కరెంట్ అఫైర్స్
తెలంగాణ
న్యానేశ్వర్ మృతి
భారతీయ ప్రాచీన సంప్రదాయ డోక్రా హస్తకళాకారుడు, శిల్పి గురు జాతీయ అవార్డు గ్రహీత కోవ న్యానేశ్వర్ ఏప్రిల్ 21న మరణించారు. ఆయన కుమ్రం భీం జిల్లా కెరమెరి మండలం కేస్లాగూడకు చెందినవారు.
సారస్వత పురస్కారాలు
తెలంగాణ సారస్వత పరిషత్తు తొలిసారిగా తెలుగు సాహిత్య ప్రక్రియల్లో నిర్వహించిన గ్రంథ రచన పోటీల ఫలితాలను ఏప్రిల్ 22న ప్రకటించింది. 2021 ఏడాదికిగాను వచన కవిత్వంలో నాగరాజు స్వామి రచించిన ‘విచ్చుకున్న అక్షరం’, పద్యగేయ కవిత్వంలో వడ్డేపల్లి కృష్ణ రచించిన ‘వడ్డేపల్లి రాగరామాయణం’ గ్రంథాలు పురస్కారానికి ఎంపికయ్యాయి. కథాప్రక్రియలో ‘కథమానం భవతి’ ‘నూటొక్క కథలు (కేవీ నరేందర్)’, నవల ప్రక్రియలో ‘కల్లోల కలల కాలం (పరవస్తు లోకేశ్వర్)’, విమర్శ ప్రక్రియలో ‘తెలుగు నవల ప్రయోగ వైవిధ్యం (కేపీ అశోక్‌కుమార్)’, ఇతర ప్రక్రియల విభాగంలో ‘ఊరి దస్తూరి (అన్నవరం దేవేందర్)’ గ్రంథాలు ఎంపికయ్యాయి. యువ పురస్కారం ‘దండ కడియం (గోపాల్)’ కు లభించింది. ప్రధాన ప్రక్రియలో ఉత్తమ గ్రంథాలకు రూ.20 వేలు, యువ పురస్కారానికి రూ.10 వేల చొప్పున నగదు బహుమతి అందజేస్తారు.
జాతీయం
స్టార్టప్ ఇండియా సీడ్ ఫండ్
దేశీయ స్టార్టప్స్‌ను ఆర్థికంగా ప్రోత్సహించేందుకు ఉద్దేశించిన స్టార్టప్ ఇండియా సీడ్ ఫండ్ పథకం ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చిందని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఏప్రిల్ 19న తెలిపారు. వచ్చే నాలుగేండ్లలో స్టార్టప్ ఇండియా సీడ్ ఫండ్ పథకం కింద రూ.945 కోట్లు కార్పస్ ఫండ్‌గా అందిస్తారు. 300 ఇంక్యుబేటర్ల ద్వారా సుమారు 3,600 స్టార్టప్స్‌కు సీడ్ ఫండ్‌ను అందించాలన్నదే లక్ష్యం.
జోనల్ విధానానికి కేంద్రం ఆమోదం
ప్రభుత్వ ఉద్యోగాల నియామకాల కోసం తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన నూతన జోనల్ విధానానికి కేంద్ర ప్రభుత్వం ఏప్రిల్ 19న ఆమోదముద్ర వేసింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ ‘371డి’లోని (1) (2) క్లాజ్‌ల కింద దఖలుపడిన అధికారాలను అనుసరించి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ తెలంగాణ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ (ఆర్గనైజేషన్ ఆఫ్ లోకల్ కేడర్ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ డైరెక్ట్ రిక్రూట్మెంట్) ఆర్డర్-2018కి ఆమోదముద్ర వేశారు.
నెల్సన్ మండేలా అవార్డు
నెల్సన్ మండేలా అవార్డు-2021కు ఏపీ హైకోర్టు జడ్జి జస్టిస్ సీ ప్రవీణ్‌కుమార్, హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ ఎంపికయ్యారని అవార్డు కమిటీ ఏప్రిల్ 20న ప్రకటించింది. ఈ అవార్డును నేషనల్ కో ఆపరేటివ్ యూనియన్ ఆఫ్ ఇండియా న్యూఢిల్లీ, ముద్ర అగ్రికల్చర్ స్కిల్ డెవలప్మెంట్ మల్టీ స్టేట్ కో ఆపరేటివ్ లిమిటెడ్ సంయుక్తంగా అందిస్తున్నాయి.
మొబైల్ ఆక్సిజన్ ప్లాంట్లు
23 మొబైల్ ఆక్సిజన్ ప్లాంట్లను జర్మనీ నుంచి దిగుమతి చేసుకోవాలని భారత రక్షణ శాఖ ఏప్రిల్ 23న నిర్ణయించింది. ఒక్కో మొబైల్ ప్లాంట్‌కు గంటకు 2,400 లీటర్ల ఆక్సిజన్‌ను ఉత్పత్తి చేసే సామర్థ్యం ఉంది. రక్షణ శాఖ ఆధ్వర్యంలో నడిచే కరోనా చికిత్స కేంద్రాల్లో తొలుత వీటిని వినియోగించనున్నారు.
అంతర్జాతీయం
ప్రపంచ పత్రికాస్వేచ్ఛ సూచీ
రిపోర్టర్స్ వితవుట్ బోర్డర్స్ సంస్థ 180 దేశాలకు సంబంధించిన ప్రపంచ పత్రికా స్వేచ్ఛ సూచీని ఏప్రిల్ 20న విడుదల చేసింది. దీని ప్రకారం నార్వే మొదటి స్థానంలో నిలువగా.. ఫిన్లాండ్ 2, డెన్మార్క్ 3వ స్థానాల్లో నిలిచాయి. భారత్ 142వ స్థానంలో ఉండగా.. చైనా 177, సిరియా 178, ఉత్తర కొరియా 174, ఎరిథ్రియా 180వ స్థానాల్లో ఉన్నాయి.
గ్లోబల్ ఎనర్జీ ట్రాన్సిషన్ ఇండెక్స్
వరల్డ్ ఎకనామిక్ ఫోరం గ్లోబల్ ఎనర్జీ ట్రాన్సిషన్ ఇండెక్స్-2021ను ఏప్రిల్ 20న విడుదల చేసింది. 115 దేశాలు తమ ఇంధన వ్యాపారాల పనితీరుపై వివిధ కోణాల్లో పరిశీలించి దీనిని రూపొందించారు. ఈ సూచీలో స్వీడన్ మొదటి స్థానంలో నిలువగా.. నార్వే 2, డెన్మార్క్ 3, స్విట్జర్లాండ్ 4వ స్థానాల్లో నిలిచాయి. భారత్ 87, చివరిగా జింబాబ్వే 115వ స్థానాల్లో ఉన్నాయి.
సబ్‌మెరైన్ గల్లంతు
సముద్ర అన్వేషణలో భాగంగా కేఆర్ఐ నంగాల 402 సబ్‌మెరైన్ ఏప్రిల్ 21న గల్లంతయ్యింది. ఇండోనేషియాకు చెందిన ఈ సబ్‌మెరైన్‌లో 53 మంది ఉన్నారు.
డెరెక్ చౌవిన్
ఆఫ్రికన్-అమెరికన్ జార్జ్ ఫ్లాయిడ్ కస్టోడియల్ మృతి కేసులో మినియాపొలిస్ మాజీ పోలీస్ అధికారి డెరెక్ చౌవిన్‌ను న్యాయస్థానం ఏప్రిల్ 21న దోషిగా తేల్చింది. 2020, మే 25న పోలీస్ జులుం ప్రదర్శిస్తూ ఫ్లాయిడ్ మెడపై మోకాలితో తొక్కిపెట్టి ఊపిరాకుండా చేసి ఆయన మరణానికి కారకుడయ్యాడు.
అంతర్జాతీయ ధరిత్రీ దినోత్సవం
అంతర్జాతీయ ధరిత్రీ దినోత్సవ 51వ వార్షిక వేడుకలను ప్రపంచవ్యాప్తంగా ఏప్రిల్ 22న నిర్వహించారు. 1970 నుంచి ఏప్రిల్ 22న అంతర్జాతీయ ధరిత్రీ దినోత్సవంగా యూఎన్ఈపీ నిర్వహిస్తుంది. 2021 థీమ్.. ‘పునరుద్ధరించు మా భూమి’. భూమి శ్రేయస్సు కోసం ప్రజలకు అవగాహన కల్పించాలనేది దీని ఉద్దేశం.
వాతావరణ మార్పులపై సదస్సు
వాతావరణంలో మార్పులపై శిఖరాగ్ర సదస్సు అమెరికా ఆధ్వర్యంలో ఏప్రిల్ 22, 23 తేదీల్లో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించారు. ఈ సదస్సులో భారత ప్రధాని మోదీతోపాటు 40 దేశాలకు సంబంధించిన అధినేతలు పాల్గొన్నారు. కాలుష్యంలేని ఇంధన వినియోగా (క్లీన్ ఎనర్జీ)న్ని పెంపొందించడమే ఈ సదస్సు ప్రధాన లక్ష్యం. దీనిలో భాగంగా ఇండో-యూఎస్ఏ ైక్లెమెట్ క్లీన్ ఎనర్జీ-ఎజెండా 2030 భాగస్వామ్యాన్ని ప్రారంభించారు. మోదీ, జో బైడెన్ ఈ ఒప్పందాన్ని అంగీకరించారు.
అమెరికాలో కొత్త రాష్ట్రం
అమెరికా 51వ రాష్ట్రంగా వాషింగ్టన్ డీసీని ఏర్పాటు చేసేందుకు ప్రవేశపెట్టిన బిల్లును సెనెట్ ఏప్రిల్ 23న ఆమోదించింది. దీనికి 216 మంది సభ్యులు అనుకూలంగా, 208 మంది వ్యతిరేకంగా ఓటు వేశారు. రిపబ్లికన్లు ఈ బిల్లును పూర్తిగా వ్యతిరేకించారు.
వార్తల్లో వ్యక్తులు
ఇద్రిస్ దెబి
యుద్ధక్షేత్రంలో తిరుగుబాటుల చేతిలో చాద్ దేశ అధ్యక్షుడు ఇద్రిస్ డెబి ఏప్రిల్ 20న హత్యకు గురయ్యారు. 2016 నుంచి ఆయన అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. 2021, ఏప్రిల్ 11న తిరిగి ఆ దేశాధ్యక్షుడిగా విజయం సాధించారు.
ప్రియాంక మొహితే
ప్రపంచంలో ఎత్తయిన శిఖరాల్లో 10వది అయిన మౌంట్ అన్నపూర్ణ (8091 మీ.)ను ప్రియాంక మొహితే ఏప్రిల్ 20న అధిరోహించారు. ఈ పర్వతాన్ని అధిరోహించిన తొలి భారతీయురాలు ఆమె. ఈమె బయోకాన్ సంస్థలో పనిచేస్తున్నారు.
మిగుయెల్ డియాజ్
క్యూబా దేశాధ్యక్షుడిగా కమ్యూనిస్టు పార్టీ నేత మిగుయెల్ డియాజ్ కానెల్ బెర్ముడోజ్ ఏప్రిల్ 20న ఎన్నికయ్యారు. క్యూబా ఏప్రిల్ 19 నాటికి అమెరికా సైన్యంపై విజయం సాధించి 60 ఏండ్లు పూర్తయ్యింది.
నరసింహం మృతి
ప్రముఖ ఆర్థికవేత్త, ఆర్బీఐ మాజీ గవర్నర్ మైదవోలు నరసింహం ఏప్రిల్ 20న మరణించారు. ఆయన రిజర్వ్ బ్యాంక్‌కు 13వ గవర్నర్‌గా పనిచేశారు. ఆయన భారతీయ బ్యాంకింగ్ రంగ సంస్కరణలకు పితామహుడిగా గుర్తింపు పొందారు. ఆయన మాజీ రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్‌కు మనవడు.
వనితా గుప్తా
అమెరికా అసోసియేట్ అటార్నీ జనరల్‌గా భారత సంతతికి చెందిన వనితా గుప్తా ఎన్నికయ్యారు. అమెరికా సెనెట్‌లో ఏప్రిల్ 21న నిర్వహించిన ఎన్నికల్లో ఆమె 51 ఓట్లు సాధించారు. అటార్నీ జనరల్‌గా నియమితులైన తొలి ప్రవాసీ భారతీయురాలుగా రికార్డు సాధించారు.
రేఖా మీనన్
నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్వేర్ అండ్ సర్వీసెస్ కంపెనీస్ (నాస్కామ్) సంస్థకు చైర్‌పర్సన్‌గా రేఖా ఎం మీనన్ ఏప్రిల్ 23న బాధ్యతలు స్వీకరించారు. ఈ సంస్థకు ఆమె తొలి మహిళా చైర్‌పర్సన్‌గా ఎన్నికయ్యారు. 1988, మార్చి 1న ఈ సంస్థ ఏర్పడింది. దీని ప్రధాన కార్యాలయంలో ఢిల్లీలో ఉంది.
వహిదుద్దీన్ ఖాన్
ప్రఖ్యాత భారతీయ ఇస్లామిక్ పండితుడు, ఆధ్యాత్మిక నాయకుడు, రచయిత వల్లవన్ వహిదుద్దీన్ ఖాన్ ఏప్రిల్ 23న మరణించారు. 2021లో పద్మవిభూషణ్, 2000 పద్మభూషణ్, 2009లో రాజీవ్‌గాంధీ సద్భావన్ అవార్డులు లభించాయి.
ఎన్వీ రమణ
సుప్రీంకోర్టుకు 48వ చీఫ్ జస్టిస్‌గా ఎన్వీ రమణ ఏప్రిల్ 24న ప్రమాణస్వీకారం చేశారు. సుప్రీంకోర్టుకు చీఫ్ జస్టిస్‌గా 55 ఏండ్ల తరువాత నియమితులైన రెండో తెలుగు వ్యక్తి ఆయన. 2022, ఆగస్టు 26 వరకు ఆయన ఈ పదవిలో ఉంటారు. 2014, ఫిబ్రవరి 17 నుంచి సుప్రీంకోర్టు జడ్జిగా పనిచేస్తున్నారు.
క్రీడలు
ఆసియా రెజ్లింగ్ టోర్నీ
కజకిస్థాన్‌లోని అల్మటిలో ఏప్రిల్ 13 నుంచి 18 వరకు ఆసియా రెజ్లింగ్ టోర్నమెంట్‌ను నిర్వహించారు. ఈ టోర్నీలో ఇరాన్ 7 స్వర్ణాలు, 5 రజతాలు, 5 కాంస్యాలు, కజకిస్థాన్ 7 స్వర్ణాలు, 5 రజతాలు, 5 కాంస్యాలు, భారత్ 5 స్వర్ణాలు, 3 రజతాలు, 6 కాంస్యం పతకాలు సాధించాయి.
68వ గ్రాండ్‌మాస్టర్‌గా అర్జున్
యువ చెస్ ఆటగాడు అర్జున్ కల్యాణ్ ఏప్రిల్ 21 సెర్బియాలో జరుగుతున్న రుజ్నా జోరా-3 జీఎం రౌండ్ రాబిన్ లీగ్ ఐదో రౌండ్లో డ్రాగన్ కోసిక్పై పైచేయి సాధించాడు. దీంతో అర్జున్ భారత 68వ గ్రాండ్‌మాస్టర్‌గా రికార్డులకెక్కాడు.
ఖదీర్ అహ్మద్‌పై నిషేధం
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) క్రికెటర్ ఖదీర్ అహ్మద్‌పై ఐదేండ్ల నిషేధం విధిస్తున్నట్లు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ఏప్రిల్ 21న వెల్లడించింది. 2019, ఏప్రిల్‌లో జింబాబ్వేతో, 2019 ఆగస్టులో నెదర్లాండ్స్‌తో జరిగిన సిరీస్‌ల సందర్భంగా ఖదీర్ మ్యాచ్‌లకు సంబంధించి అంతర్గత సమాచారాన్ని బయటి వ్యక్తులకు చేరవేశాడని రుజువు కావడంతో ఐసీసీ ఈ నిషేధం విధించింది.
వేముల సైదులు
జీకే, కరెంట్ అఫైర్స్ నిపుణులు
ఆర్సీ రెడ్డి స్టడీ సర్కిల్ హైదరాబాద్
- Tags
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు