకుని దేశాన్ని, ప్రజలను ముంచుతారు.
-ఓవరాల్‌గా ఒకవైపు వినియోగదారులు, మరోవైపు పెట్టుబడిదారులు డబ్బును డిమాండ్ చేయడంతో బ్యాంకులు సృష్టించే పరపతి ద్రవ్యం పెరిగిపోతుంది.
-సంపాదించిన రూపాయిని ఆచి తూచి ఖర్చు చేస్తాం. వేగం తక్కువ.
-వాడు, వీడు ఇచ్చిన సొమ్ము లోన్ తీసుకున్న డబ్బు ఎక్కువసేపు నిలబడదు. కాబట్టి దానికి స్పీడు/వేగం ఎక్కువ.
-డబ్బు వేగం వృద్ధి కంటే అధికం. రూ. 10ల పని ధర రూ. 50లు. ధరలు, వృద్ధిని ఓవర్టేక్ చేసినట్టే!
4) ద్రవ్యం విలువ పడిపోతుంది
-రూ. 10లు అంటే రూ. 10 నాణేలు అని అర్థం.
-ఇంతకుముందు రూ. 10లకు కొన్నది ఇప్పుడు రూ. 50లు పెట్టి కొనాల్సివస్తుంది.
-పరిమాణం పెరిగింది. అంటే ద్రవ్య నాణ్యత తగ్గినట్టు లెక్క.
-2001లో రూ. 10ల సబ్బు 2011లో రూ. 50లు. సబ్బు అదే కాయిన్స్ పెరిగాయి. సబ్బు దృష్టిలో డబ్బు చులకనయ్యింది.
ద్రవ్యోల్బణ అసమతౌల్యాలు
-ఉత్పత్తిదారునికి లోన్లు ఇవ్వడం మానేద్దామా? అంటే ఉన్న ఉద్యోగాలు ఊడిపోతాయి. అది నిరుద్యోగానికి, కొరతకు దారితీస్తుంది. ధరలకు రెక్కలొస్తాయి. నిరుద్యోగులకు/కూలినాలి చేసుకునేవారికి పూట గడవడం కష్టం అవుతుంది.
-పోని వినియోగదారులు రూ. 40ల భారం పంచుకోవడానికి ప్రభుత్వం వారి జీతాలు పెంచినట్లయితే పెరిగిన జీతాలతో విచ్చలవిడిగా వస్తువులను కొనుగోలు చేస్తారు.
-ఖర్చు ఎక్కువ –> డిమాండ్ + ధరలు మరోసారి పెరుగుతాయి.
-పనిచేసే దగ్గర జీతం వాళ్లకు ఖర్చయితే పనిచేసిన వ్యక్తికి ఆదాయం. తిరిగి అది మార్కెట్లో ఖర్చుపెట్టినప్పుడు మరొకరికి ఆదాయం.
-ఒకరి ఖర్చు మరొకరికి ఆదాయం. అంతా చైన్ సిస్టం. ఒక్కరు విచ్చలవిడితనం ప్రదర్శించినా అందరికి చుట్టుకుంటుంది.
-పని ఉండాలి. జీతం రావాలి. ఖర్చు తగ్గొద్దు.
-ఈ లింక్ తెగొద్దు. బ్యాలన్స్డ్గా ఉండాలి.
-ఈ మూడింటిని బ్యాలన్స్ చేయడానికి ప్రభుత్వం+ఆర్బీఐ చేసే ప్రయత్నాలనే ద్రవ్య, కోశ విధానాలు అంటారు.
-ద్రవ్య విధానం అంటే పరపతి ద్రవ్యంపై కేంద్రబ్యాంకు రకరకాల ఎత్తుగడలతో ఆధిపత్యం సాధించడం లేదా దాన్ని అదుపులో ఉంచడం.
-కోశ విధానం అంటే ప్రభుత్వం తన పన్నులు, వ్యయ విధానాల ద్వారా ద్రవ్యోల్బణ ప్రభావం పడకుండా ఉత్పత్తి, ఉద్యోగితలు తద్వారా ఆర్థిక వ్యవస్థను సమతౌల్యంలో ఉంచే ప్రయత్నాలు.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?