Group I Special | జనాభా మార్పునకు తోడ్పడే ముఖ్య కారకాలు?
భారతదేశంలోని వలసలు
- ఒక ప్రదేశంలోని మన నివాస స్థలాన్ని, మన జీవితాలను ఏర్పరచుకున్న పద్ధతినే ‘నివాస ప్రాంతం’ అంటారు.
- దశాబ్దాలు గడుస్తున్న క్రమంలో ఉద్యోగాలు, ఉపాధి, వైద్య, విద్యావకాశాలు వెతుక్కుంటూ దేశం అన్ని ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు వలసపోతుంటారు.
- ఇందుకు ఉదాహరణ ఢిల్లీ దేశ రాజధాని కావడం, పార్లమెంట్, కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు ఉండటం వల్ల అన్ని రాష్ర్టాల ప్రజలు ఇక్కడ నివసిస్తున్నారు. దీనివల్ల 1951లో 60 లక్షలుగా ఉన్న జనాభా పెరిగి కోటి 60 లక్షల మంది నివసిస్తున్నారు.
- ఎటువంటి ప్రదేశాలు నివాస ప్రాంతాలుగా మారాయి
- వీటిని అర్థం చేసుకోవడానికి మూడు మౌలిక విషయాలను పరిశీలించాలి. అవి..
1) ప్రదేశం 2) పరిస్థితి 3) ఆ ప్రదేశ చరిత్ర - పట్టణాలు, నగరాల్లో ఉండటం, అక్కడికి వలస పోవడం కొంతమందికే వరంగా ఉంది. గ్రామీణ ప్రాంతాలతో పోలిస్తే పట్టణ ప్రాంతాల్లో పేదరిక స్థాయి తక్కువగా ఉన్నప్పటికీ అధిక ఆదాయం, తక్కువ ఆదాయం గల కుటుంబాల మధ్య వ్యత్యాసం చాలా తక్కువగా ఉంటుంది.
- పట్టణాలు, నగరాల్లోని జనాభా పెరుగుదలలో అధిక భాగం సహజ వృద్ధి వల్ల జరిగింది. ఈ పట్టణాల జనాభా కాలక్రమంలో పెరిగింది. చుట్టుపక్కల ఉన్న గ్రామీణ ప్రాంతాలను కలుపుకోవడం వల్ల కొన్ని పట్టణాలు, నగరాలు విస్తరించాయి. జనాభా వృద్ధిలో అయిదింట ఒక వంతు మాత్రమే గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణ ప్రాంతానికి వచ్చిన వలసల వల్ల సంభవించింది.
- భారతదేశంలో ఒక నివాస ప్రాంతం పెరగడానికి ఆ ప్రాంత చరిత్ర, భౌగోళిక పరిస్థితులు ఒక కారణం, ప్రజలు వలసలు వెళ్లడం కూడా ఆ ప్రాంత పట్టణీకరణ పెరగడానికి మరొక కారణం.
- ప్రజలు విద్య, ఉపాధి, మెరుగైన అవకాశాల కోసం, వివిధ ఆర్థిక, సామాజిక, రాజకీయ కారణాల వల్ల ఇతర ప్రాంతాలకు వెళ్లడాన్ని వలస అంటారు.
- శాశ్వతమైన నివాస మార్పు కోసం జనాభా ఒక భౌగోళిక ప్రదేశం నుంచి మరొక భౌగోళిక ప్రదేశానికి కనబరిచే ప్రాదేశిక మార్పునే వలస అంటారు.
- ఒక వ్యక్తిని వలస వెళ్లిన వారిని గుర్తించడానికి జనాభా గణనకు రెండు ప్రామాణికాలను ఉపయోగిస్తున్నారు.
1) జన్మస్థానం: ఒక వ్యక్తి పుట్టిన ప్రదేశం
2) ఇంతకు ముందు నివాసం ఉన్న స్థలం: ఒక వ్యక్తి 6 నెలలు లేదా అంతకు మించి ఎక్కువ కాలం
పాటు ఉన్న ప్రదేశం - భారతదేశంలో 2011 జనాభా లెక్కల ప్రకారం 30.7 కోట్ల మంది వలస వెళ్లారు. అనేక కారణాల వల్ల వలసలు జరుగుతాయి. ఆడవాళ్లలో వలస వెళ్లడానికి వివాహం ప్రధాన కారణం కాగా మగవాళ్లలో ఉపాధి లేదా ఉపాధి కోసం అన్వేషణ ప్రధాన కారణం.
