Telangana formation | తెలంగాణ అవతరణ
మంత్రుల బృందానికి పార్టీల అభిప్రాయాలు
-టీఆర్ఎస్: తెలంగాణపై ఎలాంటి పరిపాలనాపరమైన నియంత్రణలు పెట్టకూడదని, ఉమ్మడి రాజధాని కాలపరిమితిని ఐదేండ్లకు తగ్గించాలని, భద్రాచలాన్ని తెలంగాణలో అంతర్భాగంగానే ఉంచాలని, సీమాంధ్ర ప్రాంతంలో అనుమతులు లేకుండా కట్టిన ప్రాజెక్టులకు నీటి కేటాయింపులు అంగీకరించమని పేర్కొంది.
-బీజేపీ: రాష్ట్ర విభజన బిల్లును పార్లమెంట్ ఆమోదించాల్సి ఉన్నందున జాతీయ పార్టీలతో అఖిలపక్షం నిర్వహించాలని పేర్కొంది.
-కాంగ్రెస్: కాంగ్రెస్ నుంచి హాజరైన రెండు ప్రాంతాల నేతలు రెండు రకాల వాదనలు వినిపించారు. సీడబ్ల్యూసీ తీర్మానం ప్రకారం హైదరాబాద్ రాజధానిగా 10 జిల్లాలతో కూడిన తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయాలని ఒకరు, విభజనానంతరం సమస్యలు ఉంటాయి. కాబట్టి రాష్ర్టాన్ని సమైక్యంగానే ఉంచాలని, ఒకవేళ విడదీయక తప్పదంటే హెచ్ఎండీఏను కేంద్రపాలిత ప్రాంతం చేయాలని, హైదరాబాద్ ఆదాయాన్ని రెండు ప్రాంతాలకు జనాభా నిష్పత్తి ప్రకారం పంచాలని మరొకరు పేర్కొన్నారు.
-ఏఐఎంఐఎం: హైదరాబాద్‌పై కేంద్ర పాలన రాజ్యాంగ నిబంధనల ప్రకారం ఆమోదయోగ్యం కాదని, ఎలాంటి ఆంక్షలు పెట్టకూడదని పేర్కొంది. రాష్ర్టాన్ని విభజిస్తే తెలంగాణలోని ముస్లింలకు, దళితులకు ముప్పు ఉంది కానీ సీమాంధ్రులకు లేదని, అందువల్ల ప్రత్యేక రాష్ట్ర బిల్లుతోపాటు మతకలహాల నిరోధక బిల్లును కూడా చేయాలని తెలిపింది.
-సీపీఎం: భాషాప్రయుక్త రాష్ర్టాల్ని కొనసాగించడం, రాష్ర్టాన్ని సమైక్యంగా ఉంచడమే తమ విధానమని రాష్ట్ర విభజన, సమైక్య నిర్ణయంతో సంబంధంలేకుండా వివిధ ప్రాంతాలు, జిల్లాలు సామాజిక వర్గాల మధ్య నెలకొన్న అసమానతలు తొలగిపోయే విధంగా కృషిచేయాలని పేర్కొంది.
-వైస్సార్సీపీ: సమైక్య ఆంధ్రప్రదేశ్‌ను సమర్థిస్తూ తన అభిప్రాయాన్ని చెప్పింది.
-సీపీఐ: ఉమ్మడి రాజధాని హైదరాబాద్‌లో శాంతిభద్రతల నిర్వహణకు ప్రత్యేక యంత్రాంగాన్ని ఏర్పాటుచేయాలని, జల వివాదాల పరిష్కారానికి ప్రత్యేక మండలిని ఏర్పాటుచేసి దానికి చట్టబద్ధమైన అధికారాలివ్వాలని, 371డీ ప్రకరణను రెండు రాష్ర్టాల్లో కొనసాగించాలని పేర్కొంది.
-టీడీపీ: మంత్రుల బృందం నిర్వహించిన ఈ అఖిలపక్ష భేటీకి టీడీపీ హాజరుకాలేదు. కానీ కాంగ్రెస్ ఏకపక్షంగా, రాజ్యాంగ విరుద్ధంగా వెళ్తుంది. సమన్యాయం చేసిన తర్వాతే విభజన చేయండి అంటూ చంద్రబాబు రాష్ట్రపతికి లేఖ రాశారు.
