-తాగునీటి సరఫరా, మురుగునీటి పారుదల, వరదనీటి కాల్వల నిర్మాణం, గృహనిర్మాణం, మురికివాడల అభివృద్ధి, మౌలిక సదుపాయాలు, బీఆర్టీఎస్, ఎమ్మార్టీస్, పట్టణ రవాణా ప్రాజెక్టులు, ఈ-పరిపాలన, రూ. 36 వేల కోట్లతో చేపట్టిన ప్రాజెక్టులు పూర్తయ్యేందుకు పదేండ్లకాలం పడుతుంది. నిర్దిష్ట అర్హతలున్న నగరాలనే ఈ పథకంలో ఎంపికచేస్తారు. దేశవ్యాప్తంగా 100 నగరాలను రూ. 48 వేల కోట్ల ప్రాజెక్టు వ్యయంతో ప్రారంభించాలని నిర్ణయించారు. యూపీ నుంచి అత్యధికంగా 13 నగరాలు, తమిళనాడు నుంచి 12, మహారాష్ట్ర నుంచి 10 నగరాలు ఎంపికయ్యాయి.
కల్పించే సౌకర్యాలు
-ఇంధనం: సంప్రదాయేతర ఇంధన వనరులు, ఇంధనగ్రిడ్, ఇంధన నిల్వ, కార్బన్ రహిత ప్రణాళికలు, ఇంధన నిర్వహణ, వాతావరణ సమతుల్యం, ఇంధన సమర్థత.
-సాంకేతిక పరిజ్ఞానం: సమీకృత టెక్నాలజీ, సెన్సార్లు, ఇంటర్నెట్, జియోఇన్ఫర్మాటిక్స్, ఎలక్ట్రానిక్స్ నిఘా.
-స్మార్ట్ సొసైటీ: నూతన తరహాలో పౌరసేవలు, సామాజిక మర్యాద, పారిశ్రామికవేత్తలుగా ఎదిగేందుకు అవకాశాలు, కొత్త ఆవిష్కరణలు సాధించే వాతావరణం.
-పరిపాలన, ఆర్థికం: పబ్లిక్-ప్రైవేట్ భాగస్వామ్యం, ప్రజలందరికీ అందుబాటులో ప్రభుత్వం, నూతన పరిపాలన అందరికీ సమాచారం ఆర్థికాభివృద్ధి.
పర్యావరణం: మెరుగైన అభివృద్ధి, హరిత భవనాలు, ఘన వ్యర్థాల నిర్వహణ, పట్టణ పునర్నిర్మాణం.
నిధులు: కేంద్రం నుంచి 40 శాతం (సర్దుబాటు నిధులు), నగరపాలక/పురపాలక సంఘాలు, 50 శాతం వరకు (స్థాయిని బట్టి) మిగిలినవి పీపీపీ పద్ధతిలో సమకూరుస్తారు.
ఆకర్షణీయ నగరాల తొలి జాబితా: కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు 20 ఆకర్షణీయ నగరాల తొలి జాబితాను 2016, జనవరి 28న విడుదల చేశారు. 11 రాష్ర్టాలు, ఒక కేంద్రపాలితప్రాంతంలోని 20 నగరాలను ఎంపికచేశారు. ఆకర్షణీయ నగరాల మొత్తం విస్తీర్ణం 26,735 ఎకరాలు, జనాభా 3.54 కోట్లు. మధ్యప్రదేశ్ నుంచి 3 నగరాలు, కర్ణాటక, గుజరాత్, తమిళనాడు, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్‌ల నుంచి రెండు చొప్పున, కేరళ, ఒడిశా, పంజాబ్, అసోం, ఢిల్లీలలో ఒక్కో నగరం చొప్పున ఎంపికచేశారు.
ప్రధాన మంత్రి ఆవాస్ యోజన
-అందరికీ ఇళ్లు అనే పథకాన్ని మోదీ 2015, జూన్ 25న ప్రకటించి, 2016 ఫిబ్రవరి 21న ఛత్తీస్‌గఢ్‌లోని నయా రాయ్‌పూర్‌లో ప్రారంభించారు. దేశంలో ప్రతి ఒక్క కుటుంబానికి ఏడేండ్లలోపు గృహవసతి కల్పించడమే దీని లక్ష్యం. 2022 నాటికి అందరికీ ఇళ్లు పథకాన్నే ప్రధానమంత్రి ఆవాస్ యోజనగా మార్చారు. కేంద్రం నుంచి రూ. లక్ష రుణంపై 6.5 శాతం వడ్డీ రాయితీ ఇస్తారు. ఈ పథకం కింద రెండు కోట్ల ఇండ్లు నిర్మించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలను లబ్ధిదారులుగా ఎంపికచేస్తారు.
