కార్పొరేట్ కార్యాలయాలు మొదలు చిన్నచిన్న సంస్థలు, కంపెనీల వరకు ఎక్కడైనా సరే కంప్యూటర్ లేనిదే పని జరుగని రోజులివి. బ్యాంకులు, ఆస్పత్రులు, హోటళ్లు, మీడియా సంస్థలు ఇలా అన్ని రంగాల్లో కంప్యూటర్ల వినియోగం పెరిగిపోయింది. దాంతోపాటే కంప్యూటర్లలోని సమాచారాన్ని దొంగిలించే హ్యాకర్ల బెడద కూడా పెరిగింది. అందుకే వివిధ సంస్థలు తమ డాటా హ్యాకింగ్‌కు గురికాకుండా ఎథికల్ హ్యాకర్లను నియమించు కుంటున్నాయి. దీంతో సర్టిఫైడ్ ఎథికల్ హ్యాకర్లకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. ఈ నేపథ్యంలో ఇంటర్ అర్హతతో ఎథికల్ హ్యాకింగ్‌లో సర్టిఫికేషన్లు, కెరీర్ వివరాలు నిపుణ పాఠకుల కోసం…
హ్యాకింగ్ అంటే
– అక్రమంగా ఇతర వ్యక్తులు లేదా సంస్థల కంప్యూటర్లలోకి ప్రవేశించి సమాచారాన్ని తస్కరించడాన్ని హ్యాకింగ్ అంటారు. హ్యాకింగ్‌కు పాల్పడేవారిని హ్యాకర్లు అంటారు. హ్యాకింగ్ ద్వారా ఓ సంస్థ సిస్టమ్స్‌లోని డాటాను అస్తవ్యస్తం చేయడంతోపాటు తీవ్ర నష్టం కలిగించవచ్చు. దేశాల ఆర్థిక, రక్షణ సంబంధ సమాచారం తస్కరించి ఆయా దేశాల స్థితిగతులనే మార్చేయవచ్చు. అందుకే తమ భద్రతకు సంబంధించిన సమాచారం హ్యాక్ అయితే అభివృద్ధి చెందిన దేశాలు సైతం వణికిపోతాయి.
ఎథికల్ హ్యాకర్ అంటే
– హ్యాకర్ల దాడికి గురైన ఒక సంస్థ లేదా వ్యక్తి అనుమతితో వారి కంప్యూటర్లలో ప్రవేశించి, నెట్‌వర్క్‌ను కాపాడటాన్ని ఎథికల్ హ్యాకింగ్ అంటారు. ఈ పనిచేసేవారిని ఎథికల్ హ్యాకర్లు అంటారు. కంప్యూటర్లలోని డాటాను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ.. హ్యాకింగ్‌కు గురికాకుండా చూడటం, వాటిలోని అనవసర డాటాను తొలగించడం, లోపాలను సరిదిద్దడం ఎథికల్ హ్యాకర్ల విధి. ఈ ఎథికల్ హ్యాకర్లు కంప్యూటర్ల ద్వారా తమకు లభించిన సమాచారాన్ని రహస్యంగా ఉంచుతారు.
కావాల్సిన స్కిల్స్
– ఎథికల్ హ్యాకర్‌గా రాణించాలంటే కంప్యూటర్ నెట్‌వర్కింగ్‌పై పూర్తి పరిజ్ఞానం ఉండాలి. హ్యాకర్లు అనుసరించే మోసపూరిత విధానాలపై ఎప్పటికప్పుడు అవగాహన పెంచుకోవాలి. జావా, సీ, సీ++, పెర్ల్, పైథాన్, రూబీ లాంటి అప్లికేషన్లపై మంచి పట్టు కలిగి ఉండాలి. కంప్యూటర్ ఆపరేటింగ్ సిస్టమ్స్‌కు సంబంధించిన పరిజ్ఞానం అవసరం. వీటితోపాటు తార్కిక ఆలోచనా విధానం విశ్లేషణాత్మక వైఖరి ఉన్నవారు కెరీర్లో ఉన్నతస్థాయికి చేరుకోవచ్చు.
సంస్థలు
– సర్టిఫైడ్ ఎథికల్ హ్యాకర్ (CEH), సర్టిఫైడ్ హ్యాకింగ్ ఫోరెన్సిక్ ఇన్వెస్టిగేటర్ (CHFI) సర్టిఫికేషన్లను ఈ కామర్స్-కౌన్సిల్ (EC-Council) ఆఫర్ చేస్తున్నది. మిగతా మూడు కోర్సులను గ్లోబల్ ఇన్ఫర్మేషన్ అస్యూరెన్స్ సర్టిఫికేషన్ (GIAC) ప్రోగ్రామ్ కింద SAN (సెక్యూరిటీ, ఆడిట్ & నెట్వర్కింగ్) ఇన్స్టిట్యూట్ ఆఫర్ చేస్తున్నది.
– అంతేగాక ఇండియన్ స్కూల్ ఆఫ్ ఎథికల్ హ్యాకింగ్, ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ టెక్నాలజీ, ఫ్రిస్టిన్ ఇన్ఫో సొల్యూషన్స్, ఇన్నోబజ్ నాలెడ్జ్ సొల్యూషన్స్, అరిజోనా ఇన్ఫోటెక్, కోనిగ్ సొల్యూషన్స్, ఇన్స్పైర్ సైబర్ సెక్యూరిటీ వంటి సంస్థలు ఎథికల్ హ్యాకింగ్‌లో వివిధ సర్టిఫికేషన్లను ఆఫర్ చేస్తున్నాయి.
అవకాశాలు
– భారత్‌లోని ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో ఎథికల్ హ్యాకర్ల అవసరం చాలా ఉన్నప్పటికీ, నిపుణులైన ఎథికల్ హ్యాకర్లు అవసరానికి సరిపడాలేరని ఐటీ నిపుణులు చెబుతున్నారు. బ్యాంకింగ్, ఫైనాన్స్, బీపీవో, ఐటీ వంటి అనేక రంగాలతోపాటు డిటెక్టివ్ కంపెనీలు, ఇన్వెస్టిగేషన్ ఏజన్సీలు, ఫోరెన్సిక్ ఆర్గనైజేషన్లలో ఎథికల్ హ్యాకర్లకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయి. విదేశాల్లో సైతం ఎథికల్ హ్యాకర్లకు భారీగా డిమాండ్ ఉంది.
హోదాలు
– ఎథికల్ హ్యాకింగ్ సర్టిఫికేషన్ పొందినవారు తమ విద్యార్హతలను బట్టి నెట్వర్క్ సెక్యూరిటీ సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్/మేనేజర్, సెక్యూరిటీ ఇన్వెస్టిగేటర్, నెట్వర్క్ సెక్యూరిటీ ఇంజినీర్, సిస్టమ్స్/అప్లికేషన్స్ సెక్యూరిటీ ఎగ్జిక్యూటివ్, వెబ్ సెక్యూరిటీ అడ్మినిస్ట్రేటర్/మేనేజర్, సెక్యూరిటీ ఆడిటర్, ఎథికల్ హ్యాకర్, డాటా సెక్యూరిటీ స్పెషలిస్ట్, చీఫ్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ ఆఫీసర్, కంప్యూటర్ ఫోరెన్సిక్స్ ఇన్వెస్టిగేటర్, ఐటీ సెక్యూరిటీ అడ్మినిస్ట్రేటర్/కన్సల్టెంట్/మేనేజర్, సెక్యూరిటీ సర్టిఫైడ్ ప్రోగ్రామర్, సెక్యూరిటీ కన్సల్టెంట్ హోదాల్లో ఉద్యోగాలు పొందవచ్చు.
వేతనం
– ఎథికల్ హ్యాకర్లకు ప్రారంభంలో నెలకు రూ.20 వేల నుంచి రూ.25 వేల వేతనం లభిస్తుంది. విద్యార్హతలు, అనుభవం, స్కిల్స్ పెరిగేకొద్ది వేతనాల్లో పెరుగుదల ఉంటుంది. విదేశాల్లో అయితే అనుభవజ్ఞులైన ఎథికల్ హ్యాకర్లు నెలకు 50 వేల అమెరికన్ డాలర్లకుపైగానే వేతనం అందుకుంటున్నారు.
ఎథికల్ హ్యాకింగ్ సర్టిఫికేషన్లు
1. సర్టిఫైడ్ ఎథికల్ హ్యాకర్ (CEH)
2. సర్టిఫైడ్ హ్యాకింగ్ ఫోరెన్సిక్ ఇన్వెస్టిగేటర్ (CHFI)
3. GIAC సర్టిఫైట్ పెనెట్రేషన్ టెస్టర్ (GPEN)
4. GIAC సర్టిఫైడ్ ఇన్‌ట్రూషన్ ఎనలిస్ట్ (GCIA)
5. GIAC సర్టిఫైడ్ ఫోరెన్సిక్ ఎనలిస్ట్ (GCFA)
– అర్హత: 10+2 విధానంలో ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులైనవారు పైన పేర్కొన్న వాటిలో ఏ కోర్సు అయినా పూర్తిచేయవచ్చు. సైబర్ సెక్యూరిటీ, నెట్వర్క్ సెక్యూరిటీ, సిస్టమ్స్ సెక్యూరిటీ, డాటా సెక్యూరిటీ విభాగాల్లో పనిచేసే నిపుణులకు ఎథికల్ హ్యాకింగ్ సర్టిఫికేషన్ చాలా ముఖ్యం.