How to face the interview | ఇంటర్వ్యూని ఎదుర్కోవడం ఎలా?
ఆడిటోరియం అంతా కోలాహలంగా ఉంది. అందరూ పెన్నులు, నోట్ ప్యాడ్స్ పట్టుకుని సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే ఆ రోజు క్యాంపస్ రిక్రూట్మెంట్ శిక్షణ శిబిరం ప్రారంభం. వేదికపై నుంచి గుడ్‌మార్నింగ్ ఫ్రెండ్స్ అంటూ ఆత్మీయంగా మైక్‌లో పలకరించాడు శశాంక్. ఈ శిక్షణ శిబిరానికి, మీ విజయానికి స్వాగతం. మీరంతా తప్పక విజయం సాధిస్తారు. ఈ శిక్షణ శిబిరంలో మనం నేర్చుకోబోయే అంశాలు…
-అతి క్లిష్టమైన ఇంటర్వ్యూ ప్రశ్నలని ఎలా ఎదుర్కోవాలి?
-ప్రశ్నల వెనుక అంతరార్థం ఏమిటి?
-సరైన సమాధానం ఏ విధంగా ప్లాన్ చేసుకోవాలి?
-సాఫ్ట్ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్‌ని ఎలా అభివృద్ధి చేసుకోవాలి?
-వ్యక్తిత్వ వికాసానికి మార్గాలేమిటి?
-గ్రూప్ డిస్కషన్స్‌లో ఎలా గెలవాలి?
-ఇంటర్వ్యూలకు వెళ్లేటప్పుడు వస్త్రధారణ ఎలా ఉండాలి?
-ఏయే సబ్జెక్టులు ప్రిపేరవ్వాలి?
-లెటర్స్ ఎలా రాయాలి?
-ఇలాంటి అనేకానేక అంశాలు మనం చర్చించుకుంటాం. అంతేగాక మనం మాక్ ఇంటర్వ్యూల్లో కూడా పాల్గొంటాం. మీ మాక్ ఇంటర్వ్యూని వీడియో తీసి, తిరిగి వాటిని మీకు చూపించి, ప్రధానంగా మీరు ఎక్కడ తప్పులు చేస్తున్నారో తెలిసేలా చేస్తాం. మీకింకా ఏమైనా సందేహాలుంటే అడగొచ్చు అని శశాంక్ తన ప్రసంగం ముగించాడు. శశాంక్ ప్రసంగం విని అందరికీ సరికొత్త ఉత్సాహం వచ్చింది. కరతాళ ధ్వనులతో ఆడిటోరియం మార్మోగింది. మీకందరికీ ముందుగా ఒక జోక్ వినిపిస్తాను. పోలీస్ కానిస్టేబుల్ పోస్టుకు ఇంటర్వూలు జరుగుతున్నాయి. ఒక అభ్యర్థి జనరల్ నాలెడ్జ్‌ని పరీక్షించడం కోసం గాంధీజీని ఎవరు హత్య చేశారు? అని అడిగారు ఇంటర్వ్యూ చేసేవాళ్లు. ఆ అభ్యర్థి ఉత్సాహంతో వెంటనే తన వాళ్లకి ఫోన్ చేశాడు. ఫోన్లో ఇలా చెప్పాడు హలో! ఒక గుడ్ న్యూస్. నాకు ఉద్యోగం ఇచ్చేశారు. అప్పుడే ఒక హత్య కేసు కూడా అప్పగించారు. ఈ కేసును ఎలాగైనా ఛేదించాలి. బై అని చెప్పి ఫోన్ కట్ చేశాడు. ఇది చాలా పాత జోకే. అయినా ఈ జోక్ నుంచి మనం తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు కొన్ని ఉన్నాయి.
1. ప్రతి ప్రశ్నని పూర్తిగా వినాలి.
2. విన్న పశ్నని పూర్తిగా అర్థం చేసుకోవాలి.
3. ఏ ప్రశ్న ఎందుకడుతున్నారో సరిగ్గా ఊహించాలి.
4. అన్ని సరిగ్గా అంచనా వేసిన తర్వాత సమాధానం చెప్పాలి.
5. ప్రశ్న వెనుక ఉన్న ఉద్దేశాన్ని సానుకూలపరుస్తూ స్పష్టంగా, స్థిరంగా చక్కటి హావభావాలతో సమాధానం చెప్పాలి.
