తెలుగులో మొదటి లక్షణ గ్రంథం?
గతవారం తరువాయి..
వేగరాజు (క్రీ.శ.955-960)
ఇతడు రెండో అరికేసరి కుమారుడు. రాష్ట్రకూట మూడో కృష్ణుడి సామంతుడు.
ఇతడు తన రాజధానిని వేములవాడ నుంచి ‘గంగాధర’ పట్టణానికి మార్చాడు.
‘సోమదేవసూరి’ తన ‘యశస్తిలక’ చంపూ కావ్యాన్ని ఇతడి కాలంలో పూర్తిచేసినట్లు తన గ్రంథంలో తెలియజేశాడు.
రెండో బద్దెగుడు (960-965)
వేగరాజుకు సంతానం లేనందున అతడి తమ్ముడు రెండో బద్దెగుడు (భద్రదేవుడు) సింహాసనాన్ని అధిష్టించాడు.
ఇతడు వేములవాడలో ఒక శాసనం వేయించి, తన విద్యాగురువు అయిన సోమదేవ సూరి కోసం శుభదామ జినాలయమనే పేరుతో ఒక జైన మఠాన్ని నిర్మించాడు.
ఈ శుభదామ జినాలయానికి బద్దెగ జినాలయం అనే పేరు కూడా ఉంది.
ఇతడి కాలంలో ‘బొమ్మల గుట్ట’ (కురిక్క్యాల) గొప్ప జైనమత కేంద్రంగా వర్థిల్లింది.
మూడో అరికేసరి (965-973)
ఇతడు రెండో బద్దెగుని కుమారుడు. వేములవాడ వంశ చాళుక్యుల్లో చివరివాడు.
ఇతడు రాజధానిని గంగాధర నుంచి తిరిగి వేములవాడకు మార్చాడు.
ఇతడు సోమదేవసూరికి ‘వనికటుపేట’ గ్రామాన్ని, శుభదామ జినాలయాన్ని దానమిస్తూ 966లో పర్బణి తామ్ర శాసనం వేయించాడు. ఈ శాసనంలో తాము సూర్యవంశ క్షత్రియులమని చెప్పుకొన్నారు.
ఇదే శుభదామ జినాలయానికి ‘రేపాక’ గ్రామాన్ని దానం చేసి, రేపాకలో జైన ఆలయాన్ని నిర్మించి భూ దానం చేసినట్లు రేపాక శాసనం (968) ద్వారా తెలుస్తుంది.
మూడో అరికేసరికి ‘పాంబరాంకుశ, విద్యాధర, విక్రమార్జున, సామంత చూడామణి’ అనే బిరుదులున్నాయి.
973లో రాష్ట్రకూట వంశాన్ని అంతం చేసి, రెండో తైలపుడు కళ్యాణి చాళుక్య సామ్రాజ్యాన్ని స్థాపించాడు. రాష్ట్రకూటులతోపాటే వేములవాడ చాళుక్య పాలన 973లో అంతమైంది.
కానీ కాజీపేట దర్గా శాసనం ప్రకారం కాకతీయ మొదటి ప్రోలరాజు మూడో అరికేసరి కుమారుడైన 3వ బద్దెగుడిని పారదోలి ఉంటారని, దీంతో వేములవాడ చాళుక్య రాజ్యం అంతరించిందని బీఎన్ శాస్త్రి పేర్కొన్నారు.
పరిపాలన
రాజుకు పరిపాలనలో సహాయపడటానికి మంత్రిమండలిని ఏర్పాటు చేసుకోవడమైంది. మంత్రిమండలిలో ధర్మ శాస్ర్తాలు తెలిసినవారు, సేనాధిపతులు, ముఖ్య రాజ బంధువులు సభ్యులుగా ఉండేవారు. రాజుకు మంత్రి, సేనాపతి, కోశాధికారి, పురోహితుడు, యువరాజు మొదలైనవారు పరిపాలనలో సలహాలిస్తుండేవారు. రెండో అరికేసరి కాలం నాటి వేములవాడ శాసనంలో మహాసంధి విగ్రహ, తంత్రపాల, సత్రాధిపాల అనే ఉద్యోగులున్నట్లు తెలుస్తుంది.