డిజిటల్ ఇండియా
-రూ. 4.5 లక్షల కోట్ల పెట్టుబడులతో 18 లక్షల ఉద్యోగాలను సమకూర్చే ఈ కార్యక్రమాన్ని 2015, జూన్ 1న ప్రారంభించారు. దేశాన్ని ఎలక్ట్రానిక్పరంగా సాధికారిత సాధించిన సమాజంగా తీర్చిదిద్దే ఈ కార్యక్రమంతో ప్రభుత్వ సేవలు పౌరులకు ఎలక్ట్రానిక్రూపంలో అందుబాటులోకి వస్తాయి. మధ్యప్రదేశ్‌లోని రెండు గ్రామపంచాయతీల్లో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ పథకాన్ని ప్రారంభించారు. ఈ ప్రాజెక్టు ద్వారా అన్ని గ్రామపంచాయతీలకు బ్రాడ్‌బ్యాండ్ ఇంటర్నెట్, ఈ-పరిపాలన వంటివి అందిస్తారు.
రాష్ట్రీయ స్వాస్థ్య బీమా యోజన
-అసంఘటిత కార్మికులందరికీ వర్తించేలా ఆరోగ్య బీమా పథకమైన రాష్ట్రీయ స్వాస్థ్య బీమా యోజనను కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టింది. దీని కింద 1000 వ్యాధులకు చికిత్సను అందిస్తుండగా.. ఒక్కో కుటుంబానికి గరిష్టంగా రూ. 50వేలు అందిస్తున్నారు. రాష్ట్రంలో 22.02 లక్షల కుటుంబాలు అసంఘటితరంగంలో ఉన్నాయని 2011-12 జనాభా లెక్కలు చెబుతున్నాయి. ఇప్పటివరకు కార్మిక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ పథకాన్ని ఇటీవలే ఆరోగ్యశాఖకు అప్పగించారు. ఈ పథకం కింద కేంద్రం వాటాగా 75 శాతం చెల్లిస్తుండగా 25 శాతం లబ్ధిదారులు చెల్లించేవారు. ప్రస్తుతం లబ్ధిదారుల ప్రీమియంలో 25 శాతాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుంది.
ఈ పథకం లాభాలు
-రూ. 50,000 వరకు అందిస్తున్న చికిత్స రూ. 2 లక్షల వరకు పొందేవరకు అవకాశం ఉది. 1642 చికిత్సలకు వైద్యసదుపాయాలు పొందే అవకాశముంది. రాష్ట్రంలో ఈ పథకం కింద 22.02 లక్షల కుటుంబాలు వస్తాయి.
ప్రధానమంత్రి కౌశల్ యోజన
-ప్రపంచ యువజన నైపుణ్య దినోత్సవం సందర్భంగా 2015, జూలై 15న ప్రధాని మోదీ ఈ కార్యక్రమాన్ని ఢిల్లీలోని విజ్ఞాన భవన్లో ప్రారంభించారు. నైపుణ్యాభివృద్ధి-పారిశ్రామిక జాతీయ విధానం- 2015, నైపుణ్య పథకాలను ప్రారంభించారు. దేశంలో 35 ఏండ్లలోపు ఉన్న యువతను వివిధరంగాల్లో నిపుణులుగా తీర్చిదిద్దే లక్ష్యంతో ప్రారంభించారు. 2016 చివరికల్లా 24 లక్షల మందికి సాంకేతిక పరిజ్ఞానం, వృత్తివిద్యలో నైపుణ్య శిక్షణనివ్వాలన్నది ప్రభుత్వ లక్ష్యం. 2022 నాటికి 40 కోట్ల మందిని గుణాత్మక నిపుణులుగా తీర్చిదిద్దాలన్నదే లక్ష్యం. నైపుణ్యం శిక్షణ పొందిన యువతకు స్కిల్లోన్ పేరుతో రూ. 5 వేల నుంచి రూ. 1.5 లక్షల వరకు రుణ సదుపాయ కల్పిస్తారు.
స్టార్టప్ ఇండియా-స్టాండప్ ఇండియా
-దేశంలో పరిశ్రమల వ్యవస్థాపనను ప్రోత్సహించడానికి ఉద్యోగాల కల్పనకు స్టార్టప్ ఇండియా స్టాండప్ ఇండియా అనే నినాదంతో పథకాన్ని ప్రధాని మోదీ 2015, ఆగస్టు 15న ప్రకటించారు. వినూత్న వ్యాపార ఆలోచనలు, పరిశ్రమలు నెలకొల్పే ఆలోచనలున్నవారికి చేయూతనివ్వడం కోసం ఈ కార్యక్రమ ప్రణాళికలను 2016, జనవరి 16న ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో విడుదల చేశారు. మేక్ఇన్ ఇండియా అంటే ఇండియాలో తయారీ మాత్రమే కాదు, దేశం కోసం ఉత్పత్తి చేయడం (మేక్ ఫర్ ఇండియా), 35 లక్షల మంది యువకులకు ఉపాధి కల్పిస్తారు. ఇప్పటికే 4200 స్టార్టప్‌ల వ్యవస్థాపనతో అమెరికా, బ్రిటన్ల తరువాత భారత్ మూడో స్థానంలో ఉంది.
