ఓయూకు 1400 ఎకరాలను దానం చేసిన మహిళ ? ( పోటీ పరీక్షల ప్రత్యేకం)
తెలంగాణ – ప్రముఖ కట్టడాలు
ఉస్మానియా యూనివర్సిటీ
# 1878లో రఫత్యార్ జంగ్, జమాలుద్దీన్ అఫ్ఘనీ అనే ఇద్దరు ప్రముఖ విద్యావేత్తలు మొదటిసారిగా హైదరాబాద్ రాజ్యంలో స్థానిక భాష అయిన ఉర్దూ మాధ్యమంలో ఒక విశ్వవిద్యాలయాన్ని నెలకొల్పాలని ప్రతిపాదించారు.
# ఆ తర్వాత డబ్ల్యూఎస్ బ్లంట్ (బ్రిటిష్ పార్లమెంట్ సభ్యుడు) అప్పటి ప్రధాని అయిన రెండో సాలార్జంగ్తో విశ్వవిద్యాలయ ప్రతిపాదనల గురించి మాట్లాడారు.
#అదేవిధంగా విశ్వవిద్యాలయ అవశ్యకత గురించి డబ్ల్యూఎస్ బ్లంట్ ఒక ప్రతిపాదనను తయారు చేయించి 1883లో నాటి నిజాం రాజు మీర్ మహబూబ్ అలీఖాన్‌కు (ఆరో నిజాం) అందజేశారు.
#1885లో పబ్లిక్‌గార్డెన్‌లో ఆరో నిజాం అధ్యక్షతన జరిగిన సమావేశంలో కొంతమంది విద్యార్థులు నిజామియా విశ్వవిద్యాలయం ఏర్పాటు కోసం డిమాండ్ చేశారు.
# ఈ విషయాన్ని ఏడో నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్, విద్యాశాఖ సలహాదారుడు అయిన ఎంటీఏ మేయో రాజ్య విద్యావిధానాన్ని పటిష్టపర్చడానికి కొన్ని సూచనలు చేస్తూ ప్రత్యేక విశ్వవిద్యాలయ స్థాపన అవకాశాలు పరిశీలించాలని కోరాడు.
#1913లో దారుల్-ఉల్-ఉలూం కాలేజీ విద్యార్థులు ఓల్డ్ బాయిస్ సంఘంగా ఏర్పడి, విశ్వవిద్యాలయ అవసరం గురించి ఒక ప్రతిపాదనను నిజాం రాజుకు సమర్పించారు.
#తర్వాత నిజాం రాజు తన ఆర్థికమంత్రి సర్ అక్బర్ హైదరీతో చర్చించి ఉస్మానియా యూనివర్సిటీ పేరుతో అనుమతించాడు.
# 1917, ఆగస్టు 17న ఉస్మానియా యూనివర్సిటీ స్థాపనను నిర్ణయిస్తూ ఏడో నిజాం ఒక ఫర్మానా (ఉత్తర్వు) జారీచేశాడు.
#ఉస్మానియా యూనివర్సిటీని 1400 ఎకరాల్లో స్థాపించడానికి 1918 ఆగస్టు 28న నిజాం రాజు ఒక రాజ శాసనం జారీచేశాడు.
#విశ్వవిద్యాలయానికి సంబంధించిన తరగతులు మొదట 1918-19లో అబిడ్స్‌లోని కిరాయి ఇండ్లలో ప్రారంభమయ్యాయి.