ఆర్థిక పరిస్థితులు
వేములవాడ చాళుక్యుల కాలంలో భూమి పన్ను ముఖ్య ఆదాయం, పన్ను వసూలుకు సుంకాధికారులు ఉండేవారు. వీరి కాలంలో గ్రామం పన్నెండు మంది ఆధీనంలో ఉండేది. వీరు గ్రామాధికారి, న్యాయాధికారి, కరణం, గ్రన్థి (నీరుడికాడు), తలారీ, జ్యోతిష్కుడు, కమ్మరి, వడ్రంగి, చాకలి, మంగలి, గ్రామోపాధ్యాయుడు ఇంకా సాలె, చర్మకార, కంచరి అనే వృత్తికారులు, గౌండ, గౌడ, పటేలు, రెడ్డి అనే అధికారులు కూడా ఉండేవారు. వడ్డీ వ్యాపారం కూడా ఆ రోజుల్లో ఉండేది.
మత పరిస్థితులు
వేములవాడ చాళుక్యుల్లో కొందరు రాజులు జైన మతాన్ని, మరికొందరు రాజులు శైవ మతాన్ని ఆదరించారు. అయితే జైన మతంలోకి వచ్చిన వైదిక మతస్థులు తమ పూర్వ వర్ణాన్ని విడిచిపెట్టేవారు కాదు. జినవల్లభుడు లాంటి వారు జైన మందిరాలను నిర్మించి జైన మత అభివృద్ధికి తోడ్పడ్డాడు. వేములవాడ చాళుక్యులు తమ పేర రాజరాజేశ్వర, బద్దెగేశ్వర ఆలయాలు నిర్మించారు. అంతేకాకుండా వీరికాలంలో శనిగరంలో యుద్ధమల్ల జినాలయం, వేములవాడలో బద్దెగ జినాలయం లేదా శుభదామ జినాలయం, రేపాకలో అరికేసరి జినాలయం నిర్మించబడ్డాయి. వీరి కాలంలో బొమ్మలగుట్ట ప్రాంతం గొప్ప జైన మత కేంద్రంగా వర్థిల్లింది.
భాషా సాహిత్యాలు
రెండో అరికేసరి కవి, పండితుడు, కన్నడ సాహిత్యంలో ఆదికవి అయిన పంపడు ఇతడి ఆస్థాన కవి పంపడు. ఇతడిని నాయకుడిగా చేసి విక్రమార్జున విజయం రాశాడు. తెలంగాణలో 940 నాటి కుర్క్యాల శాసనంలో మొదటిసారిగా పద్యాలు లభిస్తున్నాయి. దీనిని రచించినవాడు, వేయించివాడు పంప కవి సోదరుడైన జినవల్లభుడు.
ఈ శాసనంలో మూడు కంద పద్యాలతో పాటు సంస్కృత, కన్నడ పద్యాలు కూడా ఉన్నాయి. జినవల్లభుని మిత్రుడు మల్లియ రేచన రచించిన కవిజనాశ్రయం తెలుగులో మొదటి లక్షణ గ్రంథం. వేములవాడ చాళుక్యుల కాలంలో మరో ప్రసిద్ధిచెందిన కవి సోమదేవ సూరి.
ఇతడు ప్రసిద్ధ జైన మతాచార్యుడు. ఇతడి రచనలు యశస్థిలక చంపూ కావ్యం, నీతి వాక్యామృత, యుక్తి చింతామణి, సన్నావాతి ప్రకరణ, యశోధర మహారాజు చరిత్ర, సోమదేవసూరి బిరుదులు శాద్వాద చలసింహ, తార్కిక చక్రవర్తి, రెండో అరికేసరి కొడుకైన రెండో బద్దెగుడు నీతిశాస్త్ర ముక్తావళి, సుమతీ శతకంల గ్రంథకర్తలని కొందరి అభిప్రాయం.