- ఉన్న ఊరిలోని ఉపాధి అవకాశాలపై అసంతృప్తి, విద్యకు మెరుగైన అవకాశాలు, వ్యాపారంలో నష్టాలు, కుటుంబ తగాదాలు వంటివి జనగణన సర్వేలో ప్రజలు వలసకు కారణాలుగా పేర్కొన్నారు.
తాత్కాలిక వలసలు
- జాతీయ జనాభా గణన ప్రకారం భారతదేశంలో ప్రతి నాలుగో వ్యక్తి వలస వచ్చినవాళ్లే. 2001-11లో వలస పెరిగింది. కానీ 1980ల కాలంలో పెరిగినంతగా కాదు. వలసలు రాష్ట్రంలోపల ఉండవచ్చు. మరో రాష్ర్టానికి అయి ఉండవచ్చు. గ్రామీణ ప్రాంతం నుంచి పట్టణ ప్రాంతానికి ఉండవచ్చు. గ్రామీణ ప్రాంతాల నుంచి గ్రామీణ ప్రాంతాలకు వలస కూడా పెరిగింది. ఇలాంటి వలసలు 6 నెలల్లోపు ఉంటాయి.
గ్రామాల నుంచి గ్రామాలకు వలస - గ్రామీణ ప్రాంత కార్మికుల్లో అధిక శాతం తక్కువ కాలానికి ప్రత్యేకించి గ్రామీణ ప్రాంతంలోని సంక్షోభ పరిస్థితుల వల్ల ఇతర గ్రామాలకు జీవనోపాధికి వలస వెళతారు.
- ఉదాహరణకు కోయినా ఆనకట్ట కట్టిన తర్వాత 1970 దశాబ్దం ఆరంభం నుంచి ఇక్కడ పెద్ద ఎత్తున చెరకు సాగు చేయడం మొదలుపెట్టారు. ఇక్కడకు ప్రతి సంవత్సరం చెరకు నరకడానికి మధ్య మహారాష్ట్ర నుంచి పశ్చిమ మహారాష్ట్రకు 6,50,000 కూలీలు వలస వెళతారు. వీళ్లు ప్రధానంగా వ్యవసాయ కూలీలు, సన్నకారు రైతులు, తక్కువ ఆదాయం గలవారు, దళితులు, ఆదివాసీలు.
- గ్రామీణ కార్మికులపై జాతీయ కమిషన్ 1990లో ఇచ్చిన నివేదికలో అసమాన అభివృద్ధి ప్రాంతాల మధ్య అసమానతలు కాలానుగుణ వలసలకు కారణమని పేర్కొంది. కొన్ని గిరిజన ప్రాంతాల్లో బయటివాళ్లు రావడం, ఆనకట్టలు కట్టడం, గనుల తవ్వకం వల్ల ప్రజలు నిర్వాసితులు కావడం వల్ల తాత్కాలికంగా తప్పనిసరిగా వలస వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది.
గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణాలకు వలస
- గ్రామీణ ప్రాంతాల్లో తగినన్ని ఉపాధి అవకాశాలు లేనందున, గ్రామీణ ఉపాధిలో తగినంత ఆదాయం లేనందున ప్రజలు ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణ ప్రాంతాలకు వలస వెళుతున్నారు. కుటుంబ సభ్యులకు మరిన్ని అవకాశాలు, అధిక ఆదాయాలు, మెరుగైన సేవలు ఉంటాయన్న ఆశతో ప్రజలు వలస వెళతారు.
- ఆదాయం పెంచుకోవడానికి, కుటుంబ అవకాశాలు మెరుగుపర్చుకోవడానికి గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణాలు, నగరాల్లో పరిశ్రమలు, సేవా రంగాల్లో పని చేయడానికి వలస వెళుతున్నారు. ఈ ప్రక్రియలో వాళ్లకు చదువుకోవడానికి, కొత్త ఉద్యోగాలు చేయడానికి, కొత్త నైపుణ్యాలను నేర్చుకోవడానికి అవకాశాలు లభిస్తాయి. చాలామంది గ్రామీణ ప్రాంతాల్లో చాలినంత ఉపాధి దొరకక తప్పనిసరై పట్టణాలకు వలస వెళతారు.
