Gentlemen’s Agreement | పెద్ద మనుషుల ఒప్పందం
తెలంగాణ హిస్టరీ- గ్రూప్స్ ప్రత్యేకం
ఢిల్లీలోని హైదరాబాద్ అతిథి గృహంలో 1956, ఫిబ్రవరి 20న ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ రాష్ట్రాల పునర్విభజన కమిషన్ నివేదికను క్షుణ్ణంగా పరిశీలించి, విశాలాంధ్ర ఏర్పాటు విషయంలో తెలంగాణ ప్రజల భయాలను పోగొట్టడానికి, సంశయాలు తీర్చడానికి, వారికి రక్షణలు కల్పించే పెద్దమనుషుల ఒప్పందాన్ని కుదిర్చాడు.
# ఈ సమావేశానికి తెలంగాణ, ఆంధ్ర ప్రాంతాల నుంచి నలుగురు చొప్పున మొత్తం ఎనిమిది మంది ప్రతినిధులు హాజరయ్యారు.
– తెలంగాణ నుంచి 1) బూర్గుల రామకృష్ణారావు- హైదరాబాద్ రాష్ట్ర ముఖ్యమంత్రి
2) కొండా వెంకటరంగారెడ్డి- రెవెన్యూ మంత్రి
3) మరి చెన్నారెడ్డి- ప్రణాళిక శాఖ మంత్రి
4) జేవీ నరసింగరావు- హైదరాబాద్ కమిటీ అధ్యక్షుడు
-ఆంధ్ర ప్రాంతం నుంచి 1) బెజవాడ గోపాల్ రెడ్డి- ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి
2) నీలం సంజీవరెడ్డి- ఆంధ్ర రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి
3) సర్దార్ గౌతు లచ్చన్న- స్వతంత్ర పార్టీ
4) అల్లూరి సత్యనారాయణ రాజు- ఆంధ్ర రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు
ఒప్పంద అంశాలు: 1) రాష్ట్రానికి సంబంధించిన కేంద్ర, రాష్ట్ర సాధారణ పరిపాలనా వ్యయం ఆంధ్ర, తెలంగాణ నిష్పత్తి ప్రకారం భరించాలి. ముఖ్యంగా తెలంగాణ మిగులు నిధులు ఆ ప్రాంత అభివృద్ధికే కేటాయించాలి. ఐదు సంవత్సరాల వరకు ఈ ఏర్పాటు ఉండాలి. ఆ తరువాత తెలంగాణ శాసనసభ్యులు కోరిన పక్షంలో ఈ గడువును మరో ఐదు సంవత్సరాలు పొడిగించవచ్చు.
2) రాష్ట్ర శాసన సభలో తెలంగాణ సభ్యులు నిర్ణయించిన విధంగానే మద్య నిషేధం అమలు చేయాలి.
3) తెలంగాణలో ప్రస్తుతం ఉన్న విద్యా సౌకర్యాల్లో తెలంగాణ విద్యార్థులకే అవకాశాలు ఇవ్వాలి. వాటిని మరింత అభివృద్ధిపర్చాలి. తెలంగాణలోని కాలేజీలు, సాంకేతిక విద్యాలయాల్లో ప్రవేశాలు కేవలం తెలంగాణ విద్యార్థులకు మాత్రమే ఉండాలి. అదికాని పక్షంలో రాష్ట్రం మొత్తం మీద ప్రతి విద్యాలయంలో మూడింట ఒక వంతు (1/3) సీట్లు తెలంగాణ విద్యార్థులకు కేటాయించాలి. ఈ రెండింట్లో ఏది తెలంగాణ విద్యార్థులకు మేలు కలుగజేస్తుందో ఆ నిర్ణయం తీసుకోవాలి.
4) ఇప్పుడు రాష్ట్రం ఏర్పాటు వల్ల ఉద్యోగాలు తొలగించాల్సి వస్తే రెండు ప్రాంతాల్లో జనాభా దామాషా ప్రకారం తొలగించాలి.
5) తదుపరి ఉద్యోగ నియామకాలు రెండు ప్రాంతాల జనాభాను ప్రాతిపదికగా చేసుకొని జరగాలి.
6) పాలనా న్యాయ వ్యవహారాల్లో ప్రస్తుతం తెలంగాణలో అమల్లో ఉన్న ఉర్దూను ఇలాగే ఐదు సంవత్సరాలు కొనసాగించాలి. రీజినల్ కౌన్సిల్ ఈ అంశాన్ని పునఃసమీక్షించాలి. ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు చేసుకునేటప్పుడు, తెలుగు భాషా పరిజ్ఞానం తప్పనిసరిగా ఉండాలనే నియమం ఉండరాదు. ఉద్యోగంలో చేరిన తరువాత రెండు సంత్సరాల్లో నిర్దేశిత తెలుగు ప్రావీణ్యతా పరీక్షలో ఉత్తీర్ణులు కావాలి.
7) తెలంగాణ వారు తమ జనాభా దామాషాకు అనుగుణంగా ఉద్యోగాలు పొందేందుకు స్థానిక నియమాలు రూపొందాలి. ఉదా: 12 ఏండ్లు ఆవాసం లాంటివి.
8) తెలంగాణ ప్రాంతంలోని వ్యవసాయ భూమి అమ్మకాలు తెలంగాణ రీజినల్ కౌన్సిల్ నియంత్రణలో ఉండాలి.
9) తెలంగాణ అవసరాలు, అవశ్యకతలను దృష్టిలో ఉంచుకొని, దాని సర్వతోముఖాభివృద్ధికి రీజినల్ కౌన్సిల్ ఏర్పాటు చేయాలి.
10) రీజినల్ కౌన్సిల్లో 20 మంది సభ్యులు ఉండాలి. ఈ సభ్యులను కింది విధంగా కౌన్సిల్లోకి తీసుకోవాలి.
# తొమ్మిది మంది సభ్యులు తెలంగాణలోని తొమ్మిది జిల్లాలకు ప్రాతినిధ్యం వహించే శాసన సభ్యులు ఉండాలి. వీరిని తెలంగాణ ప్రాంత జిల్లాల శాసన సభ్యులు జిల్లాలవారీగా ఎన్నుకోవాలి.
#ఆరుగురు తెలంగాణ ప్రాంత శాసనసభ్యులు లేదా పార్లమెంట్ సభ్యులు ఉండాలి. వీరిని తెలంగాణ ప్రాంత శాసన సభ్యులందరూ కలిసి ఎన్నుకోవాలి.
# ఐదుగురు సభ్యులు శాసనసభకు బయటివారు ఉండాలి. ఈ ఐదుగురు తెలంగాణ శాసన సభ్యులతో ఎంపిక కావాలి. వీరేకాక తెలంగాణ ప్రాంత మంత్రులందరూ ఈ కౌన్సిల్లో మెంబర్లుగా ఉంటారు.
#ముఖ్యమంత్రి లేదా ఉప ముఖ్యమంత్రి ఎవరు తెలంగాణకు చెందినవారైతే వారు ఈ కౌన్సిల్‌కు అధ్యక్షత వహించాలి.
11) రీజినల్ కౌన్సిల్ చట్టబద్ధ సంస్థగా ఉండాలి. ఇంతకుముందు పేర్కొన్న అంశాలపై నిర్ణయాధికారం ఉండాలి. ప్రణాళికాభివృద్ధి, సాగునీటి ప్రాజెక్టులు, ఇతర ప్రాజెక్టుల విషయమై సాధారణ ప్రణాళికలో భాగంగా పారిశ్రామికాభివృద్ధి, తెలంగాణ ప్రాంతపు ఉద్యోగ నియామకాల విషయంలో నిర్ణయాధికారం ఉండాలి. ఏదైనా అంశంపై రీజినల్ కౌన్సిల్‌కు రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య భేదాభిప్రాయాలుంటే ఆ అంశాన్ని భారత ప్రభుత్వానికి నివేదించాలి. భారత ప్రభుత్వ నిర్ణయమే అంతిమ నిర్ణయం.
12) మంత్రి మండలిలో 60:40 శాతంగా ఆంధ్ర ప్రాంతీయులు, తెలంగాణ ప్రాంతీయులు ఉండాలి. తెలంగాణకు చెందిన 40 శాతంలో కచ్చితంగా తెలంగాణ ప్రాంత ముస్లిం శాసనసభ్యుడు ఉండాలి.
13) ముఖ్యమంత్రి ఆంధ్ర ప్రాంతం నుంచి ఉంటే ఉప ముఖ్యమంత్రి తెలంగాణ ప్రాంతం నుంచి ఉండాలి. ఒకవేళ ముఖ్యమంత్రి పదవిలో తెలంగాణ ప్రాంతీయులుంటే, ఉపముఖ్యమంత్రి పదవిలో ఆంధ్ర ప్రాంతీయులు ఉండాలి. కింది శాఖల్లో 2 శాఖలు తప్పనిసరిగా తెలంగాణ వారికి కేటాయించాలి. అవి.. 1) హోం 2) ఆర్థిక 3) రెవెన్యూ 4) ప్రణాళిక-అభివృద్ధి 5) వాణిజ్యం-పరిశ్రమలు
17) హైదరాబాద్ ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు 1962 వరకు ప్రత్యేక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఉండాలని అభిప్రాయపడ్డారు. ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షునికి ఈ విషయంలో ఎటువంటి అభ్యంతరం ఉండకూడదు.
నోట్: ఈ చర్చల్లో రెండు అంశాలపై ఏకాభిప్రాయం కుదరలేదు. కొత్తగా ఏర్పడనున్న రాష్ట్రం పేరు ఒక అంశం కాగా, హైకోర్టుకు సంబంధించిన అంశం మరొకటి.
# ఎ) తెలంగాణ ప్రాంత ప్రతినిధులు రాష్ట్రానికి ఆంధ్ర-తెలంగాణ అని పేరుపెట్టాలన్నారు (ఇది ముసాయిదా బిల్లులో ఉన్నది). ఆంధ్ర ప్రతినిధులు జాయింట్ సెలెక్ట్ కమిటీ సూచించిన ఆంధ్రప్రదేశ్ అనే పేరు ఉండాలన్నారు.
#బి) గుంటూరులో హైకోర్టు బెంచ్, హైదరాబాద్‌లో ప్రధాన పీఠం ఉండాలని తెలంగాణ ప్రతినిధులు అన్నారు. గుంటూరులో బెంచ్ ఉండనవసరం లేదని, హైకోర్టు హైదరాబాద్‌లోనే ఉండాలని ఆంధ్ర ప్రతినిధులు అన్నారు.
# తరువాత కేంద్ర ప్రభుత్వం ‘పెద్దమనుషుల ఒప్పందం’ను ‘నోట్ ఆన్ సేఫ్‌గార్డ్ ప్రపోజ్డ్ ఫర్ ది తెలంగాణ ఏరియా’ అనే పత్రం తయారు చేసి 1956, ఆగస్ట్ 10న పార్లమెంట్లో ప్రవేశపెట్టింది. ఈ నోట్ ఆన్ సేఫ్గార్డ్లో ప్రాంతీయ మండలిని కాస్త ప్రాంతీయ స్థాయీ సంఘంగా మార్చి అధికారాలను కుదించారు.
# ఒప్పందంలోని హామీల ఉల్లంఘన: 1956, ఫిబ్రవరి 20న జరిగిన ఒప్పందాన్ని ఆంధ్ర పాలకులు తమ మనసులో ఆనాడే తగులపెట్టారనింపించడంలో అతిశయోక్తి కనిపించదు. కాగితాలపై సంతకాలు చేసిన సిరా ఆరకముందే దానిని వారు విస్మరించారు. కమ్యూనిస్టు పార్టీ శాసనసభ్యుడు రాజ్‌బహదూర్ గౌర్ రాజ్యసభలో ఈ విషయం ప్రస్తావించే వరకు దాదాపు ఏడాదిన్నర పాటు తాము హామీ ఇచ్చిన రక్షణలకు చట్టబద్ధత కల్పించాలనే సంగతే ఆంధ్ర నాయకులు మరిచిపోయారు. వరుసగా 1956 నుంచి 1971 వరకు ముఖ్యమంత్రి పదవిని ఆంధ్ర ప్రాంతం వారే గుత్తకు తీసుకున్నప్పటికీ ఉప ముఖ్యమంత్రిగా ఒప్పందం ప్రకారం తెలంగాణ వారిని నియమించలేదు.
# ఉప ముఖ్యమంత్రి పదవి చేతికి ఆరో వేలు లాంటిది అది అవసరం లేదని నాటి ముఖ్యమంత్రి నీలం సంజీవరెడ్డి అహంకారంగా బహిరంగంగా వ్యాఖ్యానించారు. 1961లో ప్రజలు ఆందోళనను వ్యక్తపర్చినప్పుడు దామోదరం సంజీవయ్య కొండా వెంకటరంగారెడ్డిని కొంతకాలం ఉపముఖ్యమంత్రిగా చేశారు.
# మళ్లీ 1969లో తెలంగాణ పోరాటం ఉధృతంగా కొనసాగినప్పుడు మరికొంత కాలం తమకు అనుగుణంగా ఉండే జేవీ నర్సింగరావును కాసు బ్రహ్మానందరెడ్డి ఉపముఖ్యమంత్రిని చేశాడు.
మాదిరి ప్రశ్నలు
1. కింది వాటిలో పెద్దమనుషుల ఒప్పందంలో తెలంగాణ నుంచి పాల్గొననివారు?
1) బూర్గుల రామకృష్ణారావు
2) మరి చెన్నారెడ్డి 3) కేవీ రంగారెడ్డి
4) స్వామి రామానంద తీర్థ
2. తెలంగాణ ప్రాంతీయ మండలిలో ఎంతమంది సభ్యులుండాలని ఒప్పందంలో పేర్కొన్నారు?