ముదిగొండ చాళుక్యులు (850-1200)
నేటి తెలంగాణలోని కొరవి సీమలో ముదిగొండ (ఖమ్మం జిల్లా) రాజధానిగా, మంచికొండనాడును పాలించినవారు ముదిగొండ చాళుక్యులు.
ఖమ్మం, వరంగల్లు ప్రాంతాలను కొరవి సీమ అంటారు. కొరవి సీమలో తూర్పు ప్రాంతాన్ని మంచికొండనాడని పిలిచేవారు. వీరి రాజ్యం కృష్ణా జిల్లాలోని కొండపల్లి నుంచి వరంగల్ జిల్లాలోని కొరవి అనే ప్రాంతం వరకు విస్తరించింది. వీరు తూర్పు చాళుక్యులకు సామంతులుగా కొనసాగారు. వీరి సమకాలీన రాజ్యాలు వేములవాడ చాళుక్యులు, కాకతీయులు, విరియాల పాలకులు.
వీరి చరిత్రను తెలుసుకోడానికి ప్రముఖమైన ఆధారాలు కొరవి తామ్ర శాసనం (935), మొఘల్-చెరువు శాసనాలు, విరియాల వారి గూడూరు శాసనం (1124), కుసుమాయుధుని క్రివ్వక (కుక్కునూరు) శాసనం మొదలైనవి. అయితే ఈ శాసనాల్లో తేదీలు లేనందువల్ల వీటిలో సమాచారం సరిగాలేనందువల్ల స్పష్టంగా వీరి చరిత్ర తెలియజేయడానికి అవకాశం లేకుండా ఉంది.
పాలకులు
ముదిగొండ చాళుక్య వంశానికి మూలపురుషుడు రణమర్ధుడు. ఇతడు పశ్చిమ చాళుక్య వంశానికి చెందినవాడై ఉంటాడు. ఇతడు తూర్పు చాళుక్యుల సహాయంతో కొరవి మండలాన్ని సంపాదించి, ముదిగొండ నుంచి పాలించాడు.
మొదటి కుసుమాయుధుడు (870-895)
రణమర్ధుడి తర్వాత కుసుమాయుధుడు అధికారం చేపట్టినట్లు కొరవి శాసనం వల్ల తెలుస్తుంది.
ఇతడు గుణగ విజయాదిత్యుడు, చాళుక్య భీమునికి సమకాలికుడు.
ఇతడు తూర్పు చాళుక్యులు, రాష్ట్రకూటుల యుద్ధాల్లో ప్రముఖ పాత్ర పోషించాడు.
ఇతడి కాలంలోనే మొదటిసారిగా కొరవి సీమను రాష్ట్రకూట రాజైన రెండో కృష్ణుడు ఆక్రమించాడు.
ఇతడి కాలంలో రాష్ట్రకూట రాజైన రెండో కృష్ణుడు వేంగీ రాజ్యాన్ని ఆక్రమించడానికి తూర్పు చాళుక్య రాజ్యంపై దాడిచేసి రాజైన చాళుక్య భీముడిని ‘కొలనుకోట’లో బందీగా ఉంచాడు.
ఈ సందర్భంలోనే కుసుమాయుధుడు రెండో కృష్ణుడిని పారదోలి ఒకటో చాళుక్య భీముడితో వేంగీ సింహాసనాన్ని అధిష్టింపజేసి తన గుర్తింపును పెంచుకున్నాడు.
కుసుమాయుధుడి అభ్యర్థనపై చాళుక్య భీముడు ‘కూకిపర్రు’ గ్రామాన్ని పోతనయ్య అనే బ్రాహ్మణుడికి దానం చేశాడు.
గొణగయ్య (895-910)
కుసుమాయుధుడికి గొణగయ్య, నిరవద్య అనే ఇద్దరు కుమారులున్నారు.
గుణగ విజయాదిత్యుడి (తూర్పు చాళుక్య రాజు)పై అభిమానంతో కుసుమాయుధుడు అతడి కుమారుడికి గొణగయ్య అని నామకరణం చేశాడు. గొణగయ్య గుణగ విజయాదిత్యుడికి హ్రస్వరూపం.
