Ecosystem | జీవావరణ వ్యవస్థ
– భౌతిక పరిస్థితుల వల్ల కాలానుగుణంగా ఒక సమాజ స్థానాన్ని ఇతర రకాల సమాజాలు ఆక్రమించుకోవడాన్ని లేదా ప్రతిక్షేపించడాన్ని జీవారణ అనుక్రమం అని అంటారు.
– జీవావరణ అనుక్రమం నెమ్మదిగా, అవిచ్ఛిన్నంగా చాలాకాలం వరకు అంటే స్థిర సమాజం ఏర్పడేంత వరకు కొనసాగుతూనే ఉంటుంది.
– చివరికి ఏర్పడే సమాజాన్ని పరాకాష్ట సమాజం అంటారు. దీంతో సమాజంలో స్థిరత్వం కనిపిస్తుంది. జీవారణ అనుక్రమంలో మొదట ఏర్పడే సమాజాన్ని పయొనీర్ అని అంటారు. జీవావరణ అనుక్రమంలో మొదట ఏర్పడే సమాజాలను సీరల్ (Seral) దశలు అంటారు. చివరకు ఏర్పడే స్థిర సమాజాన్ని ైక్లెమాక్స్ (Climax) అంటారు.
– జీవావరణ అనుక్రమం ప్రధానంగా రెండు రకాలుగా ఉంటుంది.
– హైడ్రార్క్: కుంటలు, బురద ప్రదేశాల్లో ప్రారంభమయ్యే జీవావరణ అనుక్రమాన్ని హైడ్రార్క్ (Hydrarch) అంటారు.
– దీనిలోని మధ్యంతర దశలను హైడ్రోసీరల్ అని అంటారు. ఇలాంటి అనుక్రమంలో చివరకు ఒక స్థిరసమాజంగా వివిధ రకాల అడవులు ఏర్పడుతాయి.
– హైడ్రార్క్ రెండు రకాలుగా ఉంటుంది. మంచినీటిలో ప్రారంభమయ్యే అనుక్రమం హైడ్రోసీర్. ఉప్పునీటిలో ప్రారంభమయ్యే అనుక్రమ హాలోసీర్.
– జీరార్క్: ఎడారిలో ప్రారంభమయ్యే జీవావరణ అనుక్రమాన్ని జీరార్క్ అని అంటారు.
– ఇక్కడ నీటి కొరత ఎక్కువగా ఉంటుంది. అనుక్రమంలోని దశలను గ్జెరోసీర్ (Xerosere) అంటారు.
– శిలలపై ప్రారంభమయ్యే జీవారణ అనుక్రమాన్ని లిథోసియర్ అంటారు.
– ఇసుకపై ప్రారంభమయ్యే జీవావరణ అనుక్రమాన్ని సామెసియర్ అంటారు.
జీవావరణ వ్యవస్థ
– భౌతిక రసాయనిక పరిసరాలకు జీవులకు మధ్య పదార్థాల వినిమయానికి అంతర చర్యలు నిరవధికంగా జరుగుతూ ఉండే ప్రమాణాన్ని జీవావరణ వ్యవస్థ అంటారు.
– జీవావరణశాస్త్రంలో ఇది అతి ముఖ్యమైన క్రియాశీల ప్రమాణం. సరస్సు, కొలను, కుంట, అడవి, పగడపు దీవి, పచ్చిక మైదానం, పంటపొలం, సంవర్ధన ప్రయోగశాల ఇవన్నీ జీవావరణ వ్యవస్థలను అధ్యయనం చేయడానికి ఉపయోగపడే అనువైన ప్రమాణాలు.
– జీవావరణ వ్యవస్థ అనే పదాన్ని ఏజీ టాన్స్లే మొదటిసారి ప్రతిపాదించాడు.
– జీవావరణ వ్వవస్థ నిర్జీవులతో నిర్మితమై ఇవి ఒక దానితో మరొకటి ప్రభావితమై ఉంటాయి. జీవం కొనసాగడానికి ఈ రెండు కారణాలు అవసరం.
– శక్తి ప్రసరణ, పోషక పదార్థాల చక్రీయ వినిమయం ఈ రెండు జీవావరణ వ్యవస్థలో ముఖ్యమైన అంశాలు.