- చాలామందికి తమ స్వగ్రామంలో, వలస వెళ్లిన ప్రాంతాల్లో ఇళ్లు ఉంటాయి. వివిధ కాలాల్లో పనిని బట్టి వాళ్లు ఈ రెండు ప్రదేశాల మధ్య తిరుగుతుంటారు. వలస వెళ్లారంటే మొత్తం కుటుంబం వలస వెళ్లాలని లేదు, సాధారణంగా భార్య గ్రామీణ ప్రాంతంలో
ఉండిపోతుంది.
అంతర్జాతీయ వలసలు
- ఐక్యరాజ్యసమితి అభివృద్ధి కార్యక్రమం ప్రకారం 20 కోట్ల అంతర్జాతీయ వలస వ్యక్తుల్లో 7 కోట్ల కంటే తక్కువ మంది ఒక అభివృద్ధి చెందుతున్న దేశం నుంచి మరొక అభివృద్ధి చెందుతున్న దేశానికి వలస వెళుతున్నారు. భారతదేశం నుంచి అంతర్జాతీయ వలసలు 2 రకాలు.
1) సాంకేతిక నైపుణ్యం, వృత్తి అనుభవం ఉన్న వ్యక్తులు అమెరికా, కెనడా, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా వంటి అభివృద్ధి
చెందిన దేశాలకు వలస వెళుతున్నారు. ఐటీ నిపుణులు, డాక్టర్లు, మేనేజ్మెంట్ నిపుణులు ఈ రకానికి
ఉదాహరణ. - 1950, 1960లలో కెనడా, ఇంగ్లండ్‌లకు వలస వెళ్లిన భారతీయుల్లో ఎక్కువ మంది ఏ నైపుణ్యమూ లేనివాళ్లు కాగా తర్వాతి సంవత్సరాల్లో ఎక్కువగా వృత్తి నిపుణులు ఈ దేశాలకు వెళుతున్నారు. 1950లలో అభివృద్ధి చెందిన దేశాలకు సంవత్సరానికి 10,000 మంది వలస వెళ్లగా, 1990లలో ఈ సంఖ్య 60,000కు పెరిగింది.
2) చమురు ఎగుమతి చేస్తున్న పశ్చిమ ఆసియా దేశాలకు తాత్కాలిక ఒప్పందాలపై వలస వెళుతున్న నైపుణ్యం లేని కొంత నైపుణ్యం ఉన్న పనివాళ్లు. వలస వెళ్లిన దేశాల్లోని పరిస్థితిని బట్టి కొంతకాలం తర్వాత తిరిగి వస్తారు. - భారతదేశం నుంచి పశ్చిమాసియాకు వెళుతున్న 30 లక్షల వలస వ్యక్తుల్లో ఎక్కువమంది సౌదీఅరేబియా, యూఏఈ లకు వెళుతున్నారు. ప్రతి సంవత్సరం పశ్చిమాసియాకు 3 లక్షల కార్మికులు వలస వెళుతున్నారు. వీరిలో అయిదింట ముగ్గురు కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ర్టాలకు చెందినవారు.
అంతర్జాతీయ వలసల పర్యవేక్షణ
- భారతీయులు విదేశాలకు వలస వెళ్లి పనిచేయడాన్ని ‘వలసల చట్టం-1983’ భారత దేశ చట్టం పర్యవేక్షిస్తుంది. పని నిమిత్తం వెళ్లే వాళ్ల ప్రయోజనాలను కాపాడటానికి ఇది కొన్ని షరతులు విధిస్తుంది. వివిధ దేశాల్లో భారత ప్రభుత్వం ఏర్పాటు చేసిన దౌత్య కార్యాలయాలు వలస చట్టంలో పొందుపరిచిన విధంగా చట్టపర విధానాలను పాటించి అంతర్జాతీయ వలస కార్మికుల సంక్షేమాన్ని కాపాడాల్సి ఉంటుంది.
- ‘జనాభాలో సాంస్కృతిక వ్యాపనం, సాంఘిక సమగ్రతకు తోడ్పడే సాధనమే వలస’- బోగ్ (1959). జనాభా మార్పునకు తోడ్పడే ముఖ్య కారకాలు.
1) వలస
2) ఫలవంతజనాలు (ఫర్టిలిటీ)
3) మరణాలు (మోర్టాలిటీ)
వలసలు – జనాభా లెక్కలు - భారత్‌లో మొదటగా వలసలకు సంబంధించిన గణాంకాలను 1872లో సేకరించారు.
- 1961 వరకు వలస వారి జన్మస్థలం గణాంకాలను మాత్రమే సేకరించారు.