-తెలంగాణకు చెందిన కేంద్ర మంత్రులు తెలంగాణ రాష్ర్టాన్ని ఎందుకు ఏర్పాటు చేయాలంటే అనే శీర్షికనగల నివేదికను మంత్రుల బృందానికి ఇచ్చారు. వీరు భద్రాచలాన్ని తెలంగాణలోనే ఉంచాలని కోరారు. అదేవిధంగా సీమాంధ్రకు చెందిన కేంద్ర మంత్రులు సీమాంధ్రుల రక్షణ కోసం హైదరాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతంగా చేయాలని, ఒకవేళ ఉమ్మడి రాజధానిగా ప్రకటించేటట్లయితే దానికి హెచ్ఎండీఏ పరిధిని తీసుకోవాలని, భద్రాచలాన్ని తూర్పుగోదావరి జిల్లాలో కలపాని పేర్కొన్నారు.
-అప్పటి సీఎం కిరణ్ కుమార్‌రెడ్డి రాష్ట్ర విభజనకు బదులుగా తెలంగాణ ప్రాంతానికి లక్ష కోట్ల రూపాయల ఆర్థిక ప్యాకేజీగా ఇవ్వాలని, విద్య, ఉద్యోగ, రాజకీయ పదవులపై మరింత దృష్టిపెట్టాలని, విభజనల వల్ల నక్సలిజం, తీవ్రవాదం, మతపరమైన సమస్యలతోపాటు నీటి సమస్యలను ఎదుర్కోవల్సి వస్తుందని మంత్రుల బృందంతో పేర్కొన్నాడు.
-మంత్రిత్వ శాఖ కార్యదర్శులు: మంత్రుల బృందం ఎనిమిది ముఖ్య మంత్రిత్వశాఖలు పోలీస్ టాస్క్‌ఫోర్స్, ఆర్థిక శాఖ, భారతీయ రైల్వే, న్యాయ-శాసన వ్యవహారాలు, పౌరవిమానయానం, జాతీయ రహదారులు-రవాణా, నౌకాయానం, సిబ్బంది వ్యవహారాలు శిక్షణ కార్యదర్శులతో సమావేశమై సుదీర్ఘంగా వివిధ అంశాలపై చర్చించడంతో రాష్ట్ర విభజన కసరత్తు చివరిదశకు చేరినట్లయింది.
-2013, అక్టోబర్ 8న ఏర్పాటైన మంత్రుల బృందం తనకు కేటాయించిన 11 విధివిధానాలపై అభిప్రాయాలను సేకరించి ఒక నిర్ణయానికి వచ్చే క్రమంలో రాయల-తెలంగాణ హైదరాబాద్, పోలవరం ముంపు గ్రామాల అంశాలపై తీవ్ర ఒత్తిళ్లను ఎదుర్కోవాల్సి వచ్చింది. మంత్రుల బృందం 2013, డిసెంబర్ 4న చివరిసారిగా సమావేశమై రాష్ట్ర విభజన బిల్లును, రాష్ట్ర విభజన సిఫారసులతో కూడిని నివేదికను కేబినెట్‌కు 2013, డిసెంబర్ 5న పంపింది. అదేరోజు సాయంత్రం 5 గంటలకు ప్రధానమంత్రి నివాసంలో ప్రారంభమైన మంత్రివర్గ సమావేశంలో తీవ్రవాదోపవాదాల మధ్య 10 జిల్లాలతో కూడిన తెలంగాణ రాష్ర్టానికే కేంద్రమంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ బిల్లు రాష్ట్రపతి, అటునుంచి అసెంబ్లీకి పంపింది.