-అసలు ఇంటర్వ్యూల్లో ఎందుకు ప్రశ్నలు వేస్తారు? ఎన్ని ప్రశ్నలు వేస్తారు? అనే విషయాల్ని అర్థం చేసుకుందాం. మనం చాలా సినిమాల్లో చూశాం. ఇంటర్వ్యూల్లో అర్థంపర్థం లేని ప్రశ్నలు వేసి కామెడీ సీన్లు సృష్టించి నవ్వు పుట్టిస్తూ ఉంటారు. ఇంకొన్ని సినిమాల్లో ఈ అర్థంపర్థంలేని ప్రశ్నలకు విసిగి కథానాయక పాత్రధారి ఆవేశపడతాడు. పెద్దపెద్ద డైలాగులు చెప్పి ఇంటర్వ్యూచేసేవారిని తిట్టి బయటికి వస్తాడు. ఇవన్నీ సినిమాల్లో మాత్రమే జరుగుతాయి. కల్పించబడిన సన్నివేశాలు. ఇవేవీ నిజాలు కాదు.
-లేనిపోని అపోహలతో, ఉత్తుత్తి భయాలతో ఇంటర్వ్యూ అంటే ఆందోళన పడకండి. మనకర్థమయ్యేందుకు ఒక ఉదాహరణ చెప్పుకుందాం.
-మీరు ఒక కంపెనీ ఓనర్ అనుకుందాం. మీకు ఎక్కువ ఆదాయం వస్తున్నది. మీకెంతో ఇష్టమైన మెర్సిడెస్ బెంజ్ కారును కోటి రూపాయలు పెట్టికొన్నారు. మీకు డ్రైవింగ్ వచ్చినప్పటికీ సౌకర్యం కోసం ఒక డ్రైవర్‌ను నియమించుకోవాలని అనుకుంటున్నారు. డ్రైవర్ కోసం పత్రికా ప్రకటన ఇచ్చారు. అనేక మంది అభ్యర్థులు వచ్చారు. మీరు వారిలో ఏం తెలుసుకోవాలని అనుకుంటారు? వారికి ఏయే ప్రశ్నలు వేస్తారు? మనకేం కావాలో బాగా ఆలోచించండి.
-అతనికి డ్రైవింగ్ బాగా వచ్చి ఉండాలి (నైపుణ్యత)
-వీలైనన్ని ఎక్కువ ఏండ్లు డ్రైవింగ్ చేసిన అనుభవం ఉండాలి. (అనుభవం)
-ప్రమాదాలకు గురికానటువంటి అనుభవం ఉండాలి. (నైపుణ్యతతో కూడిన అనుభవం)
-తరచూ ఉద్యోగాలు మారే అలవాటు లేకుండా, చక్కగా కుదురుగా ఎక్కువ కాలం పనిచేయగలిగేలా ఉంటే మంచిది.
-ప్రతి చిన్నవిషయానికి సెలవు పెట్టకుండా, సమయపాలన పాటించేవారై ఉండాలి.
-డ్రైవింగ్‌ను బాధ్యతగా కాకుండా, ఇష్టంగా చేయగలడా అని కనుక్కుంటాం.
-ఇదివరకటి యజమానులు అతని గురించి ఏమని అభిప్రాయపడుతున్నారు, అతని ప్రవృత్తి ఎలాంటిది? సాటి ఉద్యోగులపట్ల, మహిళలపట్ల, వృద్ధులపట్ల అతని ప్రవర్తన ఎలా ఉంటుంది? అనే విషయాలను తెలుసుకుంటాం. యజమాని స్థానంలోకి మీరు వచ్చేసరికి మీ అవసరాలకు అనుగుణంగా ప్రశ్నలు తయారుచేసుకో గలుగుతున్నారు&
-Can you? (నైపుణ్యం ఉందా లేదా?)
-Will you? (చాలా ఏండ్లు చేస్తావుగా?)
-Are you Ok? (క్యారెక్టర్ మంచిదేనా?)
-మీరిలా ఎన్ని ప్రశ్నలు వేసినా అవి ఈ మూడు ప్రశ్నల్లో ఏదో ఒక ప్రశ్న కిందికే వస్తాయి. అదే చిత్రం. మనం ఇంకా ఇలా చేసి చూద్దాం. మీరే కంపెనీ ఓనర్‌గా, హెచ్ఆర్ మేనేజర్‌గా ఊహించుకుని రకరకాల హోదాలకు ఇంటర్వ్యూ నిర్వహిస్తున్నారనుకోండి. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే, మీరేదైతే ఇంటర్వ్యూకి వెళ్తున్నారో, ఆ కంపెనీ యజమాని స్థాయిలో ఆలోచించి వారికి ఎలాంటి అవసరాలుంటాయో ఊహించి, దానికి అనుగుణంగా పై మూడు ప్రశ్నలు ఎన్ని విధాలుగా అడగొచ్చో చూడండి. అప్పుడు మీకు స్పష్టత వస్తుంది.
-టేబుల్‌కు ఇటువైపు మీరు కూర్చున్నప్పటికీ, ప్రతి ప్రశ్నని టేబుల్‌కి అటువైపు వారి కోణంలో ఆలోచించడం ప్రారంభించాలి. అప్పుడు కచ్చితంగా విజయం మీ సొంతమవుతుంది.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?