#ఉస్మానియా విశ్వవిద్యాలయం నిర్మాణానికి సంబంధించి నిజాం రాజు రెండు సవాళ్లను ఎదుర్కొన్నాడు. మొదటిది విశ్వవిద్యాలయం నిర్మించే ప్రాంతం. ఇందుకు ప్రొఫెసర్ సర్ ప్యాట్రిక్ జెడెస్ అనే ఆంగ్లేయుడిని నిజాం పురమాయించాడు. దీంతో అతడు ఎంతో శ్రద్ధతో సర్వేచేసి అడిక్‌మెట్ ప్రాంతంలోని 1400 ఎకరాల స్థలాన్ని యూనివర్సిటీ కోసం ఎంపిక చేశాడు. రెండోది విశ్వవిద్యాలయం డిజైన్ గురించి. దీనిని హైదరాబాద్‌కు చెందిన శిల్పులు నవాబ్ జైన్ యార్జంగ్, సయ్యద్ అలీరజాలకు అప్పగించాడు. వీరు ఐరోపా దేశాలన్నీ తిరిగి, ఈజిప్టు విశ్వవిద్యాలయ నిర్మాణ పనుల్లో ఉన్న బెల్జియం శిల్పి జాస్ఫర్ను కలిశారు. అతడి డిజైన్‌కు ముగ్ధులై 1933లో ఆయనను హైదరాబాద్‌కు రప్పించారు.
# జాస్ఫర్ భారత్‌లోని ఎల్లోరా, అజంతా గుహలు, రాజస్థాన్ ఢిల్లీలోని కట్టడాలు, గోల్కొండ, చార్మినార్లను తిలకించి ప్రాచీన హిందూ, మధ్యయుగ ముస్లిం, ఆధునిక ఐరోపా కట్టడాలతో మిళితమైన డిజైన్‌ను, హైదరాబాద్ సంస్కృతి, పర్యావరణానికి అనువుగా ఉండే కళాశాల భవంతి నమూనాను రూపొందించి ఇచ్చాడు.
#1934 జూలైలో ఆర్ట్ కళాశాల నిర్మాణానికి నిజాం శంకుస్థాపన చేశాడు. దాదాపు 35 వేల మంది కార్మికులు శ్రమించి 1939లో ఈ నిర్మాణాన్ని పూర్తిచేశారు. ఈ ఆర్ట్ కళాశాల భవన నిర్మాణానికి సుమారు రూ.36 లక్షలు ఖర్చు చేశారు. ఈ నిర్మాణం హిందూ-సార్సెనిక్ వాస్తు శైలికి నిదర్శనం. దీనిలో ముస్లిం, అరబ్, గోథిక్ శైలులను కూడా ఇనుమడింపజేశారు.
# 1939 డిసెంబర్ 4న నిజాం ఈ కళాశాల భవనాన్ని ప్రారంభించారు. అదేరోజు అబిడ్స్‌లో జరుగుతున్న తరగతులను ఈ కాలేజీకి మార్చారు. ఆ తర్వాత అదే ప్రాంగణంలో ఇంజినీరింగ్ కాలేజీ, లా కాలేజీ, ఠాగూర్ ఆడిటోరియం నిర్మించారు.
# ఆర్ట్ కాలేజీ భవన నిర్మాణంలో పింకిష్ గ్రానైట్ రాయిని ఉపయోగించారు.
#ఉస్మానియా విశ్వవిద్యాలయ నిర్మాణం కోసం ఎంపిక చేసిన 1400 ఎకరాల స్థలం ఒక మహిళది. మహాలఖ చందాబాయి అనే మహిళ ఆ స్థలాన్ని దానం చేశారు.
# 1949లో ఉస్మానియా విశ్వవిద్యాలయ బోధనా భాషను ఉర్దూ నుంచి ఆంగ్లానికి మార్చారు.
#ఉస్మానియా యూనివర్సిటీ దేశంలో ఏడో పురాతన విశ్వవిద్యాలయంగా, దక్షిణ భారత దేశంలో మూడో పురాతన విశ్వవిద్యాలయంగా రికార్డులకెక్కింది.
# దీని మొదటి వైస్ చాన్స్‌లర్ నవాబ్ హబీబుర్ రెహమాన్ ఖాన్ (1918-19).
#1918 నుంచి ఇప్పటివరకు మొత్తం 27 మంది ఉస్మానియా యూనివర్సిటీ వీసీలుగా బాధ్యతలు నిర్వర్తించారు.