అసెంబ్లీలో చర్చలు
-బిల్లు 2013, డిసెంబర్ 6న కేంద్ర హోంశాఖ నుంచి రాష్ట్రపతి కార్యాలయానికి చేరింది. రాష్ట్రపతి బిల్లుకు సంబంధించి న్యాయ నిపుణుల సలహాను తీసుకున్న తర్వాత 2013, డిసెంబర్ 11న ముసాయిదా బిల్లుపై ఆమోదముద్ర వేసి 2014, జనవరి 23 (45 రోజులు) లోగా అసెంబ్లీ, శాసనమండలి అభిప్రాయాలను తెలపాలని గడువు విధిస్తూ బిల్లును రాష్ర్టానికి పంపాలని ఆదేశించారు.
-2013, డిసెంబర్ 16న బిల్లును శాసనసభ, శాసనమండలిలో ప్రవేశపెట్టారు. స్పీకర్ నాదెండ్ల మనోహర్ బిల్లును శాసనసభలో ప్రవేశపెట్టారు. సభలో నెలకొన్న గందరగోళ పరిస్థితుల మధ్య సభను 2014, జనవరి 3కు వాయిదావేశారు. ఈ మధ్యకాలంలో శాసనసభ వ్యవహారాల శాఖ నుంచి శ్రీధర్‌బాబును తప్పించి శైలజానాథ్‌కు అప్పగించడంతో శ్రీధర్‌బాబు తన మంత్రిపదవికి జనవరి 2న రాజీనామా చేశారు.
-జనవరి 7న ఎమ్మెల్యేలు తమ అభిప్రాయాలను వెలిబుచ్చారు. అదేరోజు జేఏసీ ఇందిరాపార్క్ వద్ద సంపూర్ణ తెలంగాణ సాధన దీక్షను నిర్వహించింది. జనవరి 8న రాష్ట్ర విభజన బిల్లుపై మంత్రి వట్టి వసంతకుమార్ చర్చను ప్రారంభించారు. జనవరి 20న బిల్లుపై శాసనసభ్యులు క్లాజులవారీగా తెలిపిన అభిప్రాయాలను, సవరణలను సీడీలరూపంలో నిక్షిప్తం చేశారు.
-ఇందులో 9039 సవరణలు, అభిప్రాయాలు, సూచనలున్నాయి. జనవరి 22, 23న సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర విభజన బిల్లును వ్యతిరేకిస్తున్నట్లు, ఈ సమయంలో తాను సీఎంగా ఉండటం దురదృష్టకరమని, డ్రాఫ్టు బిల్లు కాకుండా ఒరిజనల్ బిల్లు పంపాలని ప్రకటించాడు. చర్చకు మరింత సమయం కావాలని రాష్ట్రప్రభుత్వం రాష్ట్రపతికి లేఖ రాయడంతో జనవరి 30 వరకు గడువు పెంచుతున్నట్లు రాష్ట్రపతి ఉత్తర్వులు జారీచేశారు.
-జనవరి 25న సీఎం కిరణ్‌కుమార్ రెడ్డి బిల్లును తిరస్కరిస్తూ పార్లమెంట్లో ప్రవేశపెట్టేందుకు సిఫారసు చేయొద్దని రాష్ట్రపతికి విజ్ఞప్తిచేసే తీర్మానాన్ని రూల్ 77 కింద శాసనసభలో తేవడానికి వీలుగా స్పీకర్‌కు నోటీసు ఇచ్చాడు. ఈ సందర్భంగా చంద్రబాబు ప్రసంగిస్తూ బిల్లును తిప్పి పంపే అధికారం శాసనసభకు ఉందని, బిల్లును ముందే ఎందుకు తిప్పి పంపలేదని ప్రశ్నించారు.
-కిరణ్ సర్కార్ బిల్లుపై చర్చించడానికి మూడువారాల గడువు కావాలంటూ మరోమారు రాష్ట్రపతికి లేఖ రాసింది. బిల్లును అడ్డుకోవడానికే ఈ కుటిల ప్రయత్నాలని తెలంగాణ ప్రజాప్రతినిధులు ఆందోళనకు దిగారు. చివరి రోజు (జనవరి 30) స్పీకర్ మాట్లాడుతూ 87 మంది సభ్యులు మాట్లాడారు. మిగిలినవాళ్లు రాతపూర్వకంగా తమ అభిప్రాయాలను తెలిపారు. దీంతో మొత్తం సభ్యుల అభిప్రాయం రికార్డయ్యింది.
