Home
Competitive Exams
Group I Mains – General Essay | నవ్య పరిష్కారాలు సూచించేది.. ఆర్థిక వ్యవస్థకు తోడ్పడేది
Group I Mains – General Essay | నవ్య పరిష్కారాలు సూచించేది.. ఆర్థిక వ్యవస్థకు తోడ్పడేది
Group I Mains – General Essay | మానవాభివృద్ధికి అనాదిగా ఆవిష్కరణే పునాది. నిప్పును కనుగొనడం నుంచి దాని నియంత్రణ దాకా.. చక్రం సృష్టి దాని బహుముఖ ప్రయోజనాల ఆవిష్కరణ వరకు.. ఇతిహాస యుగం నుంచి విప్లవాత్మక పరివర్తన శకానికి బాటలు వేసింది ఆవిష్కరణాత్మకతే. దాని గురించి తెలుసుకుందాం.
- పారిశ్రామిక విప్లవంతోపాటు ముఖ్యంగా గత శతాబ్దంలో ఆవిష్కరణల ప్రభావంపై ఎంతో లోతైన చర్చ సాగింది. ప్రపంచాన్ని కుదిపేసే స్థాయిలో సాంకేతిక పరిజ్ఞాన పరివర్తనకు ఈ చర్చ దారి తీసింది.
- అదే సమయంలో ప్రపంచవ్యాప్త ఆర్థిక వ్యవస్థల్లోని అన్ని రంగాల్లో గణనీయ మెరుగుదలకు దోహదం చేసింది.
- నానాటికీ పెరిగే జనాభా అవసరాలు, ఆకాంక్షలను తీర్చడమేగాక మానవాళి జీవనాన్ని మరింత మెరుగ్గా, మరింత అనుసంధానంతో మరింత సుసంపన్నం చేసింది.
ఆవిష్కరణ అంటే ఏమిటి? - అర్థవంతమైన సవాళ్లకు నవ్య పరిష్కారాలను అన్వేషించి, విలువను సృష్టించగల ప్రక్రియే ఆవిష్కరణ. దీన్ని కొత్త అనువర్తనాల సృష్టి కోసం అన్వేషణ లేదా ఇప్పటికేగల సాంకేతికత మెరుగు వైపు సాగే పరిశోధనగా పేర్కొనవచ్చు.
- ప్రపంచ వాస్తవ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వార్షిక వృద్ధి క్రీ.శ.1700 వరకు 0.1 శాతం కంటే తక్కువగా ఉందని సంప్రదాయక జీడీపీ అంచనాలు సూచిస్తున్నాయి.
- జనాభా పెరుగుదలతో వినియోగం పెరుగుదల ముడిపడి ఉండటం ఇందుకు కారణమని అవి చెబుతున్నాయి.
- ఈ నేపథ్యంలో 1750 తర్వాత ప్రపంచ జీడీపీ వృద్ధి విశేష స్థాయిలో నమోదవుతూ వచ్చింది.
- పారిశ్రామిక విప్లవ సమయాన సాంకేతిక పరిజ్ఞానం, సాంకేతిక చోదిత ఆవిష్కరణాత్మకతే వృద్ధిలో ఈ మార్పును తెచ్చాయని చెప్పవచ్చు.
- ఇక 18వ శతాబ్దంలో ఆవిరి ఇంజిన్ పరిజ్ఞానం అందుబాటులోకి రావడాన్ని ఒక అద్భుత ఉదాహరణగా పేర్కొనవచ్చు. ఇది చిన్న, మరింత శక్తిమంతమైన ఇంజిన్ల సృష్టికి నాంది పలికింది.
- తద్వారా భారీ వస్తూత్పత్తికి అవకాశం లభించడంతో వస్తు, ప్రజా రవాణాలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టింది.
- ఈ ఒక్క పరిష్కారంతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అనేక రెట్లు ఎగువకు దూసుకెళ్లింది. ఏ దేశ ఆర్థిక వ్యవస్థనైనా రూపుదిద్దడంలో ఆవిష్కరణాత్మకత కీలక పాత్ర పోషిస్తుందని ఇది స్పష్టం చేస్తుంది.
- ఆర్థిక దృక్కోణంలో కార్మిక శక్తి, మూలధనం, ఉత్పాదకత కలగలిసి లభించే అంతిమ ఫలితాన్నే మొత్తం ఉత్పత్తి (జీడీపీ)గా వృద్ధి సిద్ధాంతం నిర్వచించింది.