స్టార్టప్ ఇండియా ప్రధానాంశాలు
-స్టార్టప్ పరిశ్రమలకు మూడేండ్ల పాటు ఆదాయపన్ను మినహాయింపు.
-స్టార్టప్‌లకు నిధులందించేందుకు మొదట రూ. 2500 కోట్ల నిధిని ఏర్పాటుచేస్తారు. దీన్ని వచ్చే నాలుగేళ్లలో రూ. 10,000 కోట్లకు పెంచుతారు.
-మూలధన లాభాలపై పన్ను మినహాయింపు.
-స్టార్టప్‌లకు మద్దతుగా రూ. 10 వేల కోట్లతో ప్రభుత్వ నిధి
-స్టార్టప్ పరిశ్రమ వ్యవస్థకు సంబంధించి ప్రభుత్వంతో సంప్రదింపులకు సింగిల్ విండో కేంద్రం ఏర్పాటు.
-తక్కువ ఖర్చుతో న్యాయ సహాయం, సత్వర మేధో హక్కుల పరిశీలన
-దివాలా బిల్లు-2015 సత్వర ఆమోదంతో స్టార్టప్ పరిశ్రమలు సులభంగా మూపివేసే అవకాశం
-రంగాలవారీగా కొత్త పరిశ్రమలకు సదుపాయాల కల్పనల కేంద్రా (ఇంక్యుబేటర్)లు.
రూర్బన్ మిషన్
-దేశవ్యాప్తంగా 330 గ్రామీణ కేంద్రాల (రూరల్ క్లస్టర్స్)ను పట్టణ సదుపాయాలతో కూడిన అభివృద్ధికేంద్రాలుగా మార్చేందుకు శ్యాంప్రసాద్ ముఖర్జీ రూర్బన్ మిషన్ పథకాన్ని ప్రధాని మోదీ 2016 ఫిబ్రవరి 21న ఛత్తీస్‌గఢ్‌లోని కురుభట్లో ప్రారంభించారు. ఈ కార్యక్రమం ద్వారా గ్రామాలకు పక్కనున్న పల్లెలు అభివృద్ధి చెందుతాయి.
ఇంద్రధనుష్ ప్రాజెక్టు
-దేశంలో ప్రభుత్వరంగ బ్యాంకులను బలోపేతం చేయడానికి కేంద్రప్రభుత్వం 2015, ఆగస్ట్ 14న ఈ ప్రాజెక్టును ప్రకటించింది. ప్రభుత్వరంగ బ్యాంకుల్లో నియామకాల కోసం బోర్డు ఆఫ్ బ్యూరో ఏర్పాటు, మూలధనం సమకూర్చుకోవడం, మొండి బకాయిల తగ్గింపు చర్యలు, రాజకీ య ప్రమేయం తగ్గిస్తూ సాధికారత కల్పించడం, జవాబుదారీతనం, గవర్నెన్స్ పరమైన సంస్కరణలు, హోల్డింగ్ సంస్థ ఏర్పాటు అనే 7 అంశాలతో ఏర్పాటు చేశారు.
స్కూల్ నర్సరీ యోజన
-స్కూల్ నర్సరీ యోజనను అప్పటి కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి ప్రకాష్ జవదేవకర్ 2015, ఆగస్ట్ 14న ఢిల్లీలో ప్రారంభించారు. విద్యార్థులను ప్రకృతికి దగ్గర చేసేందుకు ఉద్దేశించిన పథకం. దీన్ని 2015లో 1000, 2016లో 5 వేలు, 2017లో 10 వేల పాఠశాలలకు విస్తరిస్తారు.
జీవన్ ప్రమాణ్
-2014 నవంబర్ 10న ప్రధాని మోదీ ప్రభుత్వ, ప్రభుత్వరంగ సంస్థలకు చెందిన మాజీ ఉద్యోగులు పెన్షన్ పొందడానికి జీవన్ ప్రమాణ్ పథకాన్ని ప్రారంభించారు.
హిమ్మత్
-మహిళల ఆత్మరక్షణ కోసం ఢిల్లీ నగర పోలీసులు రూపొందించిన మొబైల్ అప్లికేషన్ హిమ్మత్‌ను కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ 2015, జనవరి 1న ప్రారంభించారు. దేశంలో మొదటిసారిగా మహిళల భద్రతను దృష్టిలో పెట్టుకొని ఢిల్లీ పోలీసులు ఈ ఆండ్రాయిడ్ అప్లికేషన్‌ను రూపొందించారు.