-బిల్లుకు 9072 సవరణలు, ప్రతిపాదనలు వచ్చాయని స్పీకర్ పేర్కొన్నాడు. తర్వాత స్పీకర్ రూల్ 77 కింద ముఖ్యమంత్రి ఇచ్చిన తీర్మానాన్ని చర్చకు తీసుకుంటున్నట్లు ప్రకటించాడు. తీర్మానాన్ని మూజువాణి ఓటుతో ఆమోదించినట్లు స్పీకర్ ప్రకటించాడు. నిజానికి సభా నియమాల ప్రకారం ముఖ్యమంత్రి తీర్మానాన్ని ప్రవేశపెట్టాలి. దానిపై చర్చ, చర్చ తర్వాత ఓటింగ్ పెట్టాలి కానీ సభా నియమాలను కాలరాసి స్పీకర్ స్వయంగా తీర్మానాన్ని ప్రవేశపెట్టారు.
పార్లమెంట్ ఆమోదం
-తెలంగాణ బిల్లుపై అసెంబ్లీ నివేదిక 2014 ఫిబ్రవరి 1న అసెంబ్లీ కార్యదర్శి నుంచి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి అటునుంచి ఢిల్లీకి చేరుకుంది. ఫిబ్రవరి 3న ఢిల్లీకి చేరుకున్న ఆ నివేదికను కేంద్ర హోంమంత్రిత్వ శాఖ కార్యాలయానికి తరలించారు. మంత్రుల బృందం అసెంబ్లీ నుంచి 9072 సవరణలను, 87 మంది సభ్యు ల అభిప్రాయాలను, మండలి నుంచి వచ్చిన 1157 సవరణలను, 54 మంది సభ్యుల అభిప్రాయాలను, కిరణ్‌కుమార్‌రెడ్డి తీర్మానంతో పాటు, 10న అనధికార తీర్మానాలను, తమ దగ్గరకు వచ్చిన 18,000 ఈమెయిల్స్‌ను ఫిబ్రవరి 4న చర్చించి వాటిని కేబినెట్‌కు పంపింది. ఫిబ్రవరి 9న బిల్లు రాష్ట్రపతి దగ్గరకెళ్లింది.
-ఫిబ్రవరి 12న తెలంగాణ బిల్లు విషయంలో రాజ్యాంగ సవరణ అవసరం లేదని న్యాయశాఖ తెలిపింది. ఇదే రోజున పోలవరం ముంపు గ్రామాల సంఖ్యను 134కు తగ్గిస్తూ కేంద్ర కేబినెట్ మరో సవరణ చేసింది. ఫిబ్రవరి 13న కేంద్ర హోంమంత్రి సుశీల్‌కుమార్ షిండే లోక్‌సభలో మధ్యాహ్నం 12 గంటలకు ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లు-2013ను ప్రవేశపెట్టారు. ఫిబ్రవరి 18న మూజువాణి ఓటుతో లోక్‌సభ బిల్లుకు ఆమోదం తెలిపింది. రాష్ట్ర పునర్విభజన బిల్లు నెగ్గిందని స్పీకర్ ప్రకటించాడు. ఫిబ్రవరి 20న రాజ్యసభలో బిల్లుపై చర్చ ప్రారంభమైంది. బీజేపీ మద్దతు ఇస్తున్నట్లు అరుణ్‌జైట్లీ ప్రకటించారు. సీపీఎం నేత సీతారాం ఏచూరి తాము విశాలాంధ్రను సమర్థిస్తున్నామని, బిల్లుకు వ్యతిరేకమన్నారు. బిల్లుపై వెంకయ్యనాయుడు 38 సవరణలు ప్రతిపాదిస్తూ సుదీర్ఘ ప్రసంగం చేశారు. రాజ్యసభలో బిల్లుపై చర్చలో పాల్గొన్న ప్రధానమంత్రి మన్మోహన్సింగ్ ఆంధ్రప్రదేశ్‌కు 6 హామీలు ఇచ్చారు. అవి..