గొణగయ్యనే కరిగొణగ (నల్లని గొణగ) అని కూడా పిలుస్తారు.
చాళుక్య భీముని అనంతరం వేంగీలో జరిగిన అంతఃకలహాల వల్ల గొణగయ్య వేంగీ చాళుక్యుల అభిమానాన్ని కోల్పోయాడు.
ఈ పరిణామాలను అవకాశంగా తీసుకున్న ఇతడి తమ్ముడు నిరవద్య (910-935) గొణగయ్యను తొలగించి తాను ముదిగొండ చాళుక్య సింహాసనం అధిష్టించాడు. ఈ విషయం మనకు కొరవి శాసనంవల్ల తెలుస్తుంది.
అయితే రాజ్యాన్ని కోల్పోయిన గొణగయ్య వేములవాడ చాళుక్య రెండో అరికేసరి సహాయంతో నిరవద్యను కూలదోసి తిరిగి ముదిగొండ రాజ్యాన్ని సంపాదించాడు.
అనంతర కాలంలో గొణగయ్య సంతతివారే ముదిగొండ రాజ్యాన్ని పరిపాలించారు.
ఆరో కుసుమాయుధుడు (1150-1175)
ముదిగొండ చాళుక్యుల్లో చివరివాడు ఆరో కుసుమాయుధుడని ‘క్రివ్వక శాసనం’ వల్ల తెలుస్తుంది.
అయితే ఇతడి తమ్ముడు నాగటి రాజు (1175-1200) కాలంలో కాకతీయ గణపతి దేవుడు ముదిగొండ చాళుక్య రాజ్యంపై దండెత్తి వారిని ఓడించి తరిమాడు.
దీంతో ముదిగొండ చాళుక్య రాజ్యం కాకతీయ సామ్రాజ్యంలో అంతర్భాగమైంది. చివరి ముదిగొండ చాళుక్యులు తమ రాజ్యాన్ని పోగొట్టుకొని వేంగీకి వెళ్లి కొన్నాళ్లు అక్కడే జీవించి మరణించారని వారి మరణంతో ముదిగొండ చాళుక్య వంశం అంతరించినట్లుగా తెలుస్తుంది.
ప్రాక్టీస్ బిట్స్
- రెండో అరికేసరి ఆస్థాన కవి?
1) పంపడు 2) సోమదేవ సూరి
3) జినవల్లభుడు 4) మల్లియ రేచన - సోమదేవ సూరి తన యశస్తిలక చంపూ కావ్యాన్ని ఎవరి కాలంలో పూర్తిచేశారు?
1) బద్దెగ-2 2) అరికేసరి-3
3) వేగరాజు 4) నరసింహ-2 - ఎవరి కాలంలో బొమ్మలగుట్ట (కురిక్క్యాల) గొప్ప జైనమత కేంద్రంగా
వర్థిల్లింది?
1) వేగరాజు 2) బద్దెగ-2
3) బద్దెగ-1 4) అరికేసరి-2 - తెలుగులో మొదటి లక్షణ గ్రంథంగా భావిస్తున్నది?
1) కవిజనాశ్రయం
2) విక్రమార్జున విజయం
3) నీతిశాస్త్రముక్తావళి
4) యుక్తి చింతామణి - కింది వాటిలో సరైనవి?
ఎ. వేగరాజు తన రాజధానిని వేములవాడ నుంచి గంగాధర పట్టణానికి మార్చాడు
బి. మూడో అరికేసరి రాజధానిని గంగాధర నుంచి తిరిగి వేములవాడకు మార్చాడు?
1) ఎ 2) ఎ, బి - ముదిగొండ చాళుక్య వంశానికి మూలపురుషుడు?
1) రణమర్ధుడు
2) సత్యాశ్రయ రణవిక్రముడు
3) కుసుమాయుధ-1
4) గొణగయ్య
సాసాల మల్లికార్జున్
అసిస్టెంట్ ప్రొఫెసర్
ప్రభుత్వ డిగ్రీ కాలేజీ, కోరుట్ల
9492 575 006
Answers
1-1, 2-3, 3-2, 4-1, 5-4, 6-1.
- Tags
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు