Qutubshahis | దక్కన్ దర్జా – కుతుబ్‌షాహీలు
బహమనీ వంశం అంతరించడంతో రాజ్యం ఐదు స్వతంత్ర భాగాలుగా విడిపోయి కొత్త రాజ్యాలు ఆవిర్భవించాయి. అవి..
-నిజాం ఉల్‌ముల్క్ ఆధీనంలో అహ్మద్‌నగర్
-ఆదిల్షా ఆధీనంలో బీజాపూర్
-కుతుబ్ ఉల్ ముల్క్ ఆధీనంలో గోల్కొండ
-ఇమాదుల్ ముల్క్ ఆధీనంలో బీరార్
-బరీద్ ఇమామాలిక్ ఆధీనంలో బీదర్
-తెలంగాణ పాలకు డిగా కులీ కుతుబ్‌షా (కుతుబ్ ఉల్‌ముల్క్) నియమించబడ్డాడు. ఇతడి కాలంలోనే తెలంగాణ అనే పదం బహుళ ప్రచారం పొందింది. 1496-1518 వరకు కులీ కుతుబ్‌షా తెలంగాణ సుబేదార్‌గా పాలించాడు.
-కులీ కుతుబ్‌షా ఆసియా నుంచి వచ్చి బహమనీ సుల్తాన్ అయిన మహమ్మద్ కొలువులో చేరి సేనాపతి అయ్యాడు. 1487లో దక్కనీ, అఫాకీ ముస్లింల ఘర్షణలో మహమ్మద్ షాను రక్షించాడు. బహదూర్ జిలానీ తిరుగుబాటును కులీకుతుబ్‌షా అణచివేయడంతో మహమ్మద్ షా కులీకి కుతుబ్ ఉల్ ముల్క్ అనే బిరుదునిచ్చి గోల్కొండ జాగీర్దార్గా నియమించాడు.
-గోల్కొండను రాజధానిగా చేసుకుని పరిపాలించాడు. గోల్కొండను పూర్వం మంగళవరం అని పిలిచేవారు. కులీ స్వతంత్రించినప్పుడు మెదక్ జిల్లా కోహిర్ నుంచి ఓరుగల్లు వరకు మాత్రమే ఇతని పాలనలో ఉంది. ఓరుగల్లు నుంచి తూర్పు తీరం వరకు చితాబ్‌ఖాన్ పాలిస్తున్నాడు. కులీ 1504లో ఓరుగల్లు కోటను కైవసం చేసుకున్నాడు. చితాబ్‌ఖాన్ మంత్రిగా ఉన్న చరిగొండ ధర్మన్న రాజ్యంలో వరంగల్, ఖమ్మం మెట్టు, నల్లగొండ ప్రాంతాలు ఉన్నాయి. రాచకొండ, పానగల్లు, ఘనపురం, దేవరకొండ, నల్లగొండ, ఉర్లగొండ, ఉండ్రుగొండ, అనంతగిరి దుర్గాధిపతులు స్వతంత్రులుగా ఉండేవారు. వీటిలో కులీ కుతుబ్ షా రాచకొండ, దేవరకొండ దుర్గాలను స్వాధీనం చేసుకున్నాడు.
-కరీంనగర్ జిల్లా కివాం ఉల్ ముల్క్‌ను ఓడించి ములంగూర్, ఎల్గందుల, రామగిరి కోటలను కులీ ఆక్రమించాడు. ఆదిల్షాతో యుద్ధం చేసి కొవిలకొండను ఆక్రమించాడు. హరిచందర్ను అణచి నల్లగొండను వశం చేసుకుని కృష్ణానది తీరంవరకు ఆక్రమించాడు. ఇతనికి ఆరుగురు కొడుకులు. వారిలో మొదటివాడు హైదర్, రెండోవాడు కుతుబుద్దీన్, మూడోవాడు జంషీద్, నాలుగోవాడు అబ్దుల్ కరీం, ఐదోవాడు దౌలత్, ఆరోవాడు ఇబ్రహీం కుతుబ్ షా.
-తండ్రి బతికుండగానే పెద్దకొడుకైన హైదర్ మరణించాడు. రెండో కొడుకు రాజకీయాల పట్ల శ్రద్ధ చూపలేదు. మిగతా ముగ్గురు తండ్రి బతికుండగానే సింహాసనాన్ని ఆకాంక్షించారు.
-నాలుగో కొడుకు బీజాపూర్ సుల్తాన్‌తో కలిసి గోల్కొండ ముట్టడికి ప్రయత్నించాడు. ఆ ప్రయత్నంలో మరణించాడు.
-మూడో కొడుకు జంషీద్, ఐదోవాడు దౌలత్ రాజ్య వారసత్వం కోసం పోరాడుతుండగా జంషీద్‌ను గోల్కొండలో, దౌలత్‌ను భువనగిరిలో బంధించాడు.
-గోల్కొండ బందీఖాన నుంచి తప్పించుకున్న జంషీద్ తండ్రి కుతుబ్‌షాను చంపి, అన్న కుతుబుద్దీన్ కండ్లు పొడిచి జైలులో పెట్టి సింహాసనాన్ని ఆక్రమించాడు.
-ఆరో కొడుకైన ఇబ్రహీం కుతుబ్‌షా అన్న ప్రవర్తన గ్రహించి విజయనగరం పారిపోయాడు. అక్కడ ఏడేండ్లు శరణార్థిగా ఉండి సింహాసనాన్ని ఆక్రమించాడు.
-1571లో రాజమండ్రిని, 1579లో కొండవీటిని, అనంతరం వినుకొండ, ఖమ్మం దుర్గాలను, కసిరికోటను జయించాడు.
-ఇతడు హుస్సేన్‌సాగర్, ఇబ్రహీంపట్నం చెరువు, ఇబ్రహీంబాగ్, పూల్‌బాగ్, లంగర్, పురానాపూల్ నిర్మించాడు. ఇబ్రహీం కుతుబ్‌షా భాగీరథి అనే స్త్రీని ప్రేమించి వివాహం చేసుకున్నాడు.
-ఇబ్రహీం కుతుబ్ షాకు ఆరుగురు మగసంతానం. ఆయన మరణించిన తర్వాత భాగీరథీకి జన్మించిన మహమ్మద్ కులీ కుతుబ్‌షా చిన్నవయస్సులోనే రాజ్యానికి వచ్చాడు.
-మహమ్మద్ కులీ కుతుబ్ షా మంచి కవి. దక్షిణాన ఉన్న పెనుగొండ, గండికోటలను జయించాడు. అనేక తిరుగుబాట్లను అణచివేశాడు. 1592లో రాజధానిని గోల్కొండ నుంచి హైదరాబాద్‌కు మార్చాడు. అప్పుడే మొఘలులు ఉత్తర భారతాన్ని ఆక్రమించి దక్షిణ భారతం వైపు దృష్టి సారించారు.
-తన ప్రియురాలు భాగమతి పేరుతో హైదరాబాద్ నగరాన్ని నిర్మించాడు. ఆమెకు కులీ పెట్టిన పేరు హైదర్ మహెబ్. ఈ పేరు మీదుగానే హైదరాబాద్ వ్యవహారంలోకి వచ్చింది.
-చార్మినార్, చార్‌కమాన్, జుమామసీద్, దారుల్షిఫా, దాద్ మహల్, ఖుదాద్ మహల్, నది మహల్, బన్నత్ఘాట్, కోహినూర్ వంటివాటిని నిర్మించాడు. కులీ మరణం తర్వాత తన తమ్ముడి కొడుకు సుల్తాన్ మహమ్మద్ కుతుబ్ షా సింహాసనాన్ని అధిష్టించాడు. ఇతని కాలంలోనే తీరాంధ్ర ప్రాంతంలో డచ్చివారు, ఇంగ్లిష్‌వారు వర్తక స్థావరాలను ఏర్పాటు చేసుకున్నారు.
-మహమ్మద్ కుతుబ్ షా ఖైరతాబాద్ మసీద్‌ను నిర్మించి, మక్కా మసీద్‌కు పునాది వేశాడు. 1624లో ఈద్గాను నిర్మించాడు. సుల్తాన్ మహ్మద్ తర్వాత అతని పెద్ద కొడుకు అబ్దుల్లా కుతుబ్‌షా రాజ్యానికొచ్చాడు.
-1636లో మొఘల్ చక్రవర్తి షాజహాన్ గోల్కొండపై దండెత్తగా దాన్ని ఎదుర్కోలేక సంధి చేసుకుని వారి వద్ద సామంతుడయ్యాడు. దీంతో కుతుబ్ షాహీ వంశం క్షీణదశ ప్రారంభమైంది.
-అబ్దుల్లా కుతుబ్‌షా, షాజహాన్ కుమారుడైన జౌరంగజేబ్తో సంధి చేసుకుని తన రెండో బిడ్డను ఔరంగజేబ్ కుమారుడైన మహమ్మద్ సుల్తాన్‌తో వివాహం చేశాడు. దీంతో గోల్కొండలో మొఘల్ అధికారుల ఆధిపత్యం పెరిగింది.
-1672లో అబ్దుల్లా కుతుబ్‌షా మరణించాడు. అతని తర్వాత సుల్తాన్‌గా అబ్దుల్లా మూడో కూతురి భర్త అబుల్ హసన్ తానీషా వచ్చాడు. మొఘలుల నుంచి ప్రమాదం పొంచి ఉన్నదని గ్రహించిన తానీషా ప్రధానమంత్రిగా అక్కన్నను నియమించాడు. తిరుగుబాటుదారులపై కఠిన చర్యలు తీసుకున్నాడు. మొఘలులను ఎదిరిస్తున్న శివాజీతో సంధి చేసుకున్నాడు. శివాజీ మరణం తర్వాత ఔరంగజేబు గోల్కొండ పై దండయాత్ర చేశాడు. దీంతో తానీషా మొఘలులతో సంధి చేసకున్నాడు. గోల్కొండ మొఘలుల వశమవడంతో కుతుబ్‌షాహీల గోల్కొండ రాజ్యం అంతరించింది. తర్వాత గోల్కొండ 37 ఏండ్లు మొఘలు సుబేదారు పాలనలో ఉంది.
కుతుబ్‌షాహీ వంశరాజుల పాలనాకాలం
-కులీ కుతుబ్ షా- 1518-43
-జంషీద్ కుతుబ్ షా- 1543-50
-ఇబ్రహీం కుతుబ్ షా- 1550-80
-మహమ్మద్ కులీ కుతుబ్ షా- 1580-1612
-మహమ్మద్ కుతుబ్ షా- 1612-26
-అబ్దుల్లా హుస్సేన్ కుతుబ్ షా- 1626-72
-అబుల్ హసన్ తానీషా- 1672-87
బహమనీ వంశం తర్వాత పాలించిన ఐదు రాజవంశాలు
1. అహ్మద్ నగర్లో నిజాం షాహీలు
2. బీజాపూర్‌లో ఆదిల్ షాహీలు
3.బీరార్‌లో ఇమద్ షాహీలు
4.బీదర్‌లో బరీద్ షాహీలు
5. గోల్కొండలో కుతుబ్ షాహీలు
-గోల్కొండ సామ్రాజ్యాన్ని సుల్తాన్ కులీ కుతుబ్ ఉల్‌ముల్క్ స్థాపించాడు. ఈయన మధ్య ఆసియాలోని కారాకుయున్ అనే వంశానికి చెందినవాడు. ఈ వంశీయులు టర్కీని, ఇరాన్ పశ్చిమ భాగాన్ని ఆక్రమించుకుని సామ్రాజ్యాన్ని స్థాపించారు. తైమూర్‌ను, చెంఘిజ్ఖాన్ను ఎదిరించారు. వీరు అఫాకీలైన స్థానికులకు మేలు చేశారు.
సుల్తాన్ కులీ కుతుబ్ ఉల్‌ముల్క్ (1518-43)
-1496 నుంచి 1518 వరకు తెలంగాణ ప్రాంత సుబేదార్‌గా పాలించి, 1518లో స్వాతంత్య్రాన్ని ప్రకటించుకున్నాడు. గోల్కొండ రాజధానిగా తెలంగాణతోపాటు మొత్తం ఆంధ్రదేశాన్ని తన ఆధీనంలోకి తెచ్చుకున్నాడు. అర్హత ఉన్నవారికి ఉద్యోగాలివ్వడంతో ఈయన కాలంలో స్థానిక, స్థానికేతర సమస్య తలెత్తలేదు.
జంషీద్ కుతుబ్‌షా (1543-50)
-ఇతడి అసలు పేరు యార్కులీ. 99 ఏండ్ల వయస్సులో ఉన్న తన తండ్రిని చంపించి రాజయ్యాడు.
-జంషీద్ తర్వాత సుభాన్ కులీ (1550లో ఏడు నెలలు మాత్రమే పదవిలో ఉన్నాడు) అధికారంలోకి వచ్చాడు.
ఇబ్రహీం కులీ కుతుబ్ షా (1550-80)
-ఇతడు మల్కీభరాముడిగా ప్రసిద్ధి. ఇతడి ఆస్థానకవి అద్దంకి గంగాధరుడు తన తపతీసంవరణోపాఖ్యానంను ఇబ్రహీంకు అంకితమిచ్చాడు. తెలుగు కావ్యాన్ని అంకితం తీసుకున్న మొదటి ముస్లిం రాజు. ఇబ్రహీం ఆస్థానంలో కందుకూరి రుద్రకవి, పొన్నగంటి తెలగనార్యతోపాటు ఎనిమిది భాషలకు చెందిన కవులు ఉన్నారు. ఈయన మంత్రి మహారాష్ట్రకు చెందిన మురహరిరావు.
-ఇబ్రహీం కుతుబ్‌షా ట్యాంక్‌బండ్ నిర్మించాడు.
మహమ్మద్ కులీ కుతుబ్‌షా (1580-1612)
-14 ఏండ్ల 7 నెలల వయస్సులో రాజయ్యాడు. భాగ్యనగర నిర్మాత, చార్మినార్‌ను నిర్మించాడు.
సుల్తాన్ మహమ్మద్ కుతుబ్‌షా (1612-1626)
-మహమ్మద్ కులీ కుతుబ్ షా అల్లుడు. ఈయన ఆస్థానంలో పారసీ, దక్కనీ భాషల పోషణ జరిగింది.
అబ్దుల్లా కుతుబ్‌షా (1626-1672)
-12 ఏండ్ల వయస్సులో రాజయ్యాడు. ఈయన కిరీటంలోనే ప్రసిద్ధి చెందిన కోహినూర్ వజ్రం ఉంది. మొదటిసారిగా క్షేత్రయ్య ఈయన సంస్థానంలోని విద్వాంసులను ఓడించి 1500 పదాలను సుల్తాన్‌కు అంకితమిచ్చిచ్చాడు.
అబుల్ హసన్ తానీషా (1672-1687)
-అబ్దుల్లా మేనల్లుడు తానీషా. 1687లో ఔరంగజేబ్ గోల్కొండను జయించడంతో కుతుబ్‌షాహీల పాలన అంతమైంది.
ప్రాక్టీస్ బిట్స్
-చాళుక్యయుగంలో గోల్కొండను ఏమని పిలిచేవారు?
– మంగళవరం
-1363 ప్రాంతంలో గోల్కొండను ఏమని పిలిచేవారు?
– మహమ్మద్ నగరం
-గోల్కొండ ప్రజలతో బడే మాలిక్‌గా పిలువబడిన నవాబు?
– సుల్తాన్ కులీ
-ఖమ్మం మెట్టు దగ్గర సుల్తాన్ కులీ చేతిలో ఓడిపోయినవారు?
– సీతాపతి
-సీతాపతి ఎవరి సామంతుడు?
– గజపతి
-సుల్తాన్ కులీ (కులీ కుతుబ్ షా)ను హత్యచేసి అధికారంలోకి వచ్చినవారు?
– జంషీద్
-అమర్ ఉల్ ఉమ్రా బిరుదు ఎవరిది?
– కులీ కుతుబ్ షా
-జంషీద్‌కు భయపడి అళియ రామరాయల ఆశ్రయం కోరిన కులీ కుతుబ్ షా కుమారుడు?
– మాలిక్ ఇబ్రహీం
-ఇబ్రహీం వివాహం చేసుకున్న నిజాం షా కుమార్తె?
– బీబీ జుమాలిని
-కుతుబ్ షా వంశస్తుల్లో మొదటిసారిగా షా బిరుదు ధరించినవారు?
– ఇబ్రహీం కుతుబ్ షా
-బీజాపూర్ నవాబు ఇబ్రహీం ఆదిల్షాకు తన కుమార్తె చాంద్ సుల్తానాను ఇచ్చి వివాహం చేసిన గోల్కొండ నవాబు?
– కులీ కుతుబ్ షా
-కులీ కుతుబ్ షా దర్బార్‌ను సందర్శించిన అక్బర్ చక్రవర్తి రాయబారి ఎవరు?
– మసూద్ బేగ్
-తూనికలు, కొలతలపై రిసాల మిక్టరియా అనే గ్రంథాన్ని రచించిన వారు?
– మీర్ మహమ్మద్ మోమిన్
-మహమ్మద్ కుతుబ్ షా కాలం నాటి ప్రసిద్ధ వైద్యుడు?
– హలీం తనేయుద్దీన్
-గోల్కొండ వజ్రం ఎవరి కాలంలో దొరికింది?
– అబ్దుల్లా హుస్సేన్ కుతుబ్ షా
-ఈస్టిండియా కంపెనీకి వ్యాపార హక్కులు గోల్డెన్ ఫర్మానా ఇచ్చిన నవాబు?
– అబ్దుల్లా హుస్సేన్ కుతుబ్ షా
-వందవాసి యుద్ధం ఎప్పుడు జరిగింది?
– 1648
-గోల్కొండ నవాబుల్లో తాన్సాహా (మంచి రాజు) అని ఎవరికి పేరుంది?
– అబుల్ హసన్
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?