1) 22 2) 20 3) 18 4) 15
3. కింది వాటిలో సరైనవి?
1) ఈ ఒప్పందం ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్ (ప్రస్తుతం ఆంధ్రా భవన్)లో 1956, ఫిబ్రవరి 20న జరిగింది
2) ఒప్పందం ప్రకారం మంత్రి మండలిలో తెలంగాణ ప్రాంతీయులు కచ్చితంగా 40 శాతం ఉండాలి
3) ఈ 40 శాతంలో కచ్చితంగా తెలంగాణ ప్రాంతం ముస్లిం శాసనసభ్యుడు ఉండాలి
4) పైవన్నీ సరైనవే
4. ‘తెలంగాణలో జాతీయోద్యమాలు’, ‘హైదరాబాద్‌లో స్వాతంత్య్రోద్యమం’ అనే గ్రంథాలను రాసింది?
1) దేవులపల్లి రామానుజరావు
2) వెల్దుర్తి మాణిక్యరావు
3) వట్టికోట ఆళ్వారుస్వామి
4) పుచ్చలపల్లి సుందరయ్య
5. కింది వాటిని జతపర్చండి?
1) తొలి తెలుగు శతకం
ఎ. వృషాధిప శతకం
2. తొలి తెలుగు ద్విపద కావ్యం
బి. బసవ పురాణం
3. తొలి తెలుగు లక్షణ గ్రంథం
సి. కవి జనాశ్రయం
4. తొలి తెలుగు దండకం
4. భోగినీ దండకం
1) 1-బి, 2-సి, 3-ఎ, 4-డి
2) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి
3) 1-డి, 2-సి, 3-బి, 4-ఎ
4) 1-ఎ, 2-బి, 3-డి, 4-సి
6. కింది వాటిలో సరైనవి?
1) 1948, ఆగస్ట్ 21న ఇమ్రోజ్ పత్రిక సంపాదకుడైన ‘షోయబుల్లాఖాన్’ను ఖాసిం రజ్వీ ఆదేశంతో రజాకార్లు హైదరాబాద్‌లో కాల్చి చంపారు
2) షోయబుల్లా ఖాన్ మృతికి ‘కన్నీటి కానుక పోలీస్ చర్య’ అనే గీతాన్ని దవళ శ్రీనివాసరావు రచించాడు
3) 1 4) 1, 2
7. ఎవరు అడిగిన ప్రశ్నకు జవాబుగా కేంద్ర ప్రభుత్వం పెద్దమనుషుల ఒప్పందాన్ని ‘నోట్ ఆన్ సేఫ్‌గార్డ్’ పేరుతో పార్లమెంట్లో ప్రవేశపెట్టారు?
1) బూర్గుల రామకృష్ణారావు
2) నీలం సంజీవరెడ్డి
3) రాజ్ బహదూర్ గౌర్
4) జేవీ నరసింగరావు
8. ఎవరి జయంతిని పురస్కరించుకొని తెలంగాణ ప్రభుత్వం జూలై 11ను ‘తెలంగాణ ఇంజినీర్స్ డే’గా జరుపుకోవాలని ప్రకటించింది?
1) నవాజ్ అలీ యావర్ జంగ్
2) మీర్ నవాజ్ అలీ నవాజ్ జంగ్
3) రాజ బహదూర్ వెంకట రాంరెడ్డి
4) తురబ్ అలీఖాన్
9. ‘తెలంగాణ రాషో్ట్రద్యమాలు’ గ్రంథ రచయిత?
1) ఆదిరాజు వెంకటేశ్వర రావు
2) జూలూరు గౌరీశంకర్
3) కొత్తపల్లి జయశంకర్
4) కోదండరామ్
10. క్విట్ ఇండియా ఉద్యమ సమయంలో హైదరాబాద్ రెసిడెన్సీ ప్రాంతంపై జాతీయ జెండా ఎగురవేసింది?
1) పద్మజా నాయుడు
2) జ్ఞాన్కుమారి హిడా
3) టీ రామస్వామి 4) పై అందరూ
11. నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ తవ్వకాల సమయంలో ఏ చారిత్రక ప్రదేశం ధ్వంసమైంది?
1) ఏలేశ్వరం 2) రామగిరి
3) వినుకొండ 4) ఏదీకాదు
సమాధానాలు
1-4, 2-2, 3-4, 4-1, 5-2,
6-4, 7-3, 8-2, 9-1, 10-4,
11-1.
సాసాల మల్లికార్జున్
అసిస్టెంట్ ప్రొఫెసర్
ప్రభుత్వ డిగ్రీ కాలేజీ, కోరుట్ల
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?