Group 1 General Essay | చాట్ జీపీటీ ప్రయోజనాలు, సవాళ్లను వివరించండి?
ఇటీవల జమ్ముకశ్మీర్‌లో పెద్ద ఎత్తున ‘తెల్ల బంగారం’ అని పిలిచే లిథియం నిల్వలు కనుగొన్నారు. దీనికి గత కొంతకాలంగా అంతర్జాతీయ డిమాండ్ పెరుగుతుంది. ఈ ప్రకటన నేపథ్యంలో వివిధ పారిశ్రామిక అవసరాలకు లిథియం ఏ విధంగా ఉపయోగపడుతుందో చర్చించండి?
పరిచయం
- గ్లోబల్ వార్మింగ్‌కు కారణమయ్యే కర్బన ఉద్గారాలను తగ్గించడానికి భారత్ చేస్తున్న ప్రయత్నాలకు ఊతమిచ్చేలా ఇటీవల జమ్ముకశ్మీర్‌లో 5.9 మిలియన్ టన్నుల లిథియం నిక్షేపాలను జయోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా గుర్తించింది. దీనికి గల వివిధ పారిశ్రామిక (అవసరాల) అనువర్తనాల దృష్ట్యా ఇది ‘వైట్‌గోల్డ్’గా గుర్తింపు పొందింది.
ప్రత్యేకత – ప్రపంచ వ్యాప్త విస్తరణ
- లిథియం అనేది భూమ్మీద సహజసిద్ధంగా ఏర్పడిన మూలకం కాదు. ఇది నోవా అనే ప్రకాశవంతమైన నక్షత్రాల విస్ఫోటనం నుంచి జనించిన విశేష మూలకం. ఇది బూడిద రంగులో మెరిసే ఒక నాన్ ఫెర్రస్ లోహం. ఇది అన్ని లోహాల్లో కెల్లా తేలికయింది, తక్కువ సాంద్రత కలిగి ఉంది.
- అమెరికా జియోలాజికల్ సర్వే ప్రకారం లిథియం వనరులు 89 మిలియన్ టన్నులుగా గుర్తించారు. చిలీ, అర్జెంటీనా, ఆస్ట్రేలియా, చైనా, అమెరికాల్లో లిథియం నిల్వలు ఎక్కువగా కనుగొన్నారు.
- చిలీ, బొలీవియా, అర్జెంటీనా దేశాలు ‘లిథియం ట్రయాంగిల్’గా గుర్తింపు పొందాయి. ఈ మూడు దేశాల్లోనే 75 శాతం లిథియం నిల్వలను గుర్తించారు.
దేశంలో లిథియం నిల్వలు
వివిధ పారిశ్రామిక అనువర్తనాలు
1) ఎలక్ట్రిక్ వాహనాల తయారీ
- 2070 నాటికి ‘నెట్ జీరో’ లక్ష్యాన్ని సాధిస్తామని కాప్-26 సమావేశంలో భారత ప్రధాని ప్రకటించారు. ఈ నేపథ్యంలో కర్బన ఉద్గారాల తగ్గింపునకు ఎలక్ట్రిక్ వాహనాల తయారీని భారత్ ప్రోత్సహిస్తుంది. ఇందుకు అవసరమయ్యే బ్యాటరీల తయారీకి లిథియం పెద్ద ఎత్తున ఉపయోగపడుతుంది. దీని ద్వారా శక్తి ఆదా అవుతుంది.
2) ఫార్మా రంగంలో
- ఇది బై పోలార్ డిజార్డర్, డిప్రెషన్, ఇతర మానసిక ఆరోగ్య చికిత్సల్లో మూడ్ స్టెబిలైజర్‌గా ఉపయోగపడుతుంది.
3) థర్మో న్యూక్లియర్ రియాక్షన్స్
- అణు విద్యుత్‌ను ఉత్పత్తి చేసే ప్లాంట్లలో ప్రెషరైజ్డ్ వాటర్ రియాక్టర్ల శీతలీకరణ వ్యవస్థను నియంత్రించడానికి హైడ్రాక్సైడ్‌గా లిథియం చాలా ప్రాముఖ్యం కలిగి ఉంటుంది.
4) సైనిక రంగం
- రక్షణ వ్యవస్థల్లో ఉపయోగించే రాడార్ సిస్టమ్స్, మిసైల్ గైడెన్స్ సిస్టమ్ వంటి వివిధ సైనిక కార్యక్రమాల్లో, రక్షణ పరికరాల్లో ఇది ఉపయోగపడుతుంది.
5) సిరామిక్స్, గాజు పరిశ్రమ
- సిరామిక్స్, గ్లాస్వేర్లలో లిథియం కార్బోనేట్ బలాన్ని పెంచుతుంది. ఇది థర్మల్ విస్తరణను తగ్గించి గాజు బలాన్ని పెంచుతుంది. అదేవిధంగా రవాణా, ఉక్కు, విమాన పరిశ్రమల్లో కందెన గ్రీజులను తయారు చేయడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది.
ముగింపు
- ఇప్పటి వరకు లిథియం కోసం ఇతర దేశాల మీద ఆధారపడిన భారత్‌కు ప్రస్తుత ఆవిష్కరణల ద్వారా ఆ సమస్య తీరుతుంది. వాతావరణ మార్పుల్లో వేగాన్ని తగ్గించే లక్ష్యాన్ని చేరుకోవడానికి 2050 నాటికి లిథియం వంటి ఖనిజాల మైనింగ్‌ను 500 శాతం పెంచాల్సిన అవసరం ఉందని ప్రపంచ బ్యాంక్ ప్రకటించింది. ఈ నేపథ్యంలో భారత్ హరిత లక్ష్యాలను చేరుకోవడానికి ‘న్యూ ఎరా గోల్డ్ రష్’గా పిలిచే లిథియం ఉపయోగపడుతుంది.
2023-24 కేంద్ర బడ్జెట్లో ‘హరిత వృద్ధి’ని ప్రభుత్వం తన ఏడు ప్రాధాన్య అంశాల్లో ఒకటిగా చేర్చింది. ఈ నేపథ్యంలో హరిత వృద్ధి సాధనకు (బడ్జెట్లో ప్రస్తావించిన) వివిధ కార్యక్రమాలను వివరించండి?
పరిచయం
- పర్యావరణ పరిరక్షణకు అత్యంత ప్రాధాన్యం ఇస్తూ కర్బన ఉద్గారాల నియంత్రణను సాధించే ఆర్థిక వృద్ధిని ‘హరిత వృద్ధి’ అని అంటారు. 2070 నాటికి భారతదేశాన్ని ‘నెట్ జీరో’ దేశంగా మార్చడానికి కాప్-26 సమావేశంలో ప్రధాని ప్రకటించిన పంచామృత వాగ్దానాలను నెరవేర్చే క్రమంలో భాగంగా బడ్జెట్ సప్తర్షి ప్రాధాన్యంలో హరిత వృద్ధికి చోటు కల్పించారు.
హరిత వృద్ధి సాధన – ముఖ్యమైన కార్యక్రమాలు
- 1) మిస్టి కార్యక్రమం (మాంగ్రూవ్ ఇనిషియేటివ్ ఫర్ షోర్లైన్ హాబిటాట్స్ అండ్ టాంజిబుల్ ఇన్కమ్స్- మడ అడవుల కోసం తీర ప్రాంత నివాసాలు, ప్రత్యక్ష ఆదాయాల కార్యక్రమం.
- దేశవ్యాప్తంగా 9 రాష్ర్టాలు, 3 కేంద్ర పాలిత ప్రాంతాల్లో 4992 చ.కి.మీ. విస్తరించి ఉన్న మడ అడవులను సంరక్షించడానికి, మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం, కాంపెన్సెటరీ అఫారెస్టేషన్ ఫండ్ మేనేజ్మెంట్ అండ్ ప్లానింగ్ అథారిటీ ఫండ్ (కంపా ఫండ్) నిధులతో ఈ కార్యక్రమాన్ని అమలు చేయనున్నారు.
2) అమృత్ ధరోహర్ కార్యక్రమం
- చిత్తడి నేలల వినియోగాన్ని ప్రోత్సహించడానికి, జీవ వైవిధ్యాన్ని సంరక్షించడానికి, పర్యావరణ ఆధారిత పర్యాటకాన్ని అభివృద్ధి చేసి స్థానిక కమ్యూనిటీలకు ఆదాయ మార్గాలను సూచించడానికి రాబోయే మూడేళ్లలో ఈ కార్యక్రమాన్ని అమలు చేయనున్నారు.
3) పీఎం ప్రణామ్ చొరవ
- దేశ వ్యవసాయ రంగంలో యూరియా, పాస్ఫేట్, సల్ఫేట్ వంటి రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించి, జీవ సంబంధ ఎరువుల వినియోగాన్ని ప్రోత్సహించడానికి ఈ కార్యక్రమం ప్రారంభించారు. అదేవిధంగా రసాయన ఎరువులపై కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ భారాన్ని తగ్గించడానికి ఇది ఉద్దేశించింది. ఉదా: 2021లో ఎరువుల సబ్సిడీ- 1.62 లక్షల కోట్లు, 2022-23లో ఎరువుల సబ్సిడీ- 2.25 లక్షల కోట్లు (39 శాతం ఎక్కువ).
4) గోబర్ధన్ పథకం
- గాల్వనైజింగ్ ఆర్గానిక్ బయో ఆగ్రో రిసోర్సెస్ ధన్ (గోబర్ధన్). పశువుల పేడ, పొలంలోని ఘన వ్యర్థాలను కంపోస్ట్‌గా, బయోగ్యాస్, బయో సీఎన్జీగా మార్చి వ్యర్థాల నుంచి సంపద సృష్టించే 500 కొత్త ప్లాంట్లు ఏర్పాటు చేస్తారు. వీటి ద్వారా జీవ ఎరువులు, బయోగ్యాస్ ఉత్పత్తి చేస్తారు.
5) భారతీయ ప్రకృతి ఖేతి బయో ఇన్పుట్ వనరుల కేంద్రాలు
- రాబోయే మూడేళ్లలో కోటి మంది రైతులు సేంద్రియ వ్యవసాయ విధానాన్ని అవలంబించడానికి వీలుగా 10,000 బయో ఇన్పుట్ వనరుల కేంద్రాలను ఏర్పాటు చేసి జాతీయ స్థాయిలో సూక్ష్మ ఎరువులు, పురుగు మందుల తయారీ కేంద్రాలను ఏర్పాటు చేస్తారు.
6. గ్రీన్ క్రెడిట్ కార్యక్రమం
- పర్యావరణ పరిరక్షణ చట్టం-1986 ప్రకారం కంపెనీలు, వ్యక్తులు, స్థానిక సంస్థలు తమ కార్యకలాపాలను పర్యావరణ హితంగా మార్చుకునేలా తగు ప్రవర్తనాపర మార్పులను తీసుకొనిరావడానికి ఇది ఉద్దేశించింది.
7) పునరుత్పాదక ఇంధన తరలింపు
- లఢక్ నుంచి 13 గిగావాట్ల పునరుత్పాదక శక్తిని తరలించడానికి విద్యుత్, పునః పంపిణీ కోసం కొత్తగా పవర్‌గ్రిడ్‌కు అనుసంధానం చేయడానికి దీన్ని రూపకల్పన చేశారు.
ముగింపు
- ఈ విధంగా భారత్ భవిష్య పర్యావరణ లక్ష్యాలకు అనుగుణంగా గతంలో ప్రారంభించిన గ్రీన్ హైడ్రోజన్ మిషన్, ఇ-వాహనాలు, భారత్ స్టేజ్ ప్రమాణాల వంటి వాటికి అనుబంధంగా బడ్జెట్లో ఈ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. 2030 నాటికి సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సాధనకు ఇవి కీలక చోదక శక్తులుగా ఉపయోగపడనున్నాయి.
కృత్రిమ మేధస్సు ఆధారిత చాట్‌జీపీటీ ప్రస్తుతం వార్తల్లో ఉంది. ఇది ప్రముఖ సెర్చ్ ఇంజిన్ గూగుల్ ఉనికిని ప్రశ్నార్థకం చేయగలదనే అంచనాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో చాట్‌జీపీటీ అంటే మీరేం అర్థం చేసుకున్నారు. దీనివల్ల కలిగే ప్రయోజనాలు, సవాళ్లను అంచనా వేయండి?
పరిచయం
- చాట్‌జీపీటీ అంటే చాట్ జనరేటివ్ ప్రీ ట్రెయిన్డ్ ట్రాన్స్ఫార్మర్ అని అర్థం. అంటే ముందుగానే సిద్ధం చేసిన సమాచారంతో, సంభాషణల రూపంలో మనం అడిగే ప్రశ్నలకు కచ్చితమైన సమాధానాన్ని ఇవ్వగలిగే కృత్రిమ మేధస్సు ఆధారిత సాంకేతిక పరిజ్ఞానాన్ని చాట్‌జీపీటీ అని అంటారు.
ప్రయోజనాలు
1) కచ్చితత్వంతో కూడిన సమాచారం
- చాట్‌జీపీటీలో 2021 వరకు అందుబాటులో ఉన్న సమాచారంతో దాదాపు 300 బిలియన్ పదాలతో కంటెంట్‌ను రూపొందించారు. తద్వారా దీనిలో యూజర్లు అడిగే ప్రశ్నలకు గూగుల్ తరహాలో వందలు, వేలకొద్దీ ప్రత్యామ్నాయాలు కాకుండా కచ్చితత్వంతో కూడిన ప్రామాణిక సమాధానం లభిస్తుంది. దీనివల్ల అత్యంత విలువైన సమయం ఆదా అవుతుంది.
2) అత్యున్నతమైన వ్యక్తిగతీకరణ సేవలు
- ఇప్పటికీ కృత్రిమ మేధస్సుతో పనిచేసే అలెక్సా, సిరి వంటి చాట్బోట్ల కంటే గొప్పగా చాట్‌జీపీటీ మనకు కావాల్సిన సమాచారాన్ని క్రోడీకరిస్తుంది. అదే సమయంలో మనం అడిగిన ప్రశ్నలన్నింటినీ గుర్తుపెట్టుకొని, ఏదైనా తప్పు అని భావిస్తే సవరించి కూడా గుర్తుపెట్టుకుంటుంది.
3) సాఫ్ట్వేర్ రంగం మరింత సులువు
- సాఫ్ట్వేర్ రంగంలో అతి కష్టమైన కోడ్స్‌కు కూడా సులువుగా సమాధానం చూపిస్తుంది. మనం ఏ కోడ్ కావాలో టైప్ చేస్తే అది పూర్తి కోడ్‌ను మనకు రాసి ఇస్తుంది. దీని ద్వారా ప్రాజెక్టులను ఇంటిగ్రేట్ చేయవచ్చు. కన్సల్టింగ్, డెవలప్మెంట్ సర్వీసుల్ని అందించవచ్చు.
4) ఉపాధి, ఆదాయ అవకాశాలు
- చాట్‌జీపీటీ అందించే యూనిక్ అండ్ ఎంగేజింగ్ కంటెంట్ సహాయంతో సోషల్ మీడియా బ్లాగ్స్, వెబ్‌సైట్స్‌ను రన్ చేయవచ్చు. తద్వారా యాడ్స్, ప్రమోషనల్ యాడ్స్‌ను డిస్ప్లే చేసి ఆదాయాన్ని గడించవచ్చు. స్టాక్ మార్కెట్‌పై కొంచెం పట్టుంటే చాట్‌జీపీటీని ఉపయోగించి ఆటోమేటెడ్ ట్రేడింగ్ స్ట్రాటజీని బిల్డ్ చేయవచ్చు.
- అదేవిధంగా లాంగ్వేజ్ ట్రాన్స్లేషన్, టెక్ట్స్, సమ్మరైజేషన్ వంటి పనులు చేస్తూ ఉపాధి పొందవచ్చు.
సవాళ్లు
1) ఇందులోని సమాచారం 2021 వరకు అప్డేట్ చేయబడి ఉండటం వల్ల వర్తమాన అంశాలకు సంబంధించి ఇది మనకు సంతృప్తికర సమాధానాలను ఇవ్వలేదు.
2) గూగుల్ తరహాలో కాకుండా ఒకే సమాధానాన్ని ఇవ్వడం వల్ల అది మన అంచనాలకు తగినట్లు ఉండవచ్చు, ఉండకపోవచ్చు. కేవలం ఇది నిర్దేశిత, పరిమిత కంటెంట్ ఆధారంగానే పనిచేయడం వల్ల కొన్నిసార్లు పొరబాట్లకు అవకాశం ఉంటుంది.
3) టెక్ రంగంలో ఈ తరహా ఆవిష్కరణలు మరింత విస్తృతమై, సరికొత్త టెక్ వార్‌జోన్‌లోకి వినియోగదార్లు పడిపోయే ప్రమాదం ఉంది. ఉదా: చాట్‌జీపీటీకి పోటీగా గూగుల్ బార్డ్ రావడం.
4) విద్యార్థులు, ఉపాధ్యాయులు, ఉద్యోగులు పూర్తిగా దీనిమీద ఆధారపడే ప్రమాదం ఉంది. దీనివల్ల మానవ సృజనాత్మకత మరుగున పడిపోతుంది.
5) ఇంటర్నెట్ ఆధారిత సమాచారం మరింత పక్షపాతంగా మారిపోవచ్చు. కంపెనీల మధ్య, ప్రాంతాల మధ్య ఆన్లైన్ ఉద్రిక్తతలకు ఇది కారణం కావచ్చు.
ముగింపు
- ఓపెన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అదే సంస్థ ద్వారా రూపొందించిన చాట్‌జీపీటీ సరికొత్త సాంకేతిక విప్లవంగా తక్కువ కాలంలోనే విశేష ప్రాచుర్యం పొందింది. అయితే కృత్రిమ మేధస్సు ఎప్పటికయినా మానవ ఉనికికే అత్యంత ప్రమాదకరమైన ఆవిష్కరణ అనే భయాలు పెరుగుతున్న నేపథ్యంలో ఈ రకమైన సృజనాత్మకత మరింత లోతుగా ప్రజాబాహుళ్యంలో పర్యవేక్షించాల్సిన అవసరం ఉంది.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?