# నవాబ్ అలీ యావర్ జంగ్ 1945-46, 1948-52 సంవత్సరాల్లో రెండుసార్లు వైస్ చాన్స్‌లర్‌గా పనిచేశారు.
#1969 తెలంగాణ ఉద్యమ సమయంలో (1969-72 మధ్య) ఓయూ వీసీగా పనిచేసిన వ్యక్తి ప్రొఫెసర్ రావాడ సత్యనారాయణ.
#ఆర్ట్ కాలేజీ మొదటి ప్రిన్సిపాల్ సర్ రాస్ మసూద్.
# ఓయూ వీసీ పదవి చేపట్టిన మొదటి ఐఏఎస్ అధికారి సయ్యద్ హషీం అలీ (1982-85).
హైదరాబాద్
# గోల్కొండను పాలించిన కుతుబ్‌షాహీ సుల్తానుల్లో ఇబ్రహీం కులీ కుతుబ్‌షా మూడో కుమారుడు అయిన మహ్మద్ కులీ కుతుబ్ షా గొప్ప కళాభిమాని, నిర్మాత.
#ఆయనే నాటి హైదరాబాద్ నగర నిర్మాత. ఆయన మానసపుత్రిక అయిన హైదరాబాద్ నగరాన్ని క్రీ.శ.1590-91లో నిర్మించడం ప్రారంభించారు.
# గోల్కొండ రాజధానిలో జనాభా విపరీతంగా పెరిగినందు వల్ల మహ్మద్ కులీ కుతుబ్‌షా మూసీనది దక్షిణ ప్రాంతాన హైదరాబాద్ నగర నిర్మాణానికి పునాది వేశాడు.
గమనిక: ఈ నగర నిర్మాణం విషయంలో చరిత్రకారుల్లో ఏకాభిప్రాయం లేదు. ఈ మహాసుందర నగర నిర్మాణంలో మహ్మద్ కులీకుతుబ్‌షాకు అన్ని విధాలా సహకరించిన వ్యక్తి మీర్ మోమిన్ మహ్మద్ ఆస్త్రబాది.
మీర్ మోమిన్ ఆస్త్రబాది: ఈయన క్రీ.శ.1581లో ఇరాన్ నుంచి దక్కన్కు వలసవచ్చి కులీకుతుబ్ షా ఆస్థానంలో చేరాడు. దక్షిణ ఇరాన్‌లోని జిలానీ రాష్ట్రంలో మూసవీ కుటుంబానికి చెందినవాడు. ఈయన బముఖ ప్రజ్ఞాశాలి. రచయిత, పాలనావేత్త, సూఫీ సిద్ధాంతాలను జీర్ణించుకున్న మేధావి. అధ్యాపకుడు, గొప్ప వాస్తు ఇంజినీర్. తన తెలివితేటలు, విశ్వసనీయత ద్వారా మహ్మద్ కులీకుతుబ్‌షా అభిమానం పొందాడు. క్రీ.శ.1585లో ఈయన గోల్కొండ రాజ్య పీష్వా (ప్రధానమంత్రి)గా నియమితులయ్యారు.
# హైదరాబాద్ నగరాన్ని మీర్ మోమిన్ తన మాతృదేశం ఇరాన్‌లోని ఇసఫహాన్ పట్టణ నమూనాలో కట్టాలని ప్రణాళిక చేశాడు. అందుకు కులీకుతుబ్ షా సమ్మతించాడు.
# దీంతో నగర నిర్మాణానికి ప్రపంచ నలుమూలల నుంచి వాస్తు నిర్మాణంలో దిట్టలైన మేస్త్రీలను, రాళ్లు చెక్కేవాళ్లను హైదరాబాద్ నగరానికి ఆహ్వానించాడు.
#ప్రణాళికను త్రిభుజాకారంలో రూపొందించాడు. చార్మినార్ ఉన్న ప్రదేశాన్ని కేంద్ర బిందువుగా ఇతర మార్కెట్లను, భవంతులను కమాన్లను గుర్తించి నిర్మాణం చేపట్టాడు.
# హైదరాబాద్ నగర సరిహద్దు ఉత్తర దిశన కేంద్రీకృతమై ఉన్న నౌబత్ పహాడ్ కొండ నుంచి దాని పక్కనగల హుస్సేన్ సాగర్ వరకు వ్యాపించింది.
# హైదరాబాద్ పట్టణ నిర్మాణానికి పునాదివేసే సందర్భంలో మహ్మద్ కులీకుతుబ్ షా భగవంతుడిని తలుస్తూ.. తన నగరానికి శాంతి, సమృద్ధిని ప్రసాదించమని.. ఇక్కడి ప్రజలంతా కుల, మత, జాతి భేదాలు లేకుండా ఒక చెరువులోని చేపపిల్లల్లా స్నేహభావంతో, ప్రేమతో ఐక్యంగా ఉండి సహజీవనం చేయాలని ప్రార్థించాడు.
#మహ్మద్ కులీకుతుబ్ షా తన రేఖాశాస్త్ర పరిజ్ఞానాన్ని ఉపయోగించి గ్రిడ్ నమూనాపై చించల అనే గ్రామం చుట్టూ నూతన రాజధాని అయిన హైదరాబాద్ 70 లక్షల హొన్నుల ఖర్చుతో నిర్మించాడు. తన ప్రేయసి భాగమతి పేరుతో భాగ్నగర్ను నిర్మించాడని ఫ్రెంచ్ యాత్రికుడు ట్రావెర్నియర్ పేర్కొన్నాడు.
# క్రీ.శ. 1616లో పేరు తెలియని రచయిత రాసిన తారీఖ్-ఇ-కుతుబ్‌షాహీ గ్రంథంలో హైదరాబాద్ అందచందాలను, వాతావరణాన్ని అద్భుతంగా వర్ణించాడు. ఈ నగరం నిజంగా భూతల స్వర్గం. ఇక్కడ దొరకని వస్తువంటూ లేదు. ముసలితనంలో ఉన్న వృద్ధుడు ఈ పట్టణానికి వస్తే అతడు తన యవ్వనాన్ని తిరిగి పొందుతాడు. హైదరాబాద్ నగరంలో మంచితనానికి కొదువలేదు. అదృష్టం ఇక్కడే స్థిరపడింది. దుఃఖం, బాధలు ఇక్కడికి చేరలేవు అని పేర్కొన్నాడు.
# క్రీ.శ.1687లో ఔరంగజేబు వెంట హైదరాబాద్‌కు వచ్చిన మహ్మద్-సాఖీ అనే చరిత్రకారుడు.. హైదరాబాద్ ఆహ్లాదకర ప్రదేశమని, ఇక్కడి గాలి, నీరు, వాతావరణం మానవుల హృదయాలను పవిత్రం చేసి.. పగలు, ద్వేషాలను దూరం చేసి, మనుషుల మధ్య ప్రేమను, సోదరభావాన్ని పెంపొందిస్తుందని, దీర్ఘాయువును ప్రసాదిస్తుందని పొగిడాడు.
# హైదరాబాద్‌ను సందర్శించిన ఇతర విదేశీ బాటసారులు బెర్నియర్, విలియం మెథోల్డ్ ఇక్కడి నీరు, గాలి, చెట్లు, పర్వతాలు, నేల స్వర్గతుల్యమని, భూమిపై ఇదొక స్వర్గసీమ అని ప్రశంసించాడు.
తెలంగాణ అమరవీరుల స్థూపం
# ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో (1969) అమరులైన వారి జ్ఞాపకార్థం ఒక స్మారక స్థూపం నెలకొల్పాలని శ్రీధర్‌రెడ్డి (పోటీ తెలంగాణ ప్రజా సమితి) మొదటిసారిగా నిర్ణయించాడు.
#1970 జనవరి 17న అసెంబ్లీ ముందున్న గన్‌పార్క్‌లో, కంటోన్మెంట్ పరిధిలోని సికింద్రాబాద్ క్లాక్ టవర్ పార్కులో తెలంగాణ అమరవీరుల స్థూపాలను నిర్మించాలని హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ తీర్మానించింది.
# స్మారక స్థూపం శంకుస్థాపన కార్యక్రమానికి పోలీసులు అనుమతి ఇవ్వలేదు. అయినప్పటికీ అనేక నిషేధాజ్ఞలను ఉల్లంఘించి అసెంబ్లీ ఎదురుగా ఉన్న గన్‌పార్కులో 1970 ఫిబ్రవరి 23న అమరవీరుల స్మారక చిహ్నానికి అప్పటి హైదరాబాద్ మేయర్ ఎస్ లక్ష్మీనారాయణ శంకుస్థాపన చేశారు.
#శంకుస్థాపన ముందురోజు అంటే 1970, ఫిబ్రవరి 22న ప్రతాప్ కిశోర్, విలియమ్స్ అంతి అనే ఇద్దరు.. 1969 ఉద్యమ సమయంలో జంట నగరాల్లో పోలీస్ కాల్పుల్లో మరణించిన కొందరు అమరులకు చెందిన పుస్తకాలను తెప్పించి గన్‌పార్కులోని స్థూపం నిర్మించిన అడుగు భాగంలో భద్రపర్చారు.
# అమరవీరుల స్మారక స్థూపం రూపశిల్పి- ఎక్కా యాదగిరి రావు. ఈ స్థూపం నిర్మాణం 1975లో పూర్తయ్యింది.
# స్థూపం ఎత్తు 25 అడుగులు. ఈ స్థూపం అడుగు భాగాన్ని నల్లరాతితో తయారు చేశారు. ఈ నల్లరాయిపై నాలుగు వైపులా 9 చొప్పున రంధ్రాలు ఉంటాయి. ఈ రంధ్రాలు అమరవీరుల శరీరాల్లోకి దూసుకుపోయిన తూటాల గుర్తులను సూచిస్తాయి. అదేవిధంగా అప్పటి 9 తెలంగాణ జిల్లాల సంఖ్యను తెలుపుతాయి.
#అడుగుభాగం పైన నిర్మించిన స్థూపం ఎరుపు రంగులో ఉంటుంది. ఈ ఎరుపు రంగు అమరవీరుల త్యాగాన్ని సూచిస్తుంది. ఈ ఎర్రరాతి భాగంలో మకర తోరణం ఉంటుంది. ఈ మకర తోరణాన్ని సాంచీస్థూపం నుంచి తీసుకున్నారు. ఈ తోరణం అమరవీరులకు జోహార్లను సూచిస్తుంది.
#ఎర్రరాయి పైభాగంలో మళ్లీ 9 నల్లరాతి గీతలు ఉంటాయి. ఈ స్థూపాన్ని ఎటునుంచి చూసినా 9 గీతలు కనిపిస్తాయి.
# స్థూపం పైభాగంలో అశోకచక్రం ఉంటుంది. ఉద్యమంలో మరణించిన అమరులు ధర్మ సంస్థాపన కోసం తమ ప్రాణాలను బలిపెట్టారని ఈ ధర్మ చక్రం తెలియజేస్తుంది.
# స్థూపం శీర్షంలో తొమ్మిది రేకులు కలిగిన తెల్లరాతి పుష్పం ఉంటుంది. ఇది శాంతికి, త్యాగానికి చిహ్నం.
గందె శ్రీనివాస్
2016 గ్రూప్-2 విజేత
సిద్దిపేట
9032620623
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?