విద్యాంజలి
-విద్యార్థుల మానసిక వికాసానికి 2016 జూన్ 18న ఢిల్లీలో అప్పటి మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి స్మృతి ఇరానీ ప్రారంభించింది. 21 రాష్ర్టాల్లో 2200 పాఠశాలల్లో దీన్ని ప్రారంభించారు. 2016 డిసెంబర్ నాటికి అన్ని పాఠశాలలకు విస్తరిస్తారు. వివిధరంగాలకు చెందినవారు ప్రభుత్వ పాఠశాలల్లో 1 నుంచి 8వ తరగతి చదువుతున్న విద్యార్థులకు మానసిక వికాసానికి తోడ్పడే వక్తృత్వ, నటన వంటి విద్యేతర అంశాల్లో శిక్షణ ఇవ్వనున్నారు.
ఈ-మార్కెట్
-ప్రధాని మోదీ 2016, ఏప్రిల్ 14న ఈ-మార్కెట్‌ను ప్రారంభించారు. వ్యవసాయ ఉత్పత్తుల ఆన్లైన్ వ్యాపా రం కోసం 8 రాష్ర్టాల్లోని 21 మార్కెట్ల సమీకృతం చేయడానికి ఉద్దేశించిన జాతీయ వ్యవసాయ మార్కెట్ పోర్టల్ ఇనామ్‌ను ప్రారంభించారు. గుజరాత్, తెలంగాణ, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, హర్యానా, జార్ఖండ్, హిమాచల్ ప్రదేశ్ రాష్ర్టాల్లో 21 మండీల్లో 25 రకాల వ్యవసాయ ఉత్పత్తులను విక్రయించవచ్చు.
దీన్‌దయాళ్ ఉపాధ్యాయ గ్రామజ్యోతి యోజన
-ఈ పథకాన్ని మోదీ 2015 జూలై 25న బీహార్‌లోని పాట్నాలో ప్రారంభించారు. ఈ పథకం ద్వారా దేశంలోని అన్ని గ్రామీణ ప్రాంతాల్లో 24 గంటల పాటు కరెంట్ అందుబాటులో ఉండేటట్లు ఏర్పాట్లు చేయనున్నారు.
నయా మంజిల్
-విద్యార్థుల పాఠశాల డ్రాపవుట్స్‌ను తగ్గించేందుకు ఎటువంటి విద్యార్హత, ధృవీకరణపత్రంలేని ముస్లిం యువత మెరుగైన ఉపాధి అవకాశాలను పొందేందుకు, వారికి వృత్తినైపుణ్యంతో కూడిన విద్యను అందించేందుకు ప్రభుత్వం ఈ పథకాన్ని మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి నజ్మా హెప్తుల్లా బీహార్‌లోని పాట్నాలో 2015, ఆగస్ట్ 8న ప్రారంభించారు.
సురక్షిత్ ఖాద్య అభియాన్
-ఈ పథకాన్ని కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజాపంపిణీల శాఖ మంత్రి రాంవిలాస్ పాశ్వాన్ ఢిల్లీలో 2015, జూలై 21న ప్రారంభించారు. దీని ముఖ్య ఉద్దేశం సామాన్య జనంలో పౌష్టికాహార ఆవశ్యకతను గురించి తెలపడం.
దీన్‌దయాళ్ ఉపాధ్యాయ కౌశల్ యోజన
-దేశ జనాభాలో 70 శాతం ఉన్న గ్రామీణ జనాభాలో యువకులకు ఉద్యోగ సాధన నైపుణ్యాల మెరుగుపర్చడానికి రూ. 1500 కోట్లతో ఈ పథకాన్ని 2015-16 ఆర్థిక ఏడాదిలో ప్రారంభించారు.
ముద్ర బ్యాంక్
-ముద్ర (మైక్రో యూనిట్స్ డెవలప్మెంట్ అండ్ రీఫైనాన్స్ ఏజెన్సీ) బ్యాంక్‌ను ప్రధాని మోదీ 2015 ఏప్రిల్ 8న ఢిల్లీలో రూ. 20 వేల కోట్ల కార్పస్ ఫండ్‌తో ప్రారంభించారు. స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంకు ముద్రకు అనుబంధంగా పనిచేస్తుంది. శిశు పేరిట రూ. 50 వేలు, కిశోర్ పేరిట రూ. 50 వేల నుంచి రూ. లక్ష వరకు, తరుణ్ పేరిట రూ. 5 లక్షల నుంచి రూ. 10 లక్షల వరకు మంజూరుచేస్తుంది.