-13 జిల్లాలతో కూడిన ఆంధ్రప్రదేశ్‌కు కేంద్ర సహాయం అందించేందుకు ప్రత్యేక కేటగిరి హోదా కల్పిస్తారు. నాలుగు రాయలసీమ జిల్లాలు, మూడు ఉత్తర కోస్తా జిల్లాలు కలిపి ఏపీకి ఐదేండ్ల పాటు ఈ హోదా ఉంటుంది.
-రెండు రాష్ర్టాల్లో పారిశ్రామీకరణ, ఆర్థికాభివృద్ధి సాధించేందుకు ప్రోత్సాహకాలు ఉంటాయి.
-రాయలసీమ, ఉత్తర కోస్తాంధ్ర ప్రాంతాలకు అందించే అభివృద్ధి ప్యాకేజీ ఒడిశాలోని కోరాపూల్, బొలాంగిర్, కలహండి, మధ్యప్రదేశ్‌లోని బుండేల్ఖండ్ ప్రాంతాలకు అందించే ప్యాకేజీ తరహా ఉంటుంది.
-పోలవరం ప్రాజెక్టును కేంద్ర ప్రభుత్వం పూర్తి చేస్తుంది. పూర్తి పునరావాస, పునర్నిర్మాణ బాధ్యతను కేంద్రం తీసుకుంటుంది.
-సిబ్బంది, ఆర్థిక, ఆస్తుల పంపకం, అప్పుల బాధ్యత వంటి చర్యలు చేపట్టేందుకు నోటిఫైడ్ తేదీని అనుసరించి అపాయింటెడ్ తేదీని (విభజన తేదీ)ని నిర్ణయిస్తారు.
-ఏపీలో మొదటి ఏడాది ఏర్పడే వనరుల లోటును 2014 కేంద్ర బడ్జెట్ ద్వారా పూడుస్తారు.
-బిల్లుపై డివిజన్ జరగాలని సీపీఎం పట్టుబట్టగా, డివిజన్ ప్రసక్తి లేదంటూ డిప్యూటీ చైర్మన్ తెలపగా మూజువాణి ఓటుతో బిల్లు నెగ్గింది. ది బిల్ ఈజ్ పాస్డ్ అని డిప్యూటీ చైర్మన్ ప్రకటించారు. రాజ్యసభ ఆమోదం అనంతరం బిల్లు న్యాయశాఖ నుంచి హోంశాఖకు, హోంశాఖ నుంచి రాష్ట్రపతి దగ్గరకు వచ్చింది.
-2014 మార్చి 1న ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లుపై రాష్ట్రపతి సంతకం చేశారు. దీంతో ఈ బిల్లు ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం-2014గా రూపుదాల్చింది. మినిస్ట్రీ ఆఫ్ లా అండ్ జస్టిస్ దీన్ని భారతీయ రాజపత్రం (ద గెజిట్ ఆఫ్ ఇండియా)లో ది ఆంధ్రప్రదేశ్ రీ ఆర్గనైజేషన్ యాక్ట్ – 2014 పేరుతో ముద్రించి దానికి చట్టబద్ధ హోదా కల్పించింది. పార్లమెంట్ ఆమోదం ఈ చట్టానికి 2014 మార్చి 1న రాష్ట్రపతి ఆమోదముద్ర వేసినట్లు గెజిట్‌లో పేర్కొన్నారు.
-రిజిస్టర్డ్ నం. డి.ఎల్-(s)04/0007/2013-14 పేరుతో 71 పేజీల చట్టాన్ని గెజిట్‌లో పొందుపర్చారు. రాష్ట్ర ఆవిర్భావ దినాన్ని కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ ద్వారా అధికార గెజిట్‌లో చేరుస్తారని రాజపత్రంలో పేర్కొన్నారు. 2014 మార్చి 4న కేంద్ర హోంశాఖ 2014 జూన్ 2న విభజన తేదీ (అపాయింటెడ్ డే)గా నిర్ణయిస్తూ భారత రాజపత్రం (గెజిట్)లో ప్రకటించింది. జూన్ 2 నుంచి అధికారికంగా తెలంగాణ 29వ రాష్ట్రంగా ఆవిర్భవించింది.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?