- 1961 నుంచి గ్రామీణ, పట్టణ వలసలు, నివాస స్థలం, జన్మ స్థలం వంటివి సేకరించారు.
- 1971లో చివరి నివాస స్థలాన్ని సేకరించారు.
- 1981లో వలసకు కారణాలను సేకరించారు.
2011 జనాభా లెక్కలు – వలసలు
- 45.58 కోట్ల (37 శాతం) మందిని వలసదారులుగా 2011 లెక్కల ప్రకారం గుర్తించారు. ఇది 2001 జనాభా లెక్కల ప్రకారం 31.45 కోట్లు.
- మొత్తం వలసదారుల్లో 70 శాతం మహిళలు వివాహం వల్ల వలసదారులవుతున్నారు. పని, ఉపాధి కోసం జరిగే వలస 10.2 శాతంగా ఉంది.
- మహారాష్ట్రకు అత్యధికంగా మధ్యప్రదేశ్, రాజస్థాన్, బిహార్‌ల నుంచి వలస వెళుతున్నారు.
- భారత్ వలసకు ప్రధాన కారణాలు వివాహం, ఉద్యోగాలు. అలాగే ఒకే రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల
మధ్య వలసలు ఎక్కువగా ఉన్నాయి. - ఢిల్లీకి వలస వెళుతున్న వారిలో అధికంగా ఉత్తరప్రదేశ్ వాటా (45 శాతం), బిహార్ (17.5 శాతం). దేశంలో వలసలు అధికంగా ఉత్తరప్రదేశ్, బిహార్ నుంచి వెళుతున్నారు.
- అంతర్ వలసల్లో మహారాష్ట్ర, బాహ్య వలసల్లో ఉత్తరప్రదేశ్ మొదటి స్థానాల్లో ఉన్నాయి.
బోగ్ అభిప్రాయంలో వలసలకు కారణాలు
1) ఆకర్షించేవి (పుల్ ఫ్యాక్టర్స్)
2) నెట్టబడేవి (పుష్ ఫ్యాక్టర్స్)
ఆకర్షించే కారకాలు
- నగరాల్లో ఉండే కింది పరిస్థితులు గ్రామాల నుంచి వలసలను (ఆకర్షించే) ప్రోత్సహిస్తాయని బోగ్ తెలిపారు.
- వర్తక, వాణిజ్యాలు, పారిశ్రామిక, సేవా రంగాల్లో అవకాశాలు ఉన్నత విద్య, వృత్తి శిక్షణ అవకాశాలు ఆకర్షిస్తాయి.
- క్రీడలు, వినోదం, విరామాలకు అవకాశాలు, అలాగే వైద్య, ఆరోగ్య వసతులు ఎక్కువగా ఉండటం.
- నగరాల్లో జీవన విధానం ఆకర్షణీయంగా ఉండటం అలాగే రియల్ ఎస్టేట్ రంగాల్లో పెట్టుబడి లాభసాటి ఉండట
- కులమత సహనం, వివిధ భాషలు, కులాలు ఎక్కువగా ఉండటం, నగరాల్లో సాంస్కృతిక వైవిధ్యం ఉండటం
- గ్రామాల్లో కింది అంశాలు పట్టణానికి వలస వెళ్లేలా పనిచేస్తాయని బోగ్ తెలిపారు.
నెట్టబడే కారకాలు
- ప్రకృతి విపత్తులు
- కుటీర, చేనేత పరిశ్రమలు మూతపడటం
- వ్యవసాయ యంత్రీకరణ, వ్యవసాయ కార్మికుల నిరుద్యోగిత
- వృత్తి శిక్షణ, ఉన్నత విద్యా అవకాశాలు లేకపోవడం
- అగ్రకులాల ఆధిపత్యం, ఆర్థిక, సాంఘిక అసమానతలు
- కులం, మతం, రాజకీయ, ప్రాంతీయ ఘర్షణలు
- సరైన వైద్య, ఆరోగ్య సదుపాయాలు లేకపోవడం
జీ గిరిధర్
సివిల్స్ ఫ్యాకల్టీ
ఏకేఎస్ ఐఏఎస్ ఇన్స్టిట్యూట్
అశోక్‌నగర్, హైదరాబాద్
9966330068
Previous article
Biology – JL/DL Special | మొక్క వయస్సును దేని ఆధారంగా నిర్ణయిస్తారు?
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?