– ఈ రెండు బలాలతోనే జీవులు, నిర్జీవులు సంబంధం కలిగి ఉంటాయి. జీవావరణ వ్యవస్థలో రెండు నిర్మాణాత్మక భాగాలు ఉంటాయి. 1. నిర్జీవ కారకాలు 2. జీవ కారకాలు
– నిర్జీవ కారకాలు: వీటిని రెండు విభాగాలుగా గుర్తించవచ్చు.
– భౌతిక నిర్జీవ కారకాలు: ఉష్ణోగ్రత, కాంతి, పీడనం, గాలి, భూ అయస్కాంతత్వం, గురుత్వాకర్షణ శక్తి, నీరు అవక్షేపం మొదలైనవి.
– రసాయన నిర్జీవ కారకాలు: లవణీయత, ఆమ్లత్వం, పోషక పదార్థాల లభ్యత.
జీవకారకాలు
– జీవకారకాలు అంటే జీవ సమాజంలోని అన్ని రకాల జీవులు. వీటిని ముఖ్యంగా మూడు రకాలుగా విభజించవచ్చు.
– ఉత్పత్తిదారులు: జల, భౌమ ఆవాసాల్లో పెరిగే హరిత వృక్షజాతులను స్వయం పోషక జీవులు లేదా ఉత్పత్తిదారులు అంటారు.
– ఇవి సామాన్య కర్బన పదార్థాల నుంచి అతి సంక్లిష్టమైన పిండి పదార్థాలను తయారు చేసుకుంటాయి. ఇందుకోసం వీటిలో సంక్లిష్టమైన కిరణజన్య సంయోగక్రియ జరుగుతుంది.
– ఈ ప్రక్రియలో మొక్కల్లోని క్లోరోఫిల్ అనే హరిత వర్ణకం సూర్యరశ్మిలో శక్తిని గ్రహించి, కార్బన్ డై ఆక్సైడ్, నీరు నుంచి పిండి పదార్థాన్ని సంశ్లేషిస్తుంది.
– సల్ఫర్ బ్యాక్టీరియా వంటి కొన్ని బ్యాక్టీరియాలు ప్రత్యేక ప్రక్రియ ద్వారా రసాయన పదార్థాలను విచ్ఛిన్నం చేసి శక్తిని ఉత్పత్తి చేస్తాయి. వీటిని రసాయన స్వయం పోషకాలు అంటారు.
– వినియోగదారులు: ఆహారం కోసం ఇతర జీవులపై ఆధారపడే జీవులను వినియోగదారులు అంటారు.
ప్రాథమిక వినియోగదారులు
– స్వయం పోషకాలను లేదా ఉత్పత్తిదారులను ప్రత్యక్షంగా తినే జంతువులను ప్రాథమిక వినియోగదారులు లేదా మొదటి తరగతి వినియోగదారులు అంటారు.
– వీటిని సాధారణంగా శాకాహారులు అంటారు. నేలపై జీవించే పశువులు, జింకలు, గొర్రెలు, కుందేళ్లు, మిడత, నత్త ఉదాహరణలు.
– జలావరణంలో కొన్ని ప్రొటిస్ట్లు, క్రస్టేసియన్లు, మొలస్కాజీవులు, జంతుప్లవకాలు సూక్ష్మ శాకాహారులు.
– జీవావరణ వ్యవస్థలో శాకాహారులు రెండో పోషణస్థాయిని ఆక్రమిస్తాయి.
ద్వితీయ వినియోగదారులు
– ప్రాథమిక వినియోగదారులతోపాటు ఉత్పత్తిదారులను కూడా ద్వితీయ వినియోగదారులు తింటాయి. వీటిని సాధారణంగా సర్వభక్షకులని అంటారు.
– ఉదాహరణ: మనిషి, చేపలు, కప్పలు
– తృతీయ వినియోగదారులు: ప్రాథమిక, ద్వితీయ వినియోగదారులను భుజించే జంతువులను తృతీయ వినియోగదారులని అంటారు.
– వీటిని మాంసాహారులు అని అంటారు. వీటిని అంతిమ మాంసాహారులు అని కూడా అంటారు.
– విచ్ఛిన్నకారులు: మృతిచెందిన వృక్ష, కళేబారాలను, జీవుల వ్యర్థ పదార్థాలను పోషక పదార్థాలుగా ఉపయోగించుకొని విచ్ఛిన్నం చేసి శక్తిని పొందే జీవులు విచ్ఛిన్న జీవులు.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?