- క్లుప్తంగా చెబితే ఆర్థిక వ్యవస్థలో మొత్తం ఉత్పత్తి లేదా జీడీపీ అనేది మొత్తం ఉత్పాదకత నిష్పత్తికి అనుగుణంగా ఉంటుంది. ఈ మొత్తం ఉత్పాదకత వృద్ధిలో ఆవిష్కరణ, సాంకేతికత వృద్ధి, సామర్థ్య ప్రయోజనాలు అత్యంత భారీ ఉప-విభాగాలుగా ఉంటాయి.
- ప్రపంచంలో అత్యంత అభివృద్ధి చెందిన అమెరికా, యునైటెడ్ కింగ్డమ్, ఫ్రాన్స్, జర్మనీ, జపాన్ వంటి దేశాలను సంప్రదాయకంగా అత్యంత సాంకేతికత ఆధారిత ఆవిష్కరణాత్మక దేశాలుగా మనం పరిగణిస్తుంటాం.
- ఒక దేశ ప్రగతి పురోగమనాన్ని నిర్ణయించడంలో ఆవిష్కరణల పాత్రను ఈ దృక్కోణం రుజువు చేస్తుంది.
- అయితే ఏ దేశమైనా ఆవిష్కరణాత్మకతను తన సహజ స్వభావంగా ఎలా మార్చుకోగలదు? ప్రపంచ చరిత్ర ప్రకారం ఆవిష్కరణాత్మకతకు బీజం వేయడంలో తొలి అడుగు ప్రభుత్వానిదే.
- ఇజ్రాయెల్లో ‘ఇజ్రాయెల్ రక్షణ బలగాలు’, అమెరికాలో ‘ఎస్బీఏ’, స్మాల్ బిజినెస్ ఇన్నోవేషన్ రీసెర్చ్ వ్యవస్థలు ఆవిష్కరణ కేంద్రాలుగా రూపొందడంలో ప్రభుత్వాలు కీలక పాత్ర పోషించాయని మనకు స్పష్టమవుతుంది.
- ఈ నేపథ్యంలో భారత్ వంటి విశాల, వైవిధ్య భరిత దేశంలో ఆవిష్కరణల సంస్కృతిని రూపుదిద్దడం గురించి ఆలోచిస్తే మనకిది మరింత ప్రస్ఫుటం అవుతుంది.
- ఈ సహస్రాబ్ది ప్రారంభంలో అట్టడుగు స్థాయి నుంచి సాంకేతిక ఆవిష్కరణలతో పాటు సంప్రదాయ పరిజ్ఞాన బలోపేతం దిశగా భారత ప్రభుత్వం తనవంతు కృషికి నాంది పలికింది.
- ఇందులో భాగంగా శాస్త్ర-సాంకేతిక విభాగం పరిధిలో ‘జాతీయ ఆవిష్కరణల సంస్థ’ను ఏర్పాటు చేసింది.
- దాదాపు దశాబ్దం తర్వాత 2013లో శాస్త్ర సాంకేతిక ఆవిష్కరణల విధానం రూపొందింది.
- ప్రపంచంలోని ఐదు అగ్రశ్రేణి శాస్త్ర విజ్ఞాన దేశాల జాబితాలో భారత్ స్థానం సంపాదించడమే దీని లక్ష్యం.
- ఈ మేరకు భారతదేశం కోసం బలమైన, ఆచరణాత్మక, అత్యాధునిక సాంకేతికత చోదిత శాస్త్ర పరిశోధన ఆవిష్కరణల వ్యవస్థ నిర్మాణాన్ని లక్ష్యంగా నిర్దేశించుకుంది.
- శాస్త్ర సాంకేతిక ఆవిష్కరణల విధానం మేరకు దేశం నలుమూలలా ఆవిష్కరణ వ్యవస్థాపన సంస్కృతిని ప్రోత్సహించేందుకు సిద్ధమైంది.
- దీనికి అనుగుణంగా 2016లో అత్యున్నత ప్రభుత్వ విధాన నిర్ణాయక సంస్థ ‘నీతి ఆయోగ్’ పరిధిలో ‘అటల్ ఆవిష్కరణల వ్యవస్థ’ (ఏఐఎం)ను ఏర్పాటు చేసింది.
- దేశంలో ఆవిష్కరణ-వ్యవస్థాపన సంస్కృతిని సృష్టించడమే ఏఐఎం లక్ష్యం.
- అయితే సంస్కృతి సృష్టి అన్నది ఒక ఆవిష్కర్త జీవన చక్రమంతటా నిరంతర లక్షిత కార్యాచరణ అవసరమైన సుదూర లక్ష్యం.
- అంతేకాకుండా సంబంధిత ఆవిష్కరణ విలువ ప్రక్రియ మొత్తానికి వర్తించేదిగా ఉండాలి. కాబట్టి తనకు నిర్దేశించిన లక్ష్య సాధన దిశగా ఏఐఎం సమగ్ర విధానాన్ని అనుసరిస్తోంది.
- తదనుగుణంగా పాఠశాల విద్యార్థుల నుంచి స్థాపిత అంకుర సంస్థల దాకా ఆలోచన నుంచి విస్తరణ వరకు మొత్తం పరిధికి వర్తించే కార్యక్రమాలు, విధానాలు, సంస్థలను రూపొందించింది.
- ఆవిష్కర్తకు చేయూత కరవై మధ్యోలోనే ఆ మార్గం వీడే దుస్థితి రాకుండా ఈ నిరంతర చర్యలు జాగ్రత్త వహిస్తాయి.
- ఆరంభ దశలోనే యువ హృదయాల్లో ఆవిష్కరణ బీజాలు నాటడంలో పాఠశాలల స్థాయి ‘అటల్ సంధాన ప్రయోగశాల’ల వ్యవస్థ బాలల్లో పరస్పర సంధాన భావనను ప్రోత్సహిస్తుంది. తద్వారా సమస్యా పరిష్కార ఆవిష్కరణాత్మక ధోరణిని ప్రేరేపిస్తుంది.
- దాంతోపాటు అవగాహనతో అన్నిటినీ చక్కదిద్దుకునే వినూత్న ఆలోచన దృక్పథాన్ని ప్రోది చేస్తుంది. తద్వారా కళాశాలలో ప్రవేశించాక తమ ఆలోచనలను భావనలుగా మార్చుకుని, అంకుర సంస్థలుగా వాటికి రూపమివ్వడానికి వారు కృషి చేసే అవకాశం ఉంది.
- ఆ దశలో ఉన్నత విద్య లేదా పరిశోధన సంస్థల్లో ఏర్పాటు చేసిన అటల్ పోషణ కేంద్రాలు అందుకు తగిన పర్యావరణ వ్యవస్థ మద్దతు లభించేలా చూస్తాయి. అంటే ఆస్పత్రుల్లోని ఇంక్యుబేటర్లు శిశుపోషణ చేపట్టిన తరహాలో పని చేస్తాయన్న మాట.
- ప్రధాన నగరాల్లో సాధారణ ఆవిష్కరణ సముదాయాలను మించి ముందడుగు వేయడం కోసం 2, 3 అంచెల నగరాల్లో అటల్ సామాజిక ఆవిష్కరణ కేంద్రాలు తోడ్పడతాయి.
- వ్యక్తిగత ఆవిష్కర్తలను, సూక్ష్మ పారిశ్రామికవేత్తలను ప్రోత్సహిస్తూ భౌగోళికంగా, భాషాపరంగా సార్వజనీన ఆవిష్కరణలకు ఇవి వీలు కల్పిస్తాయి.
- అటల్ నవ భారత పోటీ కార్యక్రమం ద్వారా ఆయా రంగాల్లో జాతీయ ప్రాధాన్యం, సామాజిక ఔచిత్యంతో ముడిపడిన సవాళ్లకు పరిష్కారాల రూపకల్పన నుంచి వాణిజ్యీకరణ దాకా కృషి చేసే అంకుర సంస్థలు, ఎంఎస్ఎం ఈలకు అటల్ ఆవిష్కరణల వ్యవస్థ నేరుగా ఆర్థిక సహాయం అందిస్తుంది.
అటల్ ఆవిష్కరణ వ్యవస్థ మూల స్తంభాలు
- అటల్ ఆవిష్కరణ వ్యవస్థకు పలు మూల స్తంభాలు ఉన్నాయి. వాటి ద్వారా స్వయం సమృద్ధి భారతం స్వప్నాన్ని సాకారం చేసేందుకు కృషి సాగుతోంది.
- ఈ మేరకు ఆవిష్కర్తల జీవన చక్రంలో వారికి చేయూతనిస్తూ భారత ఆవిష్కరణల ముందడుగును ప్రభావితం చేసేందుకు కొన్నేళ్ల నుంచి ఏఐఎం చర్యలు చేపట్టింది.
- ఇందులో భాగంగా అటల్ టింకరింగ్ ల్యా బ్, అటల్ ఇంక్యుబేషన్ సెంటర్, అటల్ కమ్యూనిటీ ఇన్నోవేషన్ సెంటర్, అటల్ న్యూ ఇండియా చాలెంజ్, మెంటర్ ఆఫ్ చేంజ్ వంటి సంస్థలను ఏర్పాటు చేసింది.
1. అటల్ టింకరింగ్ ల్యాబ్స్ (ఏటీఎల్) - దేశంలో 10 లక్షల మంది బాలలను వినూత్న ఆవిష్కర్తలుగా తీర్చిదిద్దే లక్ష్యంతో వివిధ పాఠశాలల్లో ఏటీఎల్లను అటల్ ఆవిష్కరణల వ్యవస్థ ఏర్పాటు చేసింది.
- అక్కడ 6 నుంచి 12 తరగతుల మధ్య యువతరంలో ఆవిష్కరణలపై ఉత్సుకత-రూపకల్పన ఆసక్తి పెంచడంతో పాటు సమస్యా పరిష్కార ధోరణిని, వినూత్న దృక్పథాన్ని ప్రేరేపించే అత్యాధునిక ప్రదేశమే ఏటీఎల్.
- ఈ ప్రయోగశాలల్లో ఐవోటీ, 3డి ప్రింటింగ్, ర్యాపిడ్ ప్రోటోటైపింగ్, ఉపకరణాలు, రోబోటిక్స్, సూక్ష్మీకరించిన ఎలక్ట్రానిక్స్, డీఐవై కిట్లు తదితర 21వ శతాబ్దపు పరికరాలతోపాటు సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో ఉంటుంది.
- ఇక్కడ యువ మేధావులు స్వయంగా చేపట్టే కార్యకలాపాల ద్వారా తమ ఆలోచనలకు ఒక రూపం ఇవ్వగలుగుతారు.
- విద్యార్థులు ‘విరుచు-చింపు-అతికించు’ అనే పద్ధతిలో తమ సృజనాత్మకతకు పదును పెడుతూ ఆవిష్కరణకు యత్నించే స్వేచ్ఛా వాతావరణం ఈ ప్రయోగశాలల్లో ఉంటుంది.
- 21వ శతాబ్దపు నైపుణ్యాల దిశగా విద్యార్థుల్లో సామర్థ్యం పెంచేందుకు ఏటీఎల్ ఎప్పటికప్పుడు బహుళ పాఠ్యాంశాలు-మాడ్యూళ్లను అందుబాటులోకి తెస్తుంది.
- వీటితోపాటు ప్రతిష్ఠాత్మక కార్యక్రమాల్లో భాగంగా ఏటీఎల్ మారథాన్, టింకర్ప్రెన్యూర్ వంటివి చేపడుతుంది.
- ఉత్పత్తుల రూపకల్పన ద్వారా విద్యార్థులను యువ వ్యాపార దిగ్గజాలుగా ప్రపంచానికి పరిచయం చేసే వేదికను సమకూరుస్తుంది.
- అత్యుత్తమ ప్రతిభ ప్రదర్శించే విద్యార్థులు ‘విద్యార్థి ఆవిష్కర్త కార్యక్రమం’ ద్వారా ప్రత్యక్ష పారిశ్రామిక అనుభవం గడించే అవకాశం కూడా పొందుతారు.
- తద్వారా వివిధ పరిశ్రమల్లోని నిపుణుల మార్గదర్శకత్వాన తమ ప్రాజెక్టులను మరింత అభివృద్ధి చేస్తారు.
- అలాగే మార్కెట్ను మరింత లాభసాటిగా మారుస్తారు. ఈ విధంగా రేపటి ఆవిష్కర్తలకు అవసరమైన బహుముఖ నైపుణ్యం అందించడమే ఏటీఎల్ లక్ష్యం.
- ఈ మేరకు దేశ వ్యాప్తంగా నేడు 35 రాష్ర్టాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లోని 700కు పైగా జిల్లాల్లో గల 10,000 పాఠశాలల్లో మొత్తం 75 లక్షల మందికి పైగా విద్యార్థులు అటల్ టింకరింగ్ ల్యాబ్లలో తమ సృజనాత్మకతకు పదును పెడుతున్నారు.
- వీటిలో 60 శాతం ప్రభుత్వ పాఠశాలల్లో ఏర్పాటైనవి కాగా 12 లక్షలకు పైగా ఆవిష్కరణాత్మక ప్రాజెక్టులను విద్యార్థులు సృష్టించారు.
2. అటల్ ఇంక్యుబేషన్ సెంటర్ - అటల్ ఇంక్యుబేషన్ సెంటర్ (ఏఐసీ) పేరిట పోషణ కేంద్రాల ఏర్పాటుకు ఏఐఎం 2017 నుంచి తోడ్పాటునిస్తుంది. మరింత ఎదగడంతోపాటు సుస్థిరత సాధన దిశగా కృషి చేస్తున్న అంకుర సంస్థలు భారీ వ్యాపార సంస్థలుగా మారేలా చేయూతనివ్వడం ఈ కేంద్రాల బాధ్యత.
- దేశ వ్యాప్తంగా గల ఏఐసీలు అంతర్జాతీయ స్థాయిలో ఏర్పాటైనవి మాత్రమేగాక అందుకు తగిన మూలధన ఆస్తులతోపాటు నిర్వహణ సౌకర్యాల పరంగా తగు మౌలిక సదుపాయాలు కూడా కలిగి ఉన్నాయి.
- అలాగే అంకుర సంస్థలకు మార్గదర్శకత్వం వహించేందుకు అవసరమైన మేర రంగాలవారీ నిపుణుల లభ్యత, వ్యాపార ప్రణాళిక మద్దతు, ఆరంభ మూలధన సౌలభ్యం, పరిశ్రమ భాగస్వాములు, శిక్షణ సహా ఆవిష్కరణాత్మక అంకుర సంస్థలను ప్రోత్సహించడానికి అవసరమైన ఇతర సంబంధిత విభాగాలు కూడా ఉంటాయి.
- వివిధ రంగాల మధ్య పరస్పర పోషణ కేంద్రాల ఏర్పాటుకు ఏఐసీ కార్యక్రమం సహాయం, మద్దతు కూడా ఇస్తుంది.
- ఈ ఏఐసీలు ప్రభుత్వ-ప్రైవేటు ఉన్నత విద్యా సంస్థలు సహా పరిశోధన సంస్థలు, కార్పొరేట్ సంస్థలు తదితరాల్లో పని చేస్తుంటాయి.
- వివిధ రంగాల్లో ఇంక్యుబేటర్లను పెంపొందించడమే ఏఐసీల ఏర్పాటు ఉద్దేశం.
ఇవి పరిధి పరంగా, సంప్రదాయ శాస్త్ర సాంకేతిక ఇంక్యుబేటర్ల కన్నా ఐఐటీ/ ఎన్ఐటీల కన్నా కూడా చాలా పెద్దవిగా ఉంటాయి. - ఇప్పటిదాకా స్పృశించని జౌళి, డెయిరీ, కాఫీ వంటి వాటితోపాటు తక్షణావసరాలైన వ్యవసాయ, విద్య, వైద్య, పరిశుభ్రత సాంకేతికతల నుంచి అత్యాధునిక రవాణా, అంతరిక్ష, అణు సాంకేతికతల దాకా ఈ కేంద్రాల పరిధిలో ఉంటాయి.
- ఈ వినూత్న కేంద్రాల ఏర్పాటుతో విజయవంతమైన అంకుర సంస్థల వృద్ధికి,
భవిష్యత్ అంకురాల దీర్ఘ శ్రేణికి బాటలు పడ్డాయి. - ఇందులో భాగంగా ఇప్పటిదాకా 70 ఏఐసీలు ఏర్పాటు కాగా ఇవి 3000కు పైగా అంకురాలకు పోషణనిచ్చి ఎదిగేందుకు దోహదం చేయడమేగాక 30,000కు పైగా ఉద్యోగాలను సృష్టించాయి.
- తద్వారా స్వావలంబన సాకారానికి భారతదేశాన్ని మరో అడుగు చేరువ చేశాయి.
‘యోజన’ సౌజన్యంతో
Next article
Biology | శాకాహారుల్లో లోపించే విటమిన్ ఏది?
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?